రాజుగారింటికి వెళ్లిన మంత్రి..!
► హిరమండలం ఏఎంసీ పోస్టుపై రగడ
► ఇన్‌చార్జిని కాదని మంత్రి ఒత్తిళ్లు
► సీఎం వద్ద ఇతరుల గోడు
► శత్రుచర్లకే సీఎం మద్దతు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పొరుగూళ్లలో జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు చేస్తున్న పంచాయితీలకు చెక్‌పడింది. తనకు అనుకూలురుకే పదవులు కట్టబెట్టాలని పట్టుబట్టడం... ఇతర ప్రజాప్రతినిధులను తూలనాలడం తదితర అంశాలు సీఎం దృషికి వెళ్లాయి. అన్ని విషయాల్లోనూ తలదూర్చవద్దంటూ సీఎం నేరుగా మంత్రికి మందలించినట్టు సమాచారం. హిరమండలం వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ పోస్టు పదవిపై నేతల మధ్యనలుగుతున్న విభేదాలకు సీఎం ముగింపు పలికినట్టు తెలిసింది.
ఇదీ కథ
కొత్తూరు, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట మండలాలకు సంబంధించి హిరమండలంలో మార్కెట్ చైర్మన్ పోస్టు ఖాళీగా ఉంది. ఈ పోస్టు భర్తీకి పాతపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కె.మన్మథరావు అనే వ్యక్తికి మద్దతిస్తూ వస్తున్నారు. ఇదే విషయాన్ని బలపరుస్తూ హైదరాబాద్‌లోని చినాబబు లోకేష్, సీఎం కార్యాలయానికీ జాబితా పంపించారు. కొన్నాళ్ల తరువాత ఈ విషయమై మళ్లీ రగడ ప్రారంభమైంది. టీడీపీ మండలాధ్యక్షుడు యాళ్ల నాగేశ్వరరావును ఏఎంసీ చైర్మన్‌గా నియమించాలంటూ ఎంపీ రామ్మోహన్‌నాయుడు, జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు ప్రతిపాదించారు.
అంతే కాకుండా దివంగత ఎర్రన్నాయుడి మనిషిగా నాగేశ్వరరావే సరైన అభ్యర్థి అంటూ ప్రచారం చేసేసి దాదాపు పోస్టును ఖరారు చేసేశారు. దీంతో విజయరామరాజు, మంత్రి అచ్చెన్నల మధ్య మాటల యుద్ధం నడిచింది. తాను చెప్పిందే వేదం అంటూ అచ్చెన్న వ్యవహరించడంపై పంచాయితీ సీఎం వద్దకు చేరింది. శత్రుచర్ల కూడా తానేమీ తక్కువ కాదంటూ మన్మథరావు పేరును ఖరారు చేస్తూ తనకు మద్ధతివ్వాల్సిందిగా పలాస ఎమ్మెల్యే శివాజీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంక ట్రావు, ప్రభుత్వ విప్ కూనరవి కుమార్‌లను ఆశ్రయించారు. వీరంతా కలిసి శత్రుచర్లను వెంటబెట్టుకుని సీఎం వద్దకు తీసుకువెళ్లడంతో రాజకీయాలు వేడెక్కాయి.
ఇన్‌చార్జిదే బాధ్యత
మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకాల విషయంలో స్థానిక ఇన్‌చార్జి/ఎమ్మెల్యేలదే బాధ్యత అంటూ సీఎం సున్నితంగా చెప్పినట్టు తెలిసింది. అంతే కాకుండా జిల్లా వ్యవహారాల్లో తలదూర్చొద్దంటూ అచ్చెన్నకు హితవు పలికినట్టు సమాచారం. రాజాం, పాలకొండ ప్రాంతాల్లో పర్యటించే సమయాల్లో అక్కడి ఇన్‌చార్జిల మాట వింటున్నప్పుడు పాతపట్నం విషయానికొచ్చేసరికి ఎందుకలా చేస్తున్నారంటూ అచ్చెన్నపై సీఎం చిందులేసినట్టు భోగట్టా. తక్షణం రాజుగారింటికి వెళ్లి సమస్య పరిష్కరించాలని కూడా సూచించారని సమాచారం. దీంతో ఇటీవల మంత్రి అచ్చెన్న పాతపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జి శత్రుచర్ల ఇంటికి పరామర్శ పేరిట వెళ్లి హిరమండలం మార్కెట్ కమిటీ చైర్మన్ విషయంలో తాను తలదూర్చానని వివరణ ఇచ్చుకున్నట్టు తెలిసింది.
ప్రభుత్వ విప్ సహా ఇద్దరు ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షురాలు శత్రుచర్లవైపే మొగ్గుచూపడం కూడా మంత్రి అచ్చెన్నకు కాస్త ఇబ్బందిగానే మారింది. మన్మథరావు కూడా మంచి వ్యక్తేనని, గతంలో ఎల్‌ఎన్‌పేట పీఏసీఎస్ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉందని అంతా తేల్చిచెప్పడంతో హిరమండలం ఏఎంసీ పోస్టు దాదాపు ఖరారైనట్టేనని, సమస్య కూడా ముగిసిపోయినట్టేనని టీడీపీ నేతలు ఊపిరిపీల్చుకుంటున్నారు.