Vros
-
మళ్లీ గ్రామ రెవెన్యూ అధికారులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. త్వరలోనే ఈ నియామకాలను పూర్తిచేసి.. గతంలో రెవె న్యూ సిబ్బంది అందించిన అన్ని సేవలను మళ్లీ వారికే అప్పగించనుంది. మొత్తంగా రాష్ట్రంలోని 10,909 రెవెన్యూ గ్రామాలకు మళ్లీ రెవెన్యూ అధికారులు రానున్నారు.గతంలో వీఆర్వోలు, వీఆర్ఏలుగా పనిచేసిన వారిలో... పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులైన వారికి నేరుగా బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలిసింది. మిగతా వారిలో తగిన విద్యార్హతలు ఉన్న వారికి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించి, నియామకాలు చేపట్టనున్నారు. అయి తే ఈ గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థకు ప్రభు త్వం ఇంకా ఎలాంటి పేరును నిర్ణయించలేదు. ఇబ్బందులు రాకుండా ప్రణాళిక.. గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణం కోసం కొన్ని ప్రాతిపదికలను రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్నట్టు తెలిసింది. ఈ అంశంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పకడ్బందీ ప్రణాళిక రూపొందిస్తున్నారు. న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వీఆర్వోలు, వీఆర్ఏలుగా నియమితులైన వారిని నేరుగా గ్రామ రెవెన్యూ అధికారిగా విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 వేల మంది తిరిగి రెవెన్యూ శాఖలోకి రానున్నారు. దాదాపు మరో 8 వేల మందిని రాత పరీక్ష ఆధారంగా నియమించనున్నారు. గతంలో వీఆర్వోలు, వీఆర్ఏలుగా పనిచేసి.. వివిధ శాఖల్లోకి వెళ్లిన వారిలో డిగ్రీ, ఇంటర్ అర్హతలను గుర్తించి వేర్వేరుగా ఈ పరీక్ష (రెవెన్యూ సేవలే సిలబస్‌గా) నిర్వహించనున్నారు. పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టనున్నారు. నేడు వీఆర్వోల ఆతీ్మయ సమ్మేళనం పూర్వ వీఆర్వోల ఆతీ్మయ సమ్మేళనం ఆదివారం శామీర్‌పేట మండలంలోని తూంకుంట గ్రామంలో జరగనుంది. తెలంగాణ వీఆర్వోల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశంలో... గ్రూప్–4 ఉద్యోగ నియామకాల ద్వారా ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని అసోసియేషన్ అధ్యక్షుడు గరిక ఉపేందర్‌రావు వెల్లడించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లోకి వెళ్లిన పూర్వ వీఆర్వోలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారంపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. -
అసైన్డ్ భూముల యాజమాన్య హక్కులపై భారీ కసరత్తు
సాక్షి, అమరావతి: అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం భారీ కసరత్తు చేస్తోంది. అసైన్డ్ రైతులకు హక్కులిచ్చేందుకు అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించిన ప్రభుత్వం దాన్ని అమలు చేసే దిశగా వేగంగా అడుగులేస్తోంది. అందులో భాగంగా జిల్లాల్లో అసైన్డ్ భూముల లెక్కలు తేల్చేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు చురుగ్గా వెరిఫికేషన్ జరుగుతోంది. ఈ ఏడాది జూలై 31 నాటికి అసైన్ చేసి 20 ఏళ్లు పూర్తయిన భూముల వివరాలను వీఆర్వోలు తనిఖీ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమికంగా 27.41 లక్షల ఎకరాలపై హక్కులివ్వాలని ఇప్పటికే నిర్ణయించగా క్షేత్ర స్థాయిలో ఆ భూములను పరిశీలిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో నిశిత పరిశీలన.. ప్రతి రెవెన్యూ గ్రామంలో అసైన్డ్ భూములు అసైన్‌దారుల చేతుల్లో ఉన్నాయా, లేదా అనే విషయాన్ని వీఆర్వోలు నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రతి సర్వే నంబర్‌కు సంబంధించిన పట్టాను పరిశీలించి ఆ పట్టాదారు ప్రభుత్వం భూమి కేటాయించిన వ్యక్తా లేక అతని వారసుడా? అనే విషయాన్ని నమోదు చేస్తున్నారు. సంబంధిత భూమి వారి ఆధీనంలోనే ఉందా? రెవెన్యూ రికార్డుల ప్రకారం.. ఆ భూమి లంక భూమా? లేక నీటి వనరులకు సంబంధించిన భూమా? ఆ భూమి అతనికి ప్రభుత్వం ఎప్పుడు అసైన్ చేసింది? వంటి వివరాలను సేకరిస్తున్నారు. అసైన్డ్ భూములకు సంబంధించి డీకేటీ రిజిస్టర్లు, 1బీ అడంగల్, 22ఎ జాబితా, ఇతర రెవెన్యూ రికార్డులు చూసి వాటికి తగ్గట్టు క్షేత్ర స్థాయి పరిస్థితి ఉందా లేదా?, వాస్తవ పరిస్థితి ఏమిటనే విషయాలను నమోదు చేస్తున్నారు. 4 వేల గ్రామాల్లో పూర్తి.. ఇప్పటివరకు 4 వేల గ్రామాల్లోని 8 లక్షల ఎకరాల్లో వీఆర్వోలు వెరిఫికేషన్ పూర్తి చేశారు. తహశీల్దార్లు 2,600 గ్రామాల్లో తనిఖీలు పూర్తి చేయగా, ఆర్డీవోలు వెయ్యికి పైగా గ్రామాల్లో, జేసీలు 150కిపైగా గ్రామాల్లో వెరిఫికేషన్ ముగించారు. దీంతో తనిఖీలు పూర్తయిన గ్రామాల్లో తహశీల్దార్లు అసైన్డ్ భూముల జాబితాలను తయారు చేస్తున్నారు. వీఆర్వోలు, తహశీల్దార్ల స్థాయిలో జరిగిన వెరిఫికేషన్‌ను ఆర్డీవోలు, సబ్ కలెక్టర్లు పరిశీలిస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి వెరిఫికేషన్‌ను పూర్తి చేసి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అసైన్డ్ భూముల జాబితాలను తయారు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇవన్నీ తయారైన తర్వాత వచ్చే నెలలో పూర్తి స్థాయిలో తనిఖీ చేసి జిల్లా కలెక్టర్లకు పంపనున్నారు. వారి నుంచి జిల్లా రిజిస్ట్రార్లకు 22(ఎ) నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించాల్సిన భూముల జాబితాను పంపడానికి కసరత్తు జరుగుతోంది. -
గ్రేడ్–2 వీఆర్వోల ప్రమోషన్‌కు మార్గం సుగమం
సాక్షి, అమరావతి: గ్రేడ్–2 వీఆర్వోలకు ప్రభుత్వం ప్రమోషన్ చానల్ కల్పించింది. ఈ మేరకు ఏపీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ సర్వీస్ రూల్స్‌ను సవరిస్తూ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిప్రకారం గ్రేడ్–2 వీఆర్వోలకు ప్రమోషన్లకు అవకాశం ఏర్పడుతుంది. ఈ మేరకు గ్రేడ్–2 నుంచి గ్రేడ్–1గా ప్రమోషన్ చానల్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్–166 ప్రతిని రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేతుల మీదుగా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి రవీంద్రరాజుకు గురువారం అందజేశారు. ప్రభుత్వం జీవో జారీ చేయడంపై రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘ నాయకులు హర్షం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మెహన్ రెడ్డి, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారుల సంఘ నాయకులు దేవరాజు, గోపాలకృష్ణ, ఆరుమళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లకు కొత్త జాబ్ చార్ట్
సాక్షి, అమరావతి: వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త జాబ్ చార్ట్ ఇచ్చింది. గ్రామ సచివాలయాల్లో పనిచేసే వీఆర్వోలు, వార్డు సచివాలయాల్లో పనిచేసే వార్డు రెవెన్యూ కార్యదర్శులకు కంబైన్డ్ జాబ్ చార్ట్, గ్రేడ్–1, 2, 3 గ్రామ సర్వేయర్లకు జాబ్ చార్ట్‌లపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ రెండు వేర్వేర్లు ఉత్తర్వులిచ్చారు. వీఆర్వోల జాబ్ చార్ట్.. తుపాన్లు, వరదలు, ప్రమాదాలు లాంటి విపత్తు నిర్వహణ విధులు, ఓటర్ల జాబితా అప్డేషన్, ప్రభుత్వం నిర్దేశించే ఇతర ఎన్నికల విధులు, రెవెన్యూ రికార్డుల మ్యుటేషన్ పనులు, భూముల రీ సర్వే కార్యకలాపాలు, నివాస, నేటివిటీ లాంటి సర్టిఫికెట్ల జారీ విధులను నిర్వర్తించాలని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో రెవెన్యూ శాఖకు సంబంధించిన అన్ని వినతులను పరిశీలించి తీసుకున్న చర్యలపై ఆయా శాఖలకు నివేదికలు పంపడం లాంటి పనుల్ని నిర్దేశించారు. పంటల అజమాయిషీ, సర్వే రాళ్ల తనిఖీ, ప్రభుత్వ భూములు, ఆస్తుల రక్షణ, రోడ్లు, వీధులు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా కాపాడటం, రెవెన్యూ సెస్, పన్నులు వసూలు చేయాలి. హత్యలు, ఆత్మహత్యలు, అసహజ మరణాలు, గ్రామాల్లో శాంతి భద్రతకు విఘాతం కలిగించే అంశాలను తహశీల్దార్‌కు నివేదించడంతోపాటు తహశీల్దార్, కలెక్టర్, సీసీఎల్ఏ, ప్రభుత్వం నిర్దేశించే ఇతర పనుల్ని ఎప్పటికప్పుడు నిర్వర్తించాలని జాబ్ చార్ట్‌లో పేర్కొన్నారు. ఒకే సమయంలో ఎక్కువ పనులు చేయాల్సి వచ్చినప్పుడు ప్రాధాన్యతకు అనుగుణంగా చేపట్టాలని సూచించారు. గ్రామ సర్వేయర్ల జాబ్ చార్ట్ వ్యక్తులు, ప్రభుత్వ సంస్థలతోపాటు అనుమతించిన లేఅవుట్లకు సంబంధించి ఎఫ్‌లైన్ పిటిషన్లు (సరిహద్దు వివాదాలు, హద్దులు–విస్తీర్ణంలో తేడాలు లాంటి వాటిపై అందే దరఖాస్తులు) స్వీకరించి పరిష్కరించాలి. సర్వే సబ్ డివిజన్, సంబంధిత మార్పులు చేసే బాధ్యత వారిదే. గ్రామ కంఠాలు, పూర్తిస్థాయి స్ట్రీట్/టౌన్ సర్వే, కొత్త సబ్ డివిజన్, పాత సబ్ డివిజన్లను కలపడంపై అందే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించి గ్రామ రికార్డుల్లో చేర్చాలి. సచివాలయాల పరిధిలో అందే అన్ని వినతులతోపాటు వివిధ శాఖల అధికారులు రిఫర్ చేసే అంశాలపై నివేదికలు ఇవ్వాలి. మిస్ అయిన, దెబ్బతిన్న, తొలగించిన సర్వే పాయింట్లు, మార్క్‌లు, గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లు సర్వే, సరిహద్దు చట్టం ప్రకారం ముసాయిదా నోటీసు ఇచ్చి రెన్యువల్ చేయాలి. తన పరిధిలోని 10 శాతం సర్వే పాయింట్లు, మార్క్‌లు, గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లను ప్రతి నెలా తనిఖీ చేయాలి. కాంపిటెంట్ అథారిటీ అధికారుల ఆదేశాల ప్రకారం రికార్డుల్లో తప్పులను సరి చేయాలి. పై అధికారులకు సమాచారమిచ్చి అన్ని తనిఖీలకు గ్రామ సర్వేయర్లు హాజరు కావాలి. సర్వే పరికరాలు, ఇతర వస్తువులను సర్వీస్ చేయించి నిర్వహణ చేపట్టాలి.నెలవారీ టూర్ డైరీలు, ప్రోగ్రెస్ స్టేట్మెంట్లు ఇతర నిర్దేశిత సమాచారాన్ని సర్వే సెటిల్మెంట్ కమిషనర్‌కు పంపాలి. సర్వే కార్యకలాపాలను ఈటీఎస్, డీజీపీఎస్, కార్స్ లాంటి అత్యాధునిక సాంకేతిక పరికరాలతోనే నిర్వహించాలి. వీఆర్వోలకు సహకరించాలి. ఈ జాబ్ చార్ట్ ఆధారంగా పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ కూడా ఇచ్చారు. -
వీఆర్వోల విలీన ప్రక్రియపై స్టేటస్ కో.. అయితే ఇది అందరికీ కాదు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఇతర ప్రభుత్వ శాఖల్లో వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియపై స్టేటస్ కో విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇది పిటిషనర్ల (19 మంది)కు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. రెవెన్యూ శాఖను పర్యవేక్షించే భూపరిపాలన విభాగంలో వీఆర్వోలుగా పనిచేస్తున్న వారిని ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు (విలీనం) చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి ఇస్తూ జీవో నంబర్ 121ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ జీవో చట్టవిరుద్ధమని, సహజ న్యాయ సూత్రాలను ఉల్లఘించినట్లేనని పేర్కొంటూ.. పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ ను రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ లేదా తత్సమాన పోస్టుల్లో భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ శాఖలో ఆ మేరకు ఖాళీలు కూడా ఉన్నాయని వెల్లడించారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటినర్ తరఫున అడ్వొకేట్ ఫణి భూషణ్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే 90 శాతం సర్దుబాలు ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. ఈ సమయంలో స్టేటస్ కో విధించడం సరికాదన్నారు. వారు రెవెన్యూ శాఖలోనే పని చేస్తామని పట్టుబట్టడం కూడా చట్టవిరుద్ధమని వెల్లడించారు. అంతకు ముందు స్టేటస్ కో వీఆర్వోలందరికీ వర్తిస్తుందని చెప్పిన ధర్మాసనం.. ఏజీ వాదనల తర్వాత దాన్ని పిటిషనర్లకు మాత్రమే వర్తింపజేసింది. విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
