![Khammam district BRS leaders meet at former minister Puvvada Ajay Kumar residence](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/PP1-2.jpg.webp?itok=mMzU55JO)
సంతోష్‌కుమార్‌తో కలిసి ‘వృక్షార్చన’ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో మోసపోయామని ప్రజలు భావిస్తున్నారు: కేటీఆర్
ప్రజలు తిడుతున్నా సీఎం రేవంత్ రెడ్డి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు
స్థానిక సంస్థల్లో ఏకగ్రీవాలకు ఖమ్మం జిల్లా మంత్రుల కుట్రలు
మాజీ మంత్రి పువ్వాడ ఇంట్లో ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్ నేతల భేటీ
సాక్షి, హైదరాబాద్: ‘కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో మోసపోయామని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టి ప్రజలు కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. రుణమాఫీ విషయంలో మంత్రుల మధ్య సయోధ్య లేకపోవడంతో తెలంగాణ అధోగతి పాలైంది. ప్రజలు తిడుతున్నా సీఎం రేవంత్ రెడ్డి ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నివాసంలో జరిగిన ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
‘తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చింది. సీఎం నియోజకవర్గంతోపాటు తెలంగాణలోని ప్రతీ పనికి సంబంధించిన కాంట్రాక్టు ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రికే దక్కుతున్నాయి. కాంట్రాక్టుల మంత్రి ఇచ్చే కమీషన్ల కోసమే ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు. డిప్యూటీ సీఎం 30శాతం కమీషన్లు తీసుకుని పనులు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెబుతున్నారు’ అని కేటీఆర్ మండిపడ్డారు.
ప్రత్యేక కారణాలతోనే బీఆర్‌ఎస్‌కు నష్టం
‘పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఖమ్మంలో అసాధారణ అభివృద్ధి జరిగినా అక్కడి ప్రత్యేక రాజకీయ సమీకరణాల వల్ల బీఆర్‌ఎస్‌కు కొంత నష్టం జరిగింది. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నా వరదల సమయంలో ప్రజలకు పైసా ఉపయోగ పడలేదు. కానీ బీఆర్‌ఎస్ నాయకులు ఓడిపోయినా ఏడాది కాలంగా ప్రజలకు అండగా నిలుస్తున్నారు. అన్ని వర్గాలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి.
ఈ ఎన్నికల్లో పోలీసులను అడ్డం పెట్టుకొని ఏకగ్రీవాల కోసం ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు చేస్తున్న కుట్రలను బీఆర్‌ఎస్ అడ్డుకుంటుంది’ అని కేటీఆర్ హెచ్చరించారు. త్వరలో తాను ఖమ్మం జిల్లాలో పర్యటిస్తానని ప్రకటించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు పువ్వాడ అజయ్, జగదీశ్‌రెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ పుట్టిన రోజున ‘వృక్షార్చన’
బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17న ప్రతీ ఒక్కరూ మూడు మొక్కల చొప్పున నాటాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘వృక్షార్చన’ పేరిట మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను కేటీఆర్ మంగళవారం విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment