vro posts
-
వీఆర్వో పరీక్షకు 78 శాతం హాజరు
సాక్షి, హైదరాబాద్: విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్వో) పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించిన రాత పరీక్షకు 78.46 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. 700 పోస్టుల భర్తీకి జరిగిన ఈ పరీక్షకు 10,58,387 మంది దరఖాస్తు చేసుకోగా 7,87,049 మంది పరీక్ష రాశారని టీఎస్పీఎస్సీ తెలిపింది. వరంగల్ అర్బన్, మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధికంగా 83 శాతం మంది, వికారాబాద్ జిల్లాలో అతి తక్కువగా 29 శాతం మంది హాజరయ్యారని వెల్లడించింది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్ జిల్లాలో 73,681 మంది (74.06 శాతం), రంగారెడ్డి జిల్లాలో 64,209 మంది (74.89 శాతం), మేడ్చల్‌లో 68,499 మంది (75.09 శాతం) పరీక్ష రాశారు. ఇష్టం వచ్చినట్లు కేంద్రాల కేటాయింపు దరఖాస్తు సమయంలో ఎంచుకున్న జిల్లాలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్లు పరీక్ష కేంద్రాలను కేటాయించడంతో అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు. హైదరాబాద్‌కు చెందిన కొంతమందికి ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో కేటాయించడంతో పరీక్షకు హాజరు కాలేకపోయారు. హైదరాబాద్‌లోని పరీక్ష కేంద్రాల్లో పరీక్ష రాసేందుకు సామర్థ్యానికి మించి అభ్యర్థులు ఆప్షన్ ఇవ్వడంతో అనేక మందికి ఇతర జిల్లాల్లో కేంద్రాలను కేటాయించారు. పరీక్ష కేంద్రం మారిందంటూ.. పరీక్ష సందర్భంగా కొన్ని చోట్ల అభ్యర్థులు తంటాలు పడాల్సి వచ్చింది. కొందరికి ‘మీ పరీక్ష కేంద్రం మారింది.. మారిన ప్రకారం హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకోండి’అని సమాచారం రావడంతో గందరగోళం నెలకొంది. 1340077047 నంబరు గల అభ్యర్థి రెండు రోజుల కిందట హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే ‘మీ పరీక్ష కేంద్రం మారింది.. మారిన ప్రకారం హాల్‌టికెట్ ఇంకా డౌన్లోడ్ చేసుకోండి.. ఒకవేళ డౌన్లోడ్ చేసుకుంటే ఈ మెసేజ్‌ను వదిలేయండి’అని శనివారం మధ్యాహ్నం 12:20 గంటలకు ఎస్ఎంఎస్ వచ్చింది. మళ్లీ మధాహ్నం 1.09 గంటలకు.. ‘మీకు ముందుగా ఇచ్చిన పరీక్ష కేంద్రాన్ని (విజేత స్కూల్ తుర్కపల్లి, శామీర్‌పేట్ మండలం) మార్పు చేశాం.. మూసారాంబాగ్‌లోని నారాయణ జూనియర్ కాలేజీ ఫర్ గరŠల్స్ కేంద్రాన్ని కేటాయించాం.. మారిన కేంద్రం ప్రకారం హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకోండి..’అని సమాచారం వచ్చింది. కానీ ఆ అభ్యర్థి ఎన్నిసార్లు డౌన్లోడ్ చేసినా తుర్కపల్లి పరీక్ష కేంద్రం ఉన్న హాల్టికెటే వచ్చింది. దీనిపై టీఎస్పీఎస్సీ టెక్నికల్ టీం, హెల్ప్ డెస్క్‌కు అనేకసార్లు ఫోన్ చేసినా కలవలేదు. కలసినా ఫోన్ తీయలేదు. దీంతో సదరు అభ్యర్థి మారిన కేంద్రానికి వెళ్లగా అక్కడ తన నంబరు లేదు. తనలా చాలా మంది ఉండొచ్చని సదరు అభ్యర్థి అన్నారు. తాళి తీయించి పరీక్షకు.. తనిఖీల పేరుతో పలు కేంద్రాల్లోని అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మహిళా అభ్యర్థుల వాచ్‌లు, గాజులు.. చివరకు మెడలోని తాళినీ తీయించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో మహిళలను తాళి తీసేసిన తర్వాతే పరీక్షకు అనుమతించడంతో అభ్యర్థుల బంధువులు కేంద్రం ఎదుట తాళిబొట్లు పట్టుకుని నిరసనకు దిగారు. పోలీసుల జోక్యంతో తాళి, మెట్టెలతో హాలులోకి అనుమతించారు. అనేక మంది మహిళలు చంటి బిడ్డలతో పరీక్షకు హాజరయ్యారు. కేంద్రాల ముందు కనీస ఏర్పాట్లు కూడా లేకపోవడంతో మధ్యాహ్నమంతా చిన్నారులను ఎత్తుకుని ఎండలోనే గడపాల్సి వచ్చింది. -
పలు వీఆర్వో పరీక్షా కేంద్రాల్లో మార్పు
సాక్షి, హైదరాబాద్: వీఆర్వో పోస్టుల భర్తీ కోసం ఈనెల 16న రాత పరీక్ష నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 700 పోస్టులకు 10.58 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. పరీక్ష ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతుందని, అభ్యర్థులు 10:45 గంటల కల్లా పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లాలని సూచించింది. మరోవైపు రంగారెడ్డి జిల్లాలోని మూడు పరీక్షా కేంద్రాలను మార్పు చేసింది. ఇవీ మార్పులు.. - సరూర్‌నగర్‌లోని ప్రగతి మహిళా డిగ్రీ కళాశాలలో (సెంటర్ కోడ్ 39124) 1339063388 హాల్‌టికెట్ నంబరు నుంచి 1339063987 నంబరు వరకు 600 మంది అభ్యర్థులకు మొదట పరీక్షకేంద్రం ఏర్పాటు చేయగా తాజాగా దానిని మార్పు చేసింది. వారందరికీ నారాయణ జూనియర్ కాలేజీ (బాయ్స్) ఏఐఈఈఈ క్యాంపస్, బిసైడ్ కమలా హాస్పిటల్ , కర్పూరం ఇందిరా సు శీల కాంప్లెక్స్, దిల్‌సుఖ్‌నగర్‌కు మార్పు చేసింది. - సాయి చైతన్య జూనియర్ కాలేజీ, ఇంటినంబరు16–11–741/బి/4/ఏ, టీకేఆర్‌ఎస్ ఐకాన్ హాస్పిటల్ లేన్ బిహైండ్ బాప్టిస్ట్ చర్చి, దిల్సుఖ్నగర్ (సెంటర్ 39133) పరీక్షా కేంద్రాన్ని మార్పు చేసింది. అందులో పరీక్ష రాయాల్సిన 1339068548 హాల్‌టికెట్ నంబరు నుంచి 1339069047 వరకు 500 మందికి మరో కేంద్రాన్ని కేటాయించింది. వారంతా నారాయణ జూనియర్ కాలేజీ ఫర్ గరŠల్స్ 16–11–477/6/ఎ/9/1 బిసైడ్ యూనివర్సిల్ జిమ్ అండ్ బ్రిలియంట్ గ్రామర్‌స్కూల్, మూసారాంబాగ్, దిల్సుఖ్నగర్, హైదరాబాద్కేంద్రంలో పరీక్ష రాయాలని సూచించింది. - సరూర్‌నగర్‌లోని న్యూ నోబుల్ డిగ్రీ కాలేజీలో (సెంటర్ కోడ్ 39137) పరీక్షలు రాయాల్సిన 1339070504 నుంచి 1339070953 హాల్‌టికెట్ నంబర్లకు చెందిన 450 మంది అభ్యర్థుల పరీక్షా కేంద్రం మార్పు చేసింది. వారంతా వెలాసిటీ జూనియర్ కాలేజీ, మూసారాంబాగ్, దిల్సుఖ్నగర్, హైదరాబాద్ పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాయాలని సూచించింది. -
ఒక్క పోస్టు.. 1,512 మంది పోటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనూ ఎన్నడూ లేనంతగా వీఆర్వో పోస్టులకు అత్యధికంగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణీ ప్రసాద్ వెల్లడించారు. 700 పోస్టుల భర్తీ చేపట్టగా 10,58,387 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఒక్కో పోస్టుకు 1,512 మంది పోటీ పడుతున్నట్లు తెలిపారు. బుధవారం టీఎస్పీఎస్సీ కార్యాలయం లో విలేకరులతో ఆమె మాట్లాడారు. ఈ నెల 16న నిర్వహించనున్న ఈ పరీక్షకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఉం టుందని పేర్కొన్నారు. అభ్యర్థులు ఉదయం 10:45లోపు పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,945 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కోరుకున్న పరీక్ష కేంద్రం దక్కలేదు.. వాస్తవానికి హెచ్ఎండీఏ పరిధిలో పరీక్ష రాసేందుకు 5 లక్షల మందికిపైగా అభ్యర్థులు పరీక్ష కేంద్రం ఆప్షన్ ఇచ్చినా 3 లక్షల మందికే హెచ్ఎండీఏ పరిధిలోని 627 పరీక్ష కేంద్రాలను కేటాయించినట్లు ఆమె తెలిపారు. ఆ మేరకే సరిపడ కేంద్రాలున్నాయని, మిగతా వారికి ఇతర జిల్లాల్లో కేంద్రాలను కేటాయించినట్లు వివరించారు. కొంతమందికి ఆదిలాబాద్‌లోనూ పరీక్ష కేంద్రాలను కేటాయించక తప్పలేదని, ఆన్లైన్లో ర్యాండమ్ పద్ధతిన వాటిని కేటాయించినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు ఆందోళన చెందకుండా వీలైనంత ముందుగా కేంద్రాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. తొలిసారిగా ఎక్కువ మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నందున కాలేజీలు, కొన్ని పాఠశాలల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈసారి కొత్త జిల్లాల్లోనూ కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అధిక సంఖ్యలో అభ్యర్థులు ఉన్నందున పరీక్షలకు బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయడం లేదన్నారు. ముందే హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి చివరి వరకు ఆగకుండా ముందుగానే హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని ఆమె సూచించారు. చివరిక్షణంలో అంతా ఒకే సారి డౌన్లోడ్ చేసుకుంటే సర్వర్ డౌన్ అయ్యే ప్రమాదం ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 11 నుంచి డౌన్లోడ్ అవకాశం కల్పించామని, ఇప్పటివరకు 8 లక్షల మంది డౌన్Œలోడ్ చేసుకున్నారని తెలిపారు. గతంలో కొందరు హాల్టికెట్లలోని పరీక్ష కేంద్రాలను సరిగ్గా చూసుకోకుండా ఇతర కేంద్రాలకు వెళ్లి నష్టపోయారన్నారు. పరీక్షకు వెళ్లేప్పుడు హాల్‌టికెట్, ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలన్నారు. కొందరు ఆన్లైన్ దరఖాస్తు సమయంలో పేరు స్థానంలో ఖాళీగా వదిలేయడం, బోర్డు పేరు రాయడం, ఫొటోలు అప్లోడ్ చేయకపోవడం వంటి పొరపాట్లు చేశారన్నారు. ఎడిట్ ఆప్షన్ ఇచ్చినా ఇంకా 2 వేల మంది అలాంటి పొరపాట్లే చేశారని తెలిపారు. అయితే వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌కు ఒక లెటర్ రాసిచ్చి పరీక్షకు హాజరుకావచ్చని వెల్లడించారు. ఫొటో ప్రింట్ కానీ వారు తమ వెంట 2 ఫొటోలను తీసుకెళ్లాలని అన్నారు. ప్రభుత్వ అనుమతులు వచ్చాకే.. ప్రస్తుత పోస్టుల భర్తీకి పాత జిల్లాల ప్రకారమే నోటిఫికేషన్ జారీ చేశామని, ప్రభుత్వం కొత్త జోనల్, జిల్లాల ఉత్తర్వుల ప్రకారం మరో జీవో ఇస్తే కొత్త జిల్లాల ప్రకారం మెరిట్ జాబితాలను సిద్ధం చేసే అవకాశం ఉందన్నారు. దీనికి ప్రభుత్వం కొత్తగా ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉందన్నారు. కొత్త జోనల్, జిల్లాల విధానంపై ఉత్తర్వులు జారీ అయిన నేప థ్యంలో వాటి ప్రకారం పలు పోస్టులను విభజించి రోస్టర్ వివరాలను ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందన్నారు. అప్పుడే కొత్త నోటిఫికేషన్లు ఇవ్వవచ్చని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాశామని, అవిరాగానే నోటిఫికేషన్ల జారీకి చర్యలు చేపడతామన్నారు. గ్రూప్–1 వంటి వాటికీ అలాగే ఉన్నాయన్నారు. కొత్త విధానం ప్రకారం పోస్టుల విభజన చేయా ల్సి ఉందన్నారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా సర్టి ఫికెట్ల వెరిఫికేషన్‌ను డీఈవోలు చేస్తున్నారన్నారు. అయితే టెట్ మార్కులు, కొన్ని రకాల డిగ్రీ వ్యాలిడిటీ సంబంధ అంశాల్లో స్పష్టత రావాల్సి ఉందన్నారు. గ్రూప్–2 వ్యవహారం కోర్టులో ఉందని, తీర్పు రిజర్వు అయిందని, అది వెలువడ్డాక తదుపరి చర్యలు చేపడతామని వివరించారు. వెబ్సైట్లో డిజిటల్ కాపీ ఈసారి పరీక్ష రాసే అభ్యర్థులకు కార్బన్‌లెస్ ఓఎంఆర్ కాపీ ఇవ్వబోమన్నారు. వారి ఓఎంఆర్ జవాబు పత్రాలను స్కాన్ చేసిన తర్వాత డిజిటల్ కాపీలను వెబ్సైట్లో ఉంచుతామన్నారు. ఇతర పరీక్షల డిజిటల్ కాపీలను 48 గంటల్లోపే వెబ్సైట్లో ఉంచుతున్నా.. ప్రస్తుత పరీక్షను ఎక్కువ మంది రాయనుండటంతో కొంత ఆలస్యమైనా జిల్లాల వారీగా స్కాన్ చేసి డిజిటల్ కాపీలను అందుబాటులోకి తెస్తామన్నారు. -
వీఆర్వో పోస్టులకు 13 లక్షల దరఖాస్తులు
1,650 పోస్టులు.. 13 లక్షల దరఖాస్తులు వీఆర్ఏలకు 62,277 మంది దరఖాస్తు వచ్చే నెల 2న రాత పరీక్షలు సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ) పోస్టులకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. సోమవారం ఈ పోస్టులకు దరఖాస్తుల సమర్పణకు గడువు ముగిసింది. ఈ పోస్టులకు 14,51,728 లక్షల మంది ఫీజు చెల్లించగా.. 14,08,998 మంది దరఖాస్తులను సమర్పించారు. 1,650 వీఆర్వో, 4,305 వీఆర్ఏ పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్ 28న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. 1,650 వీఆర్వో పోస్టులకు 13,08,916 మంది.. 4,305 వీఆర్ఏ పోస్టులకు 62,277 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో డిగ్రీ, పీజీలు చేసిన వారు ఎక్కువగానే ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ పోస్టులకు ఫిబ్రవరి 2న రాత పరీక్షలు నిర్వహించ నున్నారు. 2వ తేదీ ఉదయం వీఆర్వోలకు, మధ్యాహ్నం వీఆర్ఏలకు పరీక్షలు జరగనున్నాయి. కాగా, ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పరీక్షలను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని ఏపీపీఎస్సీ చైర్మన్‌ను రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి ఆదేశించారు. -
నిరుద్యోగులకు శుభవార్త
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలోని నిరుద్యోగులకు శుభవార్త. గ్రామాల్లో ఖాళీగా ఉన్న వీఆర్ఏ, వీఆర్వో పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్వో), విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ) పోస్టుల భర్తీకి ఈనెల 28న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి ప్రకటించారు. జిల్లాలోని వీఆర్ఏ పోస్టులు 105, వీఆర్ఓ పోస్టులు 78 భర్తీ కానున్నాయి. 2012 డిసెంబర్ వరకు ఖాళీగా ఉన్న వీఆర్వో, వీఆర్ఏ పోస్టుల ప్రకారం ఆయా పోస్టుల భర్తీకి అధికారులు గతంలో నివేదికలు పంపించారు. తాజా ప్రభుత్వ ప్రకటనతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లా, రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూశాఖలో అనేక మంది ఉద్యోగులు పదవివీరమణ పొందారు. ఉన్న ఉద్యోగులపై పనిభారం పెరగడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఖాళీల భర్తీకి నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో వీఆర్వో, వీఆర్ఏ పోస్టులు ఖాళీగా ఉండటంతో చిన్న చిన్న పనులు కూడా సకాలంలో పూర్తికాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆదాయ, కుల ధ్రువీకరణ, పహణీ నకలు వంటి వాటికోసం మీసేవలో దరఖాస్తు చేసుకున్నా వాటిని విచార ణ చేసేందుకు వీఆర్వోలు లేకపోవడంతో నెలల తరబడి అభ్యర్థులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. నాలుగైదు గ్రామాలకు కలిపి ఒకే వీఆర్వో ఉండటంతో సకాలంలో పనులుకాక ప్రజలు.. పని ఒత్తిడితో వీఆర్వోలు సతమతమవుతున్నారు. రెవెన్యూ పరంగా గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ రెవెన్యూ సహాయకుల ఖాళీలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఈమేరకు జిల్లా అధికార యంత్రాంగం ఖాళీల భర్తీపై కసరత్తు ప్రారభించింది. గ్రామాల వారీగా ఖాళీల వివరాలను తయారు చేస్తున్నారు. వీఆర్ఏ పోస్టులకు ఆయా గ్రామాలకు సంబంధించిన అభ్యర్థులకు అధిక అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ నెల 28న నోటిఫికేషన్ విడుదల చేయనుండటంతో దరఖాస్తులు చేసుకునేందుకు అభ్యర్థులు సమాయత్తం అవుతున్నారు. సంబంధిత సర్టిఫికెట్లను సేకరించేందుకు సిద్ధం అవుతున్నారు. అనేక రోజులుగా వీఆర్వో, వీఆర్ఏ పోస్టుల భర్తీని నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తూ వచ్చింది. ఎట్టకేలకు ఈ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి. జిల్లావ్యాప్తంగా 128 వీఆర్ఏ పోస్టులు, 111 వీఆర్వో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే 2012 లెక్కల ప్రకారం 105 వీఆర్ఏ, 78 వీఆర్వో పోస్టులను భర్తీచేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్న అభ్యర్థులు 30 శాతం మందికి వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించనున్నారు. వీఆర్ఏ, వీఆర్వో పోస్టుల భర్తీకి 28న నోటిఫికేషన్ జనవరి 1 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ 13వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం 19న హాల్‌టికెట్లు విడుదల ఫిబ్రవరి 2న రాత పరీక్షలు 20న ఫలితాలు విడుదల