society elections
-
పిఠాపురంలో కత్తుల కూటమి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి నేతలు కత్తులు దూసుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల నాటినుంచి టీడీపీ, జనసేన నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటున్నారు. తాజాగా పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో–ఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో వారి మధ్య వైషమ్యాలు ముదురుపాకాన పడ్డాయి. పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో–ఆపరేటివ్ సొసైటీ రూ.50 కోట్ల వార్షిక టర్నోవర్‌తో నడుస్తోంది.మొత్తం 2,011 ఖాతాదారులున్న ఈ బ్యాంక్‌లో ఐదుగురు డైరెక్టర్ల పదవులకు రెండు రోజుల క్రితం ఎన్నికలు జరిగాయి. ఇరు పార్టీల నుంచి ఐదు స్థానాలకు నామినేషన్లు వేయడంతో కూటమి పార్టీల మధ్య పొత్తు చిత్తయింది. జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, టీడీపీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ మధ్యవర్తిత్వం వహించి.. టీడీపీ రెండు, జనసేన మూడు స్థానాల్లో పోటీ చేసేలా ఒప్పందం కుదిర్చారు.టీడీపీ ఒక స్థానంతో సరి!ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి టీడీపీ ఒక స్థానానికే పరిమితమైంది. పొత్తును చిత్తు చేస్తూ జనసేన బలపరిచిన వ్యక్తులు మూడు (2, 4, 5) స్థానాలు దక్కించుకోగా.. సొసైటీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నాయకుడు బాలిపల్లి రాంబాబు 1వ వార్డు నుంచి గెలుపొంది డైరెక్టర్ అయ్యారు. ఈ నేపథ్యంలో జనసేన తీరుపై టీడీపీ నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.టీడీపీ వర్గాల మండిపాటుసార్వత్రిక ఎన్నికల నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. తాజాగా సొసైటీ ఎన్నికల్లో జనసేన నేతలు దొంగ దెబ్బ తీయడాన్ని వర్మ, టీడీపీ నేతలకు పుండుపై కారం చల్లినట్టయింది. వర్మ ప్రాధాన్యం తగ్గించి, దెబ్బకొట్టే వ్యూహంతోనే పవన్ డైరెక్షన్లో జనసేన నేతలు పొత్తు ధర్మాన్ని తుంగలోకి తొక్కారని టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం చైర్మన్ జనసేనకు, టీడీపీకి వైస్ చైర్మన్ పదవులు దక్కాలి. దీనికి జనసేన నేతలు తూట్లు పొడిచి చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల్లో ఏ ఒక్కటీ దక్కకుండా చేయడంతో టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. సోమవారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో జనసేన బలపరిచిన చెల్లుబోయిన ప్రమీలా నాగేశ్వరరావు చైర్మన్, మేళం రామకృష్ణ వైస్ చైర్మన్లుగా ఎన్నికయ్యారు. -
చేనేత సొసైటీల్లో ఎన్నికలకు కసరత్తు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాల (సొసైటీ) ఎన్నికల కసరత్తును ప్రభుత్వం ప్రారంభించింది. అక్టోబర్ 21న షెడ్యూల్ విడుదల చేసి, డిసెంబర్ 6వ తేదీకి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఏ సొసైటీల పరిధిలో ఎంత మంది సభ్యులున్నారన్న వివరాలతో కూడిన జాబితాలను చేనేత జౌళి శాఖ సేకరిస్తోంది. ఆ జాబితాలను పరిశీలించి నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితాలను అధికారులు ఖరారు చేస్తారు. అయితే, ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.పదేళ్లుగా సొసైటీలకు ఎన్నికలు జరగకపోవడంతో ఓటర్ల జాబితా ఖరారు, బోగస్ సొసైటీల వ్యవహారం వంటి అనేక సమస్యలు ఎన్నికలకు అవరోధంగా మారాయి. మరోవైపు వ్యవసాయ పరపతి సంఘాల ఎన్నికలు సైతం నిర్వహించాలనే ప్రతిపాదన ఉండటంతో చేనేత సొసైటీ ఎన్నికలు ముందు వెనుక అయ్యే అవకాశం ఉందని చేనేత జౌళి శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఓటరు జాబితాల కసరత్తు పూర్తి చేసి ఎన్నికలను మరో రెండు నెలల తర్వాత నిర్వహించాలనే ప్రతిపాదన కూడా ఉందని, ఇంకా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని ఆ అధికారి చెప్పారు.ఎన్నికలు నిర్వహిస్తారనే సంకేతాలతో చేనేత సొసైటీ ఎన్నికల బరిలో దిగి పదవులు దక్కించుకునేందుకు పలువురు సమాయత్తమవుతున్నారు. తమ సొసైటీల పరిధిలో సభ్యుల జాబితాలు, వాటిలో మార్పులు, సభ్యులను చేరి్పంచడం వంటి చర్యలు చేపట్టారు. మరోపక్క కృష్ణా జిల్లా పెడనలో రాష్ట్రంలోనే తొలిసారిగా పూర్తిగా మహిళలతోనే ప్రత్యేకంగా చేనేత సొసైటీ ఏర్పాటుకు సోమవారం శ్రీకారం చుట్టారు. పేరుకే సొసైటీలు.. యాక్టివ్‌గా ఉన్నవి కొన్నే అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 960 చేనేత సొసైటీలు ఉన్నాయి. వాటిలో 200కు పైగా బోగస్‌వే. మిగతా వాటిలో 600కు పైగా సొసైటీలు రికార్డుల్లోనే ఉన్నాయి తప్ప కార్యకలాపాలు ఏమీ లేవు. వాస్తవంగా నిత్యం కార్యకలాపాలు సాగిస్తూ యాక్టివ్‌గా ఉండే సొసైటీలు 100 నుంచి 150 మాత్రమే ఉంటాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ సబ్సిడీలు, ఇతర రాయితీల కోసం మాస్టర్ వీవర్స్, చేనేత రంగంలో బడా వ్యాపారులు వారి వద్ద పనిచేసే వారిని, కుటుంబ సభ్యుల పేర్లను చేర్చి సొసైటీలు ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరు ఏకంగా పదుల సంఖ్యలో బోగస్ సొసైటీలు ఏర్పాటు చేసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వీటన్నింటినీ రద్దు చేస్తారా లేదా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఇటువంటి సొసైటీలను తప్పించి, వ్యవస్థను ప్రక్షాళన చేశాకే ఎన్నికలు జరిపాలని అసలైన సొసైటీల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.సొసైటీ నుంచి ఆప్కో వరకు ఎన్నికలు ఇలా.. ప్రతి సొసైటీకి తొమ్మిది మంది డైరెక్టర్లను ఎన్నుకుంటారు. వారిలో ఇద్దరు మహిళా డైరెక్టర్లు కచి్చతంగా ఉండాలి. తొమ్మిది మంది డైరెక్టర్లు వారిలో ఒకరిని అధ్యక్షులుగా, మరొకరిని ఉపాధ్యక్షులుగా ఎన్నుకుంటారు. ప్రతి జిల్లా పరిధిలోని సొసైటీల అధ్యక్షులందరూ కలిసి ఒక ఆప్కో డైరెక్టర్‌ను ఎన్నుకుంటారు. అన్ని జిల్లాల ఆప్కో డైరెక్టర్లు వారిలో ఒకరిని ఆప్కో చైర్మన్‌గా ఎన్నుకుంటారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎంపికయ్యే ఆప్కో చైర్మన్, డైరెక్టర్లు, సొసైటీ పాలకవర్గాల పదవీకాలం ఐదేళ్లు ఉంటుంది. అదే ప్రభుత్వమే నామినేట్ చేస్తే ప్రతి ఆరు నెలలకు ఒకసారి వారి పదవిని పొడిగించాలి. చేనేత సొసైటీ ఎన్నికల్లో పోటీ చేసే వారి బ్యాంకు రుణాల కిస్తీల చెల్లింపులు మూడు నెలలకు మించి పెండింగ్‌లో ఉండకూడదు. -
‘ఆర్టీసీ’లో ఎన్నికల హారన్
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగుల పొదుపు–పరపతి సహకార సొసైటీ ఎన్నికల నగారా మోగింది. రెండేళ్ల కాల పరిమితితో 210 మంది ప్రతినిధులను ఎన్నుకునేందుకు డిసెంబర్ 14న ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం ఎన్నికైన సొసైటీ ప్రతినిధులు 9 మంది పాలక మండలి సభ్యులను డిసెంబర్ 29న ఎన్నుకుంటారు. ఈ మేరకు సొసైటీ ఎన్నికల షెడ్యూల్ బుధవారం వెలువడింది. దాని ప్రకారం.. సొసైటీ నూతన పాలకమండలి ఎన్నికలకు నోటిఫికేషన్‌ను 15న విడుదల చేస్తారు. నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి సొసైటీలో సభ్యులుగా నమోదైన వారు ఓటర్లుగా ఉంటారు. కనీసం ఏడాది సర్వీస్‌ను పూర్తి చేసుకుని, సీసీఎస్ ఫామ్ సమర్పించడంతో పాటు రూ.300 షేర్ క్యాపిటల్ చెల్లించిన ఆర్టీసీ ఉద్యోగులు ఓటర్లుగా నమోదయ్యేందుకు అర్హులు. నూతన ఓటర్ల నమోదు ఈ నెల 15 వరకూ కొనసాగుతుంది. ప్రస్తుతం సొసైటీలో 50,300 మంది ఓటర్లున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌పై అభ్యంతరాలను ఈ నెల 22 వరకూ స్వీకరిస్తారు. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 12 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 10 వరకూ అవకాశం కల్పిస్తారు. పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను డిసెంబర్ 10న ప్రకటిస్తారు. పోలింగ్‌ను డిసెంబర్ 14న నిర్వహించి.. అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. ఎన్నికైన ప్రతినిధులు 9 మంది పాలక మండలి సభ్యులను ఎన్నుకుంటారు. ఆర్టీసీ నాలుగు జోన్ల నుంచి ఇద్దరు చొప్పున సభ్యులు, హెడ్ ఆఫీస్ నుంచి ఒక సభ్యుడు.. మొత్తం మీద 9 మంది పాలక మండలి సభ్యులను ఎన్నుకుంటారు. ఆర్టీసీ ఎండీ చైర్మన్‌గా వ్యవహరించే ఈ సొసైటీకి వైస్ చైర్మన్‌గా ఆర్టీసీ ఈడీతో పాటు, మరో ముగ్గురు అధికారులు సభ్యులుగా ఉంటారు. ఇదిలా ఉండగా ఆర్టీసీలో సొసైటీ ఎన్నికల హడావుడి ఇప్పటికే మొదలైంది. హామీలు నెరవేర్చాం.. మరోసారి అవకాశం ఇవ్వండి ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ తమ సభ్యులతో విజయవాడలో బుధవారం సమావేశం నిర్వహించింది. ఈయూ నేతృత్వంలోని పాలక మండలి.. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి విశేషంగా కృషి చేసిందని ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వైవీ రావు, దామోదరరావు చెప్పారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామన్నారు. సొసైటీకి రావాల్సిన బకాయిలను చెల్లించేందుకు ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు బుధవారం హామీ ఇవ్వడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు మరిన్ని సేవలందించేందుకు ఈయూ అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు. ఎన్ఎంయూ అభ్యర్థులను గెలిపించండి సొసైటీ ఎన్నికల్లో నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) అభ్యర్థులను గెలిపించాలని ఆ సంఘం అధ్యక్షుడు రమణారెడ్డి కోరారు. విజయవాడలో ఎన్ఎంయూ బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పాలకవర్గం వైఫల్యంతో కుటుంబ నేస్తం, జనతా వ్యక్తిగత బీమా పథకాలు రద్దయ్యాయని విమర్శించారు. సొసైటీకి సంస్థ నుంచి రావాల్సిన బకాయిలను రాబట్టలేకపోయారని విమర్శించారు. -
ముగిసిన ‘సహకార’ నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ శనివారంతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 905 పీఏసీఎస్‌ల పరిధిలోని డైరెక్టర్ల పదవులకు చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 6న నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా, 3 రోజుల వ్యవధిలో మొత్తం 36,969 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు శనివారం అత్యధికంగా 22,684 నామినేషన్లు వచ్చినట్లు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ ప్రకటించింది. మొదటి రోజు 2,316, రెండో రోజు 11,959 నామినేషన్లు దాఖలయ్యాయి. వెయ్యికి పైగా డైరెక్టర్ స్థానాలకు ఒక్కో నామినేషన్ చొప్పున మాత్రమే దాఖలు కావడంతో ఈ స్థానాల్లో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఆదివారం నామినేషన్ల పరిశీలన, సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ఉండటంతో, ఈ నెల 10 సాయంత్రం ఏకగ్రీవ డైరెక్టర్ స్థానాలపై స్పష్టత రానుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తమ గెలుపునకు సహకరించిన నేతలు, కార్యకర్తలను పీఏసీఎస్‌లలో పోటీకి దించారు. పార్టీల గుర్తుతో ఎన్నికలు జరగకున్నా.. టీఆర్ఎస్, కాంగ్రెస్ మద్దతుదారులు ఎక్కువ మంది బరిలోకి దిగారు. అత్యధికంగా నిజామాబాద్‌లో.. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 89 ప్యాక్స్‌ల పరిధిలో 2,988 మంది నామినేషన్లు వేశారు. ఖమ్మం జిల్లాలో 76 ప్యాక్స్లకు 2,546 నామినేషన్లు, నల్లగొండ జిల్లాలో 42 ప్యాక్స్లకు 2,272 నామినేషన్లు, సూర్యాపేట జిల్లాలో 47 ప్యాక్స్లకు 2,169 నామినేషన్లు వచ్చాయి. అత్యల్పంగా జోగుళాంబ–గద్వాల జిల్లాలో 11 ప్యాక్స్లకు 452 నామినేషన్లు దాఖలైనట్లు సహకార శాఖ ఎన్నికల అథారిటీ వెల్లడించింది. 10న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు చేయనున్నట్లు ఎన్నికల అథారిటీ అధికారులు వెల్లడించారు. -
సహకార ఎన్నికలకు సర్కారు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సహకార ఎన్నికలకు మరోసారి బ్రేక్ పడింది. రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకూడదని సహకార శాఖకు వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థ సారథి స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికలు ముగియగానే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్)కు ఎన్నికలు నిర్వహించాలని ముందుగా భావించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆ దిశగా అధికా రులకు సంకేతాలు ఇచ్చారు. అందులో భాగంగా ఫిబ్రవరి రెండో వారంలో ప్యాక్స్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈ నెల 17న నోటిఫికేషన్ ఇవ్వాలని సహకార శాఖ అధికారులు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆ శాఖ కమిషనర్ ఎం.వీరబ్రహ్మయ్య ఇటీవల ‘సాక్షి’కి తెలిపారు. ఎన్నికల కోసం ప్యాక్స్ ఓటర్ల తుది జాబితాను కూడా రూపొందించుకున్నారు. ఫిబ్రవరి రెండో వారంలో ప్యాక్స్లకు ఎన్నికలు ముగియగానే అదే నెల 25వ తేదీ కల్లా డీసీసీబీ, డీసీఎంఎస్, టెస్కాబ్‌ల ఎన్నిక పూర్తి చేయాలని షెడ్యూల్‌తోపాటు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ సీట్లు ఆశించి భంగపడే వారికి డీసీసీబీ చైర్మన్‌గా నియమించాలని అధికార పార్టీ భావిస్తోంది. అలాగే ఎంపీ ఎన్నికలకు క్షేత్రస్థాయిలో ప్యాక్స్, డీసీసీబీ ఆశావహులను ఇప్పుడు బలంగా పనిచేయించుకునే అవకాశం ఉంటుందనే ఆలోచనతో తాత్కాలికంగా ప్యాక్స్ ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. ప్రస్తుతం 906 ప్యాక్స్లకు పర్సన్ ఇన్చార్జిలు కొనసాగుతున్నారు. ఈ గడువు వచ్చే నెల మొదటి వారంలో ముగుస్తుంది. అప్పటికీ ఎన్నికలపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే వారినే కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. -
కొలువుదీరిన సొసైటీ పాలకవర్గాలు
సాక్షి, కడప : జిల్లాలోని 20 సొసైటీలకు కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. నూతన అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు సోమవారం జరిగాయి. అధ్యక్షులుగా ఎన్నికైన వారితో ఎన్నికల అధికారులు లాంఛనంగా ప్రమాణ స్వీకారం చేయించారు. రైతుల శ్రేయస్సుతో పాటు సొసైటీల అభివృద్ధికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. కాగా సొసైటీ ఎన్నికలలో కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఓటర్లను ప్రలోభపెట్టినా తుది విజయం వైఎస్సార్ సీపీకే దక్కింది. నూతన సంవత్సరంలో జరిగిన మొదటి ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు విజయఢంకా మోగించడంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం వెల్లివిరుస్తోంది. సొసైటీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూసి కాంగ్రెస్, టీడీపీ ఖంగుతిన్నాయి. టీడీపీ ఖాతా తెరవలేకపోయింది. కాంగ్రెస్ నాలుగు స్థానాలకే పరిమితమైంది. -
‘సొసైటీ’ పోలింగ్‌కు సర్వం సిద్ధం
సాక్షి,కడప; సహకార సొసైటీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడు డివిజన్ కేంద్రాల నుంచి పోలింగ్ సామగ్రి తీసుకొని సొసైటీ ఎన్నికలు జరిగే ప్రదేశాలకు సోమవారం మధ్యాహ్నం నుంచే ఆర్టీసీ బస్సులలో సిబ్బంది తరలి వెళ్లారు. పోలింగ్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, పోలింగ్ సిబ్బంది నియామకపు ఏర్పాట్లను జిల్లా సహకార అధికారి చంద్రశేఖర్, సహకార కళాశాల ప్రిన్సిపాల్ గుర్రప్ప, ఆడిట్ ఆఫీసర్ సుభాషిణి తదితరులు పరిశీలించారు. పోలింగ్ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు జరగనుంది. మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేసి గెలుపొందిన డెరైక్టర్ అభ్యర్థులను ప్రకటిస్తారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికలు జరిగే సొసైటీలివే.. జిల్లాలో ప్రస్తుతం 20 సొసైటీలకు ఎన్నికలు జరుగుతుండగా అనంతసముద్రం, అనంతయ్యగారిపల్లె, మద్దిరేవుల, గొర్లముదివీడు సొసైటీల్లో అన్ని డెరైక్టర్ స్థానాలు ఏకగ్రీవం కావడంతో అక్కడ ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన 16 సొసైటీల్లోని 156 డెరైక్టర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నాగిరెడ్డిపల్లెలో 12, కె.అగ్రహారం 12, ఎల్లటూరు 13, వల్లూరు 12, గోనమాకులపల్లె 10, మన్నూరు 11, అల్లాడుపల్లె 9, టంగుటూరు 13, బి.కోడూరు 4, చెన్నకేశంపల్లె 3, పెనగలూరు 7, వీరబల్లి 13, కొలిమివాండ్లపల్లె 3, మట్లి 13, దిగువ గొట్టివీడు 8, నందలూరు 12 డెరైక్టర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. బ్రాహ్మణపల్లె సొసైటీకి సంబంధించి ఫిబ్రవరి 2న ఎన్నికలు జరగనున్నాయి. అగ్రహారం, ఎల్లటూరు, వల్లూరు, టంగుటూరు, గోనమాకులపల్లె, బి.కోడూరు, చెన్నకేశంపల్లె సొసైటీలు సమస్యాత్మక ప్రాంతాలు కావడంతో అక్కడ గట్టి బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. -
పోటా పోటీ
సాక్షి, కడప : జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ కారణాలు సాకుగా చూపుతూ వాయిదా వేసిన 21 సొసైటీ ఎన్నికల డెరైక్టర్ స్థానాల బరిలో 385 మంది అభ్యర్థులు నిలిచారు. నామినేషన్ దశలో 12 సొసైటీల ఎన్నికలు నిలిచిపోగా, ప్రస్తుతం వాటిలో డెరైక్టర్ స్ధానాలకు 133 మంది పోటీ పడుతున్నారు. 93 డెరైక్టర్ స్ధానాలు ఏకగ్రీవం కావడం విశేషం. పోలింగ్ ప్రక్రియ దశలో ఆగిపోయిన 8 సొసైటీలకు 252 మంది అభ్యర్ధులు పోటిలో నిలిచారు. ఇందులో 8 డెరైక్టర్ స్థానాలు మాత్రమే ఏక గ్రీవమయ్యాయి. ఈ స్ధానాలలో వైసీపీ అనుకూల అభ్యర్ధులు అధిక్యం ప్రదర్శించే అవకాశం ఉండటంతో అధికార పార్టీ అప్పట్లో ఈ ఎన్నికలను వాయిదా వేయించింది. టంగుటూరు సొసైటీకి సంబంధించి అత్యధికంగా 54 నామినేషన్లు రావడం విశేషం. ఇందులోనే 12వ డెరైక్టర్ స్థానానికి 8మంది బరిలో నిలవడం విశేషంపోలింగ్ దశలో ఆగిన సొసైటీ బరిలో అభ్యర్ధులు వీరే గతంలో నాగిరెడ్డిపల్లె సొసైటీలో ఒక డెరైక్టర్ స్థానం ఏకగ్రీవం కాగా, మిగిలిన 12 డెరైక్టర్ స్థానాలకు 34 మంది బరిలో ఉన్నారు. కె.అగ్రహారం సొసైటీకి సంబంధించి ఒక డెరైక్టర్ ఏకగ్రీవం కాగా, 25 మంది పోటీలో నిలిచారు. యల్లటూరు సొసైటీకి 34 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వల్లూరులో 10వ డెరైక్టర్ స్థానానికి నామినేషన్ దాఖలు కాలేదు. మిగతా 12 స్థానాలకు 26 మంది రంగంలో ఉన్నారు. మన్నూరు సొసైటీకి రెండు స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన స్థానాలలో 22 మంది పోటీపడుతున్నారు. అల్లాడుపల్లె సొసైటీలో నాలుగు స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన స్థానాలకు 28 మంది పోటీకి సిద్ధపడుతున్నారు. టంగుటూరుసొసైటీకి సంబంధించి 13 డెరైక్టర్ స్థానాలకు 54 మంది పోటీలో ఉండడం విశేషం. నామినేషన్ల దశలో నిలిచిన సొసైటీ బరిలో... బి.కోడూరులో మూడు స్థానాలలో ఆరుగురు, చెన్నకేశంపల్లెలో నాలుగు స్థానాలకు 10 మంది, పెనగలూరులో ఏడు స్థానాలకు 14 మంది, వీరబల్లిలో 13 స్థానాలకు 27 మంది, కొలిమివాండ్లపల్లెలో మూడు స్థానాలకు 6 మంది, మట్లిలో 13 స్థానాలకు 27 మంది, దిగువగొట్టివీడులో ఎనిమిది స్థానాలకు 18 మంది, నందలూరులో 12 స్థానాలకు 25 మంది పోటీలో ఉన్నారు. మొత్తానికి జిల్లాలో మరోసారి సహకార ఎన్నికల వాతావరణం వేడెక్కనుంది.