గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్‌ఏ) పోస్టులకు భారీగా దరఖాస్తులు వచ్చాయి.
1,650 పోస్టులు.. 13 లక్షల దరఖాస్తులు
వీఆర్‌ఏలకు 62,277 మంది దరఖాస్తు
వచ్చే నెల 2న రాత పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్‌ఏ) పోస్టులకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. సోమవారం ఈ పోస్టులకు దరఖాస్తుల సమర్పణకు గడువు ముగిసింది. ఈ పోస్టులకు 14,51,728 లక్షల మంది ఫీజు చెల్లించగా.. 14,08,998 మంది దరఖాస్తులను సమర్పించారు. 1,650 వీఆర్వో, 4,305 వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్ 28న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. 1,650 వీఆర్వో పోస్టులకు 13,08,916 మంది.. 4,305 వీఆర్‌ఏ పోస్టులకు 62,277 మంది దరఖాస్తు చేసుకున్నారు.
దరఖాస్తు చేసుకున్న వారిలో డిగ్రీ, పీజీలు చేసిన వారు ఎక్కువగానే ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ పోస్టులకు ఫిబ్రవరి 2న రాత పరీక్షలు నిర్వహించ నున్నారు. 2వ తేదీ ఉదయం వీఆర్వోలకు, మధ్యాహ్నం వీఆర్‌ఏలకు పరీక్షలు జరగనున్నాయి. కాగా, ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పరీక్షలను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని ఏపీపీఎస్సీ చైర్మన్‌ను రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి ఆదేశించారు.