కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఫిబ్రవరి 2వ తేదీ జరగనున్న గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ రెవెన్యూ సహాయకుల పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఇందులో భాగంగా పరీక్షల నిర్వహణకు అవసరమైన చీఫ్ సూపరింటెండెంట్లు, ఫ్లైయింగ్ స్క్వాడ్స్, పరిశీలకుల వంటి సిబ్బంది నియామకాలను పూర్తి చేశారు. మూడు వందల కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పరీక్షలు రాసే కేంద్రానికి ప్రత్యేకంగా అదనపు చీఫ్ సూపరింటెండెంట్లు నియమించారు. ఇప్పటికే జిల్లా కేంద్రానికి ప్రశ్నపత్రాలు వచ్చాయి.
వీటిని పరీక్ష కేంద్రాలకు చేర్చడం, తిరిగి సమాధాన పత్రాలను జిల్లా కేంద్రానికి వచ్చేందుకు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పరీక్షల్లో అవకతవకలకు ఆస్కారం లేకుండా వీడియో చిత్రీకరణ చేపట్టనున్నారు. పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఐవైఆర్ కృష్ణారావు పలుమార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులకు సూచనలిచ్చారు. జిల్లాలో 27 వీఆర్‌ఓ పోస్టులకు గానూ 28,352 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వీఆర్‌ఏ పోస్టులు 128 ఉండగా 888 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎస్టీ కేటగిరి క్రింద 4, బీసీ-ఎ క్రింద 4, ఎక్స్‌సర్వీస్ మెన్ (మహిళ) కోటా క్రింద ఒకటి, అంధ మహిళలు 13 వెరసి 22 వీఆర్‌ఏ పోస్టులకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు.
పరీక్షల వివరాల ఏర్పాట్లు :
వచ్చేనెల 2వ తేదీ ఉదయం 10 నుంచి 12గంటల వరకు వీఆర్‌ఓ పరీక్షలు, అదేరోజు మధ్యాహ్నం 3నుంచి 5గంటల వరకు వీఆర్‌ఏ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం కడపలో 38 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి ప్రొద్దుటూరులో 16 కేంద్రాలను గుర్తించారు. ఇక రాజంపేటలో 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 64 పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, ఫర్నీచర్, విద్యుత్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద అవసరమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షా సమయం కంటే ఒక గంట ముందుగానే అభ్యర్థులు కేంద్రాల వద్దకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈనెల 19వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు.
అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా పంపిన దరఖాస్తుల్లో ఫోటోలు సరిగా కనిపించకుండా ఉండడం, లేదా సంతకాలు సక్రమంగా లేనివి 344 వాటిని అధికారులు ఇప్పటికే గుర్తించారు. అలాంటి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకొని పరీక్షా కేంద్రాల వద్దకు వెళితే అనుమతించరు. అలాంటి అభ్యర్థులు మూడు పాస్‌పోర్టు సైజు ఫోటోలపై గెజిటెడ్ అధికారుల సంతకం చేయించి ఇన్విజిలేటర్‌కు సమర్పిస్తే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఒకరి బదులు మరొకరు పరీక్షలను రాయకుండా ఉండేందుకోసం అభ్యర్థుల వేలిముద్రలను స్వీకరించనున్నారు.
రెడీ..
Published Thu, Jan 30 2014 2:11 AM | Last Updated on Sat, Sep 2 2017 3:09 AM
Advertisement
Advertisement