అవస్థలు పడుతున్న వీఆర్వోలు
ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేసి రెండేళ్లు..
అయినా పరిష్కారం కాని సమస్యలు
పీఎఫ్ వచ్చిందో లేదో తెలియదు
కొత్త ప్రభుత్వం కొలువుదీరినా అదే పరిస్థితి
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ వ్యవస్థకు పట్టుకొమ్మలాంటి గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్వో)ను ఇతర శాఖల్లో సర్దుబాటు చేసి రెండేళ్లవుతోంది. నేటికీ సరిగ్గా వేతనాలు రాక, పీఎఫ్ నిబంధన అమలు కాక, పదోన్నతులకు అర్హత లేక, సీనియార్టీ కోల్పోయి సర్దుబాటు వీఆర్వోలు పడరాని పాట్లు పడుతున్నారు.
భూ సమస్యల పరిష్కారం కోసం కొత్త రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్‌వోఆర్) చట్టాన్ని అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తున్న నేపథ్యంలో తమ సమస్యలను కూడా పరిష్కరించాలని, వీలైనంత త్వరగా తమను రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని వీఆర్వో సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
రెండేళ్లుగా అవస్థలు
రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడం ద్వారా 5,400 మందికి పైగా వీఆర్వోలను ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేసే ప్రక్రియను అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తి చేసింది. కనీసం తమతో మాట్లాడకుండా, లాటరీ పద్ధతిలో ఇతర శాఖల్లోకి బదలాయించడం పట్ల అప్పట్లోనే వీఆర్వోలు, రెవెన్యూ సంఘాలు అభ్యంతరం తెలిపినా ఖాతరు చేయకుండానే ప్రక్రియ ముగించింది. అప్పటి నుంచీ ఇతర శాఖల్లో సర్దుబాటయిన వీఆర్వోలు పడరాని పాట్లు పడాల్సి వస్తోందని వీఆర్వోల సంఘాలు చెపుతున్నాయి.
తమకు 010 పద్దు కింద వేతనాలు రావడం లేదని, జీపీఎఫ్, సీపీఎస్, టీఎస్‌జీఎల్‌ఐలు చెల్లించడం లేదని, ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపజేసే ఐఆర్ పెంపుదల ఇవ్వలేదని, పాత డీఏలు, పీఆర్సీ బకాయిలు రావడం లేదని, కొన్ని సొసైటీలు, కార్పొరేషన్లలో మూడు నెలలకోసారి వేతనాలు ఇస్తున్నారని, గిరిజన సహకార కార్పొరేషన్‌లో పనిచేస్తున్న 16 మంది వీఆర్వోలకు గత 20 నెలలుగా వేతనాలు కూడా రావడం లేదని వాపోతున్నారు.
ఇతర శాఖల్లో బలవంతంగా పంపిన తమకు అర్హతకు అనుగుణంగా ఉద్యోగాలు ఇవ్వలేదని, సీనియార్టీని కూడా కలపకపోవడంతో పదోన్నతులు కోల్పోయామని, స్టోర్ కీపర్లుగా, హాస్టల్ వర్కర్లుగా, తోటమాలీలుగా పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరి సమస్యలను పరిష్కరిస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత కూడా ఒకట్రెండు సార్లు దీనిపై సానుకూల ప్రకటనలు కూడా చేసింది. కానీ, ఇప్పటివరకు రెవెన్యూశాఖలోకి సదరు వీఆర్వోలను తీసుకురాలేదు.
రెవెన్యూ మంత్రిని కలిసిన వీఆర్వో జేఏసీ
కొత్త ఆర్‌వోఆర్ చట్టం తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపేందుకు గాను వీఆర్వో జేఏసీ ఇటీవల రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసింది.
జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీశ్, సెక్రటరీ జనరల్ హరాలే సుధాకర్‌రావు, నేతలు పల్లెపాటి నరేశ్, చింతల మురళి తదితరులు సచివాలయంలో రెవెన్యూ మంత్రిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని వీఆర్వోలను మళ్లీ రెవెన్యూ శాఖలోకి తీసుకువచ్చి కొత్త ఆర్‌వోఆర్ చట్టం అమలును సులభతరం చేసేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వీఆర్వో జేఏసీ నేతలు మంత్రి పొంగులేటిని కోరారు.
జరిగిన అన్యాయాన్ని సరిదిద్దండి
గత ప్రభుత్వ హయాంలో వీఆర్వోలకు పూర్తిగా అన్యాయం జరిగింది.. ఈ ప్రభుత్వమైనా మాకు న్యాయం చేయాలి. ఆప్షన్లు ఇచ్చి అందరినీ రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలి.’ –వింజమూరి ఈశ్వర్, తెలంగాణ రీడిప్లాయిడ్‌ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment