ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలోని నిరుద్యోగులకు శుభవార్త. గ్రామాల్లో ఖాళీగా ఉన్న వీఆర్‌ఏ, వీఆర్వో పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్వో), విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్‌ఏ) పోస్టుల భర్తీకి ఈనెల 28న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి ప్రకటించారు. జిల్లాలోని వీఆర్‌ఏ పోస్టులు 105, వీఆర్‌ఓ పోస్టులు 78 భర్తీ కానున్నాయి. 2012 డిసెంబర్ వరకు ఖాళీగా ఉన్న వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టుల ప్రకారం ఆయా పోస్టుల భర్తీకి అధికారులు గతంలో నివేదికలు పంపించారు. తాజా ప్రభుత్వ ప్రకటనతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లా, రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూశాఖలో అనేక మంది ఉద్యోగులు పదవివీరమణ పొందారు. ఉన్న ఉద్యోగులపై పనిభారం పెరగడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఖాళీల భర్తీకి నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టులు ఖాళీగా ఉండటంతో చిన్న చిన్న పనులు కూడా సకాలంలో పూర్తికాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆదాయ, కుల ధ్రువీకరణ, పహణీ నకలు వంటి వాటికోసం మీసేవలో దరఖాస్తు చేసుకున్నా వాటిని విచార ణ చేసేందుకు వీఆర్వోలు లేకపోవడంతో నెలల తరబడి అభ్యర్థులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
నాలుగైదు గ్రామాలకు కలిపి ఒకే వీఆర్వో ఉండటంతో సకాలంలో పనులుకాక ప్రజలు.. పని ఒత్తిడితో వీఆర్వోలు సతమతమవుతున్నారు. రెవెన్యూ పరంగా గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ రెవెన్యూ సహాయకుల ఖాళీలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఈమేరకు జిల్లా అధికార యంత్రాంగం ఖాళీల భర్తీపై కసరత్తు ప్రారభించింది. గ్రామాల వారీగా ఖాళీల వివరాలను తయారు చేస్తున్నారు. వీఆర్‌ఏ పోస్టులకు ఆయా గ్రామాలకు సంబంధించిన అభ్యర్థులకు అధిక అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ నెల 28న నోటిఫికేషన్ విడుదల చేయనుండటంతో దరఖాస్తులు చేసుకునేందుకు అభ్యర్థులు సమాయత్తం అవుతున్నారు. సంబంధిత సర్టిఫికెట్‌లను సేకరించేందుకు సిద్ధం అవుతున్నారు. అనేక రోజులుగా వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టుల భర్తీని నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తూ వచ్చింది. ఎట్టకేలకు ఈ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి. జిల్లావ్యాప్తంగా 128 వీఆర్‌ఏ పోస్టులు, 111 వీఆర్వో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే 2012 లెక్కల ప్రకారం 105 వీఆర్‌ఏ, 78 వీఆర్వో పోస్టులను భర్తీచేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. వీఆర్‌ఏగా విధులు నిర్వహిస్తున్న అభ్యర్థులు 30 శాతం మందికి వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించనున్నారు.
వీఆర్‌ఏ, వీఆర్వో పోస్టుల భర్తీకి 28న నోటిఫికేషన్
జనవరి 1 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
13వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం
19న హాల్‌టికెట్‌లు విడుదల
ఫిబ్రవరి 2న రాత పరీక్షలు
20న ఫలితాలు విడుదల
నిరుద్యోగులకు శుభవార్త
Published Sun, Dec 22 2013 3:52 AM | Last Updated on Sat, Sep 2 2017 1:50 AM
Advertisement
Advertisement