వీఆర్వోల విధులూ ‘సర్దుబాటు’! హైకోర్టులో వీఆర్వోల జేఏసీ పిటిషన్
సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)ను ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇన్నాళ్లూ వారు నిర్వర్తించిన విధులను కూడా ఇతర శాఖలకు బదిలీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మొత్తంగా వీఆర్వో హోదాలో మండల రెవెన్యూ కార్యాలయం, గ్రామ పంచాయతీ కార్యాలయాలు కేంద్రంగా నిర్వహించిన దాదాపు 50కిపైగా విధులను పలు శాఖలకు అప్పగించేందుకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. కుల, ఆదాయ, నివాసం, ఇతర ధ్రువపత్రాల పరిశీలన బాధ్యతలను పంచాయతీరాజ్ శాఖకు బదిలీ చేయనున్నట్టు తెలిసింది. ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులు పని ఒత్తిడిలో ఉన్నందున.. ధ్రువపత్రాల పరిశీలన విధులు వారికి ఇవ్వాలా, లేక పంచాయతీరాజ్ శాఖలోని ఇతర సిబ్బందికి ఇవ్వాలా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. రైతుబంధు కార్యక్రమం రెవెన్యూ రికార్డుల ఆధారంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలోనే జరుగుతున్న నేపథ్యంలో.. వీఆర్వోలు చూసుకున్న పంట నష్టం అంచనాలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా జరిగే నష్టాల అంచనాల బాధ్యతను వ్యవసాయ శాఖకే అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఇక వీఆర్వోల ముఖ్య విధి అయిన భూముల రక్షణ బాధ్యతలను స్థానిక సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. గ్రామ పంచాయతీలు, అర్బన్ మండలాల పరిధిలోకి వచ్చే భూముల రక్షణ బాధ్యతను ఆయా స్థానిక సంస్థలకు చెందిన శాఖలకు అప్పగించనుంది. మిగతా సాధారణ విధులను భూపరిపాలన విభాగంలోని ఇతర సిబ్బందితో చేయించాలని, అవసరాన్ని బట్టి కొన్ని విధులను పలు శాఖల సిబ్బందికి అప్పజెప్పాలని ప్రభుత్వం భావిస్తోంది. లాటరీలు పూర్తిచేస్తున్న కలెక్టర్లు వీఆర్వోలను ఇతర శాఖలకు బదిలీ చేసే ప్రక్రియలో భాగంగా కలెక్టర్లు లాటరీలను పూర్తి చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో వీఆర్వోలను ఇతర శాఖలకు కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. చాలా మంది ఈ ఉత్తర్వులను తీసుకుంటుండగా.. కొంద రు వీఆర్వోలు ఉత్తర్వుల స్వీకరణకు విముఖత చూపుతున్నారు. మరోవైపు వీఆర్వో సంఘాలు ప్రభుత్వంపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నాయి. జీవోను కొట్టివేయాలంటూ వీఆర్వోల జేఏసీ హైకోర్టులో పిటిషన్ వేసింది. మరికొందరు వ్యక్తిగతంగా కోర్టుల ను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. సీనియారిటీ వర్తిస్తుందా.. లేదా? ఇతర శాఖల్లోకి వెళ్తున్న వీఆర్వోలకు వారి ఉద్యోగ సీనియారిటీ లభిస్తుందా లేదా అన్న దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. వీఆర్వోలు ఇతర శాఖల్లో రిపోర్టు చేసేందుకు రెవెన్యూ శాఖ నుంచి తాజా పేసర్టిఫికెట్, సర్వీస్ రిజిస్టర్ సమర్పించాల్సిన నేపథ్యంలో సీనియారిటీ కచ్చితంగా వర్తిస్తుందని కొందరు చెప్తుండగా.. మిగులు ఉద్యోగులుగా ప్రకటించినందున సివిల్ సర్వీసెస్ లేదా సబార్డినేట్ రూల్స్ ప్రకారం సీనియారిటీ క్లెయిమ్ చేసుకునే వీలుండదని మరికొందరు పేర్కొంటున్నారు. -
అప్పుడు రోడ్డు పాల్జేసి... ఇప్పుడు సర్దుబాటా? కేసీఆర్ నిర్ణయంపై బండి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ శాఖలో వీఆర్వోలను దొంగలుగా చిత్రీకరించి 22 నెలల పాటు రోడ్డు పాల్జేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు వారిని లాటరీ పద్ధతిలో ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సీఎం కేసీఆర్ మొదటి నుంచి రెవిన్యూ వ్యవస్థపై కక్ష కట్టారని, అశాస్త్రీయమైన ధరణి వెబ్‌సైట్‌లోని తప్పులను ఎత్తిచూపుతారనే ఉద్దేశంతో వీఆర్వో వ్యవస్థను తొలగించారని సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. కొత్త జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పాటు చేసిన సీఎం... రెవిన్యూ శాఖలో కొనసాగుతున్న 7 వేల పైచిలుకు వీఆర్వోలను రోడ్డుపాలు చేశారని విమర్శించారు. భూస్వామ్య మనస్తత్వం కలిగిన కేసీఆర్‌కు ప్రజాస్వామ్యంపైన నమ్మకం లేదని, 8 ఏళ్లుగా పెత్తందారీ దోరణితో పాలన కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. సర్పంచులకు అధికారాల్లేకుండా చేశారని, ఎంపీటీసీ, జడ్పీటీసీలను నామమాత్రంగా మార్చారని మండిపడ్డారు. పంచాయతీరాజ్, రెవిన్యూ వ్యవస్థలను నిర్వీర్యం చేసి గ్రామ కార్యదర్శులకు మనశ్సాంతి లేకుండా చేస్తున్నారన్నారు. ఉన్నత విద్యావంతులైన వీఆర్వోలను తహసీల్దార్లుగా చేస్తానని గతంలో హామీ ఇచ్చిన కేసీఆర్... అవినీతి సాకుతో వీఆర్వో వ్యవస్థనే నిర్మూలించడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి తక్షణమే జీవో నెంబర్ 121ను ఉపసంహరించుకోవాలని, వీఆర్వోలందరికీ పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
సర్దుబాటుపై ససేమిరా!
సాక్షి, హైదరాబాద్: గ్రామరెవెన్యూ అధికారు(వీఆర్వో)లకు ప్రభుత్వం న్యాయం చేయకపోతే కోర్టును ఆశ్రయిస్తామని వీఆర్వోల జేఏసీ స్పష్టం చేసింది. గురువారం ఇక్కడి సీసీఎల్ఏ కార్యాలయంలో స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వీఆర్వోల జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీశ్ మాట్లాడుతూ వీఆర్వోలను వివిధ శాఖల్లో ప్రభుత్వం సర్దుబాటు చేస్తుందన్న వార్తలతో తాము తీవ్ర మనోవేదనకు గురవుతున్నామన్నారు. వీఆర్వోల జేఏసీని సంప్రదించిన తర్వాతే సర్దుబాటు ప్రక్రియపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులను ఏ ఒక్క వీఆర్వో కూడా స్వీకరించబోరని స్పష్టం చేశారు. అశాస్త్రీయ పద్ధతిలో వీఆర్వో పోస్టులను రద్దు చేయడం అమానుషమన్నారు. ఏకపక్ష నిర్ణయంతో ఇతర శాఖల్లోకి వీఆర్వోలను బదిలీ చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. వీఆర్వోలను రెవెన్యూ శాఖలోనే సమానహోదాతో సర్దుబాటు చేయాలని, అర్హులైన వీఆర్వోలకు సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు రామచంద్రాపురం(పటాన్చెరు): ప్రభుత్వానికి తాము వ్యతిరేకం కాదని, సమస్యల పరిష్కారానికే న్యాయ పోరాటం చేస్తున్నామని రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికే ఉపేందర్‌రావు అన్నారు. గురువారం రామచంద్రాపురంలో నిర్వహించిన గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇతర శాఖల్లోకి వీఆర్వోలను బలవంతంగా సర్దుబాటు చేస్తే సర్వీస్ పరమైన సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
గుడ్‌న్యూస్: ఇక వీఆర్వోలు నేరుగా సీనియర్ అసిస్టెంట్లు
సాక్షి, అమరావతి: సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న వీఆర్వోల పదోన్నతులకు రాష్ట్ర ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. గ్రేడ్–1 వీఆర్వోలకు నేరుగా సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించేందుకు విధివిధానాలను రూపొందించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. డిగ్రీ చదివి, ఐదేళ్లు గ్రేడ్–1 వీఆర్వోగా సర్వీసు పూర్తి చేసినవారికి నేరుగా సీనియర్ అసిస్టెంట్ పదోన్నతికి అర్హత ఉంటుందని తెలిపారు. రెవెన్యూ శాఖలో పనిచేసే గ్రేడ్–1 వీఆర్వోలు, జూనియర్ అసిస్టెంట్లు/టైపిస్టుల మధ్య 60:40 నిష్పత్తిలో.. జిల్లా స్థాయిలో రొటేషన్ పద్ధతిలో పదోన్నతులు కల్పిస్తారు. పదోన్నతి పొందిన వీఆర్వోలు.. మొదట సీనియర్ అసిస్టెంట్లుగా తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్లో రెండేళ్లు పని చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్లుగా వారిని ఫీల్డ్ వర్క్‌కి పంపకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పదోన్నతి పొందాక అన్ని డిపార్ట్మెంట్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించే కంప్యూటర్, ఆటోమేషన్ పరీక్షల్లోనూ ఉత్తీర్ణత సాధించాలని తెలిపారు. ఇవన్నీ రెండేళ్లలోపు పూర్తి చేయకపోతే వారిని తిరిగి వీఆర్వోలుగా పంపుతామన్నారు. రెండేళ్లలో ఈ అర్హతలన్నీ సాధించినవారిని రెగ్యులరైజ్ చేయడంతోపాటు సీనియారిటీని కూడా నిర్ధారిస్తామని స్పష్టం చేశారు. ఇందుకనుగుణంగా 1998 ఏపీ మినిస్టీరియల్ సర్వీసు రూల్స్‌ని సాధారణ పరిపాలన శాఖ సవరిస్తుందన్నారు. -
వీఆర్వోల ‘సర్దుబాటు’
సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)ను ఇతర ప్రభుత్వశాఖల్లో సర్దుబాటు చేసే ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు రాష్ట్రంలో పనిచేస్తున్న వీఆర్వోల పూర్తి వివరాలను భూపరి పాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) కార్యాల యం మళ్లీ సేకరిస్తోంది. మూడు ఫార్మాట్లలో వారి సమగ్ర సమాచారాన్ని పంపాలని జిల్లా కలెక్టర్లకు లేఖలు రాసింది. వీఆర్వోలందరి వివరాలను 18 కాలమ్‌ల ఫార్మాట్లో పంపాలని, వారిపై ఉన్న కేసులు, సస్పెన్షన్లు, దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్నవారి వివరాలు మరో ఫార్మాట్లో, వీఆర్వోల కులం, మతం, విద్యార్హతలు, ఉద్యోగ ఎంపికల గురించి ఇంకో ఫార్మాట్లో నమోదు చేసి పంపాలని కలెక్టర్లకు సూచించింది. వీలైనంత త్వరగా ఈ వివ రాలను చేరవేయాలని ఆ లేఖలో పేర్కొంది. కాగా, వీఆర్వోలను జూనియర్ అసిస్టెంట్ల హోదాలో పలు ప్రభుత్వశాఖల్లో సర్దుబాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వారి సర్వీసు, విద్యార్హతల ఆధారంగా వివిధ శాఖలకు ఇవ్వాలని, ఆ తర్వాత వారికి పదోన్నతుల ప్రకియ్ర చేపట్టాలని యోచిస్తున్నామని సీసీఎల్ఏ వర్గాలు తెలిపాయి. డైరెక్ట్ రిక్రూటీ వీఆర్వోలను రెవెన్యూలోనే కొనసాగించాలని ఆలోచిస్తున్నట్టు వెల్లడించాయి. తప్పులున్నాయి.. సరిపోలడంలేదు వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా 5,485 మంది వీఆర్వోలు పనిచేస్తున్నారు. ఈ వ్యవస్థను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత వీరందరి వివరాలను ఇప్పటికే రెండుసార్లు సీసీఎల్ఏ వర్గాలు తెప్పించుకున్నాయి. గత ఏడాది డిసెంబర్లో తెప్పించిన వివరాల్లో వీఆర్వోల విద్యార్హత, కులం, ఉద్యోగ ఎంపికలకు సంబంధిం చిన వివరాలు సరిగా లేవని, ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో తెప్పించిన వివరాల్లో డిసెంబర్లో వచ్చిన సమాచారానికి, మళ్లీ పంపిన సమాచా రానికి తేడా ఉందని గుర్తించాయి. ఈ నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి వీఆర్వోల వివరాలను సమగ్రంగా పంపాలని జిల్లా కలెక్టర్లను కోరుతూ సీసీఎల్ఏ లేఖలు రాయడం గమనార్హం. -
పెద్దముడియం తహసీల్దార్ సస్పెన్షన్
కడప అగ్రికల్చర్, జమ్మలమడుగు : జమ్మలమడుగు నియోకవర్గంలోని పెద్దముడియం తహసీల్దార్ వెంకటసుబ్బయ్య, వీఆర్వోలు ఓబయ్య, షహబుద్దీన్‌ను కలెక్టర్ కేవీ సత్యనారాయణ సస్పెండ్ చేశారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. కార్యాలయానికి తహసీల్దార్ వెంకటసుబ్బయ్య తరుచూ మద్యం సేవించి వస్తుండడం... ప్రభుత్వ కార్యకలాపాలు సక్రమంగా నిర్వర్తించలేకపోవడం తదితర కారణాలపై సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.పదిరోజుల కిందట వీఆర్వోలు షహబుద్దీన్, ఓబయ్యతో కలిసి తహసీల్దార్ ఆళ్లగడ్డలోని ఓబార్లో మద్యం తాగుతూ పట్టుబడ్డారు. దీనిపై విచారణ చేపట్టిన ఆర్డీఓ నివేదికను కలెక్టర్‌కు సమర్పించారు. దీని ఆధారంగా కలెక్టర్ తహసీల్దార్, వీఆర్వోలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
రెవెన్యూలో పదోన్నతులు వాయిదా
‘సాదాబైనామా’ పరిశీలన ఉన్నందున జేసీ నిర్ణయం హన్మకొండ అర్బన్ : సుమారు నెలరోజులుగా ఇదుగో అదిగో... అంటూ ఊరిస్తున్న రెవెన్యూ శాఖలోని వీఆర్వోలు, జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించే ప్రక్రియకు బ్రేక్ పడింది. దీని ఫలితంగా పదోన్నతులు పొంది పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న వారికి నిరాశ మిగిలింది. ప్రస్తుతం గ్రామస్థాయిలో సాదాబైనామాల ప్రక్రియ కొనసాగుతున్నందున వీఆర్వోల బదిలీ, పదోన్నతులు ఆగస్టు మొదటి వారంలో పరిశీలిద్దామంటూ జేసీ ఆదేశించినట్లు సమాచారం. దీంతో సుమారు 20రోజుల నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు కలెక్టరేట్లో పడిగాపులు వస్తూ వచ్చిన వీఆర్వోలు ఉస్సూరుమంటూ వెళ్లారు. ఆర్ఐ పోస్టుల కోసం వీఆర్వోలు, జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లు, ఆర్ఐలుగా పదోన్నతి కల్పించేందుకు కొద్దినెలల క్రితమే పేర్లతో సహా ఫైల్ సిద్ధమైంది. ఇంతలో కొందరు వీఆర్వోలు తమకు నగరం చుట్టుపక్కల ఆర్ఐ పోస్టింగ్‌లూ కావాలని పట్టుబట్టి ఢిల్లీ స్థాయి నుంచి ఫోన్లు చేయించగా అధికారులు ఆగ్రహించినట్లు సమాచారం. కాగా పదోన్నతి పొందిన వారికి సీనియర్ అసిస్టెంట్ పోస్టింగ్ ఇస్తామని డీఆర్వో ఇప్పటికే చెప్పినా వారు ఆర్ఐ పోస్టు... అది కూడా తాము కోరుకున్న చోటే కావాలని తీవ్రస్థాయిలో ఒత్తిడి రాడంతో అధికారులు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. 80 పోస్టులు ఖాళీ.. ప్రస్తుతం జిల్లాలో మొత్తంగా 60కిపైగా సీనియర్ అసిస్టెంట్ పోస్టులు, 20కిపైగా ఏఆర్ఐ, ఎంఆర్ఐ పోస్టులు ఖాళీగా ఉన్నాయని సమాచారం. అయితే మండలానికి ఒక ఆర్ఐ పోస్టు సరిపోతుందని భావించిన అధికారులు ప్రసుతం సీనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయాలని భావించారు. ఇదే ఉద్దేశంతో ఇటీవల కొందరు సీనియర్ అసిస్టెంట్లను ఆర్ఐ పోస్టుల్లోకి బదిలీ చేశారు. ఈక్రమంలో అధికారులపై ఆర్ఐ పోస్టుల కోసం ఒత్తిళ్లు పెరగడంతో వారు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. కొన్నిచోట్ల ప్రస్తుతం విధుల్లో ఉన్న ఆర్ఐలను బదిలీ చేసి మరీ తమకు ఆ పోస్టింగ్ ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లాలోని ఒక మంత్రి, రాష్ట్రం నుంచి ఢిల్లీలో ఉన్న ఒక ప్రముఖ నాయకుడే కాకుండా కొందరు ఆర్డీవోల నుంచి పోస్టింగ్‌ల కోసం చెప్పిస్తున్నట్లు సమాచారం. అయితే, మొత్తం ప్రక్రియ వాయిదా పడగా... ఆగస్టు మొదటి వారంలో ఎవరి పంతం నెగ్గుతుందో తేలనుంది. -
కలెక్టర్‌కు వీఆర్వోల సంఘం నాయకుల వినతి
నగరంపాలెం (గుంటూరు) : 2012 ఏపీపీఎస్సీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా గ్రామ రెవెన్యూ అధికారుల నియామకం పొంది నాలుగేళ్లు సర్వీస్ పూర్తి చేసిన వారికి సర్వీస్ రెగ్యులైజేషన్ కానీ, ప్రొబేషన్ పీరియడ్ డిక్లరేషన్ గానీ చేయాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా నాయకులు శనివారం కలెక్టర్ కాంతిలాల్ దండేను కోరారు. కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ దండేను కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. ప్రకాశం, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఇప్పటికే సర్వీస్ రెగ్యులరైజషన్ జరిగిందన్నారు. ఆరేళ్లు పూర్తి చేసుకున్న వీఆర్వోలకు స్పెషల్ ఇంక్రిమెంట్ కోసం ఆరు నెలలుగా కలెక్టరేట్లో పెండింగ్ ఉన్నాయని తెలిపారు. వివిధ కారణాలతో సస్పెండైన వీఆర్వోలు ఏడాది కాలంగా ఇబ్బంది పడుతున్నారని, వారికి మానవతా దృక్పథంతో పోస్టింగ్‌లు ఇవ్వాలని కోరారు. జిల్లాలో పని చేస్తున్న 13 మంది పార్టు టైం వీఆర్వోలకు 11 నెలలుగా జీతాలు రావటం లేదని, ఇటీవల ప్రభుత్వ నిబంధనల ప్రకారం బదిలీ అయిన వీఆర్వోలను కొంతమంది తహశీల్దార్లు రిలీవ్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని వారు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సూరేపల్లి రాజశేఖర్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ప్రసన్నకుమార్, జిల్లా కార్యదర్శి పెరుగు శ్రీనివాసరావు, ట్రెజరర్ జి.బ్రహ్మేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఎస్. వంశీ కృష్ణమోహన్ తదితరులు ఉన్నారు. -
కలక్టరేట్ వద్ద వీఆర్వోల ఆందోళన
కరీంనగర్ : ఎంతోకాలం నుంచి అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వీర్వోలు బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ వద్ద భైటాయించారు. కనీసవేతనాలు అమలు చేయాలన డిమాండ్ చేశారు. నాల్గోతరగతి ఉద్యోగులు తమను గుర్తించాలని నినదించారు. 010 పద్దు కింది జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. బండెడు చాకరీ చేస్తున్న వీర్వోలపై తెలంగాణ సర్కార్ చిన్నచూపు చూస్తోందని వారు ఆరోపించారు. ఇప్పటికైన తమ డిమాండ్లు పరిష్కరించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. -
రెవెన్యూ శాఖకు జవసత్వాలు తేవాలి
తెలంగాణ రాష్ర్టంలో రెవెన్యూశాఖలో పనిచేస్తున్న తహసీల్దార్ స్థాయి నుంచి ఆఫీసు సబార్డినేట్ వరకున్న రెవెన్యూ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ గత ప్రభుత్వాలతో పలు మార్లు చర్యలు జరిపినా ఫలితం శూన్యమే. రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) మొదలు తహసీల్దార్ స్థాయి వరకు మొత్తం సిబ్బంది సంఖ్య 48 వేలు ఉంటుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కోసం రాత్రింబవళ్లు శ్రమించాల్సింది కూడా ఈ రెవెన్యూ ఉద్యోగులే. పలు సందర్భాల్లో రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు, వీఆర్ఓలు తమ జేబుల్లోంచి ఖర్చు చేయాల్సివస్తోంది. రాత్రిబవళ్లూ సేవలే: పోలీస్ శాఖ తర్వాత 24 గంటలు పనిచేసే విభాగం రెవెన్యూ శాఖనే పనివేళలు అసలేలేవు. సాయంత్రం వేళ పనిముగించుకొని ఇంటికి వెళ దామంటే మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులు రాత్రి వరకు వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తుంటారు. ఆ తర్వాత కిందిస్థాయి అధికారుల సూచనలు షరా మామూలే! పైగా ప్రతి జిల్లాలోని కలె క్టరేట్‌లో ఏ నుంచి జె వరకు సెక్షన్లు ఉంటాయి. వీటికి పరిపాలనా ధికారులుగా తహశీల్దార్ స్థాయిలో పది మంది ఉండాలి కానీ ఏ జిల్లాలోను ముగ్గురికి నలుగురికి మించిలేరు. మండలాల్లో కూడా కొన్ని చోట్ల తహసీల్దార్లు లేక డిప్యూటీ తహశీల్దార్లు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. పలుచోట్ల సీనియర్ అసిస్టెంట్, రెవెన్యూ ఇన్ స్పెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్న వారిపై రెట్టింపు భారం పడుతోంది. శ్రమకు తగ్గ వేతనాలు రెవెన్యూ ఉద్యోగులకు అధికారులకు లేవు. విద్యాశాఖలోని హెడ్మాస్టర్లకు ఉన్న స్కేలు తహశీల్దార్లకు లేదు. ఉపాధ్యాయులకు ఉన్న స్కేళ్లు రెవెన్యూ ఉద్యోగులకు లేవు. పే స్కేలు రెట్టింపు చేయాలని, స్పెషల్ స్కేల్ ఇవ్వాలని వేతన సవరణ సంఘాలకు గత ప్రభుత్వాలకు రెవెన్యూ కేంద్ర సంఘం అధ్యక్షుడు శివశంకర్ ఆధ్వర్యంలో ఉద్యమించినా ఫలితం దక్కలేదు. ప్రభుత్వ భూముల పరి రక్షణలో, ఇసుక అక్రమ రవాణా అరికట్టే విషయంలో వాల్టా చట్టం అమలులో తహశీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, వీఆర్ఓ లపై తరచు దాడులు జరుగుతూనే ఉన్నాయి. కరీంనగర్ జిల్లా లో ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్న ఓ మహిళ తహశీల్దార్‌పై హత్యా ప్రయత్నం, ఆదిలాబాద్ జిల్లా భీమిని మండల తహశీల్దా ర్‌పై సర్పంచ్ దాడి చేయడం ఇందుకు ఉదాహరణలు. పలు జిల్లాల్లో నిక్కచ్చిగా వ్యవహరించే రెవెన్యూ ఉద్యోగులను బదిలీ చేయించడం, తమ అనుచరులచే ఎస్సీ, ఎస్టీ, ఏసీబీ తదితర కేసుల్లో ఇరికించడం వంటి బాధలు పెడుతున్నారు. ఈ బాధల నుంచి రెవెన్యూ శాఖ ఉద్యోగుల రక్షణకు ప్రభుత్వపరంగా తగు చర్యలు చేపట్టి ఆ శాఖకు జవసత్వాలు తేవాలి. - హరి అశోక్ కుమార్ హైదరాబాద్ -
ప్రహసనంగా రుణమాఫీ
వీఆర్వోల చేతుల్లోనే జాబితాలు నెల్లూరు(అగ్రికల్చర్): రుణమాఫీ వ్యవహారం ప్రహసనంగా మారింది. పాలకుల రోజుకోమాట.. పూటకో మెలికతో అన్నదాతలు గందరగోళానికి గురవుతున్నారు. రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వడం లేదు. ఈ నెల 10వ తేదీ నాటికి జాబితాలను పరిశీలించి, 15వ తేదీకల్లా అర్హుల జాబితా ప్రకటించి రైతుల ఖాతాల్లో 20 శాతం నగదును జమ చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పిన మాటలు నీటిమూటలుగానే మిగిలిపోయాయి. ప్రభుత్వం ఆదిశగా ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కన్పించడం లేదు. బ్యాంకులు పంపిన ఖాతాల వివరాలు సరిగా లేవని ముప్పుతిప్పలు పెడుతోంది. జాబితాల పరిశీలన అనంతరం, జన్మభూమి కమిటీల ఆమోదం అంటూ మాట మార్చుతూ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన చివరి గడువు గురువారంతో ముగిసింది. జాబితాలు తమకు అందలేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్నత అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో వీఆర్వోల చేతుల్లోనే పరిశీలనా జాబితాలు ఉన్నట్లు సమాచారం. ఎక్కువ ఖాతాల విచారణ చేయాల్సి రావడంతో జాప్యం జరుగుతున్నదని అధికారులు పేర్కొంటున్నారు. మూడుసార్లు తీసుకున్నారు రైతుల రుణమాఫీ సంబంధించిన వివరాల సేకరణ ప్రహసనంగా మారింది. జిల్లాలో ఎంతమంది పేర్లు అర్హుల జాబితాలో ఉన్నాయో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. రుణమాఫీ కోసమంటూ ఇప్పటివరకు మూడు దఫాలుగా తీసుకున్న పత్రాలు బుట్టదాఖలేనని పలువురు రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ ప్రక్రియను జాప్యం చేసేందుకే ప్రభుత్వం ఎన్నో రకాల షరతులు, లింకులు పెడుతుందని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.ఈ ఏడాది మార్చి 31 వరకు జిల్లాలో 5,67,158 మంది రైతులు బ్యాంకుల నుంచి రుణాలను తీసుకున్నారు. 4,93,906 మంది రైతులు మాత్రమే రుణమాఫీకి అర్హులని బ్యాంకు అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపారు. గత ఏడాది రబీ, ఖరీఫ్ సీజన్లలో రైతులు తీసుకున్న రూ. 3,093.02 కోట్లు పంట రుణాలు రద్దవుతాయని ఆశించారు. బంగారం తనఖా పెట్టి 2,20,625 మంది రైతులు రూ.921 కోట్లు బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకున్నారు. బ్యాంకు అధికారులు పంపిన జాబితాలు సరిగా లేవని, వాటిని పరిశీలించి అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని రెవెన్యూ అధికారులకు పంపించారు. పరిశీలనకు పంపిన జాబితాలో 3.40 లక్షల మంది పేర్లు మాత్రమే ఉండటంతో మిగిలిన 1.5 లక్షల మంది రుణమాఫీకి అర్హులా, కాదా అనేది తేలాల్చి ఉంది. అంతా గందరగోళం... రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన విడుదల చేయకపోవడంతో అందరిలో గందరగోళం నెలకొంది. ఈ నెల 8న తహశీల్దార్ కార్యాలయాలకు పంపిన జాబితా అర్హులదో.. అనర్హులదో తెలియక లబ్ధిదారులు అయోమయంలో ఉన్నారు. తొలుత 4,93,906 మంది అర్హులుగా గుర్తించిన ప్రభుత్వం 3.4 లక్షల మంది పేర్లు మాత్రమే పరిశీలనకు తహశీల్దార్ కార్యాలయాలకు పంపడం.. పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నెల 21వ తేదీకల్లా 20 శాతం జమ చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఎవరికి జమ చేస్తుందో అర్థంకాని అయోమయ స్థితి నెలకొంది. పత్రాలు సమర్పించేందుకు నానా పాట్లు... రుణమాఫీకి సంబంధించి పలుమార్లు వివిధ పత్రాలను అందించేందుకు నానా పాట్లు పడినట్లు రైతులు వాపోతున్నారు. జిల్లావ్యాప్తంగా పలు రుణాలు పొందిన 4 లక్షల మందికి పైగా రైతులు బ్యాంకర్లకు, వీఆర్వోలకు ఇప్పటివరకు మూడుసార్లు పత్రాలు అందించారు. తొలిసారి బ్యాంకర్లకు 34 అంశాలకు సంబంధించి పలు పత్రాలు అందించగా, జాబితా వచ్చిన తర్వాత ఒకసారి, జాబితాలో నంబర్లు తీసుకున్న తర్వాత రెండోసారి వీఆర్వోలకు ఆధార్, ఓటరు కార్డులు ఇద్దరివి, రేషన్‌కార్డు, రుణ రసీదు కాపీలు అందజేశారు. వీటికి సంబంధించి పనులు మానుకొని మరీ కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరగడానికి..జెరాక్స్‌లకు..చార్జీలతో కలిపి లెక్కేసుకుంటే ఒక్కొక్కరికీ రూ.500 పైగానే ఖర్చయ్యాయని చెబుతున్నారు. స్పష్టత కరువు * జిల్లాలో ఎంతమంది రైతులకు రుణమాఫీ అవుతుంది? తొలిసారిగా అందించిన జాబితాలోని 4,93,906 మందికా? ఇటీవల తహశీల్దార్ కార్యాలయాలకు పంపిన 3.4 లక్షల మందికా అనేది స్పష్టత లేదు. * తహశీల్దార్ కార్యాలయానికి పంపిన 3.4లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తారనుకుంటే మిగిలిన 1,53,906 మంది రైతుల పరిస్థితి ఏమిటి? * రెండో జాబితా వస్తుందని కొంతమంది తహశీల్దార్లు, వీఆర్వోలు, బ్యాంకర్లు చెబుతున్నారని రైతులు పేర్కొంటున్నారు. నిజంగా రెండో జాబితా ఉంటుందా? ఉంటే ఎప్పుడు ప్రకటిస్తారు? * రైతు రుణమాఫీకి, డ్వాక్రా రుణమాఫీకి లింకు పెడతారా? జన్మభూమి కమిటీలు నిర్ణయించిన టీడీపీ మద్దతుదార్లకే రుణమాఫీ ఉంటుందా? * జాబితా పరిశీలనే పూర్తికాకుంటే 21న రైతు రుణమాఫీ లబ్ధిదారుల ఖాతాలోకి 20 శాతం జమ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. జాబితాపై స్పష్టత లేనప్పుడు ఏ ఖాతాకు జమ చేస్తారు. -
అస్తవ్యస్తం..గందరగోళం
గుడివాడ : ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ జాబితాలో రైతుల పేర్లు గల్లంతవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జాబితా విడుదలే అస్తవ్యస్తంగా ఉందని, ఫలితంగా తమపేరు ఎక్కడ ఉందో తెలుసుకోవటానికి నానా తంటాలు పడాల్సి వస్తోందని అంటున్నారు. ప్రస్తుతం విడుదల చేసిన జాబితాలో తమ పేర్లు లేవని తెలిసిన రైతులు భయాందోళనకు గురువుతున్నారు. నాలుగు నెలలుగా రుణమాఫీపై ఆశలు పెట్టుకుంటే తీరా పేరులేదని తెలిసిన రైతాంగం ఏంచేయాలో తెలియని స్థితిలో ఉంది. జిల్లా వ్యాప్తంగా 6.2 లక్షల మంది రైతులు రుణమాఫీ పరిధిలో ఉన్నారు. వీరిలో అనేకమంది పేర్లు జాబితాలో లేవని రైతులు పేర్కొంటున్నారు. రుణమాఫీ చేసి వడ్డీలు కూడా కడతామని చెబుతున్న ప్రభుత్వం తొలిదశలోనే పేర్లు లేకుండా చేయటంపై రైతులు మండిపడుతున్నారు. జాబితాలో తికమకలు.. ప్రభుత్వం రుణమాఫీ జాబితాలో రైతుల వివరాలు ఇంకా సేకరించాల్సి ఉన్నందున వారి వివరాలను ఈ నెల ఎనిమిదిన విడుదల చేసింది. ఈ జాబితా సోమవారం సాయంత్రానికి తహశీల్దార్ కార్యాలయాల నుంచి వీఆర్వోలకు చేరింది. జాబితాలోని రైతుల పేర్లు చూసి ఆయా రైతులు ఇంకా ఇవ్వాల్సిన వివరాలు పూర్తిచేసి పంపాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ఇది రెండు రోజుల్లో పూర్తిచేసి ఇవ్వాలని చెప్పారు. రుణమాఫీ జాబితాలు అస్తవ్యస్తంగా ఉండటంతో రెండు రోజుల్లో వివరాలు పూర్తిచేసి పంపటం కష్టమని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. రుణమాఫీ జాబితాలో కొన్ని బ్యాంకుల వారీగా ఇవ్వగా మరికొన్ని ఎక్కడ భూమి ఉందో ఆప్రాంతంలో ఉన్న జాబితాలోకి వెళ్లాయి. గుడివాడకు చెందిన సుబ్బారావుకు ఉయ్యూరులో భూమి ఉంది. దీనిపై గుడివాడ ఎస్బీఐలో ఆయన రుణం పొందాడు. జాబితాలో మాత్రం భూమి ఉన్న ఉయ్యూరులోనే ఉంటుందని అధికారులు వివరణ ఇస్తున్నారు. మరికొన్నిచోట్ల బ్యాంకు ఆధారంగా జాబితా ఇవ్వటం గమనార్హం. ఏమేమి సేకరిస్తున్నారంటే... ప్రతి రైతూ తన ఆధార్, రేషన్ కార్డు నంబర్లు ఇవ్వాల్సి ఉంది. ఇవి లేకపోతే వాటిని రెవెన్యూ అధికారులు సేకరిస్తున్నారు. ఇవిగాక ఆ కుటుంబంలో ఉన్న భార్య, పిల్లల ఆధార్ నంబర్లు, ఓటు గుర్తింపు కార్డు నంబర్లు తీసుకుంటున్నారు. ఇవన్నీ ఉంటేనే రుణమాఫీ జాబితాకు సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో ఉన్న కొద్దిపాటి మంది వీఆర్వోలు ఈ జాబితా సరిచేయటానికి ఇబ్బంది పడుతున్నారు. ఇంటింటా వివరాల సేకరణకు చాలా సమయం పడుతుందని వారంటున్నారు. కౌలు రైతులకు చోటులేదు... గుడివాడ పట్టణంలో విడుదలైన జాబితాలో కౌలు రైతుల పేర్లు లేవని చెబుతున్నారు. రుణాలు తీసుకున్నా బ్యాంకర్లు కౌలు రైతుల పేర్లు ఇవ్వని కారణంగా ఈ పరిస్థితి దాపురించినట్లు సమాచారం. బ్యాంకులకు ఇచ్చిన ఆన్లైన్ సాఫ్ట్‌వేర్‌లో కౌలు రైతు ఆప్షన్ లేకపోవటమే ఇందుకు కారణమని కొన్ని బ్యాంకుల వారు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు ప్రతి రైతూ పైసా కట్టాల్సిన పనిలేదని చెప్పిన చంద్రబాబు రుణాలు రద్దుకు ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. -
పేర్లు తొలగించమంటే.. కార్డులే లేపేశారు!
కోటబొమ్మాళి: సాధారణ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి ఇంటింటి సర్వే చేయించింది. స్థానికంగా లేని కుటుంబాలను గుర్తించి వారి కార్డులు తొలగించడం.. చనిపోయిన వ్యక్తులు, వివాహమై అత్తవారింటికి వెళ్లిన అమ్మాయిల వివరాలు సేకరించి వారి పేర్లను ఆయా కుటుంబాల రేషన్ కార్డుల్లో తొలగించడం ఈ సర్వే లక్ష్యం. ఆ మేరకు కోటబొమ్మాళి మండలంలో వీఆర్వోలు, రేషన్ డీలర్ల సహకారంతో పౌరసరఫరా శాఖ అధికారులు సర్వే నిర్వహించారు. మండలంలో 38 పంచాయతీలు ఉండగా.. వాటి పరిధిలో 477 రేషన్ కార్డులను మార్పులు, తొలగింపుల కోసం గుర్తించారు. వీటిలో పెళ్లి చేసుకున్న అమ్మాయిలు, చనిపోయిన వ్యక్తుల పేర్లు మాత్రమే తొలగించవలసిన కార్డులు 129 ఉండగా, మిగిలినవి ఆధార్ వివరాలు లేకపోవడం, అడ్రస్ మారడం, కుటుంబాలు వలసపోవడం వంటి కారణాల వల్ల పూర్తిగా తొలగించాల్సిన కార్డులే. ఈ వర్గీకరణ ప్రకారం ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాల్సి ఉంది. ఇక్కడే అధికారుల నిర్లక్ష్యం కారణంగా మొత్తం 477 రేషన్ కార్డులు పౌర సరఫరా శాఖ జాబితా నుంచి తొలగిపోయాయి(డిలీట్ అయ్యాయి). కీ రిజిస్టర్లో తమ కార్డుల వివరాలు గల్లంతైన విషయం ఆలస్యంగా తెలుసుకున్న లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. రేషన్ కార్డులోని కుటుంబ సభ్యుల పేర్లలో ఒకటో రెండో తొలగిపోతాయనుకుంటే ఏకంగా కార్డులే లేకుండాపోయాయని ఆందోళన చెందుతున్నారు. చిన్నసానలో 21, కోటబొమ్మాళిలో45, యలమంచిలిలో 10, కన్నేవలసలో 12, కొత్తపల్లిలో 15, కురుడులో 13, గ ంగరాంలో 14, పాకివలసలో 9 కార్డులు అధికారుల తప్పిదం కారణంగా రద్దుకావడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. తమ పరిస్థితేమిటని అధికారులను అడిగితే.. ఏదో జరిగిపోయింది.. మళ్లీ దరఖాస్తు చేసుకుంటే కార్డులు ఇస్తామని, ఉన్నతాధికారులకు చెబుతామని అంటున్నారు. అయితే మళ్లీ కార్డులు రావడానికి ఎన్నాళ్లు పడుతుందో.. అప్పటివరకు తాము రేషన్ కోల్పోవలసిందేనా? అని బాధితులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. మిగిలిన కార్డుల రద్దు విషయంలోనూ అధికారుల నిర్లక్ష్యమే కనిపిస్తోంది. ఈ 129 కార్డులు పోగా మిగిలిన కార్డులు చాలా వరకు కొత్తగా మంజూరైనవే. వీటిలో కుటుంబ వివరాలు, ఆధార్ నెంబర్లు, ఫొటోలు వంటివి లేని విషయాన్ని గుర్తించి.. వాటిని సేకరించి, నమోదు చేయించాల్సిన బాధ్యతను సంబంధిత రేషన్ డీలర్లకు అప్పగించారు. అయితే వారు సరిగ్గా స్పందించకపోవడంతో అవి కూడా రద్దయిపోయాయి. ఫలితంగా మండలంలో 477 కార్డులకు గత కొన్ని నెలలుగా రేషన్ సరఫరా నిలిచిపోయింది. దీంతో బాధితులు తహశీల్దార్ కార్యాలయం చుటూ ్టతిరుగుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రద్దయిన తమ కార్డుల విషయంలో జిల్లా కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. సీఎస్‌డీటీ వివరణ దీనిపై సీఎస్‌డీటీ చంద్రశేఖర్ ఆచారిని వివరణ కోరగా నిబంధనల ప్రకారం పెళ్లయ్యి వెళ్లిపోయిన అమ్మాయిలు, చనిపోయిన వ్యక్తుల పేర్లు రేషన్‌కార్డుల నుంచి తొలగించేందుకు ఆన్లైన్లో ఆప్షన్ పెట్టామన్నారు. అయితే సాంకేతిక లోపంతో 129 కార్డులు రద్దయ్యాయని అంగీకరించారు. వాటి పునరుద్ధరణ కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. బాధితులు మళ్లీ దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేస్తామన్నారు. తహశీల్దార్ వివరణ తహ శీల్దార్ వై.శ్రీనివాసరావు స్పందిస్తూ తాను ఎన్నికల అనంతరం ఇక్కడ బాధ్యతలు చేపట్టానని, అంతక ముందు ఏం జరిగిందో తనకు తెలియదన్నారు. అయితే రేషన్ కార్డుల రద్దయ్యాయని చాలామంది తనకు పిర్యాదు చేశారని వెల్లడించారు. విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించానని, బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని చెప్పారు. -
10 మంది వీఆర్ఓలకు షోకాజ్ నోటీసులు
తెర్లాం రూరల్: నీటి తీరువా వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని పార్వతీపురం సబ్ కలెక్టర్ శ్వేతా మహంతి హెచ్చరించారు. స్థానిక తహశీల్ధార్ కార్యాల యంలో గురువారం నీటితీరువా వసూళ్ల పై గ్రామ రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవెన్యూ గ్రామాల వారీగా నీటి తీరువాల లక్ష్యం, వసూళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నీటి తీరువా వసూళ్లలో నిర్లక్ష్యం వహించిన 10 మంది వీఆర్ఓలకు షోకా జ్ నోటీసులు జారీ చేశారు. తెర్లాంలోని ఇద్దరు వీఆర్ఓలు, ఉద్దవోలు, సుందరాడ, నెమలాం, కాగాం, అరసబలగ, కుసుమూరు, నందిగాం, గంగన్నపాడు గ్రామాల వీఆర్ఓలకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ మరిపి కృష్ణమూర్తి సబ్ కలెక్టర్ జారీ చేసిన షోకాజ్ నోటీసులు అందజేశారు. పార్వతీపురం డివిజన్లో రూ.11.22 కోట్ల నీటితీరువా బకాయిలు.. పార్వతీపురం డివిజన్లో నీటితీరువా బకాయిలు 11.22 కోట్ల రూపాయలు ఉందని సబ్ కలెక్టర్ శ్వేతా మహంతి చెప్పారు. వీఆర్ఓల సమావేశం అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది డివిజన్లో రూ.కోటీ 66 లక్ష ల నీటితీరువా వసూళ్లు లక్ష్యం కాగా ఇం తవరకు రూ.24 లక్షలే వసూలయ్యూయని తెలిపారు. తెర్లాం మండలంలో రూ.48 లక్షలు లక్ష్యం కాగా ఇంతవరకు రూ.8 లక్షలు మాత్రమే వసూలైందని పేర్కొన్నారు. పార్వతీపురం డివిజన్లో ఐదు రేషన్ డీలర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వీటిని చనిపోయిన డీలర్ల వారసులతో భర్తీ చేయనున్నామని చెప్పారు. ఏడో విడత భూ పం పిణీకి అవసరమైన భూములు గుర్తిస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో తెర్లాం డిప్యూటీ తహశీల్దార్ రామస్వామి, ఆర్ఐ కృష్ణమూర్తి, సీనియర్ సహాయకుడు సన్యాసినాయుడు తదితరులు పాల్గొన్నారు.