సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)ను గ్రేడింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండలాల వారీగా వారి వివరాలను పంపాలని కోరుతూ సీఎస్ సోమేశ్‌కుమార్ శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లకు సమాచారం పంపారు. ప్రత్యేక ఫార్మాట్‌లో ఆదివారం మధ్యాహ్నంకల్లా వివరాలు పంపాలని.. ఆయా మండలాల తహసీల్దార్లు తమ పరిధిలోని వీఆర్వోలకు గ్రేడింగ్ ఇవ్వాలని సూచించారు.
వీఆర్వో పనిచేస్తున్న మండలం, క్లస్టర్, ఉద్యోగి ఐడీ నంబర్, స్వగ్రామం, పాత జిల్లా, ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారు, ఎప్పటినుంచి పనిచేస్తున్నారు, చివరగా పనిచేసిన మూడు ప్రాంతాలు, పుట్టినతేదీ, వీఆర్వోగా రిక్రూటైన తేదీ, రిటైర్‌మెంట్ తేదీ, వీఆర్వోగా నియామకమైన పద్ధతి, కులం, రిజర్వేషన్, మొబైల్ నంబర్‌తోపాటు సదరు వీఆర్వోకు ఏ/బీ/సీ/డీ గ్రేడింగ్ ఇస్తూ వివరాలు పంపాలని ఆదేశించారు. సస్పెన్షన్‌లో ఉన్న, దీర్ఘకాలికంగా సమాచారం లేకుండా సెలవులో ఉన్న వారి వివరాలనూ పంపాలన్నారు.
15 ఇతర శాఖల్లో సర్దుబాటు!
రెవెన్యూ శాఖ పరిధిలోని వీఆర్వోలను 15 శాఖల్లో సర్దు బాటు చేసేందుకే వారి వివరాలను ప్రభుత్వం సేకరిస్తోందని అధికారవర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో 5,384 మంది వీఆర్వోలు పనిచేస్తుండగా.. అందులో 1,300 మంది వరకు నేరుగా రిక్రూటైనవారు ఉన్నారు. వారిని రెవెన్యూశాఖలో కొనసాగించి మిగతావారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తారా? అందరినీ ఇతర శాఖలకే పంపుతారా అన్న దానిపై చర్చ జరుగుతోంది.
ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేందుకు గాను వీఆర్వోలను ఆప్షన్లు అడుగుతారనే ప్రచారమున్నా.. అది సాధ్యం కాకపోవచ్చని, ప్రభుత్వమే అవసరాలకు అనుగుణంగా ఇతర శాఖలకు పంపేందుకు రంగం సిద్ధమైందని సమాచారం. కాగా.. వీఆర్వోల విషయంగా ప్రభుత్వం ఒక అడుగు వేయడంతో.. తమ పేస్కేల్, పదోన్నతుల సమస్యకు కూడా త్వరలో పరిష్కారం లభించవచ్చని గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏలు) ఆశిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment