
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ శనివారంతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 905 పీఏసీఎస్‌ల పరిధిలోని డైరెక్టర్ల పదవులకు చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 6న నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా, 3 రోజుల వ్యవధిలో మొత్తం 36,969 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు శనివారం అత్యధికంగా 22,684 నామినేషన్లు వచ్చినట్లు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ ప్రకటించింది. మొదటి రోజు 2,316, రెండో రోజు 11,959 నామినేషన్లు దాఖలయ్యాయి. వెయ్యికి పైగా డైరెక్టర్ స్థానాలకు ఒక్కో నామినేషన్ చొప్పున మాత్రమే దాఖలు కావడంతో ఈ స్థానాల్లో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఆదివారం నామినేషన్ల పరిశీలన, సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ఉండటంతో, ఈ నెల 10 సాయంత్రం ఏకగ్రీవ డైరెక్టర్ స్థానాలపై స్పష్టత రానుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తమ గెలుపునకు సహకరించిన నేతలు, కార్యకర్తలను పీఏసీఎస్‌లలో పోటీకి దించారు. పార్టీల గుర్తుతో ఎన్నికలు జరగకున్నా.. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మద్దతుదారులు ఎక్కువ మంది బరిలోకి దిగారు.
అత్యధికంగా నిజామాబాద్‌లో..
అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 89 ప్యాక్స్‌ల పరిధిలో 2,988 మంది నామినేషన్లు వేశారు. ఖమ్మం జిల్లాలో 76 ప్యాక్స్‌లకు 2,546 నామినేషన్లు, నల్లగొండ జిల్లాలో 42 ప్యాక్స్‌లకు 2,272 నామినేషన్లు, సూర్యాపేట జిల్లాలో 47 ప్యాక్స్‌లకు 2,169 నామినేషన్లు వచ్చాయి. అత్యల్పంగా జోగుళాంబ–గద్వాల జిల్లాలో 11 ప్యాక్స్‌లకు 452 నామినేషన్లు దాఖలైనట్లు సహకార శాఖ ఎన్నికల అథారిటీ వెల్లడించింది. 10న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు చేయనున్నట్లు ఎన్నికల అథారిటీ అధికారులు వెల్లడించారు.