అచ్యుతాపురం (యలమంచిలి): వారు ప్రేమించకున్నారు.. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నారు.. వేరే కాపురం పెట్టి కొన్నాళ్లు హాయిగా ఉన్నారు. అయితే ఇంతలో ఏమైందో ఏమో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. రమ్మని అడిగినా రానంది. కాల్‌చేస్తే ఫోన్ ఎత్తలేదు. నెలరోజులైనా రాలేదు. దీంతో అతను యాతనపడ్డాడు. చివరికి మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అచ్యుతాపురం మండలంలో గురువారం ఈ విషాదం చోటు చేసుకుంది. ఎస్‌ఐ మల్లేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. హరిపాలెం అందలాపల్లికి చెందిన కండవల్లి పవన్ కుమార్(25) నర్సీపట్నానికి చెందిన చంద్రకళతో నాలుగునెలల క్రితం ప్రేమలోపడ్డాడు. పెళ్లి చేయమని వారు తల్లిదండ్రులను ప్రాథేయపడ్డారు. ఇరువురి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో అనకాపల్లిలోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు.
పోలీసులను ఆశ్రయించి సహాయం తీసుకున్నారు. చోడపల్లిలో ఇల్లు అద్దెకు తీసుకుని కాపురంపెట్టారు. ఇద్దరూ అచ్యుతాపురంలో సెల్‌షాపులో పని చేసేవారు. నెలరోజులక్రితం తనను భర్త పవన్‌కుమార్ వేధిస్తున్నాడంటూ చంద్రకళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనితో కాపురం చేయలేనని ప్రతి విషయంలో తనను అనుమానించి ఆరా తీస్తున్నాడని ఎస్‌ఐకి చెప్పంది. ఇవన్నీ మామూలేనని ఇద్దరికీ సర్దిచెప్పి ఎస్‌ఐ పంపించేశారు. ఆ తరువాత ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. పవన్‌కుమార్ నిత్యం ఫోన్‌చేసి కాపురానికి రమ్మని కోరేవాడు. 15రోజుల క్రితం చంద్రకళ ఇక్కడి పోలీస్‌స్టేషన్‌కి వచ్చింది. తనకు పవన్‌తో కాపురంచేయడం ఇష్టంలేదని.. పదేపదే ఫోన్‌చేసి వేధిస్తున్నాడని ఎస్‌ఐకి తెలిపింది. ఫోన్ చేయకుండా పవన్‌కుమార్‌ని మందలించాలని కోరింది.
ఎస్‌ఐ పవన్‌కుమార్‌ని స్టేషన్‌కి పిలిపించి కౌన్సెలింగ్ చేశారు. పెద్దల సమక్షంలో సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పారు. భార్య ఇక కాపురానికి రానని చెప్పేయడంతో పవన్‌కుమార్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. బుధవారం అందలాపల్లిలో తన ఇంట్లో ఫ్యాన్‌కి చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పవన్ చెల్లెలు రాణి కిటికీలోనుంచి గమనించి పెద్దగా ఏడ్చుకుంటూ చుట్టుపక్కలవారికి చెప్పగా వారొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు ఎస్‌ఐ మల్లేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందకి దించారు.
భార్య కాపురానికి రాలేదని మనస్తాపంతో..
Published Fri, Sep 29 2017 1:38 PM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM
Advertisement