chairman post
-
టెక్నికల్ గా అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే
-
పవర్ కమిషన్ కొత్త చైర్మన్ పై కొనసాగుతున్న సస్పెన్స్
-
కౌన్ బనేగా ‘రెరా’ చైర్మన్?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీఎస్ రెరా) చైర్మన్‌గా ఎవరు నియమితులవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఎస్కే జోషి సహా పలువురు పదవిలో ఉన్న, పదవీ విరమణ పొందిన అధికారులు చైర్మన్ పదవి కోసం దరఖాస్తు చేసుకోవడం ఇందుకు కారణం. ఈనెల 3తో దరఖాస్తు గడవు ముగియనుంది. ఇప్పటికే 50కిపైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఈ జాబితాలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ, రిటైర్డ్ ఐఏఎస్‌లు చిరంజీవులు, బుసాని వెంకటేశ్వర్లు, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారులు కూడా బరిలో ఉన్నట్లు తెలిసింది. రిటైర్డ్ ఐఏఎస్, టీఎస్ రెరా మాజీ చైర్మన్రాజేశ్వర్ తివారీ ఈసారి దరఖాస్తు చేసుకోకపోవడం గమనార్హం. ఎంపిక ఎలా ఉంటుందంటే.. టీఎస్ రెరాకు చైర్మన్, సభ్యుల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తెలంగాణ మున్సిపల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ సెక్రటరీ నేతృత్వం వహిస్తున్నారు. చైర్మన్, ఇద్దరు సభ్యుల నియామకానికి దరఖాస్తులు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 16న నోటిఫికేషన్ జారీ చేసింది. తొలుత ఫిబ్రవరి 17ను గడువుగా విధించినా ఆ తర్వాత మార్చి 3 వరకూ పొడిగించింది. రెరా చట్టం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో అదనపు కార్యదర్శి స్థాయిలో పనిచేసిన వారు చైర్మన్ పదవికి అర్హులు. వచ్చిన దరఖాస్తుల్లోంచి రెండు పేర్లను ఈ కమిటీ ప్రభుత్వానికి సూచిస్తుంది. అందులోంచి ఒకర్ని ప్రభుత్వం చైర్మన్‌గా నియమిస్తుంది. అయితే ఇప్పటికే మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ లాబీయింగ్ చేశారని, రాష్ట్ర పెద్దలతో ఆయనకున్న సన్నిహిత సంబంధాల కారణంగా సోమేశ్ పేరు లాంఛనమే అని రియల్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చైర్మన్‌గా నియమితులైన వాళ్లు ఐదేళ్లపాటు లేదా 65 ఏళ్ల వయసు వరకు ఈ పదవిలో కొనసాగుతారు. తెలంగాణ, పశ్చిమబెంగాల్లోనే.. స్థిరాస్తిరంగ నియంత్రణ, వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 2016లో రెరా చట్టాన్ని రూపొందించింది. అయితే రాష్ట్రంలో మాత్రం రెండేళ్లు ఆలస్యంగా 2018లో రెరాను అమల్లోకి తెచ్చారు. కానీ ఈ చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోగా పూర్తిస్థాయి రెరా అథారిటీని ఏర్పాటు చేయాల్సి ఉండగా రాష్ట్రంలో ఇప్పటివరకు అథారిటీ, అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయలేదు. ఇలా అథారిటీని ఏర్పాటు చేయని రాష్ట్రాల్లో పశ్చిమబెంగాల్, తెలంగాణ ఉండటం గమనార్హం. 2017 జనవరి 1 తర్వాత యూడీఏ, డీటీసీపీ, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలు, టీఎస్‌ఐఐసీల నుంచి అనుమతి పొందిన అన్ని నిర్మాణ ప్రాజెక్ట్‌లు టీఎస్ రెరా పరిధిలోకి వస్తాయి. ఇప్పటివరకు రెరాలో 5 వేలకుపైగా ప్రాజెక్ట్‌లు నమోదయ్యాయి. -
ఎల్ఐసీలో కొత్తగా సీఈవో పోస్ట్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) పబ్లిక్ ఇష్యూకి సంబంధించి కేంద్రం చర్యలు వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా కంపెనీలో చైర్మన్ పోస్టును చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా మారుస్తూ సంబంధిత నిబంధనలకు మార్పులు చేసింది. దీని ప్రకారం ఇకపై ఎల్ఐసీకి సీఈవో, ఎండీ మాత్రమే ఉండనున్నారు. జూలై 7న ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుత విధానం ప్రకారం ఎల్ఐసీలో ఒక చైర్మన్, నలుగురు ఎండీల విధానం అమల్లో ఉంది. ఎల్ఐసీ లిస్టింగ్‌కు మార్గం సుగమం చేసే దిశగా కంపెనీ అధీకృత షేర్ క్యాపిటల్‌ను రూ. 25,000 కోట్లకు పెంచే ప్రతిపాదనకు కూడా కేంద్రం ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. -
ఐసీసీ చైర్మన్ బరిలో ఇద్దరే!
ముంబై: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ పదవి రేసు నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు గంగూలీ తప్పుకోవడంతో ఇప్పుడు ప్రధానంగా గ్రెగ్ బార్క్లే (న్యూజిలాండ్), ఇమ్రాన్ ఖాజా (సింగపూర్)ల మధ్య పోటీ ఏర్పడింది. డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో ఈ ఇద్దరి నుంచే ఎవరో ఒకరు చైర్మన్ అయ్యే అవకాశముంది. కాగా న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్క్లేకు బీసీసీఐ మద్దతు ఇస్తుంది. భారత బోర్డుతో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలు కూడా బార్క్లే అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నాయి. మరోవైపు పాక్ బోర్డు (పీసీబీ) సహా ఐసీసీ స్వతంత్ర మహిళా డైరెక్టర్ ఇంద్ర నూయి, పలు బోర్డులు ఇమ్రాన్ ఖాజాకు మద్దతు పలుకుతున్నాయి. బార్క్లేకు ఐసీసీ శాశ్వత సభ్యదేశాల మద్దతు ఉండటంతో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే దక్షిణాఫ్రికా బోర్డు సంక్షోభంలో ఉండటం తో వారి ఓటు పరిగణించేది లేనిది ఇంకా స్పష్టమవ్వలేదు. శశాంక్ మనోహర్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నప్పటి నుంచి ఇమ్రాన్ ఖాజానే తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఎందుకనో ఈసారి ఐసీసీ స్పష్టమైన వైఖరి కాకుండా గోప్యత పాటిస్తోంది. ఈ ఎన్నికల ప్రక్రియ సాధారణ మెజారిటీతో ముగిస్తారా? లేదంటే 3/4 మెజారిటీతో నిర్వహిస్తారో చెప్పనే లేదు. ఐసీసీ అధికారిక వెబ్సైట్లో స్ట్రక్చర్ పేజీని ఉన్నపళంగా ఎందుకు మార్చారో తెలియడం లేదు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిందని చెబుతున్నా... జాబితాను మాత్రం ప్రకటించడం లేదు. -
సొసైటీ ఛైర్మన్ పదవి కోసం కొట్టుకున్న టీఆర్ఎస్,కాంగ్రెస్
-
‘కుడా’పై.. కుత కుత
కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, సలహామండలి కమిటీల్లో చోటు దక్కపోవడంతో ఆశావహుల్లో అసహనం వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధులమైన తమ అనుయాయులకు కనీస ప్రాతినిధ్యం కల్పించలేదని పలువురు టీఆర్ఎస్ సీనియర్ నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. సాక్షిప్రతినిధి, వరంగల్ : కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) కమిటీలపై భిన్నాబిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘కుడా’ చైర్మన్ పదవిపై ఎప్పుడో సస్పెన్స్ వీడినా.. పాలకమండలి, సలహా మండలిలో తమ అనుచరులకు అవకాశం కల్పించకపోవడంపై కొందరు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల నుంచి అసహనం వ్యక్తం అవుతోంది. మూడు జిల్లాలు, 19 మండలాలు, 181 గ్రామాలకు ‘కుడా’ విస్తరించి ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి కీలకమైన కమిటీలలో కొందరు ఎమ్మెల్యేలు సూచించిన పేర్లనే పరిగణలోకి తీసుకున్నారన్న చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో వరంగల్ అర్బన్ జిల్లాలో ‘అసలు మేమున్నామా.. లేమా..’ అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్ ఎల్కతుర్తి మండల కేంద్రంలో జరిగిన సభలో తన మనసులోని మాట బయట పెట్టడం చర్చనీయాంశం అవుతోంది. లేఔట్లు, భూ లావాదేవీలు, భవన నిర్మాణాలపై ‘కుడా’ అనుమతులు తప్పనిసరి కాగా, నిధుల కేటాయింపు, కమిటీలలో మాత్రం హుస్నాబాద్, హుజూరాబాద్ నియోజకవర్గాలకు ప్రాధాన్యత విషయంలో మిగతా ప్రజ్రాప్రతినిధులు, సీనియర్ నేతల నుంచి అసంతృప్తి వ్యకమవుతోంది. 15 మంది సలహా మండలి కమిటీలో వరంగల్ ట్రైసిటీకి సంబంధించిన ఉద్యమకారులు, సీనియర్లకు అవకాశం దక్కలేదన్న నిరాశ కొందరిలో వ్యక్తమవుతోంది. హుజూరాబాద్, హుస్నాబాద్‌లకు దక్కని చోటు.. పది రోజుల క్రితం ప్రకటించిన ‘కుడా’ కమిటీలో పాలకమండలి చైర్మన్ పదవి మరోసారి మర్రి యాదవరెడ్డికే దక్కింది. పాలకవర్గం, సలహా మండలిని సైతం ‘కుడా’ పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేలు, మంత్రి, ఇతర సీనియర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని వేస్తారు. ఈసారి కూడా అదే జరిగిందని భావించారు. అయితే కమిటీల విషయంలో నెమ్మదిగా అసంతృప్తిరాగం వినిపిస్తోంది. పాలకవర్గంలో పది మందికి అవకాశం కల్పించారు. వాస్తవానికి ‘కుడా’ పరిధిలో వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ జిల్లాల్లోని 19 మండలాలు, ఏడు నియోజకవర్గాలు, 181 గ్రామాలు వస్తాయి. ఈ నేపథ్యంలో వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాలతో పాటు హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాలను పరిగణలోకి తీసుకోవాలని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అంటున్నారు. అయితే మర్రి యాదవరెడ్డి చైర్మన్‌గా, మునిసిపల్ కమిషనర్ వైస్ చైర్మన్‌గా, వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, నన్నపనేని నరేందర్, అరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, డాక్టర్ టి.రాజయ్య, మరో ముగ్గురు అధికారులను సభ్యులుగా చేర్చారు. హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్, హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలకు ప్రాతినిధ్యం దక్కలేదు. ఈ రెండు నియోజకవర్గాల నుంచి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, వొడితెల సతీష్‌కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పాలకమండలిలో ఈ ఇద్దరికీ ఎక్స్అఫీషియో సభ్యులుగా చేర్చకపోగా.. వారి అనుచరులకు కమిటీలో అవకాశం ఇవ్వకపోవడంపై చర్చ జరుగుతోంది. చర్చనీయాంశంగా మారిన కమిటీలు.. ‘కుడా’ సలహామండలిలో 15 మందిని సభ్యులుగా నియమించారు. ఈ సభ్యుల ప్రతిపాదనల్లోనూ ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ కోటాలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలు సూచించిన కార్యకర్తలకే అవకాశం కల్పించారు. అందులో మాడిశెట్టి శివశంకర్, దొంతి రవీందర్‌రెడి, బొర్ర ఐలయ్య, నక్క లింగయ్య యాదవ్, మోడెం ప్రవీన్, ఎలుగం శ్రీనివాస్, గులాం సర్వర్(మున్నా), ఊకంటి వనంరెడ్డి, చిర్ర రాజుగౌడ్, నన్నబోయిన రమేష్‌యాదవ్, భూక్యా శంకర్‌నాయక్, ఆకుల కుమార్, బిల్ల యాదగిరి, ఎ.రవీందర్, వీరగొని రాజ్‌కుమార్ ఉన్నారు. ఇందులో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్, ఎమ్మెల్యే అరూరి రమేష్ నలుగురి చొప్పున, ఎమ్మెల్యేలు నన్నపనేని నరెందర్ ముగ్గురు, చల్లా ధర్మారెడ్డి, డాక్టర్ టి.రాజయ్య తలా ఇద్దరి పేర్లను సిఫారసు చేసినట్లు చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో వరంగల్ అర్బన్ జిల్లాలో ‘అసలు మేమున్నామా.. లేమా.. పూర్వ కరీంనగర్ జిల్లా నుంచి విలీనమైన భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాలను అధికారులు విస్మరిస్తున్నారు.. మంత్రి, ఎమ్మెల్యే ఉన్నారన్న విషయం మరచిపోతున్నారు’ అంటూ హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్ ఎల్కతుర్తి సభలో మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. కొందరు ప్రజాప్రతినిధులు, సీనియర్లలోనూ ఈ చర్చ ఇప్పటికే జరుగుతోంది. -
సీజీ పవర్ నుంచి థాపర్ అవుట్
న్యూఢిల్లీ: ఆర్థిక అవకతవకలు వెలుగుచూసిన నేపథ్యంలో సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ సంస్థ చైర్మన్ పదవి నుంచి గౌతమ్ థాపర్‌ను తప్పిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. థాపర్ తొలగింపు తీర్మానానికి మెజారిటీ బోర్డు సభ్యులు ఆమోదం తెలిపినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు సీజీ పవర్ తెలిపింది. తీర్మానాన్ని థాపర్ వ్యతిరేకించగా, సీఈవో.. ఎండీ కేఎన్ నీలకంఠ్ ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. కొత్త చైర్మన్‌ను ఎంపిక చేసేందుకు కంపెనీ బోర్డు శుక్రవారం సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. సీజీ పవర్ నిర్వహణ బాధ్యతలను పూర్తిగా కొత్త మేనేజ్మెంట్ టీమ్‌కు అప్పగించాలని ఇన్వెస్టర్లు, రుణదాతలు డిమాండ్ చేస్తున్నట్లు వివరించాయి. వేల కోట్ల మేర తీసుకున్న రుణాలు, అనుబంధ సంస్థలకు ఇచ్చిన రుణాల మొత్తాలను తగ్గించి చూపారంటూ సీజీ పవర్ ఖాతాల దర్యాప్తులో వెల్లడైన సంగతి తెలిసిందే. రూ. 6,148 కోట్ల మేర అవకతవకల నేపథ్యంలోనే సంపూర్ణ ప్రక్షాళనలో భాగంగా తొలి చర్యగా థాపర్‌పై వేటుపడిందని పేర్కొన్నాయి. విచారణ జరుగుతున్న సందర్భంగా నీలకంఠ్‌ను సంస్థ సెలవుపై పక్కన పెట్టింది. ఆయన్ను ఇప్పటికీ కీలక బాధ్యతల్లో కొనసాగిస్తుండటంపై ఇన్వెస్టర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మోసం జరగలేదు: థాపర్ ఆగస్టు 20న ఆర్థిక అవకతవకలు బైటపడినప్పట్నుంచీ ఇప్పటిదాకా మౌనం వహించిన థాపర్ తాజాగా పెదవి విప్పారు. ‘ఈ వ్యవహారంలో ప్రమోటరు గానీ ప్రమోటర్లకు చెందిన ఏ సంస్థ గానీ అనుచితమైన లబ్ధి పొందలేదు. ఆగస్టు 19 నాటి బోర్డు సమావేశం తర్వాత వచ్చిన వార్తలన్నీ బాధపెట్టేవిగా ఉన్నాయి. వీటిలో ఎలాంటి వాస్తవాలు లేవనే చెప్పాలి. వాటాదారులందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చెబుతున్నాను. బ్యాంకు లు ఇచ్చిన రుణాలు గానీ, సీజీ నిధులు కానీ దుర్వినియోగం చేయ డం జరగలేదు. బోర్డు అనుమతులతోనే నిధులను వినియోగించడం జరిగింది. ఇంటర్–కార్పొరేట్ లావాదేవీలన్నింటికీ కూడా బోర్డు పూర్తి ఆమోదం ఉంది‘ అని ఒక ప్రకటనలో తెలిపారు. 2015 నాటి నుంచి రూ. 4000 కోట్ల పైగా మొత్తాన్ని రుణదాతలకు తిరిగి చెల్లించిన ప్రమోటర్లకు.. ‘మోసానికి పాల్పడాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు. కంపెనీ చైర్మన్ హోదా నుంచి తొలగించినప్పటికీ థాపర్ బోర్డులో కొనసాగనున్నారు. స్వల్ప వాటానే ఉన్నప్పటికీ బోర్డు నుంచి కూడా తప్పించాలంటే షేర్‌హోల్డర్ల అనుమతి తీసుకోవాల్సి ఉండటమే ఇందుకు కారణం. -
కారులో ‘నామినేటెడ్’ జోరు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్లో పదవుల పందేరానికి రంగం సిద్ధమైంది. ఎన్నికల నియమావళి ముగిసిన వెంటనే వరుసగా రాష్ట్రస్థాయి పదవులను భర్తీ చేయనున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల నియమావళి అమలు గడువు ముగిసిన వెంటనే ప్రభుత్వంలోని అన్ని రకాల నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా పలువురు కార్పొరేషన్ చైర్మన్లు రాజీనామా చేశారు. పార్టీ మారడంతో కొందరు ఇదే నిర్ణయం తీసుకున్నారు. మరికొందరి పదవీకాలం గడువు త్వరలో ముగియనుంది. అసెంబ్లీ, లోక్‌సభ, ఎమ్మెల్సీ, జెడ్పీ ఎన్నికల్లో అవకాశం రాని జాబితా ఆధారంగా నామినేటెడ్ పదవుల భర్తీలో పార్టీ నేతలకు అవకాశం కల్పించాలని కేసీఆర్ భావిస్తున్నారు. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 54 చైర్మన్ పదవులను భర్తీ చేసింది. ప్రస్తుతం ఖాళీలు... అసెంబ్లీ ఎన్నికల ముందు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరడంతో రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవికి టి.నర్సారెడ్డి, పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవికి ఎస్.బేగ్ రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి వీలుగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఎస్.నిరంజన్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, గిరిజన సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, మూసీ పరివాహక సంస్థ చైర్మన్ ప్రేంసింగ్ రాథోడ్, సెట్విన్ చైర్మన్ మీర్ ఇనాయత్‌అలీ బాక్రి తమ పదవులకు రాజీనామా చేశారు. ఇటీవల శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైన శేరి సుభాశ్‌రెడ్డి భూగర్భ గనుల సంస్థ చైర్మన్ పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ 12 పదవులను వెంటనే భర్తీ చేసే అవకాశం ఉంది. నెలాఖరులో మరికొన్ని... 2018లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పౌరసరఫరాల చైర్మన్‌గా మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి నియమితులయ్యారు. అధికార భాషా సంఘం చైర్మన్‌గా దేవులపల్లి ప్రభాకర్‌రావు, అత్యంత వెనుకబడిన కులాల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా తాడూరి శ్రీనివాస్, వైద్య సేవలు, వసతుల కల్పన సంస్థ చైర్మ న్గా పర్యాద కృష్ణమూర్తి పదవులను ఏడాదిపాటు కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ కె.వాసుదేవరెడ్డి, మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ గుండు సుధారాణి, గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ ఎం.భూంరెడ్డి, టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ సి.హెచ్.రాకేశ్‌కుమార్, గిరిజన సహకార సంస్థ చైర్మన్ డి.మోహన్‌గాంధీ నాయక్, ఫిల్మ్, టెలివిజన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ పుస్కూరు రామ్మోహన్రావు పదవీకాలం మే 27తో ముగియనుంది. అక్టోబర్‌లో... గొర్రెలు, మేకల పెంపకందారుల సమాఖ్య చైర్మన్ కె.రాజయ్యయాదవ్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు, నీటి పారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి పదవీకాలం 2019, అక్టోబర్‌లో ముగుస్తుంది. గత ప్రభుత్వంలో వీరికి మాత్రమే మూడేళ్ల పదవీకాలం చొప్పున ఇచ్చారు. మిగిలిన చైర్మన్లకు గరిష్టంగా రెండేళ్ల చొప్పున ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన చైర్మన్ల పదవీకాలం సైతం దశలవారీగా పూర్తి కానుంది. -
ఏపీ శాసన మండలి చైర్మన్‌గా ఎంఏ షరీఫ్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్‌గా ఎంఏ షరీఫ్ ఎన్నికయ్యారు. ఈ పదవి కోసం నిర్వహించిన ఎన్నికల్లో షరీఫ్ తరఫున ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ మేరకు ప్రకటన వెలువడగానే ఆయన గురువారం మండలి చైర్మన్ పదవిని చేపట్టారు. మొన్నటివరకు శాసనమండలి చైర్మన్‌గా ఉన్న ఎన్ఎండీ ఫరూక్‌ను ఇటీవల చంద్రబాబు కేబినెట్లోకి తీసుకోవడంతో మండలి చైర్మన్ పదవికి ఎన్నిక అనివార్యమైంది. -
‘వెంకటేశ్వరా’.. ఎక్కడున్నావయ్యా!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: లక్షలాది మంది పాడి రైతులు.. వందల మంది ఉద్యోగులతో ఒంగోలు డెయిరీ ఆటలాడుకుంటోంది. పాలకులకు వీరి ఆకలి కేకలు వినపడటంలేదు. వ్యాపారి అయిన శిద్దా వెంకటేశ్వరరావు డెయిరీ చైర్మన్ కావడంతో మంచి జరుగుతుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు అసలు కథ బట్టబయలైంది. పాడి రైతులు, డెయిరీ ఉద్యోగుల బకాయిల కింద తన సొంత డబ్బులు పైసా కూడా ఇవ్వవని శిద్దా వెంకటేశ్వరరావు చేతులెత్తేశారు. బ్యాంకు రుణం కోసం డెయిరీ ఆస్తులు తాకట్టు పెడతానని.. రుణం వస్తేనే బకాయిలు చెల్లిస్తానని తేల్చి చెప్పారు. ఇక చంద్రబాబు చెబితేనే డెయిరీకి వస్తానన్నారు. ఆర్భాట ప్రకటనలు ఎక్కడ? నెల రోజుల క్రితం ఒంగోలు డెయిరీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన శిద్దా వెంకటేశ్వరరావు డెయిరీలో ఆర్భాటంగా విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఒంగోలు డెయిరీని ఉద్ధరించడానికే తానొచ్చినట్లు ప్రకటించుకున్నారు. రూ. 20 కోట్లు తన సొంత డబ్బులు పాడి రైతులు, డెయిరీ ఉద్యోగులకు చెల్లిస్తానన్నారు. బ్యాంకు రుణం వచ్చిన తర్వాతనే రూ. 1 ధర్మవడ్డీతో తన అప్పు తిరిగి తీసుకుంటానని స్పష్టం చేశారు. అయితే పట్టుమని నెల కాక ముందే మాట మార్చారు. తన సొంత డబ్బులు రూపాయి కూడా ఇవ్వనని స్పష్టం చేశారు. దీంతో పాడి రైతులు, ఉద్యోగులు మరోమారు రోడ్డెక్కారు. రూ. 13 కోట్ల బకాయిలు ఒంగోలు డెయిరీ పరిధిలో పాడి రైతులకు రూ. 13 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఉద్యోగుల 5 నెలల జీతాలు రూ. 2.5 కోట్లు, పీఆర్సీ అరియన్స్, గ్రాడ్యూటీ, ఎల్ఐసీ కలిపితే మొత్తం రూ. 8 కోట్లు ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. కరెంట్ బిల్లులు రూ.2 కోట్లు, ట్రాన్స్‌పోర్టేషన్ కోసం రూ. 2 కోట్లు చెల్లించాలి. కరెంట్ బిల్లులు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో వారం క్రితం విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కొత్త డెయిరీ చైర్మన్ పైసా ఇవ్వక ఇంటికే పరిమితం కావడంతో ఇటు ఉద్యోగులు, రైతులు కలిసి మంత్రి శిద్దా రాఘవరావుతో పాటు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎమ్మెల్సీ కరణం బలరాం తదితరులను కలిశారు. డెయిరీ ఆధ్వాన పరిస్థితిపై ఏకరువు పెట్టారు. కొత్త చైర్మన్ వచ్చినా ఒరిగిందేమీ లేదంటూ ఆవేదన చెందారు. దీంతో మంత్రి శిద్దా జోక్యం చేసుకొని విద్యుత్ అధికారులతో మాట్లాడారు. వారం లోపు డబ్బు చెల్లించాలన్న కండిషన్‌తో విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. డెయిరీ సమస్యలు నాలుగు రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే సమస్య పరిష్కారం కాలేదు. ఏ నిమిషంలోనైనా తిరిగి విద్యుత్‌ను నిలిపివేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇంత జరుగుతున్న కొత్త చైర్మన్ శిద్దా వెంకటేశ్వరరావు ఏ మాత్రం స్పందించటం లేదు. రైతులు, ఉద్యోగులు కలిసే ప్రయత్నం చేసినా ఆయన అందుబాటులోకి రావడం లేదు. డెయిరీ ఎండీ ఫోన్ చేసినా చైర్మన్ స్పందించలేదని తెలిసింది. దీంతో ఉద్యోగులు, రైతులు కలిసి సోమవారం డెయిరీ వద్ద ఒంగోలు–కర్నూలు ప్రధాన రహదారిపై గంట పాటు రాస్తారోకో చేశారు. భవిష్యత్ కార్యాచరణ కోసం వీరు మంగళవారం సమావేశం కానున్నారు. పార్టీ పరువు పోయిందట డెయిరీ వ్యవహారం ముఖ్యమంత్రి వద్దకు చేరడంతో పాత, కొత్త చైర్మన్లకు చీవాట్లు పెట్టారు. జిల్లా అధికార పార్టీ పరువు తీశారని సీఎం మండిపడ్డారు. శిద్దా కుటుంబంలో చిచ్చుపెట్టే ప్రయత్నంపై మరింత మండిపడ్డట్లు తెలుస్తోంది. దీంతో బెంబేలెత్తిన కొత్త చైర్మన్ శిద్దా చేతులెత్తేశాడు. ఆయన చైర్మన్ పదవి మున్నాళ్ల ముచ్చటగానే మారింది. కొత్త చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తూ డెయిరీని ఆదుకుంటానని ప్రకటించిన శిద్దా ఇప్పుడు మాట తప్పడంపై పాడి రైతులు, ఉద్యోగులతో పాటు అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రితో పోటీ? డెయిరీ కొత్త చైర్మన్ శిద్దా వెంకటేశ్వరరావు, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావుకు సమీప బంధువు. ఆర్థికంగా బలవంతుడు. శిద్దా రాఘవరావుకు మంత్రి పదవి వల్లే హంగు, ఆర్భాటం వచ్చిందని చైర్మన్ కుటుంబం భావిస్తోంది. దీంతో శిద్దాకు మంత్రికి పోటీగా రాజకీయంగా ఏదో ఒక పదవి సంపాదించాలన్న ఆరాటం వెంకటేశ్వరరావుకు ఉంది. ఆయన బీజేపీలోనూ పని చేశారు. దీంతో మంత్రి, చైర్మన్ కుటుంబాల మధ్య మనస్పర్థలు ఉన్నాయన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఒంగోలు డెయిరీ రూ. 80 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. డెయిరీ కంపెనీ యాక్టు పరిధిలో ఉండటం, రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం సహకరించకపోవడంతో పాత చైర్మన్ చల్లా శ్రీనివాస్ చైర్మన్ పదవి గుదిబండగా మారింది. దీని నుంచి బయటపడే ప్రయత్నంలో ఆయనకు పదవి కోసం ఆరాటపడే శిద్దా వెంకటేశ్వరరావు కనిపించాడు. దీంతో పాత చైర్మన్ చల్లా రాత్రికి రాత్రే తాను చైర్మన్‌గిరి నుంచి తప్పించుకొని శిద్దాను చైర్మన్ చేశారు. ఎట్టకేలకు పదవి పొందిన శిద్దా ఆర్భాటంగా విలేకర్ల సమావేశం పెట్టి డెయిరీని ఆదుకుంటాడనుకున్నారు. అంతేకాదు జిల్లావ్యాప్తంగా కొత్త చైర్మన్ అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వేసుకున్నారు. అధికార పార్టీ కనుసన్నల్లో ఉన్నా.. ఒంగోలు డెయిరీ చైర్మన్ మార్క్ విషయం మంత్రి శిద్దాతో పాటు మిగిలిన నేతలకు తెలియకపోవడం గమనార్హం. అందరికీ తెలిస్తే శిద్దా వెంకటేశ్వరరావు డెయిరీ చైర్మన్‌గా అంగీకరించరని భావించి పాత చైర్మన్ మొత్తం వ్యవహారాన్ని బయటకు పొక్కనియకుండా చేశారన్న ప్రచారం ఉంది. -
వారికి నో చాన్స్ ...
వారు పేరుకు మాత్రమే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు. వారి మాట ఎక్కడా సాగదు. మంత్రివర్గ విస్తరణలో కానీ, కీలక పదవులు పొందడంలో కానీ.. వారికి నో చాన్స్. కనీసం వారు చేసిన సూచనలను కూడా ప్రభుత్వం పట్టించుకోదు. దీంతో విజయవాడ సిటీ ఎమ్మెల్యేల్లో అంతర్మథనం ఆరంభమైంది. అధికార పార్టీలో ఉన్నా ఏం సాధించుకోలేకపోతున్నామన్న నైరాశ్యం చేరిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సాక్షి, విజయవాడ: ఓ అక్రమ నిర్మాణానికి సహకరించాలని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామోహ్మన్ చేసిన సిఫారసును మేయర్ కోనేరు శ్రీధర్ పట్టించుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య వివాదం ఏర్పడింది. కార్పొరేషన్లో మేయర్ ఏకపక్షంగా ఉంటూ తమ సిఫారసులను పట్టించుకోకపోవడంతో గుర్రుతో ఉన్న సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అంతర్గతంగా గద్దె రామ్మోహన్‌కు మద్దతుగా నిలిచారు. పలువురు కార్పొరేటర్లు మేయర్ శ్రీధర్ అవినీతిపై రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యేలంతా మేయర్‌ను మార్చాలని సూచించినా రాష్ట్ర ప్రభుత్వంలో కీలకపాత్ర వహించే చినబాబు కోనేరు శ్రీధర్‌కు అండగా నిలవడంతో మార్పు ప్రతిపాదన పక్కకు పోయింది. మంత్రి పదవి భంగపడ్డ బొండా ఉమా గతంలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో రాజధాని నుంచి తనకు అవకాశం లభిస్తుందని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆశపడ్డారు. అయితే, ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోలేదు. కాపుల గొంతు కోస్తున్నారంటూ బొండా ఉమా చేసిన వ్యాఖ్యలపై సీఎం సీరియస్ అయ్యారు. రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంతో రవాణాశాఖ కార్యాలయం వద్ద వివాదం జరిగినప్పుడు కూడా ఉమాపై చంద్రబాబు ఆగ్రహించారు. ఆ తరువాత ఎంపీ కేశినేని శ్రీనివాస్‌తో కలిసి బొండా ఉమా సదరు అధికారికి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. స్వాంత్రంత్య్ర సమరయోధుడికి చెందిన స్థలం కబ్జాలోనూ ఎమ్మెల్యే బొండా ఉమా పాత్ర ఉండటంతో సీఎం సీరియస్ అయ్యారు. వక్ఫ్‌బోర్డు చైర్మన్ పదవి దక్కని జలీల్‌ఖాన్ మైనారిటీ కోటాలో మంత్రి పదవి వస్తుందని ఆశపడిన ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ తన నైతిక విలువలను పక్కనపెట్టి పచ్చ కండువా కప్పుకున్నారు. అయితే, మంత్రివర్గ విస్తరణలో ఆయనకు సీఎం మొండిచేయి చూపించారు. కనీసం రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవితోనైనా సరిపెట్టుకునేందుకు జలీల్ సిద్ధమయ్యారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కోటా నుంచి ఒకరిని వక్ఫ్ బోర్డు సభ్యుడిగా ఎన్నుకుంటారు. ఆ సభ్యుడితో పాటు ఇంకా ఎనిమిది మంది సభ్యులుగా ఉంటారు. వీరిలో ఒకరిని మిగిలిన సభ్యులు చైర్మన్‌గా ఎన్నికుంటారు. అయితే, ఎమ్మెల్సీ గురించి పట్టించుకోకుండా కేవలం ఎమ్మెల్యేలకు జలీల్ఖాన్ను మాత్రమే సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ముస్తఫా కోర్టులో సవాల్ చేశారు. ఈ కేసు ప్రస్తుతానికి హైకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో జలీల్‌ఖాన్‌కు కనీసం చైర్మన్ పదవి కూడా దక్కలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మేయర్ వెనుక మాస్టారు త న భార్య డైరెక్టర్‌గా ఉన్న కేఎంకే ఈవెంట్స్ సంస్థకు మేయర్ పుష్కరాల వర్క్స్ కట్టబెట్టారని, మిగిలిన సంస్థల కంటే ఆ సంస్థకుæ బిల్లులు ముందుగానే మంజూరు చేయించి అవినీతికి పాల్పడ్డారని కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. అయితే, అదే కేఎంకే సంస్థలోని కీలక డైరెక్టర్లతో చినబాబుకు పరిచయాలెక్కువే. కేఎంకే సంస్థ డైరెక్టర్ల నుంచి తమ వాటా పర్సంటేజ్‌లు రావడం వల్లే మేయర్ మార్పునకు ఎమ్మెల్యేలు పట్టుబట్టినా చినబాబు పదవి నుంచి తప్పించలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మేయర్ కోనేరు శ్రీధర్‌నే కొనసాగిస్తూనే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌పై పెత్తనం చేయాలని చినబాబు భావిస్తున్నారు. రాబోయే ఏడాదిలో వీఎంసీలో జరిగే అభివృద్ధి పనుల్లో తమకు రావాల్సిన వాటాలను మేయర్ ద్వారానే తీసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నారని కార్పొరేటర్లు చర్చించుకుంటున్నారు. చినబాబే తన వెనుక ఉండటం వల్ల మేయర్ ఎమ్మెల్యేలను, కార్పొరేటర్లను లెక్క చేయట్లేదు. -
సాగుతున్న ఆధిపత్య పోరు
మాచర్ల మున్సిపాల్టీలో తెలుగు తమ్ముళ్ల ఘర్షణ మాచర్ల : ఆధిపత్య పోరులో మున్సిపల్ చైర్మన్ గోపవరపు శ్రీదేవి భర్త మల్లికార్జునరావు మృతి చెంది వారం రోజులు కాకముందే మరోసారి పురపాలక సంఘంలో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. ఎవరు బలైనా మాకెందుకు మా తీరు మాదే అంటూ ఆధిపత్యం కోసం తన్నులాడుకుంటూనే ఉన్నారు. తమకు చెందిన వార్డులో ఇతర ప్రాంతాలకు చెందిన కౌన్సిలర్లు పెత్తనం చేస్తున్నారని ఆరోపించుకుంటూ 7వ వార్డుకు చెందిన మార్కెట్ యార్డు చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు అనుచరుడు వి.కోటేశ్వరరావు.. 9వ వార్డుకు చెందిన అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ అంకాళమ్మ భర్త చెన్నయ్య తాజాగా శుక్రవారం పురపాలక సంఘంలో ఘర్షణ పడ్డారు. నువ్వెంతంటే.. నువ్వెంతంటూ... అంతు చూస్తాన ని ఒకరు... బయటకు రా (రా) ... అని మరొకరు మార్కెట్ చైర్మన్ మల్లికార్జునరావు, మున్సిపల్ ఉద్యోగులు, పలు వార్డుల నుంచి నీటి కోసం వచ్చిన జనం ముందే ఘర్షణ పడ్డారు. మున్సిపల్ పాలక వర్గం రెండేళ్ల కిందట అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆధిపత్య రాజకీయాలతో అభివృద్ధిని విస్మరించారు. ప్రజల సమస్యలను పరిష్కరించలేదు. ఇంత జరుగుతున్నా అధికార పార్టీ నాయకులెవరూ పట్టించుకోవడం లేదు. స్వార్థం, ఆధిపత్యం, రాజకీయాలే వేదికగా మున్సిపాలిటీ తయారైంది. అధికారులకు సైతం అయోమయంలో పడ్డారు. ఆధిపత్యంలో బలైపోయిన మున్సిపల్ చైర్మన్ కుటుంబాన్ని చూసినా మార్పురాని అధికార పార్టీ నాయకుల తీరుపైనే పట్టణంలో చర్చ సాగుతోంది. -
రాజుగారింటికి వెళ్లిన మంత్రి..!
► హిరమండలం ఏఎంసీ పోస్టుపై రగడ ► ఇన్చార్జిని కాదని మంత్రి ఒత్తిళ్లు ► సీఎం వద్ద ఇతరుల గోడు ► శత్రుచర్లకే సీఎం మద్దతు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పొరుగూళ్లలో జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు చేస్తున్న పంచాయితీలకు చెక్‌పడింది. తనకు అనుకూలురుకే పదవులు కట్టబెట్టాలని పట్టుబట్టడం... ఇతర ప్రజాప్రతినిధులను తూలనాలడం తదితర అంశాలు సీఎం దృషికి వెళ్లాయి. అన్ని విషయాల్లోనూ తలదూర్చవద్దంటూ సీఎం నేరుగా మంత్రికి మందలించినట్టు సమాచారం. హిరమండలం వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ పోస్టు పదవిపై నేతల మధ్యనలుగుతున్న విభేదాలకు సీఎం ముగింపు పలికినట్టు తెలిసింది. ఇదీ కథ కొత్తూరు, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట మండలాలకు సంబంధించి హిరమండలంలో మార్కెట్ చైర్మన్ పోస్టు ఖాళీగా ఉంది. ఈ పోస్టు భర్తీకి పాతపట్నం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కె.మన్మథరావు అనే వ్యక్తికి మద్దతిస్తూ వస్తున్నారు. ఇదే విషయాన్ని బలపరుస్తూ హైదరాబాద్‌లోని చినాబబు లోకేష్, సీఎం కార్యాలయానికీ జాబితా పంపించారు. కొన్నాళ్ల తరువాత ఈ విషయమై మళ్లీ రగడ ప్రారంభమైంది. టీడీపీ మండలాధ్యక్షుడు యాళ్ల నాగేశ్వరరావును ఏఎంసీ చైర్మన్‌గా నియమించాలంటూ ఎంపీ రామ్మోహన్నాయుడు, జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు ప్రతిపాదించారు. అంతే కాకుండా దివంగత ఎర్రన్నాయుడి మనిషిగా నాగేశ్వరరావే సరైన అభ్యర్థి అంటూ ప్రచారం చేసేసి దాదాపు పోస్టును ఖరారు చేసేశారు. దీంతో విజయరామరాజు, మంత్రి అచ్చెన్నల మధ్య మాటల యుద్ధం నడిచింది. తాను చెప్పిందే వేదం అంటూ అచ్చెన్న వ్యవహరించడంపై పంచాయితీ సీఎం వద్దకు చేరింది. శత్రుచర్ల కూడా తానేమీ తక్కువ కాదంటూ మన్మథరావు పేరును ఖరారు చేస్తూ తనకు మద్ధతివ్వాల్సిందిగా పలాస ఎమ్మెల్యే శివాజీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంక ట్రావు, ప్రభుత్వ విప్ కూనరవి కుమార్‌లను ఆశ్రయించారు. వీరంతా కలిసి శత్రుచర్లను వెంటబెట్టుకుని సీఎం వద్దకు తీసుకువెళ్లడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఇన్చార్జిదే బాధ్యత మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకాల విషయంలో స్థానిక ఇన్చార్జి/ఎమ్మెల్యేలదే బాధ్యత అంటూ సీఎం సున్నితంగా చెప్పినట్టు తెలిసింది. అంతే కాకుండా జిల్లా వ్యవహారాల్లో తలదూర్చొద్దంటూ అచ్చెన్నకు హితవు పలికినట్టు సమాచారం. రాజాం, పాలకొండ ప్రాంతాల్లో పర్యటించే సమయాల్లో అక్కడి ఇన్చార్జిల మాట వింటున్నప్పుడు పాతపట్నం విషయానికొచ్చేసరికి ఎందుకలా చేస్తున్నారంటూ అచ్చెన్నపై సీఎం చిందులేసినట్టు భోగట్టా. తక్షణం రాజుగారింటికి వెళ్లి సమస్య పరిష్కరించాలని కూడా సూచించారని సమాచారం. దీంతో ఇటీవల మంత్రి అచ్చెన్న పాతపట్నం నియోజకవర్గ ఇన్చార్జి శత్రుచర్ల ఇంటికి పరామర్శ పేరిట వెళ్లి హిరమండలం మార్కెట్ కమిటీ చైర్మన్ విషయంలో తాను తలదూర్చానని వివరణ ఇచ్చుకున్నట్టు తెలిసింది. ప్రభుత్వ విప్ సహా ఇద్దరు ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షురాలు శత్రుచర్లవైపే మొగ్గుచూపడం కూడా మంత్రి అచ్చెన్నకు కాస్త ఇబ్బందిగానే మారింది. మన్మథరావు కూడా మంచి వ్యక్తేనని, గతంలో ఎల్‌ఎన్‌పేట పీఏసీఎస్ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉందని అంతా తేల్చిచెప్పడంతో హిరమండలం ఏఎంసీ పోస్టు దాదాపు ఖరారైనట్టేనని, సమస్య కూడా ముగిసిపోయినట్టేనని టీడీపీ నేతలు ఊపిరిపీల్చుకుంటున్నారు. -
చైర్మన్ కుర్చీ వైఎస్సార్ సీపీదే
బొబ్బిలి: మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థులే చైర్మన్ స్థానంలో కూర్చుంటారని ఆపార్టీ కౌన్సిలర్లు ధీమా వ్యక్తం చేశారు. తామంతా పార్టీ మారుతున్నామంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. బుధవారం వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లుంతా ఇక్కడి దర్బార్ మహాల్లో విలేకరులతో మాట్లాడారు.స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా.. ఇప్పటి వరకూ పదవీ ప్రమాణ స్వీకారాలు చేపట్టలేదని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. మున్సిపాలిటీలో ఎక్స్ అఫిషియో సభ్యుడితో కలిపి 16 స్థానాలున్న వైఎస్సార్ సీపీ చైర్మన్ స్థానాన్ని దక్కించుకుంటుందన్నారు. తమలో ఎవరికి బొబ్బి లి రాజులు బొట్టు పెడితే వారికి సంపూర్ణ సహకా రం అందిస్తామని తెలిపారు. బొబ్బిలి రాజులు ఇప్పటివరకూ నీతివంతమైన పాలన అందించారని, వారి స్థాయికి భంగం కలగకుండా తాము కూ డా ప్రజలకు మంచి పాలన అందిస్తామని చెప్పా రు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు చెలికాని మురళీకృష్ణ, రౌతు రామ్మూర్తి, ఏగిరెడ్డి శ్రీథర్, రాంబార్కి శరత్, తదితరులు పాల్గొన్నారు.