రేపే వీఆర్‌వో, వీఆర్‌ఏ పరీక్ష | VRO, VRA exam will be held tomorrow | Sakshi
Sakshi News home page

రేపే వీఆర్‌వో, వీఆర్‌ఏ పరీక్ష

Published Sat, Feb 1 2014 4:07 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM

రేపే వీఆర్‌వో, వీఆర్‌ఏ పరీక్ష

రేపే వీఆర్‌వో, వీఆర్‌ఏ పరీక్ష

దళారులను నమ్మి మోసపోవద్దు: రఘువీరా
737 ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు
 ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరి నెలాఖరులోగా నియామక పత్రాలు

 
 సాక్షి, హైదరాబాద్:
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం 239 పట్టణాల్లో గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్‌వో), గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ) పోస్టుల రాత పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు  చేసినట్లు రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. 1,657 వీఆర్‌వో పోస్టులు, 4,305 వీఆర్‌ఏ పోస్టుల భర్తీ రాత పరీక్షల ఏర్పాట్లపై శుక్రవారం సచివాలయంలో ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించి మీడియాతో మాట్లాడారు. ‘ఈ పరీక్షలకు ఇంటర్వ్యూలు ఉండవు. అభ్యర్థులు రాత పరీక్షలో చూపిన ప్రతిభే కొలబద్దగా ఉద్యోగాలు వస్తాయి. ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదు.
 
  ఉద్యోగాలిప్పిస్తామంటూ ప్రజాప్రతినిధులు, అధికారులు, వారి బంధువుల పేర్లు చెప్పే దళారులను నమ్మొద్దు. పరీక్షల్లో సాధించే మార్కుల ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయి. ఇంతకు మించి ఎవరూ ఏమీ చేయలేరు. ప్రతిభనే నమ్ముకోవాలని దరఖాస్తు చేసిన 14 లక్షల మందికీ విజ్ఞప్తి చేస్తున్నా..’ అని రఘువీరారెడ్డి పదేపదే సూచించారు. దళారుల సమాచారాన్ని రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయంలోని హెల్ప్‌లైన్ నంబరు (040-23120118)కు లేదా జిల్లా కలెక్టరేట్‌లలోని హెల్ప్‌డెస్క్‌లకు కూడా ఫోన్‌ద్వారా అందచేయాలని కోరారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ  మోసగించే వారిపై క్రిమినల్ కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామన్నారు.
 
  20న ఫలితాలు విడుదల
 -    వీఆర్‌వో పరీక్ష కోసం 3,684 పరీక్షా కేంద్రాలు, వీఆర్‌ఏ పరీక్ష కోసం 195 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఉదయం 10 నుంచి 12 వరకు వీఆర్‌వో పరీక్ష, మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు వీఆర్‌ఏ పరీక్ష జరుగుతుంది. పర్యవేక్షణ కోసం 65 వేల మంది ప్రభుత్వ సిబ్బందిని నియమించారు. నిఘా కోసం 737 ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. 25 వేల మంది పోలీసు సిబ్బంది సేవలను వినియోగించుకోనున్నారు. పర్యవేక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 88 మందిని జిల్లాలకు పంపింది.
-    అక్రమాలకు తావు లేకుండా అన్ని పరీక్షా కేంద్రాల్లో నిరంతరం వీడియో రికార్డింగ్ చేస్తారు.
-    ఈ పరీక్షల కోసం శుక్రవారం వరకు 13.37 లక్షల మంది (96 శాతం) హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు.
-    ఆదివారం ఉదయం 9 గంటల వరకు జ్ట్టిఞ//ఛిఛ్చి.ఛిజజ.జౌఠి.జీ  వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
-    డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లలో పొరపాటున ఫొటో లేకుంటే మూడు ఫొటోలను గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించుకుని ఏదైనా ఫొటో గుర్తింపు కార్డుతో పరీక్షకు హాజరు కావాలి. రేషన్‌కార్డు, ఓటరు కార్డు, బస్ పాస్, పాన్‌కార్డు, పాస్‌పోర్టు, ఆధార్ కార్డుల్లో ఏదైనా ఒకటి గుర్తింపు కార్డు కింద చూపవచ్చు.
-  పరీక్ష పూర్తయ్యే వరకూ అభ్యర్థులను బయటకు వెళ్లేందుకు అనుమతించరు.
- ఫిబ్రవరి 4న ప్రాథమిక కీ, పదో తేదీన ఫైనల్ కీ, 20న ఫలితాలు విడుదల చేస్తారు.
-  ఫిబ్రవరి 26 నుంచి నెలాఖరులోగా ధ్రువపత్రాలు పరిశీలించి వెంటనే నియామక పత్రాలు అందిస్తారు.  
 
 ఇవీ సూచనలు
 -    నిర్ధారిత సమయం కంటే అరనిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించరు. ప్రశాంతంగా పరీక్ష రాసేందుకు వీలుగా అభ్యర్థులంతా గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవడం మంచిది.
 -   హాల్‌టికెట్లలో సూచనలను పాటించాలి.
 -   బ్లాక్ లేదా బ్లూ బాల్‌పాయింట్ పెన్ మాత్రమే పరీక్షకు వినియోగించాలి.
-   కాలిక్యులేటర్లు, మొబైల్ ఫోన్లు, వైట్నర్లు, బ్లేడ్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష హాలులోకి అనుమతించరు.
 -    వంద మార్కులకు బహుళైచ్చిక ప్రశ్నలు ఉంటా యి.  నెగటివ్ మార్కులు ఉండవు. అన్ని ప్రశ్నలకూ సమాధానాలు పూరించడం మంచిది.
 -   ఎవరైనా వైట్నర్ వినియోగిస్తే ఆ ఓఎంఆర్ షీట్‌ను వాల్యుయేషన్ చేయరు. ఈ విషయాన్ని అభ్యర్థులు మరీ ముఖ్యంగా గుర్తుంచుకోవాలి.  
 -    డూప్లికేట్ ఓఎంఆర్ షీట్లను ఇంటికి తీసుకెళ్లవచ్చు. కార్బన్ పేపర్ ఉన్నందున అభ్యర్థులు గుర్తించిన సమాధానాలన్నీ ఇందులో ఉంటాయి. ‘కీ’ పరిశీలించుకుని  ఎన్ని మార్కులు వస్తాయో అంచనా వేసేందుకు ఇది ఉపకరిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement