ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు అప్పుడే తప్పులు చేయడం ఆరంభించినట్లు అనిపిస్తుంది. వయసు, సీనియారిటీని దృష్టిలో పెట్టుకుంటే ఆయన ఈసారి అందరి అభిమానాన్ని చూరగొనేలా ప్రభుత్వాన్ని నడిపితే మంచి పేరు వస్తుంది. టీడీపీ కొద్ది రోజుల క్రితం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన అనుసరించిన వైఖరి కానీ, పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కొందరు అధికారుల పట్ల అవమానకరంగా వ్యవహరించిన తీరు కానీ చర్చనీయాంశం అవుతున్నాయి.
కౌంటింగ్‌లో టీడీపీ గెలుస్తోందన్న సంకేతం వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వారం రోజులకు పైగా పార్టీ శ్రేణులు, గూండాలు విరుచుకుపడ్డ వైనం, చెలరేగిన హింసాకాండ చంద్రబాబుకు అప్రతిష్ట తెచ్చిపెట్టాయి. అయినా ఆయన దానిని లెక్కలోకి తీసుకున్నట్లు కనిపించదు. ఆయన ధోరణి గమనించిన పోలీసు ఉన్నతాధికారులు కొట్టుకు చావండి.. వైఎస్సార్‌సీపీ వారిని చంపితే చంపండి అన్న రీతిలో ఉదాసీనంగా ప్రవర్తించారు. ఇది దారుణమైన విషయం. వెంటనే అదుపు చేయాలని చంద్రబాబు ఆదేశించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. దీనిని బట్టి ప్రభుత్వ విధానం ఏమిటో అర్ధం అవుతుంది.
ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కనుక సంప్రదాయం ప్రకారం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అంతా వచ్చి ఆయనను కలుస్తారు. కానీ గతంలో తనను ఆయా స్కామ్‌లలో అరెస్టు చేసిన కొందరు అధికారులను తన ఇంటివైపు రానివ్వలేదు. సచివాలయంలో చంద్రబాబు పదవీబాధ్యతలు తీసుకున్న తదుపరి మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చిన అధికారుల పట్ల ఆయన చాలా కఠిన వైఖరి అవలంబించారు.
ఈ అధికారులు గత ప్రభుత్వ హయాంలో ప్రముఖ పాత్ర పోషించారన్నది ఆయన భావన కావచ్చు. వారి నిర్ణయాల వల్ల టీడీపీకి ఏమైనా ఇబ్బంది వచ్చిందేమో తెలియదు. అయినా తనకు అధికారం వచ్చిన తర్వాత దానిని పట్టించుకోకుండా పాలన సాగించడం సాధారణంగా జరుగుతుంటుంది. అలాకాకుండా పాత విషయాలను గుర్తులో ఉంచుకుని అధికారులను వేధించాలని, అవమానించాలని చంద్రబాబు వంటి సీనియర్ నేత తలపెట్టడం వ్యవస్థలకు మంచిది కాదు.
సీనియర్ అధికారులను కిందిస్థాయి సిబ్బందితో చెప్పించి వెనక్కి పంపించడం, పుష్పగుచ్చం ఇవ్వడానికి చొరవ తీసుకుంటే వారికి అవకాశం ఇవ్వకుండా నిరోధించడం వంటివి జరగడం ఏ మాత్రం సమర్ధనీయం కాదు. ఒక పక్క గత ప్రభుత్వం వ్యవస్థలను ద్వంసం చేసిందని చెబుతూ, ఇప్పుడు అంతకు మించి విద్వంసం చేసేలా ప్రవర్తిస్తే దాని ప్రభావం ఇతర అధికారులపై కూడా పడుతుంది. కీలకమైన బాధ్యతలలో ఉన్న అధికారులు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగానే ఎక్కువ సందర్భాలలో పనిచేస్తారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా అలాగే జరిగింది. చంద్రబాబు ప్రభుత్వం అయినా అంతే. చంద్రబాబు ఇచ్చే ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఏ అధికారి అయినా వెళతారా? ఆ ఆదేశాలు సరికాదని సంబంధిత అధికారి భావించినా, దానిని ఫైల్ మీద రాస్తారేమో కానీ, అంతిమంగా ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు వినవలసి ఉంటుంది. దీనిని విస్మరించి చంద్రబాబు వ్యవహరించడం విమర్శలకు దారి తీస్తోంది.
పని అప్పగించి సరిగా నెరవేర్చకపోతే అప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తే అదో పద్దతి. అలాకాకుండా వారు కనిపించగానే అవమానించే రీతిలో వ్యవహరిస్తే మిగిలిన ఆఫీసర్లలో ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుందో గుర్తించాలి. ఒకవేళ వారు గత ప్రభుత్వ టైమ్లో ఏదైనా తప్పు చేశారని అనుకుంటే వారిపై విచారణకు ఆదేశించి చర్య తీసుకోవచ్చు. అది ఒక సిస్టమ్. కానీ అందరి మధ్యలో వారిపట్ల అమానవీయంగా చికాకు పడితే అది తప్పుడు సంకేతం పంపుతుంది. ఛీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిపై కక్ష కట్టి అవమానించారన్న అభిప్రాయం ఏర్పడింది. ఆయన సెలవుపై వెళ్లారు. గతంలో ఆయన లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీరాజ్ శాఖను పర్యవేక్షించారు. లోకేష్ వద్ద పనిచేశారు కనుక, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా ఉన్నారా? లేదే! అదే జవహర్ రెడ్డిపై వీరికి ఎందుకో కోపం వచ్చింది.
ప్రవీణ్ ప్రకాష్ అనే అధికారిపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారట. ప్రవీణ్ ప్రకాష్ గత ప్రభుత్వ హయాంలో విద్యారంగానికి సంబంధించి పెద్ద ఎత్తున మార్పులు తీసుకు వచ్చారు. స్కూళ్ల రూపు రేఖలు మార్చడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. అదే సమయంలో టీచర్లతో గట్టిగా పనిచేయించే యత్నంలో కొంత విమర్శకు కూడా గురి అయ్యారు. టీచర్ల సంఘాలు ఆయనపై కక్ష కట్టాయి. ఇందులో ఆయన తప్పులు ఏమున్నాయో తెలియదు. కేవలం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికు సన్నిహితంగా మెలిగారన్న కారణంగా ప్రవీణ్ ప్రకాశ్ పట్ల అసహనంగా ఉండడం సరైనదేనా అనే చర్చ వస్తుంది.
మరో సీనియర్ అధికారి అజయ్ జైన్ పై కూడా చంద్రబాబు గుర్రుగా ఉన్నారని వార్తలు వచ్చాయి. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థల ఏర్పాటులో జైన్ ప్రముఖ పాత్ర వహించారు. అవి చాలా వరకు సక్సెస్ అయ్యాయి. కాకపోతే ఆయన ఎవరు అధికారంలో ఉంటే వారిని పొగుడుతారన్న భావన ఉంది. 2014లో చంద్రబాబు పాలన టైమ్ లో కూడా ఆయన కీలకంగానే ఉన్నారు. తదుపరి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేశారు. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు సీఎం అయ్యారు. దీనికి అనుగుణంగానే ఆయన వ్యవహరిస్తారు. ఆ విషయాన్ని విస్మరించి ఆయనపై కూడా ద్వేషం పెట్టుకోవడం సరికాదు. మరో అధికారి శ్రీలక్ష్మి పుష్పగుచ్చం తీసుకు వస్తే ఆమె వైపు చూడడానికి కూడా సుముఖత కనబరచలేదట. ఇవన్నీ మీడియాలో వచ్చిన వార్తలే.
అలాగే సునీల్ కుమార్, రఘురామిరెడ్డి , పిఎస్ఆర్ ఆంజనేయులు వంటి మరికొందరు అధికారులతో కూడా అలాగే వ్యవహరించారట. ఏ అధికారి అయినా సంబంధిత ప్రభుత్వం ఏమి చెబితే దానికి అనుగుణంగానే పనిచేస్తారు. ఆ ప్రభుత్వ విధానాలతోనే వెళతారు. ఎవరు ముఖ్యమంత్రి అయితే వారి ఆదేశాలను పాటిస్తారు. ఇది చంద్రబాబుకు తెలియని విషయం కాదు. ఒకవేళ ఆ అధికారులపై సరైన అభిప్రాయం లేకపోతే వారికి ప్రాధాన్యత ఉన్న పోస్టులు ఇవ్వరు. విశేషం ఏమిటంటే ఆయా ముఖ్యమంత్రులు తమకు మొదట ఇష్టం లేరన్న అధికారులు తదుపరికాలంలో వారికి సన్నిహితులు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇంకో విషయం చెప్పాలి. చంద్రబాబు వద్ద పనిచేసిన ఒక సీనియర్ అధికారి స్వచ్చంద పదవీ విరమణ చేసి ఆయన కంపెనీలలో సీఈఓ ఉద్యోగంలో చేరారు. అంటే వారి మధ్య అంత సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయనే కదా! మరో పోలీసు అధికారి తెలుగుదేశం పార్టీ అంతరంగిక వ్యవహారాలలో కూడా యాక్టివ్ గా ఉండేవారు. మరి దానిని ఏమంటారు. గత ప్రభుత్వాన్ని తప్పు పట్టి, ఏదో జరిగిపోయినట్లు ప్రచారం చేయడం చంద్రబాబుకు కొత్తకాదు. ఆయన అధికారంలో ఉంటే అధికారులంతా సచ్చీలురుగా ఉన్నట్లు, లేకుంటే పాడైపోయినట్లు చెబుతుంటారు. ఇప్పుడు అదే పంధా అనుసరిస్తున్నట్లుగా ఉంది.
ఇంకోరకంగా చూస్తే వారివల్లే ప్రజలలో వ్యతిరేకత వచ్చిందని, తత్పఫలితంగా తాను అధికారంలోకి వచ్చానని ఆయన సంతోషించవచ్చు కదా! అలాకాకుండా కక్ష కట్టడం ఏమిటి! గత ప్రభుత్వంపై ప్రజలలో కసి ఏర్పడడానికి గత ఐదేళ్లలో జరిగిన విద్వంసకర పాలన అని, అందులో ఐఏఎస్, ఐపీఎస్ లకు పాత్ర ఉందని చంద్రబాబు అన్నారు. బాగానే ఉంది. మరి 2014 నుంచి 2019 వరకు పాలన చేసిన తర్వాత టీడీపీకి 23 సీట్లే ఎందుకు వచ్చాయి? అంతకుముందు 2004 ఎన్నికలలో చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ఓడిపోయింది? అధికారుల శైలి వల్ల అని ఆయన చెబుతారా! అప్పట్లో కూడా ప్రజలలో అలాంటి అభిప్రాయం ఏర్పడినట్లా?ఉన్నతాధికారులు అప్పుడు కూడా తప్పుగానే ప్రవర్తించినట్లేనా అనే ప్రశ్నకు జవాబు దొరకదు.
ఏది ఏమైనా అధికారులను బెదిరించడానికి ఇలా చేస్తున్నారా? లేక వారిపై ఏదైనా చర్య తీసుకోవడానికి ఆలోచన చేస్తున్నారా? అన్నది తెలియదు. కానీ ఇది ఒక చెడు సంప్రదాయం అవుతుందని చెప్పక తప్పదు. పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కూడా చంద్రబాబు అక్కడ ఉన్న టీడీపీ నేతలతో మాట్లాడిన కొన్ని విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రత్యేకించి లాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా గత ప్రభుత్వం చేసిందని చంద్రబాబు అన్నారట. అంటే ఎన్నికల ప్రచారంలో చెప్పిన అబద్దాలనే ఆయన కొనసాగిస్తున్నారని అనుకోవాలి. అది నిజమే అయితే ఆయన శాసనసభలో ఈ చట్టానికి ఎందుకు మద్దతు ఇచ్చారో చెప్పాలి కదా! పైగా హైకోర్టులో నిలిచిపోయి ఉన్న చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు చెబుతున్నారు.
కేంద్రం పంపిన ఈ నమూనా చట్టంపై జనంలో అవవగాహన కలిగించకుండా గత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనానికి బాగానే వాడుకున్నారని చెప్పాలి. నైపుణ్య గణన అంటూ మరో ఫైల్ పై ఆయన సంతకం చేశారు. దానిని ఎలా ఆచరణలోకి తీసుకు వస్తారో చూడాల్సి ఉంది. ఇలా చంద్రబాబు తాను మారానని, ఎవరిపై కక్ష పూననని అంటూనే సీనియర్ అధికారులను అవమానించడంపై విమర్శలు వస్తున్న మాట వాస్తవం. అధికారం ఎవరికి శాశ్వతం కాదని తెలిసినా, ఒక్కసారి ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చాక, తమకు తిరుగులేదని ఎందుకు ప్రవర్తిస్తారో అర్థం చేసుకోవడం మనబోటి సామాన్యులకు కష్టమేనేమో!
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment