సాక్షి, హైదరాబాద్/వరంగల్: తమ సమస్యల పరిష్కారం కోసం 75 రోజులుగా సమ్మె చేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ) చివరి పోరాట అస్త్రంగా నిరవధిక నిరాహార దీక్షలకు దిగాలని నిర్ణయించుకున్నారు. రెండున్నర నెలలుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, మంత్రి కేటీఆర్ ఓసారి చర్చలు జరిపి ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో నిరవధిక దీక్షలే మార్గమని వీఆర్‌ఏల రాష్ట్ర జేఏసీ నిర్ణయించింది.
హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన జేఏసీ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో వీఆర్‌ఏ జేఏసీ నేతలు ఎం.రాజయ్య, రమేశ్ బహుదూర్, దాదేమియా, డి.సాయన్న, ఎం.డి.రఫీ, వెంకటేశ్ యాదవ్, గోవింద్, వంగూరు రాములు, మాధవ్ నాయుడు, కంది శిరీషారెడ్డి, సునీత, ఎల్.నర్సింహారావు పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
ఈ సందర్భంగా వీఆర్‌ఏ జేఏసీ కన్వీనర్ సాయన్న మాట్లాడుతూ... న్యాయమైన తమ సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టింపులేకుండా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం నుంచి 17వ తేదీ వరకు నిరసన కార్యక్రమాల కార్యాచరణ రూపొందించినట్లు పేర్కొన్నారు. 17 నుంచి జరిగే నిరవధిక దీక్షల్లో ప్రతి జిల్లా నుంచి ఒకరు, జేఏసీ నుంచి నలుగురు, మొత్తం 37 మంది నేతలు పాల్గొనాలని, దీక్షల కంటే ముందు యాదాద్రి నుంచి ప్రగతిభవన్ వరకు పాదయాత్ర, భిక్షాటన, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment