సొసైటీ సభ్యుల జాబితాల సేకరణలో అధికారులు
రాష్ట్రంలో 960 సొసైటీలు..
బోగస్‌వి 200 పైనే.
కార్యకలాపాల్లేని సొసైటీలు 600
యాక్టివ్‌గా ఉన్నవి 100 నుంచి 150 మాత్రమే
బోగస్ సొసైటీలను తొలగించాలని పలువురి డిమాండ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాల (సొసైటీ) ఎన్నికల కసరత్తును ప్రభుత్వం ప్రారంభించింది. అక్టోబర్ 21న షెడ్యూల్ విడుదల చేసి, డిసెంబర్ 6వ తేదీకి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఏ సొసైటీల పరిధిలో ఎంత మంది సభ్యులున్నారన్న వివరాలతో కూడిన జాబితాలను చేనేత జౌళి శాఖ సేకరిస్తోంది. ఆ జాబితాలను పరిశీలించి నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితాలను అధికారులు ఖరారు చేస్తారు. అయితే, ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
పదేళ్లుగా సొసైటీలకు ఎన్నికలు జరగకపోవడంతో ఓటర్ల జాబితా ఖరారు, బోగస్ సొసైటీల వ్యవహారం వంటి అనేక సమస్యలు ఎన్నికలకు అవరోధంగా మారాయి. మరోవైపు వ్యవసాయ పరపతి సంఘాల ఎన్నికలు సైతం నిర్వహించాలనే ప్రతిపాదన ఉండటంతో చేనేత సొసైటీ ఎన్నికలు ముందు వెనుక అయ్యే అవకాశం ఉందని చేనేత జౌళి శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఓటరు జాబితాల కసరత్తు పూర్తి చేసి ఎన్నికలను మరో రెండు నెలల తర్వాత నిర్వహించాలనే ప్రతిపాదన కూడా ఉందని, ఇంకా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని ఆ అధికారి చెప్పారు.
ఎన్నికలు నిర్వహిస్తారనే సంకేతాలతో చేనేత సొసైటీ ఎన్నికల బరిలో దిగి పదవులు దక్కించుకునేందుకు పలువురు సమాయత్తమవుతున్నారు. తమ సొసైటీల పరిధిలో సభ్యుల జాబితాలు, వాటిలో మార్పులు, సభ్యులను చేరి్పంచడం వంటి చర్యలు చేపట్టారు. మరోపక్క కృష్ణా జిల్లా పెడనలో రాష్ట్రంలోనే తొలిసారిగా పూర్తిగా మహిళలతోనే ప్రత్యేకంగా చేనేత సొసైటీ ఏర్పాటుకు సోమవారం శ్రీకారం చుట్టారు.
పేరుకే సొసైటీలు.. యాక్టివ్‌గా ఉన్నవి కొన్నే
అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 960 చేనేత సొసైటీలు ఉన్నాయి. వాటిలో 200కు పైగా బోగస్‌వే. మిగతా వాటిలో 600కు పైగా సొసైటీలు రికార్డుల్లోనే ఉన్నాయి తప్ప కార్యకలాపాలు ఏమీ లేవు. వాస్తవంగా నిత్యం కార్యకలాపాలు సాగిస్తూ యాక్టివ్‌గా ఉండే సొసైటీలు 100 నుంచి 150 మాత్రమే ఉంటాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ సబ్సిడీలు, ఇతర రాయితీల కోసం మాస్టర్ వీవర్స్, చేనేత రంగంలో బడా వ్యాపారులు వారి వద్ద పనిచేసే వారిని, కుటుంబ సభ్యుల పేర్లను చేర్చి సొసైటీలు ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరు ఏకంగా పదుల సంఖ్యలో బోగస్ సొసైటీలు ఏర్పాటు చేసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వీటన్నింటినీ రద్దు చేస్తారా లేదా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఇటువంటి సొసైటీలను తప్పించి, వ్యవస్థను ప్రక్షాళన చేశాకే ఎన్నికలు జరిపాలని అసలైన సొసైటీల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.
సొసైటీ నుంచి ఆప్కో వరకు ఎన్నికలు ఇలా..
ప్రతి సొసైటీకి తొమ్మిది మంది డైరెక్టర్లను ఎన్నుకుంటారు. వారిలో ఇద్దరు మహిళా డైరెక్టర్లు కచి్చతంగా ఉండాలి. తొమ్మిది మంది డైరెక్టర్లు వారిలో ఒకరిని అధ్యక్షులుగా, మరొకరిని ఉపాధ్యక్షులుగా ఎన్నుకుంటారు. ప్రతి జిల్లా పరిధిలోని సొసైటీల అధ్యక్షులందరూ కలిసి ఒక ఆప్కో డైరెక్టర్‌ను ఎన్నుకుంటారు. అన్ని జిల్లాల ఆప్కో డైరెక్టర్లు వారిలో ఒకరిని ఆప్కో చైర్మన్‌గా ఎన్నుకుంటారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎంపికయ్యే ఆప్కో చైర్మన్, డైరెక్టర్లు, సొసైటీ పాలకవర్గాల పదవీకాలం ఐదేళ్లు ఉంటుంది. అదే ప్రభుత్వమే నామినేట్ చేస్తే ప్రతి ఆరు నెలలకు ఒకసారి వారి పదవిని పొడిగించాలి. చేనేత సొసైటీ ఎన్నికల్లో పోటీ చేసే వారి బ్యాంకు రుణాల కిస్తీల చెల్లింపులు మూడు నెలలకు మించి పెండింగ్‌లో ఉండకూడదు.
Comments
Please login to add a commentAdd a comment