
విశాఖపట్నం, సాక్షి: సీజ్ ద నారాయణ కాలేజ్ నినాదంతో మధురవాడ పరదేశి పాలెం నారాయణ కాలేజ్ క్యాంపస్ మారుమోగుతోంది. యాజమాన్యం ఒత్తిడితో ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడగా.. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని విద్యార్థి సంఘాలు ఈ ఉదయం ఆందోళనకు దిగాయి.
ఒడిశా రాయ్‌పూర్‌కు చెందిన చంద్రవంశీ(17) అనే విద్యార్థి.. మధురవాడ పరదేశి పాలెం నారాయణ కాలేజీలో సెకండ్‌ఇయర్ చదువుతున్నాడు. ఏం జరిగిందో తెలియదుగానీ.. కాలేజీ మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే.. కాలేజీ యాజమాన్యం నుంచి ఒత్తిడి భరించలేకనే అతను చనిపోయినట్లు విద్యార్థి సంఘాలు ఇప్పుడు ధర్నాకు దిగాయి.

చంద్ర వంశీ ఆత్మహత్యపై కళాశాలలో నిన్న రాత్రి(బుధవారం) స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. దీంతో యాజమాన్యం విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడింది. గేట్లు వేసి, హాస్టల్ రూమ్‌లకు తాళాలు వేసి విద్యార్థులను లోపలే బంధించింది. ఆపై రంగ ప్రవేశం చేసిన పోలీసులు సైతం విద్యార్థులను బెదిరించినట్లు సమాచారం.
విషయం తెలిసిన ఎస్‌ఎఫ్‌ఐ, ఇతర విద్యార్థి సంఘాలు కాలేజ్ దగ్గరకు చేరుకుని ధర్నాచేపట్టాయి. చంద్ర వంశీ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని, కాలేజీని తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ అండదండలతో నారాయణ కళాశాల యాజమాన్యం రెచ్చిపోతుందని ఆరోపించాయవి.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment