సాక్షి, హైదరాబాద్: గ్రామ పాలన వ్యవస్థకు ప్రస్తుతం పట్టుగొమ్మగా ఉన్న గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. రెవెన్యూ వ్యవస్థను సమూలంగా సంస్కరించాలని భావిస్తోన్న ప్రభుత్వం.. కిందిస్థాయిలో కీలకమైన వీఆర్వో వ్యవస్థను రద్దుచేసే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. ఒకవేళ కొనసాగించినా, వారి విధుల్లో భారీగా కత్తెర పెట్టాలనే నిర్ణయానికి వచ్చింది. వీఆర్వో వ్యవస్థను రద్దుచేస్తే వారి విధులను పంచాయతీరాజ్, వ్యవసాయశాఖలకు బదలాయించేలా ప్రాథమికంగా ప్రతిపాదనలు తయారుచేసింది. రెవెన్యూ, గ్రామ రికార్డుల నిర్వహణ బాధ్యతలను వ్యవసాయ విస్తరణాధికారులకు.. రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాలు, పింఛన్ల పంపిణీ తదితరాలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించాలని యోచిస్తోంది. తహసీల్దార్ల అధికారాల్లో కోత ఆలోచనకు తగ్గట్టుగానే క్షేత్రస్థాయిలో వీఆర్వోల అధికారాలనూ కుదించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
విధులు, బదలాయింపులపై కసరత్తు
రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసి, అధికారుల విధుల్లో మార్పుచేర్పులు చేయడమేగాక కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురానున్నట్లు సీఎం కేసీఆర్ గతంలోనే ప్రకటించారు. భూరికార్డుల ప్రక్షాళన పూర్తయినా భూవివాదాలు సమసిపోకపోవడం, పట్టాదార్ పాస్ పుస్తకాల జారీలో జాప్యం వంటి వాటికి కిందిస్థాయి అధికారుల చేతివాటమే కారణమని అంచనాకొచ్చిన సీఎం.. గ్రామస్థాయిలో రెవెన్యూ రికార్డుల సంరక్షకుడిగా పరిగణించే వీఆర్వోలతో ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుందని శాసనసభ సాక్షిగా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే వీఆర్వో వ్యవస్థ రద్దు కానుందనే ప్రచారానికి బలం చేకూరింది. దీనికి కొనసాగింపుగా.. వీఆర్వోలను కొనసాగిస్తే వారి వి«ధులెలా ఉండాలి? వేటిని ఇతర శాఖలకు బదలాయించాలి? కాలం చెల్లినవాటిలో వేటికి మంగళం పాడాలనే దానిపై రెవెన్యూశాఖ అంతర్గత ప్రతి పాదనలతో జాబ్‌చార్ట్ తయారుచేసింది. ఒకవేళ వీఆర్వో వ్యవస్థను రద్దుచేస్తే.. వారి విధులను పంచాయతీ కార్యదర్శులు, మండల వ్యవసాయ విçస్తరణాధికారులకు బదలాయించే అంశాన్నీ పరిశీలిస్తోంది. దీనిపై సీఎం తీసుకునే నిర్ణయం మేరకు నడుచుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
పక్కనపెడితే ఏంచేయాలి?
భూరికార్డుల ప్రక్షాళనలో వీఆర్వోల భాగస్వామ్యంతో అక్రమాలు జరిగాయని అంచనాకొచ్చిన ప్రభుత్వం.. భూ రికార్డుల నిర్వహణ నుంచి వారిని పూర్తిగా తప్పించాలని నిర్ణయించింది. భూ రికార్డుల్లో కాస్తు కాలమ్‌ను తొలగించినందున, క్షేత్రస్థాయిలో వీరి అవసరం కూడా లేదనే భావనకొచ్చింది. అయితే, వీఆర్వో వ్యవస్థను పూర్తిస్థాయిలో రద్దుచేస్తే ఉద్యోగ సంఘాల ప్రతికూలత వస్తుందని భావిస్తున్న సర్కార్.. వీరి సేవలను వేరే విధంగా వినియోగించుకోవాలని భావిస్తోంది. నైపుణ్యం ఉన్నవారిని రెవెన్యూలోనే కొనసాగించి.. ఇతరులను పూలింగ్‌లో పెట్టడం ద్వారా పంచాయతీరాజ్, వ్యవసాయశాఖల్లో విలీనంచేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవస్థను గనుక రద్దుచేస్తే క్వాలిఫైడ్ వీఆర్వోలను జూనియర్ అసిస్టెంట్లుగా నిర్వచిస్తూ ప్రస్తుత శాఖలోనే కొనసాగించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది.
ఏఈవోల పరిధిపై గందరగోళం
వీఆర్వో వ్యవస్థ రద్దు, అధికారాల కుదింపు/బదలాయింపు అంశంలో ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. తహసీల్దార్ల అధికారాలకు కత్తెరపెట్టాలని యోచిస్తోన్న సర్కారు.. గ్రామకంఠం లోని భూ వ్యవహారాలను ఎంపీడీవోలకు, మిగతా రెవెన్యూ వ్యవహారాలను తహసీల్దార్లకు అప్పగించాలని భావిస్తోంది. అదేవిధంగా ప్రస్తుతం వీఆర్వోలు నిర్వహిస్తున్న విధుల్లో అధికశాతం వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో)కు కట్టబెట్టాలని యోచిస్తోంది.
అయితే, మండలానికి సగటున ముగ్గురు ఉండే ఏఈవోలకు గ్రామ రెవెన్యూ రికార్డులు, గ్రామ ఖాతాల నిర్వహణ బాధ్యతలూ అప్పగించాలనే ప్రభుత్వ ప్రతిపాదన ఆచరణ యోగ్యం కాదనే అభిప్రాయాలున్నాయి. ఏకకాలంలో రెవెన్యూ, వ్యవసాయ విస్తరణ వ్యవహారాల నిర్వహణ సాధ్యపడదనే వాదన వినిపిస్తోంది. రెవెన్యూ వ్యవహారాలకు గుండెకాయలాంటి ఆర్‌వోఆర్ చట్టంపై పరిజ్ఞానం లేని ఏఈవోలకు రెవెన్యూ రికార్డులు, విలేజ్ అకౌంట్స్ అప్పగిస్తే మరింత గందరగోళం తలెత్తే అవకాశముందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం మండల వ్యవసాయాధికారుల పరిధిలో పనిచేసే ఏఈవోల కు భూ వ్యవహారాలను అప్పగిస్తే ఎవరి పర్యవేక్షణలో పనిచేస్తారనే దానిపైనా అనిశ్చితి ఉంది. ప్ర భుత్వ నిర్ణయం తర్వాతే దీనిపై స్పష్టత రానుంది.
వీఆర్వో వ్యవస్థ ఉంటే లేదా పంచాయతీ కార్యదర్శులకు బదలాయిస్తే వారికి ప్రతిపాదించిన విధులు
► కుల, ఆదాయ, స్థానిక సర్టిఫికెట్ల ధ్రువపత్రాల విచారణ
► తుపాను, వరదలు, అగ్ని ప్రమాదాలు, ప్రమాదాలు, విపత్తుల సమాచారాన్ని పైస్థాయి అధికారులకు చేరవేయడం
► విపత్తుల వల్ల వాటిల్లిన నష్టపరిహారాన్నిఅంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదించడం
► పురాతన భవనాల కూల్చివేతలు, స్మారక కట్టడాల పరిరక్షణ, శాసనాలకు సంబంధించిన సమాచారం, చట్టపరమైన సమన్లు, నోటీసులు అందించడంలో అధికారులకు సహాయకారిగా వ్యవహరించడం
► ఆయా సందర్భాల్లో ప్రభుత్వ ఆదేశాలను ప్రజలకు ‘టాంటాం’ద్వారా తెలియజేయడం
► రుణవసూళ్లలో సహాయపడడం, క్లెయిమ్ చేయని ఆస్తులకు పంచనామా నిర్వహించడం, ప్రభుత్వ స్వాధీనంలోని ఆస్తుల పరిరక్షణ
► ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల విధుల నిర్వహణ
రద్దయ్యే విధులు!
► భూమిశిస్తు, పన్నులు, రెవెన్యూ ఆదాయం, ఇతర బకాయిల వసూళ్లు
► రైల్వే ప్రమాదాలు, ఆకస్మాత్తుగా సంభవించే వరదలపై స్టేషన్ మాస్టర్‌కు సమాచారమివ్వడం, తమ పరిధిలో విమాన ప్రమాదం జరిగితే, ఆ సమాచారాన్ని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు చేరవేయడం, గ్రామస్థాయిలో విద్యుత్‌శాఖ ఆస్తుల చౌర్యంపై ఫిర్యాదులు, బదిలీ, సస్పెన్షన్, తొలగింపు, డిస్మిస్, పదవీ విరమణ సమాచారాన్ని సంబంధితులకు చేరవేయడం, పోలీసు శాఖ సేవల నుంచి మినహాయింపు.
ఇతర శాఖల్లోని అధికారులకు బదలాయింపులిలా..
► వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈఓ): గ్రామ రికార్డుల నిర్వహణ, సాగు లెక్కల సమాచారం, రెవెన్యూ రికార్డులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ
► సంబంధిత శాఖలకు..: ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ, ఆక్రమణలపై నిఘా, ప్రజల మౌలిక అవసరాలైన రోడ్లు, వీధులు, బహిరంగ ప్రదేశాల స్థలాలను కాపాడడం, ప్రభుత్వ ఆస్తుల దుర్వినియోగం, కబ్జాలు తదితర సమాచారాన్ని తహసీల్దార్లకు చేరవేయడం, దాన్ని అమలు చేయడం
► మండల స్థాయి అధికారి: గ్రామ సహాయకుల వేతన బిల్లుల తయారీ
► అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ): చెరువుల పరిరక్షణ
► పంచాయతీ కార్యదర్శి: గ్రామస్థాయి సమావేశాల నిర్వహణ, తన పరిధిలో పింఛన్ల మంజూరు– పంపిణీ, ప్రస్తుతం రెవెన్యూ వ్యవస్థ పర్యవేక్షణలో ఉన్న రేషన్‌కార్డుల జారీ, ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారాలు, జనన, మరణ రికార్డుల నిర్వహణ, కనీస వేతనచట్టం–1948 అమలు, గ్రామ చావిడీల నిర్వహణ బాధ్యతలు
Comments
Please login to add a commentAdd a comment