ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్‌ఏ) న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని బీఎస్‌ఎన్‌ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి వీ వెంకయ్య డిమాండ్ చేశారు. గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షలు ఆదివారం మూడో రోజుకు చేరుకున్నాయి.
దీక్షా శిబిరాన్ని వెంకయ్య ప్రారంభించి ప్రసంగించారు. గత ఏడాది మార్చి 7న చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేటివ్‌తో జరిగిన చర్చల్లో వీఆర్‌ఏలకు నెలకు రూ 7500 వేతనం, రూ 500 డీఏ పెంచుతామని ప్రకటించినప్పటికీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదన్నారు. చీఫ్ కమిషనర్ ప్రభుత్వానికి సిఫార్సుచేసి పదినెలలవుతున్నా అతీగతీ లేకుండా పోయిందన్నారు. ఆర్థిక శాఖకు పంపించిన ఫైల్‌కు అనేక ఆటంకాలు కలిగిస్తూ నెలల తరబడి నాన్చుతున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యను పరిష్కరించకుండా రానున్న ఎన్నికల్లో ఎన్ని ఓట్లు, ఎన్ని సీట్లు వస్తాయోనన్న లెక్కల్లో తలమునకలైందన్నారు. వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించకుంటే వారికి మద్దతుగా ఆందోళ న కార్యక్రమాల్లో పాలుపంచుకుంటామని హెచ్చరించారు. బీఎస్‌ఎన్‌ఎల్ రిటైర్డు ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ కనీస వేతనం అమలు చేయాల్సిన ప్రభుత్వం తక్కువ వేతనాలతో వీఆర్‌ఏలతో వెట్టిచాకిరీ చేయించుకుంటోందని విమర్శించారు.
ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రీజనల్ కార్యదర్శి అయ్యపరెడ్డి మాట్లాడుతూ వీఆర్‌ఏలకు వేతనం పెంచుతున్నట్లు పత్రికల్లో ప్రకటించడం తప్పితే ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు. కాలయాపన చేయకుండా వెంటనే వీఆర్‌ఏల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఎస్‌కే బేగ్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జీ శ్రీనివాసులు, కార్యదర్శి సీహెచ్ మజుందార్, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం నాయకుడు పాలడుగు వివేకానందలు దీక్షా శిబిరాన్ని సందర్శించి ప్రసంగించారు.
వీఆర్‌ఏలకు న్యాయం చేయాలి
Published Mon, Jan 20 2014 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM
Advertisement