village revenue assistants
-
సీఎం కేసీఆర్ నిర్ణయం.. వారంలోగా వీఆర్ఏల సర్దుబాటు
సాక్షి, హైదరాబాద్: విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల (వీఆర్ఏ)ను వారి సేవలు విద్యార్హతలు, సామర్థ్యాలను బట్టి విస్తృతంగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. వారిని నీటిపారుదల సహా ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. వీఆర్ ఏల సర్దుబాటు, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై సీఎం కేసీఆర్ మంగళవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వీఆర్ఏలతో చర్చించి వారి అభిప్రాయాలను సేకరించాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు మంత్రి కేటీఆర్ నేతృత్వంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌తో కూడిన మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేబినెట్ సబ్‌కమిటీ వీఆర్ఏలతో బుధవారం నుంచి చర్చలు ప్రారంభించనుంది. ఉప సంఘం సూచనల ప్రకారం వీఆర్ఏల సేవల వినియోగంపై చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదే శించారు. ఉప సంఘం తుది నివేదిక సిద్ధమైన తర్వాత మరోమారు చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. వారంలోపు ఈ ప్రక్రియ పూర్తి కావాలని నిర్దేశించారు. లక్ష్యాలు సాధిస్తే క్రమబద్ధీకరణ నాలుగేళ్ల శిక్షణ కాలాన్ని పూర్తి చేసుకున్న పంచాయతీ కార్యదర్శుల పనితీరును నిబంధనల మేరకు పరిశీలించి క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వారి పనితీరును జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలిస్తుందని, నిర్దేశిత లక్ష్యాల్లో మూడింట రెండో వంతు పూర్తి చేసిన వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని చెప్పారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతను కాపాడేందుకు బాధ్యతాయుతంగా వ్యవహరించడం, మొక్కలు నాటించడం, వాటిని కాపాడే దిశగా పర్యవేక్షించడంతోపాటు పలు రకాల బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులు విధిగా నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు క్రమబద్ధీకరణ ప్రక్రియను చేపట్టాలని సీఎస్ శాంతి కుమారి, పంచాయితీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హన్మంతరావును కేసీఆర్ ఆదేశించారు. వారి పాత్ర అభినందనీయం రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర అభినందనీయమని కేసీఆర్ చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న గ్రామాలతో పోటీపడి తెలంగాణ పల్లెలు సాధించిన జాతీయ అవార్డుల్లో వారి కృషి ఇమిడి ఉందన్నారు. తెలంగాణ పల్లెలు మరింత గుణాత్మకంగా మార్పు చెందాలని, ప్రజల భాగస్వామ్యంతో మరింత అభివృద్ధి చెందే దిశగా పంచాయితీ కార్యదర్శుల కృషి కొనసాగుతూనే ఉండాలని ఆకాంక్షించారు. సమీక్షలో మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
17 నుంచి వీఆర్ఏల నిరాహార దీక్ష
సాక్షి, హైదరాబాద్/వరంగల్: తమ సమస్యల పరిష్కారం కోసం 75 రోజులుగా సమ్మె చేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ) చివరి పోరాట అస్త్రంగా నిరవధిక నిరాహార దీక్షలకు దిగాలని నిర్ణయించుకున్నారు. రెండున్నర నెలలుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, మంత్రి కేటీఆర్ ఓసారి చర్చలు జరిపి ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో నిరవధిక దీక్షలే మార్గమని వీఆర్ఏల రాష్ట్ర జేఏసీ నిర్ణయించింది. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన జేఏసీ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో వీఆర్ఏ జేఏసీ నేతలు ఎం.రాజయ్య, రమేశ్ బహుదూర్, దాదేమియా, డి.సాయన్న, ఎం.డి.రఫీ, వెంకటేశ్ యాదవ్, గోవింద్, వంగూరు రాములు, మాధవ్ నాయుడు, కంది శిరీషారెడ్డి, సునీత, ఎల్.నర్సింహారావు పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా వీఆర్ఏ జేఏసీ కన్వీనర్ సాయన్న మాట్లాడుతూ... న్యాయమైన తమ సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టింపులేకుండా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం నుంచి 17వ తేదీ వరకు నిరసన కార్యక్రమాల కార్యాచరణ రూపొందించినట్లు పేర్కొన్నారు. 17 నుంచి జరిగే నిరవధిక దీక్షల్లో ప్రతి జిల్లా నుంచి ఒకరు, జేఏసీ నుంచి నలుగురు, మొత్తం 37 మంది నేతలు పాల్గొనాలని, దీక్షల కంటే ముందు యాదాద్రి నుంచి ప్రగతిభవన్ వరకు పాదయాత్ర, భిక్షాటన, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. -
ఉద్యోగ భద్రత లేదా
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ)ల పరిస్థితి దయనీయంగా మారింది. కనీస వేతనం, ఉద్యోగ భద్రత, బీమా, ఆరోగ్య భద్రత, పింఛన్, పదోన్నతులకు ఆమడ దూరంలో విధులు నిర్వహిస్తున్నారు. దశాబ్దాలుగా చాలీచాలని వేతనాలతో కొలువులు చేస్తున్నారు. పెరుగుతున్న నిత్యావసరాల ఖర్చులు, పిల్లల విద్య, వైద్యం వ్యయాలను తాము భరించలేకపోతున్నామని, బతుకుబండి లాగాలంటే తమకు పేస్కేల్– ఉద్యోగ భద్రత కల్పించాలని వేడుకుంటున్నారు. డిమాండ్ల సాధనకు 28 రోజులుగా జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేస్తున్నారు. గ్రామాల్లో కీలకం.. రాష్ట్రంలో మొత్తం 23,000 మంది వీఆర్ఏలు ఉన్నారు. అందులో 20,000 మంది ఇదే వృత్తిని సంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. వీరిలో గరిష్టంగా 80 ఏళ్ల వయసు వారు కూడా వీఆర్ఏలుగా కొనసాగుతున్నారు. వీరంతా రూ.10,500 వేతనంతో బతుకుబండి నెట్టుకువస్తున్నారు. కాగా, 23,000 మందిలో 3,000 మంది 2012లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ అయ్యారు. వీరిలో 60 శాతం మంది మహిళలు ఉన్నారు. పంటల నమోదు, గ్రామాల్లో చెరువులను, కుంటలను, కుంట శిఖాలను, ప్రభుత్వ భూములను పరిరక్షించడం వీరి విధుల్లో ముఖ్యమైనవి. వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు గ్రామానికి వచ్చినప్పుడు వారికి క్షేత్రస్థాయిలో సహకారం అందింస్తుంటారు. గ్రామాల్లో కీలకంగా ఉన్నా.. వీరికి ఎలాంటి పేస్కేలు, పీఎఫ్, ఈఎస్ఐ, బీమా, పింఛన్ వంటి సదుపాయాల్లేవు. 24 గంటల్లో ఏ క్షణమైనా విధులకు వెళ్లాల్సి ఉంటుంది. పనిభారం పెరిగినా.. పదోన్నతుల్లేవు! కనీసం ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్నవారికి ఖాళీల ఆధారంగా పదోన్నతులు కల్పించాల్సి ఉంది. 2017లో వీరిలో అర్హులకు ప్రమోషన్లు రావాల్సి ఉండగా.. జిల్లాల విభజన వీరికి శరాఘాతంగా మారింది. అదనపు జిల్లాలు, మండలాలు, రెవెన్యూడివిజన్లతో పనిభారం పెరిగింది. వాస్తవానికి సర్వీస్‌రూల్స్ ప్రకారం.. మూడేళ్ల తరువాత వీఆర్ఏలను అటెండర్, నైట్ వాచ్‌మన్, జీపు డ్రైవర్‌గా ప్రమోట్ చేయాలి. అయితే వీరిలో కొందరు ఏళ్లుగా పనిచేస్తున్నప్పటికీ కనీసం పింఛన్ సదుపాయం కూడా లేదు. ఇపుడున్న వీఆర్ఏలలో చాలామంది 40 ఏళ్లు సర్వీసు ఉన్న వారూ నామమాత్రం వేతనానికి పనిచేస్తున్నారు. పదోన్నతులు ఇవ్వాల్సిందే దశాబ్దాలుగా పనిచేస్తున్నా మాకు కనీస హక్కులు అమలు కావడం లేదు. 2017లో సీఎంతో వీఆర్ఏలు భేటీ అయిన సందర్భంలో అర్హతలు ఉన్న వారికి వివిధ దశల్లో పదోన్నతులు కల్పించాలని ఆదేశించారు. కారుణ్యనియామకాల ద్వారా వచ్చిన వీఆర్ఏలకు డబుల్ బెడ్రూం, అటెండర్ ఉద్యోగాలిస్తామన్న హామీలు ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. – కందుకూరి బాపుదేవ్, వీఆర్ఏ రాష్ట్ర సహాధ్యక్షుడు మెటర్నిటీ లీవులు కరువు దేశంలో మహిళలకు, అందులోనూ ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న మహిళలకు మెటర్నిటీ లీవులు విధిగా ఇవ్వాలి. కానీ, ఇంతవరకూ వీఆర్ఏలకు ఇది అమలు కావడం లేదు. గర్భిణులుగా ఉన్నా.. రాత్రీ పగలు లేకుండా.. ఇబ్బందికర పరిస్థితుల్లోనూ విధులు నిర్వహిస్తున్నాం. బాలింతలు కూడా డ్యూటీలు చేయాల్సిన దుస్థితి ఉంది. – కంది శిరీషారెడ్డి, రాష్ట్ర జేఏసీ కో–కన్వీనర్ -
భార్య కాపురానికి రాలేదని మనస్తాపంతో..
అచ్యుతాపురం (యలమంచిలి): వారు ప్రేమించకున్నారు.. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నారు.. వేరే కాపురం పెట్టి కొన్నాళ్లు హాయిగా ఉన్నారు. అయితే ఇంతలో ఏమైందో ఏమో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. రమ్మని అడిగినా రానంది. కాల్చేస్తే ఫోన్ ఎత్తలేదు. నెలరోజులైనా రాలేదు. దీంతో అతను యాతనపడ్డాడు. చివరికి మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అచ్యుతాపురం మండలంలో గురువారం ఈ విషాదం చోటు చేసుకుంది. ఎస్ఐ మల్లేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. హరిపాలెం అందలాపల్లికి చెందిన కండవల్లి పవన్ కుమార్(25) నర్సీపట్నానికి చెందిన చంద్రకళతో నాలుగునెలల క్రితం ప్రేమలోపడ్డాడు. పెళ్లి చేయమని వారు తల్లిదండ్రులను ప్రాథేయపడ్డారు. ఇరువురి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో అనకాపల్లిలోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. పోలీసులను ఆశ్రయించి సహాయం తీసుకున్నారు. చోడపల్లిలో ఇల్లు అద్దెకు తీసుకుని కాపురంపెట్టారు. ఇద్దరూ అచ్యుతాపురంలో సెల్‌షాపులో పని చేసేవారు. నెలరోజులక్రితం తనను భర్త పవన్‌కుమార్ వేధిస్తున్నాడంటూ చంద్రకళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనితో కాపురం చేయలేనని ప్రతి విషయంలో తనను అనుమానించి ఆరా తీస్తున్నాడని ఎస్ఐకి చెప్పంది. ఇవన్నీ మామూలేనని ఇద్దరికీ సర్దిచెప్పి ఎస్ఐ పంపించేశారు. ఆ తరువాత ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. పవన్‌కుమార్ నిత్యం ఫోన్‌చేసి కాపురానికి రమ్మని కోరేవాడు. 15రోజుల క్రితం చంద్రకళ ఇక్కడి పోలీస్‌స్టేషన్‌కి వచ్చింది. తనకు పవన్‌తో కాపురంచేయడం ఇష్టంలేదని.. పదేపదే ఫోన్‌చేసి వేధిస్తున్నాడని ఎస్ఐకి తెలిపింది. ఫోన్ చేయకుండా పవన్‌కుమార్‌ని మందలించాలని కోరింది. ఎస్ఐ పవన్‌కుమార్‌ని స్టేషన్‌కి పిలిపించి కౌన్సెలింగ్ చేశారు. పెద్దల సమక్షంలో సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పారు. భార్య ఇక కాపురానికి రానని చెప్పేయడంతో పవన్‌కుమార్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. బుధవారం అందలాపల్లిలో తన ఇంట్లో ఫ్యాన్‌కి చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పవన్ చెల్లెలు రాణి కిటికీలోనుంచి గమనించి పెద్దగా ఏడ్చుకుంటూ చుట్టుపక్కలవారికి చెప్పగా వారొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ మల్లేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందకి దించారు. -
రేపే వీఆర్వో, వీఆర్ఏ పరీక్ష
దళారులను నమ్మి మోసపోవద్దు: రఘువీరా 737 ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరి నెలాఖరులోగా నియామక పత్రాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం 239 పట్టణాల్లో గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్వో), గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) పోస్టుల రాత పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. 1,657 వీఆర్వో పోస్టులు, 4,305 వీఆర్ఏ పోస్టుల భర్తీ రాత పరీక్షల ఏర్పాట్లపై శుక్రవారం సచివాలయంలో ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించి మీడియాతో మాట్లాడారు. ‘ఈ పరీక్షలకు ఇంటర్వ్యూలు ఉండవు. అభ్యర్థులు రాత పరీక్షలో చూపిన ప్రతిభే కొలబద్దగా ఉద్యోగాలు వస్తాయి. ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదు. ఉద్యోగాలిప్పిస్తామంటూ ప్రజాప్రతినిధులు, అధికారులు, వారి బంధువుల పేర్లు చెప్పే దళారులను నమ్మొద్దు. పరీక్షల్లో సాధించే మార్కుల ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయి. ఇంతకు మించి ఎవరూ ఏమీ చేయలేరు. ప్రతిభనే నమ్ముకోవాలని దరఖాస్తు చేసిన 14 లక్షల మందికీ విజ్ఞప్తి చేస్తున్నా..’ అని రఘువీరారెడ్డి పదేపదే సూచించారు. దళారుల సమాచారాన్ని రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయంలోని హెల్ప్‌లైన్ నంబరు (040-23120118)కు లేదా జిల్లా కలెక్టరేట్లలోని హెల్ప్డెస్క్లకు కూడా ఫోన్‌ద్వారా అందచేయాలని కోరారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసగించే వారిపై క్రిమినల్ కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. 20న ఫలితాలు విడుదల - వీఆర్వో పరీక్ష కోసం 3,684 పరీక్షా కేంద్రాలు, వీఆర్ఏ పరీక్ష కోసం 195 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఉదయం 10 నుంచి 12 వరకు వీఆర్వో పరీక్ష, మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు వీఆర్ఏ పరీక్ష జరుగుతుంది. పర్యవేక్షణ కోసం 65 వేల మంది ప్రభుత్వ సిబ్బందిని నియమించారు. నిఘా కోసం 737 ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. 25 వేల మంది పోలీసు సిబ్బంది సేవలను వినియోగించుకోనున్నారు. పర్యవేక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 88 మందిని జిల్లాలకు పంపింది. - అక్రమాలకు తావు లేకుండా అన్ని పరీక్షా కేంద్రాల్లో నిరంతరం వీడియో రికార్డింగ్ చేస్తారు. - ఈ పరీక్షల కోసం శుక్రవారం వరకు 13.37 లక్షల మంది (96 శాతం) హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. - ఆదివారం ఉదయం 9 గంటల వరకు జ్ట్టిఞ//ఛిఛ్చి.ఛిజజ.జౌఠి.జీ వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. - డౌన్లోడ్ చేసుకున్న హాల్టికెట్లలో పొరపాటున ఫొటో లేకుంటే మూడు ఫొటోలను గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించుకుని ఏదైనా ఫొటో గుర్తింపు కార్డుతో పరీక్షకు హాజరు కావాలి. రేషన్‌కార్డు, ఓటరు కార్డు, బస్ పాస్, పాన్‌కార్డు, పాస్‌పోర్టు, ఆధార్ కార్డుల్లో ఏదైనా ఒకటి గుర్తింపు కార్డు కింద చూపవచ్చు. - పరీక్ష పూర్తయ్యే వరకూ అభ్యర్థులను బయటకు వెళ్లేందుకు అనుమతించరు. - ఫిబ్రవరి 4న ప్రాథమిక కీ, పదో తేదీన ఫైనల్ కీ, 20న ఫలితాలు విడుదల చేస్తారు. - ఫిబ్రవరి 26 నుంచి నెలాఖరులోగా ధ్రువపత్రాలు పరిశీలించి వెంటనే నియామక పత్రాలు అందిస్తారు. ఇవీ సూచనలు - నిర్ధారిత సమయం కంటే అరనిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించరు. ప్రశాంతంగా పరీక్ష రాసేందుకు వీలుగా అభ్యర్థులంతా గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవడం మంచిది. - హాల్టికెట్లలో సూచనలను పాటించాలి. - బ్లాక్ లేదా బ్లూ బాల్‌పాయింట్ పెన్ మాత్రమే పరీక్షకు వినియోగించాలి. - కాలిక్యులేటర్లు, మొబైల్ ఫోన్లు, వైట్నర్లు, బ్లేడ్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష హాలులోకి అనుమతించరు. - వంద మార్కులకు బహుళైచ్చిక ప్రశ్నలు ఉంటా యి. నెగటివ్ మార్కులు ఉండవు. అన్ని ప్రశ్నలకూ సమాధానాలు పూరించడం మంచిది. - ఎవరైనా వైట్నర్ వినియోగిస్తే ఆ ఓఎంఆర్ షీట్‌ను వాల్యుయేషన్ చేయరు. ఈ విషయాన్ని అభ్యర్థులు మరీ ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. - డూప్లికేట్ ఓఎంఆర్ షీట్లను ఇంటికి తీసుకెళ్లవచ్చు. కార్బన్ పేపర్ ఉన్నందున అభ్యర్థులు గుర్తించిన సమాధానాలన్నీ ఇందులో ఉంటాయి. ‘కీ’ పరిశీలించుకుని ఎన్ని మార్కులు వస్తాయో అంచనా వేసేందుకు ఇది ఉపకరిస్తుంది. -
వీఆర్ఏలకు న్యాయం చేయాలి
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్ఏ) న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి వీ వెంకయ్య డిమాండ్ చేశారు. గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షలు ఆదివారం మూడో రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని వెంకయ్య ప్రారంభించి ప్రసంగించారు. గత ఏడాది మార్చి 7న చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేటివ్తో జరిగిన చర్చల్లో వీఆర్ఏలకు నెలకు రూ 7500 వేతనం, రూ 500 డీఏ పెంచుతామని ప్రకటించినప్పటికీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదన్నారు. చీఫ్ కమిషనర్ ప్రభుత్వానికి సిఫార్సుచేసి పదినెలలవుతున్నా అతీగతీ లేకుండా పోయిందన్నారు. ఆర్థిక శాఖకు పంపించిన ఫైల్‌కు అనేక ఆటంకాలు కలిగిస్తూ నెలల తరబడి నాన్చుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యను పరిష్కరించకుండా రానున్న ఎన్నికల్లో ఎన్ని ఓట్లు, ఎన్ని సీట్లు వస్తాయోనన్న లెక్కల్లో తలమునకలైందన్నారు. వీఆర్ఏల సమస్యలు పరిష్కరించకుంటే వారికి మద్దతుగా ఆందోళ న కార్యక్రమాల్లో పాలుపంచుకుంటామని హెచ్చరించారు. బీఎస్ఎన్ఎల్ రిటైర్డు ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ కనీస వేతనం అమలు చేయాల్సిన ప్రభుత్వం తక్కువ వేతనాలతో వీఆర్ఏలతో వెట్టిచాకిరీ చేయించుకుంటోందని విమర్శించారు. ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రీజనల్ కార్యదర్శి అయ్యపరెడ్డి మాట్లాడుతూ వీఆర్ఏలకు వేతనం పెంచుతున్నట్లు పత్రికల్లో ప్రకటించడం తప్పితే ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు. కాలయాపన చేయకుండా వెంటనే వీఆర్ఏల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఎస్కే బేగ్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జీ శ్రీనివాసులు, కార్యదర్శి సీహెచ్ మజుందార్, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం నాయకుడు పాలడుగు వివేకానందలు దీక్షా శిబిరాన్ని సందర్శించి ప్రసంగించారు.