కడప కలెక్టరేట్,న్యూస్‌లైన్: లోక్‌సభ, రాష్ట్ర శాసన సభ సాధారణ ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ మార్చి మొదటి వారంలో వెలువడుతుందన్న సమాచారం కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అందడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 10వ తేదీ నుంచి చేపట్టాలని నిర్ణయించిన గ్రామ రెవెన్యూ సదస్సులను రద్దు చేసింది. రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఐవైఆర్ కృష్ణారావు గురువారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. ఎన్నికల షెడ్యూలు వెలువడక మునుపే ప్రిపరేటరీ వర్క్ నిర్వహించాల్సి ఉంటుంది. గతనెల 31వ తేదీ ఓటర్ల తుది జాబితాను అధికారికంగా ప్రకటించారు.
అయితే, ఇంకా జాబితాల ముద్రణ పూర్తి కాలేదు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ పర్సనల్స్ జాబితాలను తయారు చేయాల్సి ఉంటుంది. వీటిని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపి ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఎన్నికల్లో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు, ఫ్రీ అండ్ ఫెయిర్‌గా ఎన్నికలు జరగడానికి శాంతిభద్రతల కార్యచరణ ప్రణాళికను రూపొందించాల్సి ఉంటుంది. రెవెన్యూ, పోలీసులు సమన్వయంతో ఈ
ప్రణాళికలను రూపొందించాల్సి ఉంటుంది.
ఇలా అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాక రాష్ర్ట ముఖ్య ఎన్నికల అధికారులతో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సమావేశం నిర్వహిస్తారు. అనంతరం షెడ్యూల్ విడుదల చేయడం ఆనవాయితీగా వస్తుంటుంది. ప్రీ ఎలక్షన్ వర్క్ జరగకుంటే ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఆటంకాలు ఏర్పడతాయి. ఈ పరిస్థితుల్లో ఈనెల 25వ తేది వరకు రెవెన్యూ సదస్సులు అంటూ అధికారులు గ్రామాలకు వెళితే పనులన్నీ కుంటుపడిపోతాయి. గడువులోపు ఎన్నికలు నిర్వహించడం కష్టమవుతుంది. అందువల్ల ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉంటే రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టరాదంటూ రెవెన్యూ ఉద్యోగులు ఎన్జీఓలతో కలిసి సమ్మెలో పాల్గొంటున్నారు. వీఆర్‌ఏ నుంచి తహశీల్దార్ వరకు సమ్మెలో కొనసాగుతున్నారు. ఈపరిస్థితుల్లో ఎన్నికలకు సంబంధించిన ముందస్తు పనులు ఎలా పూర్తి చేయాలో అర్థంగాక రాష్ర్ట స్థాయి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈసీఐ ఆదేశాల మేరకు జిల్లానుంచి 45 మంది తహశీల్దార్లను బదిలీ చేయాలని నిర్ణయించారు. అయితే బదిలీ ఉత్తర్వులను తీసుకోరాదని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చింది. అదే జరిగితే ఎన్నికల ప్రక్రియకు ఆటంకాలు తప్పవని భావిస్తున్నారు. ఎలాగూ రెవెన్యూ సదస్సులు రద్దయ్యాయి గనుక ఈ వారంలో గ్రామసభలు నిర్వహించి కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు పంపిణీ చేయాలని, ఈ-పాస్ పుస్తకాలపై రైతులకు అవగాహన కల్పించాలని సీసీఎల్‌ఏ కృష్ణారావు అధికారులను ఆదేశించారు.
గ్రామ రెవెన్యూ సదస్సులు రద్దు
Published Fri, Feb 7 2014 2:56 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement