సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీఎస్ రెరా) చైర్మన్‌గా ఎవరు నియమితులవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఎస్‌కే జోషి సహా పలువురు పదవిలో ఉన్న, పదవీ విరమణ పొందిన అధికారులు చైర్మన్ పదవి కోసం దరఖాస్తు చేసుకోవడం ఇందుకు కారణం.
ఈనెల 3తో దరఖాస్తు గడవు ముగియనుంది. ఇప్పటికే 50కిపైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఈ జాబితాలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ, రిటైర్డ్ ఐఏఎస్‌లు చిరంజీవులు, బుసాని వెంకటేశ్వర్లు, రిటైర్డ్ ఐఆర్‌ఎస్ అధికారులు కూడా బరిలో ఉన్నట్లు తెలిసింది. రిటైర్డ్ ఐఏఎస్, టీఎస్ రెరా మాజీ చైర్మన్‌రాజేశ్వర్ తివారీ ఈసారి దరఖాస్తు చేసుకోకపోవడం గమనార్హం.
ఎంపిక ఎలా ఉంటుందంటే..
టీఎస్ రెరాకు చైర్మన్, సభ్యుల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తెలంగాణ మున్సిపల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ సెక్రటరీ నేతృత్వం వహిస్తున్నారు. చైర్మన్, ఇద్దరు సభ్యుల నియామకానికి దరఖాస్తులు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 16న నోటిఫికేషన్ జారీ చేసింది.
తొలుత ఫిబ్రవరి 17ను గడువుగా విధించినా ఆ తర్వాత మార్చి 3 వరకూ పొడిగించింది. రెరా చట్టం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో అదనపు కార్యదర్శి స్థాయిలో పనిచేసిన వారు చైర్మన్ పదవికి అర్హులు. వచ్చిన దరఖాస్తుల్లోంచి రెండు పేర్లను ఈ కమిటీ ప్రభుత్వానికి సూచిస్తుంది. అందులోంచి ఒకర్ని ప్రభుత్వం చైర్మన్‌గా నియమిస్తుంది. అయితే ఇప్పటికే మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ లాబీయింగ్ చేశారని, రాష్ట్ర పెద్దలతో ఆయనకున్న సన్నిహిత సంబంధాల కారణంగా సోమేశ్ పేరు లాంఛనమే అని రియల్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చైర్మన్‌గా నియమితులైన వాళ్లు ఐదేళ్లపాటు లేదా 65 ఏళ్ల వయసు వరకు ఈ పదవిలో కొనసాగుతారు.
తెలంగాణ, పశ్చిమబెంగాల్‌లోనే..
స్థిరాస్తిరంగ నియంత్రణ, వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 2016లో రెరా చట్టాన్ని రూపొందించింది. అయితే రాష్ట్రంలో మాత్రం రెండేళ్లు ఆలస్యంగా 2018లో రెరాను అమల్లోకి తెచ్చారు. కానీ ఈ చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోగా పూర్తిస్థాయి రెరా అథారిటీని ఏర్పాటు చేయాల్సి ఉండగా రాష్ట్రంలో ఇప్పటివరకు అథారిటీ, అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయలేదు.
ఇలా అథారిటీని ఏర్పాటు చేయని రాష్ట్రాల్లో పశ్చిమబెంగాల్, తెలంగాణ ఉండటం గమనార్హం. 2017 జనవరి 1 తర్వాత యూడీఏ, డీటీసీపీ, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలు, టీఎస్‌ఐఐసీల నుంచి అనుమతి పొందిన అన్ని నిర్మాణ ప్రాజెక్ట్‌లు టీఎస్ రెరా పరిధిలోకి వస్తాయి. ఇప్పటివరకు రెరాలో 5 వేలకుపైగా ప్రాజెక్ట్‌లు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment