సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)ను ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇన్నాళ్లూ వారు నిర్వర్తించిన విధులను కూడా ఇతర శాఖలకు బదిలీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మొత్తంగా వీఆర్వో హోదాలో మండల రెవెన్యూ కార్యాలయం, గ్రామ పంచాయతీ కార్యాలయాలు కేంద్రంగా నిర్వహించిన దాదాపు 50కిపైగా విధులను పలు శాఖలకు అప్పగించేందుకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.
కుల, ఆదాయ, నివాసం, ఇతర ధ్రువపత్రాల పరిశీలన బాధ్యతలను పంచాయతీరాజ్ శాఖకు బదిలీ చేయనున్నట్టు తెలిసింది. ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులు పని ఒత్తిడిలో ఉన్నందున.. ధ్రువపత్రాల పరిశీలన విధులు వారికి ఇవ్వాలా, లేక పంచాయతీరాజ్ శాఖలోని ఇతర సిబ్బందికి ఇవ్వాలా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి.
రైతుబంధు కార్యక్రమం రెవెన్యూ రికార్డుల ఆధారంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలోనే జరుగుతున్న నేపథ్యంలో.. వీఆర్వోలు చూసుకున్న పంట నష్టం అంచనాలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా జరిగే నష్టాల అంచనాల బాధ్యతను వ్యవసాయ శాఖకే అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఇక వీఆర్వోల ముఖ్య విధి అయిన భూముల రక్షణ బాధ్యతలను స్థానిక సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
గ్రామ పంచాయతీలు, అర్బన్ మండలాల పరిధిలోకి వచ్చే భూముల రక్షణ బాధ్యతను ఆయా స్థానిక సంస్థలకు చెందిన శాఖలకు అప్పగించనుంది. మిగతా సాధారణ విధులను భూపరిపాలన విభాగంలోని ఇతర సిబ్బందితో చేయించాలని, అవసరాన్ని బట్టి కొన్ని విధులను పలు శాఖల సిబ్బందికి అప్పజెప్పాలని ప్రభుత్వం భావిస్తోంది.
లాటరీలు పూర్తిచేస్తున్న కలెక్టర్లు
వీఆర్వోలను ఇతర శాఖలకు బదిలీ చేసే ప్రక్రియలో భాగంగా కలెక్టర్లు లాటరీలను పూర్తి చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో వీఆర్వోలను ఇతర శాఖలకు కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. చాలా మంది ఈ ఉత్తర్వులను తీసుకుంటుండగా.. కొంద రు వీఆర్వోలు ఉత్తర్వుల స్వీకరణకు విముఖత చూపుతున్నారు. మరోవైపు వీఆర్వో సంఘాలు ప్రభుత్వంపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నాయి. జీవోను కొట్టివేయాలంటూ వీఆర్వోల జేఏసీ హైకోర్టులో పిటిషన్ వేసింది. మరికొందరు వ్యక్తిగతంగా కోర్టుల ను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.
సీనియారిటీ వర్తిస్తుందా.. లేదా?
ఇతర శాఖల్లోకి వెళ్తున్న వీఆర్వోలకు వారి ఉద్యోగ సీనియారిటీ లభిస్తుందా లేదా అన్న దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. వీఆర్వోలు ఇతర శాఖల్లో రిపోర్టు చేసేందుకు రెవెన్యూ శాఖ నుంచి తాజా పేసర్టిఫికెట్, సర్వీస్ రిజిస్టర్ సమర్పించాల్సిన నేపథ్యంలో సీనియారిటీ కచ్చితంగా వర్తిస్తుందని కొందరు చెప్తుండగా.. మిగులు ఉద్యోగులుగా ప్రకటించినందున సివిల్ సర్వీసెస్ లేదా సబార్డినేట్ రూల్స్ ప్రకారం సీనియారిటీ క్లెయిమ్ చేసుకునే వీలుండదని మరికొందరు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment