లేని భూమిని ఉన్నట్లు చూపించే ప్రయత్నం
నదీ గర్భంలో కలిసిపోయిన సర్వే నంబర్లతో దరఖాస్తు
104.82 ఎకరాలు 65 మంది రైతుల పేరుతో అధికారులకు ఫైలు
సీఆర్‌డీఏలో ఆగమేఘాలపై కదిలిన ఫైలు
వెంటనే నివేదిక పంపాలంటూ రెవెన్యూ అధికారులకు ఆదేశాలు
రైతుల పేర్లతో రెవెన్యూ అధికారుల నోటీసులు
అసలు ఆ ప్రాంతంలో ఆ రైతులే లేరని విచారణలో వెల్లడి
గతంలోనూ నదీ ప్రవాహాన్ని సాగు భూమిగా మార్చిన వైనం
తెలుగుదేశం నేతల పేర్లతో అడంగల్‌లోకి..
అప్పట్లో తహసీల్దార్ కుమారులు, డ్రైవర్‌కు భూ నజరానా
గుట్టు రట్టవడంతో తహసీల్దార్‌ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: నదిలో ఉన్న భూమి సాగు భూమి అవుతుందా? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే రాజధాని అమరావతిలో మాత్రం కచ్చితంగా అవుతుంది. లేని భూమిని ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చి, భారీగా లబ్ధి పొందుతారు. గతంలోనూ టీడీపీ హయాంలో ఇలాంటి ప్రయత్నం ఒకటి జరిగింది. ఆ విషయం తెలిసిపోవడంతో తహసీల్దార్‌ను సస్పెండ్ చేశారు. ఇప్పుడు అదే తరహా కుంభకోణం ఫైలు మరొకటి ఉన్నతస్థాయి నుంచి చకచకా కదిలి రెవెన్యూ అధికారుల వద్దకు వచ్చింది.
అసలు రెవెన్యూ రికార్డుల్లో లేని నదీ ప్రవాహంలోని సర్వే నంబర్లు పేర్కొంటూ దానిని పూలింగ్‌కు తీసుకోవాలంటూ 65 మంది రైతుల పేర్లతో జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు రావడం.. అక్కడి నుంచి సీఆర్‌డీఏకి వెళ్లి తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకోవడం వేగంగా జరిగిపోయింది. దానిని క్లియర్ చేసేయాలంటూ ఉన్నతస్థాయి నుంచి అధికారులపై ఒత్తిళ్లూ వస్తున్నాయి. అయితే, ఇంత దారుణమైన మాయ చేయలేమంటూ అధికారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇదిగో ఇది ఆ మాయాభూమి కథ..
ఇటీవల తుళ్లూరు మండలం రాయపూడి సర్వే నంబర్ 1–ఎ1, 1–ఎ2 నుంచి 1–ఎ67 వరకూ ఉన్న 104.82 ఎకరాలకు సంబంధించిన రైతుల భూమి వర్గీకరణ, భూ స్థితి, అసైన్‌మెంట్ జరిగిందీ లేనిదీ వెంటనే వివరాలివ్వాలంటూ సీఆర్‌డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నుంచి తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయానికి ఆదేశాలు వచ్చాయి. అందులో ఆ భూమి యజమానులుగా 65 మంది రైతుల పేర్లు ఉన్నాయి. దీనిపై స్పందించిన తహసీల్దార్ కార్యాలయం లాండ్ పూలింగ్ వివరాల కోసం ఆ రైతులకు నోటీసులు జారీ చేసింది.
ఈ నెల 19న తమ వద్దకు వచ్చి ఆధారాలు చూపించాలని కోరుతూ రాయపూడిలో, తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద కూడా నోటీసులు అంటించింది. అయినా ఒక్క రైతూ ముందుకు రాలేదు. రెవెన్యూ అధికారులు విచారణ చేయగా.. ఆ దరఖాస్తులో ఉన్న రైతులు ఎవరూ ఆ ప్రాంతాల్లోనే లేనట్లు తేలింది. మైక్‌లో ప్రచారం చేసినా ఎవరూ రాలేదు. 19వ తేదీన ఒక్క వ్యక్తి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. అతని వద్ద కూడా ఆధారాలు లేవని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
పూర్తిగా విచారణ చేయగా రైతులు తమ భూమి అని పేర్కొన్న భూమి మొత్తం కృష్ణా నదీ గర్భంలో ఉన్నట్లు తేలింది. అది నదిలో ఉన్న భూమి. రాయపూడి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 1, 1/12–2బీ2ఏ, 16–ఏ2, 16–బీ2, 71–ఏ, 15–ఏ, 15–బీ, 17–ఏ, 225–1, 72, 96లో నదీ ప్రవాహం వెళ్తుంది. వీటిలో మరికొన్ని నదిలోనే దిబ్బలుగా ఉన్నాయి. నదీ ప్రవాహంలో ఉన్న భూముల క్రయ విక్రయాలు చట్ట విరుద్ధం.
అక్రమంగా లబ్ధి పొందేందుకే..!
అడంగల్‌లో ఆ సర్వే నంబర్లే లేవని, ఎవరికీ పాస్ పుస్తకాలు ఇ చ్చినట్లు కూడా లేదని రెవెన్యూ అధికారుల విచారణలో తేలింది. అయినా అమరావతి రాజధాని ప్రాంతంలో సీఆర్‌డీఏ ప్లాట్ల విలువ కోట్లలో ఉండటంతో అక్రమంగా లబ్ధి పొందేందుకు కొందరు వ్యక్తులు రాయపూడి నదీ ప్రవాహాన్ని సాగు భూమిగా సృష్టించారు. ఇప్పుడు దాన్ని లాండ్ పూలింగ్‌కు తీసుకొమ్మని సీఆర్‌డీఏ అధికారులను ఒత్తిడి చేస్తున్నారు.
అసలు రైతులు, భూమి లేకుండా తామేమీ చేయలేమని రెవెన్యూ అధికారులు అంటున్నారు. అయితే వారికి ఉన్నత స్థాయి నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం. అడంగల్ లేని, పాసు పుస్తకాలు కూడా లేని భూమికి అనుమతులెలా ఇస్తామని అధికారులు అంటున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఓ తహసీల్దార్ ఇలానే ఇరుక్కొన్నారన్న విషయాన్ని గుర్తు చేసి, ఈసారి ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
ఇదీ పాత కథ
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నదీ ప్రవాహాన్ని వారి సాగు భూములుగా రికార్డులు పుట్టించి మండల రెవెన్యూ అధికారి సహకారంతో ఆడంగల్‌లో చేర్చారు. 20 ఎకరాల ఈ భూముల విలువ అప్పట్లోనే రూ.30 కోట్లకు పైగా ఉండేది.
తొలుత 1/12–2బీ, 2ఏ, 71–ఏ సర్వే నంబర్లలో ఉన్న నదీ పరివాహక ప్రాంతాన్ని సాగు భూములుగా, ఆ తర్వాత 16–ఏ2, 16–బీ2, 15–ఏ, 15–బీలో ఉన్న కృష్ణా నదిని ఇద్దరి పేర్లతో ఆడంగల్‌లో చేర్చారు. వీటిని వేరే వారికి అమ్మేసి మ్యుటేషన్ ద్వారా వేర్వేరు రిజి్రస్టార్ కార్యాలయాల్లో రిజి్రస్టేషన్ కూడా చేయించేశారు. వాస్తవానికి రెవెన్యూ అధికారులు ఆ భూములు ఉన్న ప్రదేశాన్ని పరిశీలించి, నివేదిక ఇచ్చాకే రిజి్రస్టేషన్ పూర్తవుతుంది.
అయితే, అప్పటి అధికారులు టీడీపీ నేతలతో కుమ్మక్కవడంతో నదిని కూడా సాగు భూమిగా చూపించారు. ఈ అక్రమాన్ని సక్రమం చేసినందుకు రెవెన్యూ అధికారి కొడుకులు, కారు డ్రైవర్‌కు కొంత భూమిని పంచారు. ఈ వ్యవహారాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో రాష్ట్రవ్యాప్తంగా తెలిసిపోయింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అప్పట్లో తహసీల్దార్‌ను సస్పెండ్ చేశారు.
ఆ భూములకు రైతులే లేరు
సర్వే నంబర్ 1–ఎ1 నుంచి 1–ఎ67 వరకు ఉన్న భూమిలో 65 మంది రైతులు ఉన్నారని, వారి భూమిని ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చారా లేదా వివరాలు కావాలని సీఆర్‌డీఏ నుంచి ఆదేశాలు మాకు వచ్చాయి. రైతులు వారి వద్ద ఉన్న వివరాలు అందచేయాలని నోటీసులు ఇచ్చి, మైక్ ప్రచారం చేసినా ఎవరు రాలేదు. అసలు వారు చెప్పిన సర్వే నంబర్లు మా రికార్డుల్లోనూ లేవు. – సుజాత, తహసీల్దార్, తుళ్లూరు
Comments
Please login to add a commentAdd a comment