జిల్లాలో 117 గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), 282 గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ) పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో 117 గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), 282 గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ) పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ మేరకు శనివారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. మీ సేవ కేంద్రాల్లో 10 రూపాయలు చెల్లించి దరఖాస్తు ఫారం పొందే అవకాశం కల్పించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 150 రూపాయలు, ఇతర అభ్యర్థులు 300 రూపాయల పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జనవరి 13వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా, ఫిబ్రవరి 2వ తేదీ రాత పరీక్ష నిర్వహించనున్నారు.
వీఆర్వో పోస్టులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, వీఆర్‌ఏ పోస్టులకు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఈ రెండు పరీక్షలు రాయాలనుకున్న అభ్యర్థులు ఒకేసారి ఫీజు చెల్లిస్తే ఒకే పరీక్ష కేంద్రంలో రాసే వెసులుబాటు కల్పించారు. వీఆర్వో పోస్టుకు ఇంటర్మీడియెట్, వీఆర్‌ఏ పోస్టుకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వీఆర్వో పోస్టులకు జిల్లాను, వీఆర్‌ఏ పోస్టులకు మండలాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. రాత పరీక్షను 100 మార్కులకు నిర్వహించనున్నారు. 60 మార్కులు జనరల్, 30 మార్కులు అర్ధమెటిక్స్, 10 మార్కులు లాజికల్ స్కిల్స్‌కు సంబంధించిప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్షలను జిల్లా కేంద్రమైన ఒంగోలులో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
అంచనాలకు మించి అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే డివిజనల్ కేంద్రాల్లో కూడా పరీక్షలు నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. జిల్లాలో భర్తీ చేయనున్న వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టుల వివరాలను కేటగిరీల వారీగా శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కలెక్టర్ విజయకుమార్ వెల్లడించారు. 117 వీఆర్వో పోస్టుల్లో 78 జనరల్, 39 ఉమెన్‌కు కేటాయించారు. 282 వీఆర్‌ఏ పోస్టుల్లో 134 జనరల్, 148 ఉమెన్‌కు కేటాయించారు.
29న వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టులకు మోడల్ టెస్ట్
వీఆర్వో, వీఆర్‌ఏ రాత పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఒంగోలులోని శివాలయం వద్దగల శృతి కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ ఉచిత అవగాహన సదస్సు, మోడల్ టెస్ట్ నిర్వహించనున్నట్లు డెరైక్టర్ వీ మాధవరావు ఒక ప్రకటనలో తెలిపారు. మోడల్ టెస్ట్‌లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి ఉచితంగా కోచింగ్ ఇస్తామన్నారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 99511 61139, 97056 56125 నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు.
వీఆర్వో పోస్టులు 117
ఓసీ జనరల్ 34 ఉమెన్ 19
ఎస్సీ జనరల్ 12 ఉమెన్ 6
ఎస్టీ జనరల్ 4 ఉమెన్ 2
బీసీ ఏ జనరల్ 5 ఉమెన్ 3
బీసీ బీ జనరల్ 1 ఉమెన్ --
బీసీ సీ జనరల్ 1 ఉమెన్ --
బీసీ డీ జనరల్ 7 ఉమెన్ 2
బీసీ ఈ జనరల్ 4 ఉమెన్ 1
పీహెచ్‌సీ వీహెచ్ జనరల్ 1
హెచ్‌హెచ్ ఉమెన్ 1
ఓహెచ్ జనరల్ 1
ఎక్స్‌సర్వీస్‌మన్ 2
వీఆర్‌ఏ పోస్టులు 282
ఓసీ జనరల్ 70 ఉమెన్ 30
ఎస్సీ జనరల్ 31 ఉమెన్ 5
ఎస్టీ జనరల్ 1 ఉమెన్ 5
బీసీ ఏ జనరల్ 4 ఉమెన్ 24
బీసీ బీ జనరల్ 1 ఉమెన్ 19
బీసీ సీ జనరల్ 11 ఉమెన్ --
బీసీ డీ జనరల్ -- ఉమెన్ 6
బీసీ ఈ జనరల్ -- ఉమెన్ 6
పీహెచ్‌సీ జనరల్ 33
ఎక్స్‌సర్వీస్‌మెన్ 16