సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనూ ఎన్నడూ లేనంతగా వీఆర్వో పోస్టులకు అత్యధికంగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీ ప్రసాద్ వెల్లడించారు. 700 పోస్టుల భర్తీ చేపట్టగా 10,58,387 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఒక్కో పోస్టుకు 1,512 మంది పోటీ పడుతున్నట్లు తెలిపారు. బుధవారం టీఎస్‌పీఎస్సీ కార్యాలయం లో విలేకరులతో ఆమె మాట్లాడారు. ఈ నెల 16న నిర్వహించనున్న ఈ పరీక్షకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఉం టుందని పేర్కొన్నారు. అభ్యర్థులు ఉదయం 10:45లోపు పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,945 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
కోరుకున్న పరీక్ష కేంద్రం దక్కలేదు..
వాస్తవానికి హెచ్‌ఎండీఏ పరిధిలో పరీక్ష రాసేందుకు 5 లక్షల మందికిపైగా అభ్యర్థులు పరీక్ష కేంద్రం ఆప్షన్ ఇచ్చినా 3 లక్షల మందికే హెచ్‌ఎండీఏ పరిధిలోని 627 పరీక్ష కేంద్రాలను కేటాయించినట్లు ఆమె తెలిపారు. ఆ మేరకే సరిపడ కేంద్రాలున్నాయని, మిగతా వారికి ఇతర జిల్లాల్లో కేంద్రాలను కేటాయించినట్లు వివరించారు. కొంతమందికి ఆదిలాబాద్‌లోనూ పరీక్ష కేంద్రాలను కేటాయించక తప్పలేదని, ఆన్‌లైన్‌లో ర్యాండమ్ పద్ధతిన వాటిని కేటాయించినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు ఆందోళన చెందకుండా వీలైనంత ముందుగా కేంద్రాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. తొలిసారిగా ఎక్కువ మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నందున కాలేజీలు, కొన్ని పాఠశాలల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈసారి కొత్త జిల్లాల్లోనూ కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అధిక సంఖ్యలో అభ్యర్థులు ఉన్నందున పరీక్షలకు బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయడం లేదన్నారు.
ముందే హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి
చివరి వరకు ఆగకుండా ముందుగానే హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆమె సూచించారు. చివరిక్షణంలో అంతా ఒకే సారి డౌన్‌లోడ్ చేసుకుంటే సర్వర్ డౌన్ అయ్యే ప్రమాదం ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 11 నుంచి డౌన్‌లోడ్ అవకాశం కల్పించామని, ఇప్పటివరకు 8 లక్షల మంది డౌన్Œలోడ్ చేసుకున్నారని తెలిపారు. గతంలో కొందరు హాల్‌టికెట్లలోని పరీక్ష కేంద్రాలను సరిగ్గా చూసుకోకుండా ఇతర కేంద్రాలకు వెళ్లి నష్టపోయారన్నారు. పరీక్షకు వెళ్లేప్పుడు హాల్‌టికెట్, ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలన్నారు. కొందరు ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో పేరు స్థానంలో ఖాళీగా వదిలేయడం, బోర్డు పేరు రాయడం, ఫొటోలు అప్‌లోడ్ చేయకపోవడం వంటి పొరపాట్లు చేశారన్నారు. ఎడిట్ ఆప్షన్ ఇచ్చినా ఇంకా 2 వేల మంది అలాంటి పొరపాట్లే చేశారని తెలిపారు. అయితే వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌కు ఒక లెటర్ రాసిచ్చి పరీక్షకు హాజరుకావచ్చని వెల్లడించారు. ఫొటో ప్రింట్ కానీ వారు తమ వెంట 2 ఫొటోలను తీసుకెళ్లాలని అన్నారు.
ప్రభుత్వ అనుమతులు వచ్చాకే..
ప్రస్తుత పోస్టుల భర్తీకి పాత జిల్లాల ప్రకారమే నోటిఫికేషన్ జారీ చేశామని, ప్రభుత్వం కొత్త జోనల్, జిల్లాల ఉత్తర్వుల ప్రకారం మరో జీవో ఇస్తే కొత్త జిల్లాల ప్రకారం మెరిట్ జాబితాలను సిద్ధం చేసే అవకాశం ఉందన్నారు. దీనికి ప్రభుత్వం కొత్తగా ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉందన్నారు. కొత్త జోనల్, జిల్లాల విధానంపై ఉత్తర్వులు జారీ అయిన నేప థ్యంలో వాటి ప్రకారం పలు పోస్టులను విభజించి రోస్టర్ వివరాలను ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందన్నారు. అప్పుడే కొత్త నోటిఫికేషన్లు ఇవ్వవచ్చని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాశామని, అవిరాగానే నోటిఫికేషన్ల జారీకి చర్యలు చేపడతామన్నారు. గ్రూప్–1 వంటి వాటికీ అలాగే ఉన్నాయన్నారు. కొత్త విధానం ప్రకారం పోస్టుల విభజన చేయా ల్సి ఉందన్నారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా సర్టి ఫికెట్ల వెరిఫికేషన్‌ను డీఈవోలు చేస్తున్నారన్నారు. అయితే టెట్ మార్కులు, కొన్ని రకాల డిగ్రీ వ్యాలిడిటీ సంబంధ అంశాల్లో స్పష్టత రావాల్సి ఉందన్నారు. గ్రూప్–2 వ్యవహారం కోర్టులో ఉందని, తీర్పు రిజర్వు అయిందని, అది వెలువడ్డాక తదుపరి చర్యలు చేపడతామని వివరించారు.
వెబ్‌సైట్‌లో డిజిటల్ కాపీ
ఈసారి పరీక్ష రాసే అభ్యర్థులకు కార్బన్‌లెస్ ఓఎంఆర్ కాపీ ఇవ్వబోమన్నారు. వారి ఓఎంఆర్ జవాబు పత్రాలను స్కాన్ చేసిన తర్వాత డిజిటల్ కాపీలను వెబ్‌సైట్‌లో ఉంచుతామన్నారు. ఇతర పరీక్షల డిజిటల్ కాపీలను 48 గంటల్లోపే వెబ్‌సైట్‌లో ఉంచుతున్నా.. ప్రస్తుత పరీక్షను ఎక్కువ మంది రాయనుండటంతో కొంత ఆలస్యమైనా జిల్లాల వారీగా స్కాన్ చేసి డిజిటల్ కాపీలను అందుబాటులోకి తెస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment