అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో పొత్తుకు పాతర
‘పవన్’ డైరెక్షన్‌లో టీడీపీని దెబ్బకొట్టిన జనసేన
డైరెక్టర్‌గా వైఎస్సార్‌సీపీ నాయకుడు బాలిపల్లి రాంబాబు విజయం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి నేతలు కత్తులు దూసుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల నాటినుంచి టీడీపీ, జనసేన నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటున్నారు. తాజాగా పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో–ఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో వారి మధ్య వైషమ్యాలు ముదురుపాకాన పడ్డాయి. పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో–ఆపరేటివ్ సొసైటీ రూ.50 కోట్ల వార్షిక టర్నోవర్‌తో నడుస్తోంది.
మొత్తం 2,011 ఖాతాదారులున్న ఈ బ్యాంక్‌లో ఐదుగురు డైరెక్టర్ల పదవులకు రెండు రోజుల క్రితం ఎన్నికలు జరిగాయి. ఇరు పార్టీల నుంచి ఐదు స్థానాలకు నామినేషన్లు వేయడంతో కూటమి పార్టీల మధ్య పొత్తు చిత్తయింది. జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, టీడీపీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్ వర్మ మధ్యవర్తిత్వం వహించి.. టీడీపీ రెండు, జనసేన మూడు స్థానాల్లో పోటీ చేసేలా ఒప్పందం కుదిర్చారు.
టీడీపీ ఒక స్థానంతో సరి!
ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి టీడీపీ ఒక స్థానానికే పరిమితమైంది. పొత్తును చిత్తు చేస్తూ జనసేన బలపరిచిన వ్యక్తులు మూడు (2, 4, 5) స్థానాలు దక్కించుకోగా.. సొసైటీ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ నాయకుడు బాలిపల్లి రాంబాబు 1వ వార్డు నుంచి గెలుపొంది డైరెక్టర్ అయ్యారు. ఈ నేపథ్యంలో జనసేన తీరుపై టీడీపీ నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.
టీడీపీ వర్గాల మండిపాటు
సార్వత్రిక ఎన్నికల నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. తాజాగా సొసైటీ ఎన్నికల్లో జనసేన నేతలు దొంగ దెబ్బ తీయడాన్ని వర్మ, టీడీపీ నేతలకు పుండుపై కారం చల్లినట్టయింది. వర్మ ప్రాధాన్యం తగ్గించి, దెబ్బకొట్టే వ్యూహంతోనే పవన్ డైరెక్షన్‌లో జనసేన నేతలు పొత్తు ధర్మాన్ని తుంగలోకి తొక్కారని టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం చైర్మన్ జనసేనకు, టీడీపీకి వైస్ చైర్మన్ పదవులు దక్కాలి. దీనికి జనసేన నేతలు తూట్లు పొడిచి చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల్లో ఏ ఒక్కటీ దక్కకుండా చేయడంతో టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. సోమవారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో జనసేన బలపరిచిన చెల్లుబోయిన ప్రమీలా నాగేశ్వరరావు చైర్మన్, మేళం రామకృష్ణ వైస్ చైర్మన్లుగా ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment