Village Revenue Officers
-
వేతనాలు లేక.. పదోన్నతులు రాక
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ వ్యవస్థకు పట్టుకొమ్మలాంటి గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్వో)ను ఇతర శాఖల్లో సర్దుబాటు చేసి రెండేళ్లవుతోంది. నేటికీ సరిగ్గా వేతనాలు రాక, పీఎఫ్ నిబంధన అమలు కాక, పదోన్నతులకు అర్హత లేక, సీనియార్టీ కోల్పోయి సర్దుబాటు వీఆర్వోలు పడరాని పాట్లు పడుతున్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం కొత్త రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్) చట్టాన్ని అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తున్న నేపథ్యంలో తమ సమస్యలను కూడా పరిష్కరించాలని, వీలైనంత త్వరగా తమను రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని వీఆర్వో సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.రెండేళ్లుగా అవస్థలురాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడం ద్వారా 5,400 మందికి పైగా వీఆర్వోలను ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేసే ప్రక్రియను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసింది. కనీసం తమతో మాట్లాడకుండా, లాటరీ పద్ధతిలో ఇతర శాఖల్లోకి బదలాయించడం పట్ల అప్పట్లోనే వీఆర్వోలు, రెవెన్యూ సంఘాలు అభ్యంతరం తెలిపినా ఖాతరు చేయకుండానే ప్రక్రియ ముగించింది. అప్పటి నుంచీ ఇతర శాఖల్లో సర్దుబాటయిన వీఆర్వోలు పడరాని పాట్లు పడాల్సి వస్తోందని వీఆర్వోల సంఘాలు చెపుతున్నాయి. తమకు 010 పద్దు కింద వేతనాలు రావడం లేదని, జీపీఎఫ్, సీపీఎస్, టీఎస్జీఎల్ఐలు చెల్లించడం లేదని, ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపజేసే ఐఆర్ పెంపుదల ఇవ్వలేదని, పాత డీఏలు, పీఆర్సీ బకాయిలు రావడం లేదని, కొన్ని సొసైటీలు, కార్పొరేషన్లలో మూడు నెలలకోసారి వేతనాలు ఇస్తున్నారని, గిరిజన సహకార కార్పొరేషన్లో పనిచేస్తున్న 16 మంది వీఆర్వోలకు గత 20 నెలలుగా వేతనాలు కూడా రావడం లేదని వాపోతున్నారు. ఇతర శాఖల్లో బలవంతంగా పంపిన తమకు అర్హతకు అనుగుణంగా ఉద్యోగాలు ఇవ్వలేదని, సీనియార్టీని కూడా కలపకపోవడంతో పదోన్నతులు కోల్పోయామని, స్టోర్ కీపర్లుగా, హాస్టల్ వర్కర్లుగా, తోటమాలీలుగా పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరి సమస్యలను పరిష్కరిస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత కూడా ఒకట్రెండు సార్లు దీనిపై సానుకూల ప్రకటనలు కూడా చేసింది. కానీ, ఇప్పటివరకు రెవెన్యూశాఖలోకి సదరు వీఆర్వోలను తీసుకురాలేదు. రెవెన్యూ మంత్రిని కలిసిన వీఆర్వో జేఏసీ కొత్త ఆర్వోఆర్ చట్టం తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపేందుకు గాను వీఆర్వో జేఏసీ ఇటీవల రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసింది. జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీశ్, సెక్రటరీ జనరల్ హరాలే సుధాకర్‌రావు, నేతలు పల్లెపాటి నరేశ్, చింతల మురళి తదితరులు సచివాలయంలో రెవెన్యూ మంత్రిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని వీఆర్వోలను మళ్లీ రెవెన్యూ శాఖలోకి తీసుకువచ్చి కొత్త ఆర్వోఆర్ చట్టం అమలును సులభతరం చేసేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వీఆర్వో జేఏసీ నేతలు మంత్రి పొంగులేటిని కోరారు. జరిగిన అన్యాయాన్ని సరిదిద్దండి గత ప్రభుత్వ హయాంలో వీఆర్వోలకు పూర్తిగా అన్యాయం జరిగింది.. ఈ ప్రభుత్వమైనా మాకు న్యాయం చేయాలి. ఆప్షన్లు ఇచ్చి అందరినీ రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలి.’ –వింజమూరి ఈశ్వర్, తెలంగాణ రీడిప్లాయిడ్ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు -
పదోన్నతులకు ‘సర్దుబాటు’ గండం
సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) సర్దుబాటు ప్రక్రియ కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. వీఆర్వోల వ్యవస్థను రద్దు చేసిన తర్వాత కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం గతేడాది ఆగస్టులో రాష్ట్రంలోని 5,138 మంది వీఆర్వోలను వివిధ ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వం సర్దుబాటు చేసింది. జూనియర్ అసిస్టెంట్ కేడర్‌లో వీరిని నియమించింది. అయితే రెవెన్యూ శాఖలో సుదీర్ఘంగా పనిచేసిన తమ సీనియా ర్టీ ని పరిగణనలోకి తీసుకుని తాము వెళ్లిన కొత్త శాఖల్లో పదోన్నతులు కల్పించాలని, అప్పటివరకు ఆయా శాఖల్లో పదో న్నతులు ఇవ్వద్దని పాత వీఆర్వోలు కోర్టులకు వెళ్లడం, వీరి అభ్యర్థన మేరకు కోర్టులు స్టేలు ఇస్తుండడంతో పలు శాఖల్లో శాఖాపరమైన పదోన్నతులకు బ్రేక్ పడుతోంది. ఈ తరుణంలో పదోన్నతులకు కోర్టుల రూపంలో రెడ్ సిగ్నల్ పడుతుండడంతో ఆయా శాఖల ఉద్యోగులు, ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఉన్నత విద్య, వైద్య శాఖల్లో ఆటంకాలు ఉన్నత విద్యాశాఖలో జూనియర్ లెక్చరర్ల పదోన్నతుల్లో అర్హత గల జూనియర్ అసిస్టెంట్లకు 10% కోటా ఉంది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖలో పనిచేస్తున్న సిబ్బందితో ఆ శాఖ అధికారులు జేఎల్ పదోన్నతుల కోసం సీనియార్టీ జాబితా తయారు చేశారు. అయితే ఇదే శాఖలో సర్దుబాటు అయిన వీఆర్వో ఒకరు తనకు కూడా జేఎల్ ఉద్యోగం చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని, రెవెన్యూ శాఖలో పనిచేసిన తన సీనియా ర్టీ ని పరిగణనలోకి తీసుకుని సీనియార్టీ జాబితాలో తన పేరు కూడా చేర్చేలా ఆదేశాలివ్వాలని, అప్పటివరకు ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆయన అభ్యర్థన మేరకు జేఎల్ పదోన్నతులపై స్టే విధిస్తూ ఆగస్టు నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య ఆరోగ్య శాఖలో సీనియర్ అసిస్టెంట్ పదోన్నతుల విషయంలోనూ ఇదే జరిగింది. సీనియర్ అసిస్టెంట్ పదోన్నతుల జాబితాలో తమ పేర్లు కూడా చేర్చాలంటూ పలువురు సర్దుబాటు వీఆర్వోలు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు స్టేటస్కో ఉత్తర్వులు జారీ చేసింది. -
వీఆర్వోలు ‘వెనక్కి’?
సాక్షి, హైదరాబాద్: జీతం లేదు.. సీనియారిటీ లేదు.. పదోన్నతులు రావు... పనిచేసేందుకు వెళ్లిన శాఖలో వివక్ష... ఉన్నచోట ఒక్కరికే పది పనులు.. లేనిచోట ఎలాంటి పనీ లేదు.. పేరుకే జూనియర్ అసిస్టెంట్... చేయాల్సింది మాత్రం తోటమాలి, వాచ్‌మన్, అటెండర్ పనులు.. ఇవీ ఇతర శాఖల్లోకి వెళ్లిన ‘గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వోల)’పరిస్థితి. సర్దుబాటులో భాగంగా ఇతర శాఖల్లోకి వెళ్లినవారు ఆయా చోట్ల కష్టాలు, సమస్యలను తట్టుకోలేక.. తిరిగి రెవెన్యూశాఖలోకి తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై కొన్నినెలలుగా చర్చ సాగుతున్నా.. వీఆర్ఏల సర్దుబాటు నేపథ్యంలో బలంగా తెరపైకి వస్తోంది. వీఆర్ఏలను సర్దుబాటు చేసిన తరహాలోనే తమకు కూడా సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించి రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలనే డిమాండ్ వస్తోంది. దీనికి ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కూడా మద్దతు ఇస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో వీఆర్వోలకు పేరు మార్చి, రెవెన్యూశాఖలోనే భూసంబంధిత పనులు కాకుండా ఇతర విధులు అప్పగించేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏదో ఒక ఇబ్బందితో.. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో వీఆర్వోల వ్యవస్థను రద్దు చేయడంతో.. సుమారు 5,400 మంది వివిధ ప్రభుత్వ శాఖలకు వెళ్లాల్సి వచ్చింది. విద్య, మున్సిపల్, వైద్యం, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ ఇలా పలు ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో వారిని సర్దుబాటు చేశారు. రెవెన్యూ శాఖ నుంచి ఇతర శాఖల్లోకి రావడంతో వారి సీనియారిటీని కోల్పోయారు. ఆరేళ్ల నుంచి గరిష్టంగా 20ఏళ్లవరకు సీనియారిటీని కోల్పోవాల్సి వచ్చిందని వారు వాపోతున్నారు. పేరుకు జూనియర్ అసిస్టెంట్ హోదాలో ఇతర శాఖల్లో చేరినా.. ఆయాచోట్ల రికార్డు అసిస్టెంట్‌గా, తోటమాలిగా, అటెండర్‌గా పనిచేయాల్సి వస్తోందని అంటున్నారు. మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లుగా వెళ్లిన వారికి కనీసం కూర్చునేందుకు కూడా కుర్చీలు లేవని చెప్తున్నారు. హైదరాబాద్ శివార్లలోని ఓ మున్సిపాలిటీలో వార్డు అధికారిగా చేరిన ఓ వీఆర్వోకు శక్తికి మించిన బాధ్యతలు ఇచ్చారని.. లీగల్ సెల్, ఇళ్లు కూలగొట్టడం, ప్రకృతి వైపరీత్యాల పర్యవేక్షణ, చెట్ల పెంపకం, పార్కుల పరిరక్షణ, చెరువుల పరిరక్షణ, ఆసరా పింఛన్లలో వేలిముద్రల గుర్తింపు పనులు అప్పగించారని వీఆర్వో వర్గాలు చెప్తున్నాయి. అన్ని పనులు చేయలేక మానసిక వేదనతో సదరు వీఆర్వో బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురయ్యారని అంటున్నాయి. పని లేక.. జీతాలు రాక.. ఇక సొసైటీలు, కార్పొరేషన్లు, కొన్ని స్థానిక సంస్థల పరిధిలోకి వెళ్లిన వీఆర్వోలకు స్థానిక నిధుల నుంచే వేతనం ఇస్తుండటంతో.. కొందరికి నాలుగైదు నెలలుగా జీతాల్లేవని అంటున్నారు. కొన్నిజిల్లాల్లో అవసరమైన ఉద్యోగుల సంఖ్య (కేడర్ స్ట్రెంత్)కు మించి పోస్టింగులు ఇచ్చారని, ఐదుగురు సిబ్బంది అవసరమైన చోటకు 10 మందిని పంపారని, అక్కడ ఎలాంటి విధులు నిర్వహించాలో కూడా తెలియక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఆయా శాఖల్లో పనిచేస్తున్న రెగ్యులర్ సిబ్బంది నుంచి వివక్ష ఎదుర్కోవాల్సి వస్తోందని, తమకు పదోన్నతులు రాకుండా చేయడానికి వచ్చారా? అంటూ మండిపడుతున్నారని చెప్తున్నారు. సొంత శాఖలో సమస్యలు కూడా పరిష్కారం కాక మాజీ వీఆర్వో లు రెవెన్యూ శాఖ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ప్రొబేషన్ డిక్లరేషన్, సర్వీసు వ్యవహారాల ఫైళ్లు సీసీఎల్ఏ, రెవెన్యూ కార్యదర్శి పేషీల్లో పెండింగ్‌లో ఉన్నాయని.. ప్రత్యేక, సాధారణ ఇంక్రిమెంట్లు, పీఆర్సీ వర్తింపు అంశాల్లో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం తమకు సమస్యగా మారిందని వీఆర్వోలు వాపోతున్నారు. సంఘాలకు అతీతంగా సమావేశమై.. తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు రాష్ట్రంలోని 33 జిల్లా లకు చెందిన మాజీ వీఆర్వోలు బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశమయ్యారు. సంఘాలకు అతీతంగా ‘సమస్యలపై చర్చ–ప్రభుత్వానికి నివేదన’అనే నినాదంతో తమ ఉద్యోగ హక్కులకు భద్రత కల్పించాలని.. లేదంటే మాతృశాఖకు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీఆర్వోలను ఇతర శాఖల్లో కలపడం వల్ల సీనియారిటీ దెబ్బతింటుందని, వేల మంది ఇబ్బందిపడుతున్నారని టీఆర్ఈఎస్ఏ అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సర్వీసుకు భద్రత లేక వారంతా ఆందోళనలో కూరుకుపోయారన్నారు. అయితే.. వీఆర్వోల సమావేశం నిర్వహణ వెనుక ప్రభుత్వంలో కీల క హోదాలో ఉన్న కొందరు నాయకులు ఉన్నారని, వారి సలహా మేరకే ఈ సమావేశం నిర్వహించారని సమాచారం. భూసంబంధిత అంశాలు మినహా మిగతా రెవెన్యూ వ్యవహారాల ను చూసుకునేందుకు వీఆర్వోల పేరు మార్చి మళ్లీ రెవెన్యూశాఖలోకి తీసుకునేందుకు ప్రభు త్వం సిద్ధంగా ఉందనే ప్రచారం జరుగుతోంది. వీఆర్‌ఏలతోనే తంటా! రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన వీఆర్ఏ సర్దుబాటు ప్రక్రియ వీఆర్వోలలో అలజడికి కారణమైంది. తమకంటే కింది కేడర్‌లో పనిచేసిన వీఆర్ఏలకు పేస్కేల్ వర్తింపజేయడంతోపాటు సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి మరీ.. రెవెన్యూ శాఖల్లోనే కొనసాగిస్తున్నారని, అదే పద్ధతిని తమ విషయంలో ఎందుకు పాటించలేదని వీఆర్వోలు ప్రశ్నిస్తున్నారు. సర్వీసు వ్యవహారాలు పెండింగ్‌లో ఉండటంతో చాలా జిల్లాల్లో వేతనాలు రావడం లేదని, ప్రతి విషయానికి ఏదో ఒక అడ్డంకి వస్తోందని అంటున్నారు. రెవెన్యూలో మరిన్ని సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి, తమను వెనక్కి తీసుకోవడమే ఏకైక పరిష్కారమని పేర్కొంటున్నారు. -
సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రవీంద్రరాజు
అమరావతి: ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు రవీంద్రరాజు, జనరల్ సెక్రటరీ అప్పలనాయుడు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం కొత్త కార్యవర్గంతో కలిసి ఈ మేరకు క్యాంపు కార్యాలయంలో కలిశారు. కార్యక్రమంలో ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ వెంకటరామిరెడ్డి, ఏపీ రెవెన్యూ జేఏసీ చైర్మన్ వి ఎస్ దివాకర్, సీఆర్పి రాష్ట్ర అధ్యక్షుడు గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: Jagananna Suraksha: జగనన్న సురక్ష సూపర్ సక్సెస్ -
తగ్గేదేలే.. 20లోపు జీవో రాకపోతే ఉద్యమం ఉధృతం: వీఆర్ఏలు
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ హామీతో ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని వీఆర్ఏలు అన్నారు. మంత్రిపై తమకు నమ్మకం ఉందన్నారు. ఆందోళన విరమించాలన్న కేటీఆర్ ప్రతిపాదనలపై చర్చిస్తున్నామని వీఆర్ఏ నేతలు పేర్కొన్నారు. ఈ నెల 20లోపు జీవో రాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. కాగా, పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆందోళన చేపట్టిన వీఆర్ఏ ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. వీఆర్ఏల సమస్యలు పరిష్కారిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. అంతవరకు ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. 20న వీఆర్ఏలతో మళ్లీ చర్చలు జరుపుతామని కేటీఆర్ వెల్లడించారు. చదవండి: వీఆర్ఏల ఆందోళన.. తెలంగాణ ఇంటెలిజెన్స్ మరో ఫెయిల్యూర్ -
Telangana VRAs: ప్రభుత్వంతో ముగిసిన వీఆర్ఏల చర్చలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంతో వీఆర్ఏల చర్చలు ముగిశాయి. వీఆర్ఏ సమస్యలు పరిష్కారిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. వీఆర్ఏలు ఆందోళన విరమించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. 20న వీఆర్ఏలతో మళ్లీ చర్చలు జరుపుతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. అనంతరం వీఆర్ఏలు మీడియాతో మాట్లాడుతూ, కేటీఆర్‌పై తమకు నమ్మకం ఉందన్నారు. చదవండి: TS: దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఎన్ని రోజులంటే? తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి వీఆర్ఏలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. వీఆర్ఏలు ఆందోళన చేపట్టారు అసెంబ్లీ నుంచి ప్రగతిభవన్ రోడ్డును పోలీసులు మూసివేశారు. దీంతో, అప్రమత్తమైన పోలీసులు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. అక్కడున్న వ్యాపార సముదాయాలను సైతం పోలీసులు మూసివేయించారు. సీఎం కేసీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకుంటారన్న సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
వీఆర్వోల విధులూ ‘సర్దుబాటు’! హైకోర్టులో వీఆర్వోల జేఏసీ పిటిషన్
సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)ను ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇన్నాళ్లూ వారు నిర్వర్తించిన విధులను కూడా ఇతర శాఖలకు బదిలీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మొత్తంగా వీఆర్వో హోదాలో మండల రెవెన్యూ కార్యాలయం, గ్రామ పంచాయతీ కార్యాలయాలు కేంద్రంగా నిర్వహించిన దాదాపు 50కిపైగా విధులను పలు శాఖలకు అప్పగించేందుకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. కుల, ఆదాయ, నివాసం, ఇతర ధ్రువపత్రాల పరిశీలన బాధ్యతలను పంచాయతీరాజ్ శాఖకు బదిలీ చేయనున్నట్టు తెలిసింది. ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులు పని ఒత్తిడిలో ఉన్నందున.. ధ్రువపత్రాల పరిశీలన విధులు వారికి ఇవ్వాలా, లేక పంచాయతీరాజ్ శాఖలోని ఇతర సిబ్బందికి ఇవ్వాలా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. రైతుబంధు కార్యక్రమం రెవెన్యూ రికార్డుల ఆధారంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలోనే జరుగుతున్న నేపథ్యంలో.. వీఆర్వోలు చూసుకున్న పంట నష్టం అంచనాలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా జరిగే నష్టాల అంచనాల బాధ్యతను వ్యవసాయ శాఖకే అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఇక వీఆర్వోల ముఖ్య విధి అయిన భూముల రక్షణ బాధ్యతలను స్థానిక సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. గ్రామ పంచాయతీలు, అర్బన్ మండలాల పరిధిలోకి వచ్చే భూముల రక్షణ బాధ్యతను ఆయా స్థానిక సంస్థలకు చెందిన శాఖలకు అప్పగించనుంది. మిగతా సాధారణ విధులను భూపరిపాలన విభాగంలోని ఇతర సిబ్బందితో చేయించాలని, అవసరాన్ని బట్టి కొన్ని విధులను పలు శాఖల సిబ్బందికి అప్పజెప్పాలని ప్రభుత్వం భావిస్తోంది. లాటరీలు పూర్తిచేస్తున్న కలెక్టర్లు వీఆర్వోలను ఇతర శాఖలకు బదిలీ చేసే ప్రక్రియలో భాగంగా కలెక్టర్లు లాటరీలను పూర్తి చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో వీఆర్వోలను ఇతర శాఖలకు కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. చాలా మంది ఈ ఉత్తర్వులను తీసుకుంటుండగా.. కొంద రు వీఆర్వోలు ఉత్తర్వుల స్వీకరణకు విముఖత చూపుతున్నారు. మరోవైపు వీఆర్వో సంఘాలు ప్రభుత్వంపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నాయి. జీవోను కొట్టివేయాలంటూ వీఆర్వోల జేఏసీ హైకోర్టులో పిటిషన్ వేసింది. మరికొందరు వ్యక్తిగతంగా కోర్టుల ను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. సీనియారిటీ వర్తిస్తుందా.. లేదా? ఇతర శాఖల్లోకి వెళ్తున్న వీఆర్వోలకు వారి ఉద్యోగ సీనియారిటీ లభిస్తుందా లేదా అన్న దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. వీఆర్వోలు ఇతర శాఖల్లో రిపోర్టు చేసేందుకు రెవెన్యూ శాఖ నుంచి తాజా పేసర్టిఫికెట్, సర్వీస్ రిజిస్టర్ సమర్పించాల్సిన నేపథ్యంలో సీనియారిటీ కచ్చితంగా వర్తిస్తుందని కొందరు చెప్తుండగా.. మిగులు ఉద్యోగులుగా ప్రకటించినందున సివిల్ సర్వీసెస్ లేదా సబార్డినేట్ రూల్స్ ప్రకారం సీనియారిటీ క్లెయిమ్ చేసుకునే వీలుండదని మరికొందరు పేర్కొంటున్నారు. -
ఇతర శాఖల్లోకి వీఆర్వోలు, జీవో జారీ.. భగ్గుమన్న జేఏసీ నేతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వోల) శకం ముగిసింది. రెవెన్యూ శాఖను పర్యవేక్షించే భూపరిపాలన విభాగంలో వీఆర్వోలుగా పనిచేస్తున్న 5,385 మందిని ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు (విలీనం) చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. దీంతో వీఆర్వోలుగా పనిచేస్తున్న వారిని వివిధ ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్ సమాన హోదాలో సర్దుబాటు చేయనున్నారు. ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించే బాధ్యతను జిల్లాల కలెక్టర్లకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సోమవారం జీవో నంబర్ 121ను విడుదల చేశారు. 2020లో అమల్లోకి వచ్చిన కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం వీఆర్వోల వ్యవస్థ రద్దయినందున.. ఆ పోస్టుల్లోని సిబ్బందిని ఇతర శాఖల్లోకి తీసుకోనున్నట్టు అందులో తెలిపారు. ఇప్పటికే ఆయా జిల్లాల ప్రభుత్వ యంత్రాంగం గుర్తించిన ఖాళీల్లో వారిని సర్దుబాటు చేయాలని, లాటరీ తీసి ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. రెవెన్యూ శాఖ ఇచ్చే సర్వీస్ రిజిస్టర్, తాజా పే సర్టిఫికెట్ ఆధారంగా ప్రభుత్వ శాఖలు వారిని చేర్చుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతం సెలవు, సస్పెన్షన్, డిప్యుటేషన్, ఫారిన్ సర్వీసులో ఉన్న వీఆర్వోలను కూడా ఇతర శాఖలకు పంపాలని ఆదేశించారు. అదనంగా ఉంటే పొరుగు జిల్లాలకు.. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న వీఆర్వోలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేందుకు ఆర్థికశాఖ ప్రతి జిల్లాకు ఓ ఉత్తర్వును జారీ చేసింది. సదరు జిల్లాల్లో గుర్తించిన ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను విభాగాల వారీగా ప్రకటిస్తూ.. ఎంతమంది వీఆర్వోలను సర్దుబాటు చేయాలో పేర్కొంది. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రాస్ మెమో నంబర్: 1634052–బీ/186/ఏ1/హెచ్ఆర్ఎం–7/2022 పేరిట అన్ని జిల్లాల కలెక్టర్లకు సర్క్యులర్ పంపారు. లాటరీ ప్రక్రియను వీడియో తీయాలని.. నిర్దేశిత ఫార్మాట్లో ఉద్యోగుల కేటాయింపు ఉత్తర్వులను ఆయా జిల్లాల కలెక్టర్లే ఇవ్వాలని సూచించారు. ఏదైనా జిల్లాలో గుర్తించిన ఖాళీల కంటే వీఆర్వోల సంఖ్య ఎక్కువగా ఉంటే పొరుగు జిల్లాలకు పంపాలని ఆదేశించారు. భూపరిపాలన మినహా.. జిల్లాల వారీగా ఇచ్చిన ఉత్తర్వులను పరిశీలిస్తే.. వీఆర్వోలను ఎక్కువగా నీటి పారుదల, పంచాయతీరాజ్, విద్య, వైద్య శాఖలకు కేటాయించారు. జిల్లాల్లో హెచ్‌వోడీల పరిధిలోకి వచ్చే విభాగాల్లోని ఖాళీల్లో వీఆర్వోలను సర్దుబాటు చేయాలన్నారు. దేవాదా య, ఎక్సైజ్, పన్నులు, రిజిస్ట్రేషన్ల శాఖల్లోకి కూడా వీరిని తీసుకునేందుకు అనుమతినిచ్చిన ఆర్థిక శాఖ.. భూపరిపాలన విభాగంలోకి తీసుకునేందుకు అనుమతించలేదు. జీవో నం 121 ప్రతి దహనం తమను ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయడంపై వీఆర్వోల సంఘాలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నం 121 ప్రతిని వీఆర్వో సంఘాల జేఏసీ నేతలు హైదరాబాద్‌లోని సీసీఎల్ఏ కార్యాలయ ప్రాంగణంలో దహనం చేశారు. వీఆర్వోలుగా తాము ఒక్క భూపరిపాలన విధులు మాత్రమే చూడటం లేదని.. మొత్తం 54 రకాల విధుల్లో అదీ ఒకటని, తమను ఇతర శాఖలకు పంపితే మిగతా 53 విధులను ఎవరు నిర్వర్తించాలని ప్రశ్నించారు. తమను సంప్రదించకుండా, సీనియారిటీని పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని ప్రకటించారు. అప్పటివరకు జిల్లా కలెక్టర్లు ఇచ్చే సర్దుబాటు ఉత్తర్వులను తీసుకోవద్దని నిర్ణయించారు. దీనిపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వీఆర్వోల జేఏసీ నేత వింజమూరి ఈశ్వర్ తెలిపారు. ఎక్కడో అవినీతి జరిగిందనే సాకుతో వ్యవస్థనే రద్దు చేయడం దారుణమన్నారు. ముందు కేడర్ స్ట్రెంత్ నిర్ధారించండి: ట్రెసా వీఆర్వోలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేసే ప్రక్రియను ప్రారంభించడంపై తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) అసంతృప్తి వ్యక్తం చేసింది. రెవెన్యూ శాఖ 6,874 పోస్టులను కోల్పోతోందని ట్రెసా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగా రవీందర్‌రెడ్డి, కె.గౌతమ్‌కుమార్ పేర్కొన్నారు. వీఆర్వో వ్యవస్థ రద్దుతో తమ శాఖలో పని ఒత్తిడి పెరుగుతుందని.. పరిపాలన, ఎన్నికలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, ప్రకృతి వైపరీత్యాలు, ధ్రువపత్రాల జారీ, సంక్షేమ పథకాల అమలు వంటి కార్యక్రమాలకు విఘాతం కలుగుతుందన్నారు. పాలనా సౌకర్యార్ధం ప్రతి మండలానికి ఐదుగురు అదనపు సిబ్బందిని వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. రెవెన్యూశాఖను అనాథ చేశారు: టీజీటీఏ తెలంగాణ పాలన వ్యవస్థకు ఆయువు పట్టు అయిన రెవెన్యూ శాఖను ప్రభుత్వం అనాథను చేసిందని తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ (టీజీటీఏ) పేర్కొంది. ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో ఇప్పటివరకు చెప్పలేదని టీజీటీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి మండిపడ్డారు. కొత్త మండలాలు, డివిజన్లు, జిల్లాలు ఏర్పాటయ్యాక ఒక్క పోస్టునూ పెంచని ప్రభుత్వం.. ఏకంగా 6వేలకు పైగా పోస్టులను రెవెన్యూ శాఖ నుంచి తీసేయడం దారుణమన్నారు. వెంటనే జీవో 121ను రద్దు చేయాలని, లేదంటే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. -
వీఆర్వోల ఆందోళనను పట్టించుకోరా?
సాక్షి, హైదరాబాద్: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత ఆరు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోలు విధులకు దూరంగా ఉన్నా ప్రభుత్వంలో చలనంలేదని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ కనీసం ఐదు నిమిషాల పాటు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం దారుణమని గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) జేఏసీ ఆవేదన వ్యక్తం చేసింది. వీఆర్వోలు 14 ఏళ్లుగా ఒకే క్యాడర్లో ఉద్యోగం నిర్వహించడం బాధాకరమని, అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేసింది. తెలంగాణ ఉద్యోగుల మనోభావాలు సీఎస్‌కు తెలియవని, సీఎం కేసీఆర్‌ను ఆయన తప్పదోవ పట్టిస్తున్నారని జేఏసీ ఆరోపించింది. శనివారం సీసీఎల్ఏలో వీఆర్వోల జేఏసీ సమావేశం అయింది. జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీశ్, అదనపు సెక్రెటరీ జనరల్ పల్లెపాటి నరేశ్, కో చైర్మన్ రవి నాయక్, వైస్ చైర్మన్లు మౌలానా, నూకల శంకర్, రవీందర్, ప్రతిభ, ఆర్గనైజింగ్ సెక్రెటరీ కృష్ణాగౌడ్ తదితరులు భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సతీశ్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖను రద్దు చేయాలని ప్రయత్నం జరుగుతున్నందున ప్రతి ఒక్కరూ ఏకం కావాలని కోరారు. పెద్ద సంఖ్యలో ఉన్న వీఆర్వోలు, వీఆర్ఏలు విధులకు దూరంగా ఉండడం వల్ల పాలన కుంటుపడిపోయిందని అన్నారు. ప్రభుత్వం వీఆర్వోల సర్వీసును గుర్తించి రెవె న్యూ శాఖలోనే మరో పేరుతో కొనసాగించాలని కోరుతున్నామన్నారు. వీఆర్ ఏలకు స్కేలు మంజూరు చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
వీఆర్వోలకు గ్రేడింగ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)ను గ్రేడింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండలాల వారీగా వారి వివరాలను పంపాలని కోరుతూ సీఎస్ సోమేశ్‌కుమార్ శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లకు సమాచారం పంపారు. ప్రత్యేక ఫార్మాట్లో ఆదివారం మధ్యాహ్నంకల్లా వివరాలు పంపాలని.. ఆయా మండలాల తహసీల్దార్లు తమ పరిధిలోని వీఆర్వోలకు గ్రేడింగ్ ఇవ్వాలని సూచించారు. వీఆర్వో పనిచేస్తున్న మండలం, క్లస్టర్, ఉద్యోగి ఐడీ నంబర్, స్వగ్రామం, పాత జిల్లా, ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారు, ఎప్పటినుంచి పనిచేస్తున్నారు, చివరగా పనిచేసిన మూడు ప్రాంతాలు, పుట్టినతేదీ, వీఆర్వోగా రిక్రూటైన తేదీ, రిటైర్మెంట్ తేదీ, వీఆర్వోగా నియామకమైన పద్ధతి, కులం, రిజర్వేషన్, మొబైల్ నంబర్‌తోపాటు సదరు వీఆర్వోకు ఏ/బీ/సీ/డీ గ్రేడింగ్ ఇస్తూ వివరాలు పంపాలని ఆదేశించారు. సస్పెన్షన్‌లో ఉన్న, దీర్ఘకాలికంగా సమాచారం లేకుండా సెలవులో ఉన్న వారి వివరాలనూ పంపాలన్నారు. 15 ఇతర శాఖల్లో సర్దుబాటు! రెవెన్యూ శాఖ పరిధిలోని వీఆర్వోలను 15 శాఖల్లో సర్దు బాటు చేసేందుకే వారి వివరాలను ప్రభుత్వం సేకరిస్తోందని అధికారవర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో 5,384 మంది వీఆర్వోలు పనిచేస్తుండగా.. అందులో 1,300 మంది వరకు నేరుగా రిక్రూటైనవారు ఉన్నారు. వారిని రెవెన్యూశాఖలో కొనసాగించి మిగతావారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తారా? అందరినీ ఇతర శాఖలకే పంపుతారా అన్న దానిపై చర్చ జరుగుతోంది. ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేందుకు గాను వీఆర్వోలను ఆప్షన్లు అడుగుతారనే ప్రచారమున్నా.. అది సాధ్యం కాకపోవచ్చని, ప్రభుత్వమే అవసరాలకు అనుగుణంగా ఇతర శాఖలకు పంపేందుకు రంగం సిద్ధమైందని సమాచారం. కాగా.. వీఆర్వోల విషయంగా ప్రభుత్వం ఒక అడుగు వేయడంతో.. తమ పేస్కేల్, పదోన్నతుల సమస్యకు కూడా త్వరలో పరిష్కారం లభించవచ్చని గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) ఆశిస్తున్నారు. -
వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్ : కొత్త రెవెన్యూ చట్టానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులను కలెక్టర్లు స్వాధీనం చేసుకునే పని వేగవంతంగా సాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోలంతా రెవెన్యూ రికార్డులను కలెక్టర్లకు అప్పగించే పనిలో బిజీగా ఉన్నారు. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా సాగుతున్న కేసీఆర్ సర్కార్ వీఆర్వో వ్యవస్థ రద్దుకు యోచిస్తుంది. రాష్ట్రంలోని వీఆర్వోల వద్దనున్న రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నిన్న స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లుగా సమాచారం. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకల్లా రికార్డులను స్వాధీనం చేసుకోవాలని, సాయత్రం 5 గంటల వరకు రికార్డుల స్వాధీనం ఏ మేరకు పూర్తయిందో నివేదికలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ అయినట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. (తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం!) ఈ నేపధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోల వద్ద నుంచి రికార్డులను స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. కరీంనగర్ జిల్లాలో మధ్యాహ్నం వరకు 60 శాతం రెవెన్యూ రికార్డులు కలెక్టరేట్‌కు చేరాయి. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, వీఆర్వోలు, వీఆర్ఏలు ఎలాంటి ఆందోళన వ్యక్తం చేయకుండా, స్వచ్ఛందంగా రెవెన్యూ రికార్డులను అప్పగిస్తున్నారని కరీంనగర్ అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ స్పష్టం చేశారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టానికి శ్రీకారం చుట్టడంతో ఒకింత ఆందోళన, మరికొంత ఆనందం నెలకొంది. వీఆర్వోలు, వీఆర్ఏలు బాధపడుతుండగా ప్రజలు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని బాధతో వీఆర్ఏ, వీఆర్వోలు స్వాగతిస్తూనే తమ కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండేందుకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు. మాతృసంస్థ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వేరే శాఖకు వెళ్లమంటే తమకు ఇబ్బందేనని అభిప్రాయపడుతున్నారు. -
వీఆర్వోలను ఏంచేద్దాం?
సాక్షి, హైదరాబాద్: గ్రామ పాలన వ్యవస్థకు ప్రస్తుతం పట్టుగొమ్మగా ఉన్న గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. రెవెన్యూ వ్యవస్థను సమూలంగా సంస్కరించాలని భావిస్తోన్న ప్రభుత్వం.. కిందిస్థాయిలో కీలకమైన వీఆర్వో వ్యవస్థను రద్దుచేసే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. ఒకవేళ కొనసాగించినా, వారి విధుల్లో భారీగా కత్తెర పెట్టాలనే నిర్ణయానికి వచ్చింది. వీఆర్వో వ్యవస్థను రద్దుచేస్తే వారి విధులను పంచాయతీరాజ్, వ్యవసాయశాఖలకు బదలాయించేలా ప్రాథమికంగా ప్రతిపాదనలు తయారుచేసింది. రెవెన్యూ, గ్రామ రికార్డుల నిర్వహణ బాధ్యతలను వ్యవసాయ విస్తరణాధికారులకు.. రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాలు, పింఛన్ల పంపిణీ తదితరాలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించాలని యోచిస్తోంది. తహసీల్దార్ల అధికారాల్లో కోత ఆలోచనకు తగ్గట్టుగానే క్షేత్రస్థాయిలో వీఆర్వోల అధికారాలనూ కుదించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. విధులు, బదలాయింపులపై కసరత్తు రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసి, అధికారుల విధుల్లో మార్పుచేర్పులు చేయడమేగాక కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురానున్నట్లు సీఎం కేసీఆర్ గతంలోనే ప్రకటించారు. భూరికార్డుల ప్రక్షాళన పూర్తయినా భూవివాదాలు సమసిపోకపోవడం, పట్టాదార్ పాస్ పుస్తకాల జారీలో జాప్యం వంటి వాటికి కిందిస్థాయి అధికారుల చేతివాటమే కారణమని అంచనాకొచ్చిన సీఎం.. గ్రామస్థాయిలో రెవెన్యూ రికార్డుల సంరక్షకుడిగా పరిగణించే వీఆర్వోలతో ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుందని శాసనసభ సాక్షిగా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే వీఆర్వో వ్యవస్థ రద్దు కానుందనే ప్రచారానికి బలం చేకూరింది. దీనికి కొనసాగింపుగా.. వీఆర్వోలను కొనసాగిస్తే వారి వి«ధులెలా ఉండాలి? వేటిని ఇతర శాఖలకు బదలాయించాలి? కాలం చెల్లినవాటిలో వేటికి మంగళం పాడాలనే దానిపై రెవెన్యూశాఖ అంతర్గత ప్రతి పాదనలతో జాబ్‌చార్ట్ తయారుచేసింది. ఒకవేళ వీఆర్వో వ్యవస్థను రద్దుచేస్తే.. వారి విధులను పంచాయతీ కార్యదర్శులు, మండల వ్యవసాయ విçస్తరణాధికారులకు బదలాయించే అంశాన్నీ పరిశీలిస్తోంది. దీనిపై సీఎం తీసుకునే నిర్ణయం మేరకు నడుచుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. పక్కనపెడితే ఏంచేయాలి? భూరికార్డుల ప్రక్షాళనలో వీఆర్వోల భాగస్వామ్యంతో అక్రమాలు జరిగాయని అంచనాకొచ్చిన ప్రభుత్వం.. భూ రికార్డుల నిర్వహణ నుంచి వారిని పూర్తిగా తప్పించాలని నిర్ణయించింది. భూ రికార్డుల్లో కాస్తు కాలమ్‌ను తొలగించినందున, క్షేత్రస్థాయిలో వీరి అవసరం కూడా లేదనే భావనకొచ్చింది. అయితే, వీఆర్వో వ్యవస్థను పూర్తిస్థాయిలో రద్దుచేస్తే ఉద్యోగ సంఘాల ప్రతికూలత వస్తుందని భావిస్తున్న సర్కార్.. వీరి సేవలను వేరే విధంగా వినియోగించుకోవాలని భావిస్తోంది. నైపుణ్యం ఉన్నవారిని రెవెన్యూలోనే కొనసాగించి.. ఇతరులను పూలింగ్‌లో పెట్టడం ద్వారా పంచాయతీరాజ్, వ్యవసాయశాఖల్లో విలీనంచేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవస్థను గనుక రద్దుచేస్తే క్వాలిఫైడ్ వీఆర్వోలను జూనియర్ అసిస్టెంట్లుగా నిర్వచిస్తూ ప్రస్తుత శాఖలోనే కొనసాగించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఏఈవోల పరిధిపై గందరగోళం వీఆర్వో వ్యవస్థ రద్దు, అధికారాల కుదింపు/బదలాయింపు అంశంలో ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. తహసీల్దార్ల అధికారాలకు కత్తెరపెట్టాలని యోచిస్తోన్న సర్కారు.. గ్రామకంఠం లోని భూ వ్యవహారాలను ఎంపీడీవోలకు, మిగతా రెవెన్యూ వ్యవహారాలను తహసీల్దార్లకు అప్పగించాలని భావిస్తోంది. అదేవిధంగా ప్రస్తుతం వీఆర్వోలు నిర్వహిస్తున్న విధుల్లో అధికశాతం వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో)కు కట్టబెట్టాలని యోచిస్తోంది. అయితే, మండలానికి సగటున ముగ్గురు ఉండే ఏఈవోలకు గ్రామ రెవెన్యూ రికార్డులు, గ్రామ ఖాతాల నిర్వహణ బాధ్యతలూ అప్పగించాలనే ప్రభుత్వ ప్రతిపాదన ఆచరణ యోగ్యం కాదనే అభిప్రాయాలున్నాయి. ఏకకాలంలో రెవెన్యూ, వ్యవసాయ విస్తరణ వ్యవహారాల నిర్వహణ సాధ్యపడదనే వాదన వినిపిస్తోంది. రెవెన్యూ వ్యవహారాలకు గుండెకాయలాంటి ఆర్వోఆర్ చట్టంపై పరిజ్ఞానం లేని ఏఈవోలకు రెవెన్యూ రికార్డులు, విలేజ్ అకౌంట్స్ అప్పగిస్తే మరింత గందరగోళం తలెత్తే అవకాశముందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం మండల వ్యవసాయాధికారుల పరిధిలో పనిచేసే ఏఈవోల కు భూ వ్యవహారాలను అప్పగిస్తే ఎవరి పర్యవేక్షణలో పనిచేస్తారనే దానిపైనా అనిశ్చితి ఉంది. ప్ర భుత్వ నిర్ణయం తర్వాతే దీనిపై స్పష్టత రానుంది. వీఆర్వో వ్యవస్థ ఉంటే లేదా పంచాయతీ కార్యదర్శులకు బదలాయిస్తే వారికి ప్రతిపాదించిన విధులు ► కుల, ఆదాయ, స్థానిక సర్టిఫికెట్ల ధ్రువపత్రాల విచారణ ► తుపాను, వరదలు, అగ్ని ప్రమాదాలు, ప్రమాదాలు, విపత్తుల సమాచారాన్ని పైస్థాయి అధికారులకు చేరవేయడం ► విపత్తుల వల్ల వాటిల్లిన నష్టపరిహారాన్నిఅంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదించడం ► పురాతన భవనాల కూల్చివేతలు, స్మారక కట్టడాల పరిరక్షణ, శాసనాలకు సంబంధించిన సమాచారం, చట్టపరమైన సమన్లు, నోటీసులు అందించడంలో అధికారులకు సహాయకారిగా వ్యవహరించడం ► ఆయా సందర్భాల్లో ప్రభుత్వ ఆదేశాలను ప్రజలకు ‘టాంటాం’ద్వారా తెలియజేయడం ► రుణవసూళ్లలో సహాయపడడం, క్లెయిమ్ చేయని ఆస్తులకు పంచనామా నిర్వహించడం, ప్రభుత్వ స్వాధీనంలోని ఆస్తుల పరిరక్షణ ► ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల విధుల నిర్వహణ రద్దయ్యే విధులు! ► భూమిశిస్తు, పన్నులు, రెవెన్యూ ఆదాయం, ఇతర బకాయిల వసూళ్లు ► రైల్వే ప్రమాదాలు, ఆకస్మాత్తుగా సంభవించే వరదలపై స్టేషన్ మాస్టర్‌కు సమాచారమివ్వడం, తమ పరిధిలో విమాన ప్రమాదం జరిగితే, ఆ సమాచారాన్ని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు చేరవేయడం, గ్రామస్థాయిలో విద్యుత్‌శాఖ ఆస్తుల చౌర్యంపై ఫిర్యాదులు, బదిలీ, సస్పెన్షన్, తొలగింపు, డిస్మిస్, పదవీ విరమణ సమాచారాన్ని సంబంధితులకు చేరవేయడం, పోలీసు శాఖ సేవల నుంచి మినహాయింపు. ఇతర శాఖల్లోని అధికారులకు బదలాయింపులిలా.. ► వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈఓ): గ్రామ రికార్డుల నిర్వహణ, సాగు లెక్కల సమాచారం, రెవెన్యూ రికార్డులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ ► సంబంధిత శాఖలకు..: ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ, ఆక్రమణలపై నిఘా, ప్రజల మౌలిక అవసరాలైన రోడ్లు, వీధులు, బహిరంగ ప్రదేశాల స్థలాలను కాపాడడం, ప్రభుత్వ ఆస్తుల దుర్వినియోగం, కబ్జాలు తదితర సమాచారాన్ని తహసీల్దార్లకు చేరవేయడం, దాన్ని అమలు చేయడం ► మండల స్థాయి అధికారి: గ్రామ సహాయకుల వేతన బిల్లుల తయారీ ► అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ): చెరువుల పరిరక్షణ ► పంచాయతీ కార్యదర్శి: గ్రామస్థాయి సమావేశాల నిర్వహణ, తన పరిధిలో పింఛన్ల మంజూరు– పంపిణీ, ప్రస్తుతం రెవెన్యూ వ్యవస్థ పర్యవేక్షణలో ఉన్న రేషన్‌కార్డుల జారీ, ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారాలు, జనన, మరణ రికార్డుల నిర్వహణ, కనీస వేతనచట్టం–1948 అమలు, గ్రామ చావిడీల నిర్వహణ బాధ్యతలు -
కలెక్టరేట్ వద్ద వీఆర్వోల ఆందోళన
కరీంనగర్: ఎంతోకాలం నుంచి పరిష్కారం కాని తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వీఆర్వోలు కరీంనగర్ కలెక్టరేట్ వద్ద బుధవారం బైఠాయించారు. కనీస వేతనాలు అమలు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అదే విధంగా నాల్గోతరగతి ఉద్యోగులుగా తమను గుర్తించాలని నినదించారు. 010 పద్దు కింద జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. బండెడు చాకరీ చేస్తున్న వీఆర్వోలపై తెలంగాణ సర్కార్ చిన్నచూపు చూస్తోందని వాపోయారు. ఇప్పటికైనా తమ డిమాండ్లు పరిష్కరించాలని.. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వీఆర్వోలు హెచ్చరించారు. -
‘వీఆర్వోలకు జూనియర్ అసిస్టెంట్ హోదా’
సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ అధికారులకు (వీఆర్వో) త్వరలో జూని యర్ అసిస్టెంట్ హోదా ఇవ్వనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. శుక్రవారం ఇక్కడ జరిగిన తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం-2014 డైరీ ఆవి ష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి బసవరాజు సారయ్య, డిప్యూటీ స్పీకర్ భట్టివిక్రమార్కతోపాటు రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్ష, ప్రధా న కార్యదర్శులు పెండ్యాల విజయరామారావు, గరికె ఉపేంద్రరావు పాల్గొన్నారు. -
రేపే వీఆర్వో, వీఆర్ఏ పరీక్ష
దళారులను నమ్మి మోసపోవద్దు: రఘువీరా 737 ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరి నెలాఖరులోగా నియామక పత్రాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం 239 పట్టణాల్లో గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్వో), గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) పోస్టుల రాత పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. 1,657 వీఆర్వో పోస్టులు, 4,305 వీఆర్ఏ పోస్టుల భర్తీ రాత పరీక్షల ఏర్పాట్లపై శుక్రవారం సచివాలయంలో ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించి మీడియాతో మాట్లాడారు. ‘ఈ పరీక్షలకు ఇంటర్వ్యూలు ఉండవు. అభ్యర్థులు రాత పరీక్షలో చూపిన ప్రతిభే కొలబద్దగా ఉద్యోగాలు వస్తాయి. ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదు. ఉద్యోగాలిప్పిస్తామంటూ ప్రజాప్రతినిధులు, అధికారులు, వారి బంధువుల పేర్లు చెప్పే దళారులను నమ్మొద్దు. పరీక్షల్లో సాధించే మార్కుల ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయి. ఇంతకు మించి ఎవరూ ఏమీ చేయలేరు. ప్రతిభనే నమ్ముకోవాలని దరఖాస్తు చేసిన 14 లక్షల మందికీ విజ్ఞప్తి చేస్తున్నా..’ అని రఘువీరారెడ్డి పదేపదే సూచించారు. దళారుల సమాచారాన్ని రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయంలోని హెల్ప్‌లైన్ నంబరు (040-23120118)కు లేదా జిల్లా కలెక్టరేట్లలోని హెల్ప్డెస్క్లకు కూడా ఫోన్‌ద్వారా అందచేయాలని కోరారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసగించే వారిపై క్రిమినల్ కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. 20న ఫలితాలు విడుదల - వీఆర్వో పరీక్ష కోసం 3,684 పరీక్షా కేంద్రాలు, వీఆర్ఏ పరీక్ష కోసం 195 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఉదయం 10 నుంచి 12 వరకు వీఆర్వో పరీక్ష, మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు వీఆర్ఏ పరీక్ష జరుగుతుంది. పర్యవేక్షణ కోసం 65 వేల మంది ప్రభుత్వ సిబ్బందిని నియమించారు. నిఘా కోసం 737 ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. 25 వేల మంది పోలీసు సిబ్బంది సేవలను వినియోగించుకోనున్నారు. పర్యవేక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 88 మందిని జిల్లాలకు పంపింది. - అక్రమాలకు తావు లేకుండా అన్ని పరీక్షా కేంద్రాల్లో నిరంతరం వీడియో రికార్డింగ్ చేస్తారు. - ఈ పరీక్షల కోసం శుక్రవారం వరకు 13.37 లక్షల మంది (96 శాతం) హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. - ఆదివారం ఉదయం 9 గంటల వరకు జ్ట్టిఞ//ఛిఛ్చి.ఛిజజ.జౌఠి.జీ వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. - డౌన్లోడ్ చేసుకున్న హాల్టికెట్లలో పొరపాటున ఫొటో లేకుంటే మూడు ఫొటోలను గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించుకుని ఏదైనా ఫొటో గుర్తింపు కార్డుతో పరీక్షకు హాజరు కావాలి. రేషన్‌కార్డు, ఓటరు కార్డు, బస్ పాస్, పాన్‌కార్డు, పాస్‌పోర్టు, ఆధార్ కార్డుల్లో ఏదైనా ఒకటి గుర్తింపు కార్డు కింద చూపవచ్చు. - పరీక్ష పూర్తయ్యే వరకూ అభ్యర్థులను బయటకు వెళ్లేందుకు అనుమతించరు. - ఫిబ్రవరి 4న ప్రాథమిక కీ, పదో తేదీన ఫైనల్ కీ, 20న ఫలితాలు విడుదల చేస్తారు. - ఫిబ్రవరి 26 నుంచి నెలాఖరులోగా ధ్రువపత్రాలు పరిశీలించి వెంటనే నియామక పత్రాలు అందిస్తారు. ఇవీ సూచనలు - నిర్ధారిత సమయం కంటే అరనిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించరు. ప్రశాంతంగా పరీక్ష రాసేందుకు వీలుగా అభ్యర్థులంతా గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవడం మంచిది. - హాల్టికెట్లలో సూచనలను పాటించాలి. - బ్లాక్ లేదా బ్లూ బాల్‌పాయింట్ పెన్ మాత్రమే పరీక్షకు వినియోగించాలి. - కాలిక్యులేటర్లు, మొబైల్ ఫోన్లు, వైట్నర్లు, బ్లేడ్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష హాలులోకి అనుమతించరు. - వంద మార్కులకు బహుళైచ్చిక ప్రశ్నలు ఉంటా యి. నెగటివ్ మార్కులు ఉండవు. అన్ని ప్రశ్నలకూ సమాధానాలు పూరించడం మంచిది. - ఎవరైనా వైట్నర్ వినియోగిస్తే ఆ ఓఎంఆర్ షీట్‌ను వాల్యుయేషన్ చేయరు. ఈ విషయాన్ని అభ్యర్థులు మరీ ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. - డూప్లికేట్ ఓఎంఆర్ షీట్లను ఇంటికి తీసుకెళ్లవచ్చు. కార్బన్ పేపర్ ఉన్నందున అభ్యర్థులు గుర్తించిన సమాధానాలన్నీ ఇందులో ఉంటాయి. ‘కీ’ పరిశీలించుకుని ఎన్ని మార్కులు వస్తాయో అంచనా వేసేందుకు ఇది ఉపకరిస్తుంది. -
రెడీ..
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఫిబ్రవరి 2వ తేదీ జరగనున్న గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ రెవెన్యూ సహాయకుల పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఇందులో భాగంగా పరీక్షల నిర్వహణకు అవసరమైన చీఫ్ సూపరింటెండెంట్లు, ఫ్లైయింగ్ స్క్వాడ్స్, పరిశీలకుల వంటి సిబ్బంది నియామకాలను పూర్తి చేశారు. మూడు వందల కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పరీక్షలు రాసే కేంద్రానికి ప్రత్యేకంగా అదనపు చీఫ్ సూపరింటెండెంట్లు నియమించారు. ఇప్పటికే జిల్లా కేంద్రానికి ప్రశ్నపత్రాలు వచ్చాయి. వీటిని పరీక్ష కేంద్రాలకు చేర్చడం, తిరిగి సమాధాన పత్రాలను జిల్లా కేంద్రానికి వచ్చేందుకు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పరీక్షల్లో అవకతవకలకు ఆస్కారం లేకుండా వీడియో చిత్రీకరణ చేపట్టనున్నారు. పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఐవైఆర్ కృష్ణారావు పలుమార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులకు సూచనలిచ్చారు. జిల్లాలో 27 వీఆర్ఓ పోస్టులకు గానూ 28,352 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వీఆర్ఏ పోస్టులు 128 ఉండగా 888 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎస్టీ కేటగిరి క్రింద 4, బీసీ-ఎ క్రింద 4, ఎక్స్‌సర్వీస్ మెన్ (మహిళ) కోటా క్రింద ఒకటి, అంధ మహిళలు 13 వెరసి 22 వీఆర్ఏ పోస్టులకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. పరీక్షల వివరాల ఏర్పాట్లు : వచ్చేనెల 2వ తేదీ ఉదయం 10 నుంచి 12గంటల వరకు వీఆర్ఓ పరీక్షలు, అదేరోజు మధ్యాహ్నం 3నుంచి 5గంటల వరకు వీఆర్ఏ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం కడపలో 38 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి ప్రొద్దుటూరులో 16 కేంద్రాలను గుర్తించారు. ఇక రాజంపేటలో 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 64 పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, ఫర్నీచర్, విద్యుత్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద అవసరమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షా సమయం కంటే ఒక గంట ముందుగానే అభ్యర్థులు కేంద్రాల వద్దకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈనెల 19వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా పంపిన దరఖాస్తుల్లో ఫోటోలు సరిగా కనిపించకుండా ఉండడం, లేదా సంతకాలు సక్రమంగా లేనివి 344 వాటిని అధికారులు ఇప్పటికే గుర్తించారు. అలాంటి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకొని పరీక్షా కేంద్రాల వద్దకు వెళితే అనుమతించరు. అలాంటి అభ్యర్థులు మూడు పాస్‌పోర్టు సైజు ఫోటోలపై గెజిటెడ్ అధికారుల సంతకం చేయించి ఇన్విజిలేటర్‌కు సమర్పిస్తే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఒకరి బదులు మరొకరు పరీక్షలను రాయకుండా ఉండేందుకోసం అభ్యర్థుల వేలిముద్రలను స్వీకరించనున్నారు. -
వీఆర్వో, వీఆర్ఏ పోస్టులకు 14లక్షల దరఖాస్తులు
రాయవరం, న్యూస్‌లైన్ : గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), రెవెన్యూ సహాయక (వీఆర్ఏ) పోస్టులకు 14 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు భూ పరిపాలన శాఖ చీఫ్ కమిషనర్, రాష్ట్ర ప్రభుత్వ అదనపు ముఖ్య కార్యదర్శి డాక్టర్ ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాకలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. సుమారు ఆరువేల పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్టు చెప్పారు. ఈ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 2న పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వచ్చేనెల 10 నుంచి 25 వరకూ రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. -
వీఆర్వో పోస్టులకు 13 లక్షల దరఖాస్తులు
1,650 పోస్టులు.. 13 లక్షల దరఖాస్తులు వీఆర్ఏలకు 62,277 మంది దరఖాస్తు వచ్చే నెల 2న రాత పరీక్షలు సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ) పోస్టులకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. సోమవారం ఈ పోస్టులకు దరఖాస్తుల సమర్పణకు గడువు ముగిసింది. ఈ పోస్టులకు 14,51,728 లక్షల మంది ఫీజు చెల్లించగా.. 14,08,998 మంది దరఖాస్తులను సమర్పించారు. 1,650 వీఆర్వో, 4,305 వీఆర్ఏ పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్ 28న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. 1,650 వీఆర్వో పోస్టులకు 13,08,916 మంది.. 4,305 వీఆర్ఏ పోస్టులకు 62,277 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో డిగ్రీ, పీజీలు చేసిన వారు ఎక్కువగానే ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ పోస్టులకు ఫిబ్రవరి 2న రాత పరీక్షలు నిర్వహించ నున్నారు. 2వ తేదీ ఉదయం వీఆర్వోలకు, మధ్యాహ్నం వీఆర్ఏలకు పరీక్షలు జరగనున్నాయి. కాగా, ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పరీక్షలను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని ఏపీపీఎస్సీ చైర్మన్‌ను రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి ఆదేశించారు. -
117 వీఆర్వో, 282 వీఆర్ఏ పోస్టుల భర్తీకి చర్యలు
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో 117 గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), 282 గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ మేరకు శనివారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. మీ సేవ కేంద్రాల్లో 10 రూపాయలు చెల్లించి దరఖాస్తు ఫారం పొందే అవకాశం కల్పించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 150 రూపాయలు, ఇతర అభ్యర్థులు 300 రూపాయల పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జనవరి 13వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా, ఫిబ్రవరి 2వ తేదీ రాత పరీక్ష నిర్వహించనున్నారు. వీఆర్వో పోస్టులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, వీఆర్ఏ పోస్టులకు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఈ రెండు పరీక్షలు రాయాలనుకున్న అభ్యర్థులు ఒకేసారి ఫీజు చెల్లిస్తే ఒకే పరీక్ష కేంద్రంలో రాసే వెసులుబాటు కల్పించారు. వీఆర్వో పోస్టుకు ఇంటర్మీడియెట్, వీఆర్ఏ పోస్టుకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వీఆర్వో పోస్టులకు జిల్లాను, వీఆర్ఏ పోస్టులకు మండలాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. రాత పరీక్షను 100 మార్కులకు నిర్వహించనున్నారు. 60 మార్కులు జనరల్, 30 మార్కులు అర్ధమెటిక్స్, 10 మార్కులు లాజికల్ స్కిల్స్‌కు సంబంధించిప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్షలను జిల్లా కేంద్రమైన ఒంగోలులో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అంచనాలకు మించి అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే డివిజనల్ కేంద్రాల్లో కూడా పరీక్షలు నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. జిల్లాలో భర్తీ చేయనున్న వీఆర్వో, వీఆర్ఏ పోస్టుల వివరాలను కేటగిరీల వారీగా శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కలెక్టర్ విజయకుమార్ వెల్లడించారు. 117 వీఆర్వో పోస్టుల్లో 78 జనరల్, 39 ఉమెన్‌కు కేటాయించారు. 282 వీఆర్ఏ పోస్టుల్లో 134 జనరల్, 148 ఉమెన్‌కు కేటాయించారు. 29న వీఆర్వో, వీఆర్ఏ పోస్టులకు మోడల్ టెస్ట్ వీఆర్వో, వీఆర్ఏ రాత పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఒంగోలులోని శివాలయం వద్దగల శృతి కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ ఉచిత అవగాహన సదస్సు, మోడల్ టెస్ట్ నిర్వహించనున్నట్లు డెరైక్టర్ వీ మాధవరావు ఒక ప్రకటనలో తెలిపారు. మోడల్ టెస్ట్‌లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి ఉచితంగా కోచింగ్ ఇస్తామన్నారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 99511 61139, 97056 56125 నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు. వీఆర్వో పోస్టులు 117 ఓసీ జనరల్ 34 ఉమెన్ 19 ఎస్సీ జనరల్ 12 ఉమెన్ 6 ఎస్టీ జనరల్ 4 ఉమెన్ 2 బీసీ ఏ జనరల్ 5 ఉమెన్ 3 బీసీ బీ జనరల్ 1 ఉమెన్ -- బీసీ సీ జనరల్ 1 ఉమెన్ -- బీసీ డీ జనరల్ 7 ఉమెన్ 2 బీసీ ఈ జనరల్ 4 ఉమెన్ 1 పీహెచ్సీ వీహెచ్ జనరల్ 1 హెచ్‌హెచ్ ఉమెన్ 1 ఓహెచ్ జనరల్ 1 ఎక్స్‌సర్వీస్‌మన్ 2 వీఆర్ఏ పోస్టులు 282 ఓసీ జనరల్ 70 ఉమెన్ 30 ఎస్సీ జనరల్ 31 ఉమెన్ 5 ఎస్టీ జనరల్ 1 ఉమెన్ 5 బీసీ ఏ జనరల్ 4 ఉమెన్ 24 బీసీ బీ జనరల్ 1 ఉమెన్ 19 బీసీ సీ జనరల్ 11 ఉమెన్ -- బీసీ డీ జనరల్ -- ఉమెన్ 6 బీసీ ఈ జనరల్ -- ఉమెన్ 6 పీహెచ్సీ జనరల్ 33 ఎక్స్‌సర్వీస్‌మెన్ 16