గెలిస్తే తన బలమంటూ పవన్ గొప్పలు
ఓడితే మాజీ ఎమ్మెల్యే వెన్నుపోటని ముద్ర
ఏం జరిగినా వర్మకు రాజకీయ సమాధే..
క్యాడర్‌తో మమేకం కాని జనసేనాధిపతి
కొందరు నచ్చజెప్పగా రోజుకు 200 మందితో సెల్పీలకు సమ్మతి
ఇప్పుడే ఇలాగుంటే రేపటి మాటేమిటంటున్న స్థానికులు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ పడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు ఓటముల సంగతి ఎలా ఉన్నా.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మకు రాజకీయంగా సమాధే అనే అభిప్రాయం ఆయన అనుచరవర్గం నుంచే వినిపిస్తోంది. ఒకవేళ విజయం సాధిస్తే అదంతా తన బలమేనని పవన్ గొప్పలు పోవడం గ్యారంటీ. ఓటమి పాలైతే వర్మ వెన్నుపోటు పొడిచారనే నెపం నెట్టేస్తారు. ఫలితం ఏదైనా తమ నాయకునికి రాజకీయ భవిష్యత్తు శూన్యంగా కనిపిస్తోందని వర్మ వర్గీయులు బలంగా భావిస్తున్నారు.
ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి పవన్, వర్మల మధ్య సఖ్యత వీధుల్లో మాత్రమే కనిపిస్తోందని, అంతర్గతంగా ఎన్నెన్నో ఉన్నాయని జనసేన నాయకులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ 2019లో గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులైన టీసీ నాగిరెడ్డి (గాజువాక) చేతిలో 16,753 ఓట్లు, గ్రంధి శ్రీనివాస్ (భీమవరం) చేతిలో 8,357 ఓట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. తాజా ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేయబోతున్నట్లు చివరి నిమిషం వరకు కలరింగ్ ఇచ్చారు.
టీడీపీ, బీజేపీలతో కలిసి జనసేన ఉమ్మడిగా ఎన్నికలకు వెళుతుండటం, తన సామాజిక వర్గీయులైన కాపు ఓటర్లు అధికంగా ఉన్నందున పవన్ పిఠాపురం అసెంబ్లీ స్థానాన్నిఎంచుకుని పోటీకి దిగారు. ఇక్కడి నుంచి 2014లో స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేసి 47,080 ఓట్ల మెజారీ్టతో గెలుపొందిన ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ 2019లో టీడీపీ తరఫున పోటీ చేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పెండెం దొరబాబు చేతిలో 14,992 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచీ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న వర్మను పొత్తుల మాటున పక్కకు నెట్టి పవన్ కల్యాణ్ సీటు చేజిక్కించుకున్నారు.
మాటపై నిలబడతారా?
అసెంబ్లీ సీటు చేజారడంతో జనసేనకు సహకరించే ప్రసక్తే లేదని, అనుయాయుల సహకారంతో మళ్లీ ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగుతానని బీరాలు పోయిన వర్మతో బాబు మంతనాలు జరిపి.. పవన్‌కు సహకరించేందుకు సమ్మతింపజేసిన సంగతి విదితమే. అన్యమనస్కంగానే ప్రచారంలోకి దిగిన తమ నేతతో ఎనలేని సఖ్యతను నటిస్తూ ఎన్నికల వరకూ సర్వం నీ చేతుల మీదుగానే సాగాలని అభిలíÙస్తున్నట్లుగా పవన్ పోకడలు ఉంటున్నాయని వర్మ అనుచరగణం అంటోంది.
వాస్తవంగా జనసేన, టీడీపీ వ్యవహారాలు ఆ దిశగా లేవనేది క్షేత్ర స్థాయిలో పరిశీలకుల విశ్లేషణ. మరోవైపు మిత్రపక్షంలోని బీజేపీది పిఠాపురంలో నామమాత్రపు పాత్రేనని అంటున్నారు. ఈ పరిస్థితిలో వర్మ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. పవన్ గెలుపు ఓటముల్లో ఏదైనా సరే తనకు సంకట స్థితేనని ఈ మాజీ ఎమ్మెల్యే తన ముఖ్య అనుయాయుల వద్ద వాపోతున్నట్లు సమాచారం. పవన్‌ది మాటపై నిలబడే తత్వం కాదని అనేక అంశాల్లో ఇప్పటికే నిర్ధారణయ్యింది. నాగిని నృత్యంలా ఆయన నాలుక ఎన్ని వంకర్లయినా తిరుగుతుంది. అవసరానికి వాడుకుని ఎన్నికలయ్యాక తూచ్.. నీకూ నాకూ చెల్లు అనడన్న గ్యారంటీ ఏమిటి? అనే ప్రశ్నను విజయవాడలో టీడీపీ ముఖ్య నాయకుని వద్ద వర్మ వ్యక్తం చేశారు.
తర్వాత పిఠాపురం వైపు చూస్తారా?
ఎన్నికలయ్యాక పవన్ పిఠాపురం వైపు చూస్తారా అనే అనుమానాలు జనసేనతో పాటు టీడీపీ క్యాడర్‌లోనూ లేకపోలేదు. 2019 ఎన్నికల్లో ఓడిన తర్వాత రెండు పర్యాయాలు మాత్రమే ఆయన గాజువాక వచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన నిరసనకు సంఘీభావం తెలిపేందుకు ఓసారి, పార్టీ నాయకులతో సమావేశానికి మరోసారి వచ్చారు. భీమవరానికి కూడా అంతే. పార్టీ నాయకులతో సమావేశానికి ఓ రోజు, వారాహి యాత్రలో భాగంగా మూడు రోజులు ఉంటానని చెప్పి, రెండు రోజులకు పరిమితమయ్యారు. నామమాత్రంగా పార్టీ సమావేశం కానిచ్చేసిన పవన్.. తక్కిన సమయాన్ని బ్రో సినిమా ట్రైలర్ డబ్బింగ్ పనికి వినియోగించుకున్నారు. 2023లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన జనసేన అధినేత.. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో 2024 ఫిబ్రవరి 21న ముఖ్య నాయకులను కలుసుకునేందుకు మరోమారు వచ్చారు.
పోటీ అంత సేఫ్ ఏమీ కాదు
పోటీకి పిఠాపురాన్ని ఎంచుకున్నప్పటికీ అదంత సేఫ్ సీటేమీ కాదనే అనుమానాలు పవన్ వర్గంలో లేకపోలేదు. ఇదివరకే సొంత జిల్లాలోని భీమవరం నుంచి పవన్ ఓటమి చెందగా, ఆయన సోదరుడు చిరంజీవి సైతం సొంత నియోజకవర్గమైన పాలకొల్లులో బి.ఉషారాణి చేతిలో పరాభవం చవిచూశారు. మరో సోదరుడైన నాగబాబు సైతం నరసాపురం లోక్‌సభ అభ్యర్థిగా ఓడారు. వీటన్నింటినీ పరిశీలిస్తే గోదావరి జిల్లాలు కొణిదెల కుటుంబానికి సానుకూలం కాదనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. కాగా, పవన్ కల్యాణ్ ధోరణికి పిఠాపురం నియోజకవర్గం ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు.
సినిమా యాక్టర్, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పవన్‌ను కలవాలనుకునే వారికి ఏమాత్రం సాధ్యపడటం లేదు. ఈ విషయమై కొందరు నచ్చజెప్పగా ముందుగా నిర్ణయించిన వారిలో రోజుకు 50–60 మందికి సెల్పీలు దిగే అవకాశం ఇస్తానని సెలవిచ్చారట. ఈ లెక్కన రానున్న 30 రోజుల్లో గరిష్టంగా 1500–1800 మందిని కలుసుకోగలరన్న మాట. అదీ ఆయన నెల రోజుల పాటు నియోజకవర్గంలో నిలకడగా ఉన్న పక్షంలోనే. లేదంటే అదీ లేదు. ఇప్పుడే ఇలాగైతే ఎన్నికల తర్వాత తమ పరిస్థితి ఏమిటని పిఠాపురం నియోజకవర్గం ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
గీత.. పక్కా లోకల్
పవన్‌కు పోటీదారైన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వంగా గీత విద్యాభ్యాసం అనంతరం టీడీపీలో చురుకుగా ఉంటూ జెడ్పీ చైర్‌పర్సన్‌గా, రాజ్యసభ సభ్యురాలిగా, ఎమ్మెల్యే (ప్రజారాజ్యం)గా, లోక్‌సభ సభ్యురాలిగా పిఠాపురం నియోజకవర్గంలో విస్తృత పరిచయాలు కలిగి ఉన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా వంగా గీతను ‘మా అమ్మాయి’ అని చెప్పుకునేంతగా అందుబాటులో ఉంటూ కలిసిపోతారని, ఆమెతో పోటీ పడటం అంత సులువు కాదని టీడీపీ, జనసేన పారీ్టల ముఖ్యులు వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment