సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్‌లో పదవుల పందేరానికి రంగం సిద్ధమైంది. ఎన్నికల నియమావళి ముగిసిన వెంటనే వరుసగా రాష్ట్రస్థాయి పదవులను భర్తీ చేయనున్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల నియమావళి అమలు గడువు ముగిసిన వెంటనే ప్రభుత్వంలోని అన్ని రకాల నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా పలువురు కార్పొరేషన్ చైర్మన్లు రాజీనామా చేశారు. పార్టీ మారడంతో కొందరు ఇదే నిర్ణయం తీసుకున్నారు. మరికొందరి పదవీకాలం గడువు త్వరలో ముగియనుంది. అసెంబ్లీ, లోక్‌సభ, ఎమ్మెల్సీ, జెడ్పీ ఎన్నికల్లో అవకాశం రాని జాబితా ఆధారంగా నామినేటెడ్ పదవుల భర్తీలో పార్టీ నేతలకు అవకాశం కల్పించాలని కేసీఆర్ భావిస్తున్నారు. 2014లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 54 చైర్మన్ పదవులను భర్తీ చేసింది.
ప్రస్తుతం ఖాళీలు...
అసెంబ్లీ ఎన్నికల ముందు టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరడంతో రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవికి టి.నర్సారెడ్డి, పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవికి ఎస్.బేగ్ రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి వీలుగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఎస్.నిరంజన్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, గిరిజన సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, మూసీ పరివాహక సంస్థ చైర్మన్ ప్రేంసింగ్ రాథోడ్, సెట్విన్ చైర్మన్ మీర్ ఇనాయత్‌అలీ బాక్రి తమ పదవులకు రాజీనామా చేశారు. ఇటీవల శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైన శేరి సుభాశ్‌రెడ్డి భూగర్భ గనుల సంస్థ చైర్మన్ పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ 12 పదవులను వెంటనే భర్తీ చేసే అవకాశం ఉంది.
నెలాఖరులో మరికొన్ని...
2018లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పౌరసరఫరాల చైర్మన్‌గా మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి నియమితులయ్యారు. అధికార భాషా సంఘం చైర్మన్‌గా దేవులపల్లి ప్రభాకర్‌రావు, అత్యంత వెనుకబడిన కులాల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా తాడూరి శ్రీనివాస్, వైద్య సేవలు, వసతుల కల్పన సంస్థ చైర్మ న్‌గా పర్యాద కృష్ణమూర్తి పదవులను ఏడాదిపాటు కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ కె.వాసుదేవరెడ్డి, మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ గుండు సుధారాణి, గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ ఎం.భూంరెడ్డి, టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ సి.హెచ్.రాకేశ్‌కుమార్, గిరిజన సహకార సంస్థ చైర్మన్ డి.మోహన్‌గాంధీ నాయక్, ఫిల్మ్, టెలివిజన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ పుస్కూరు రామ్మోహన్‌రావు పదవీకాలం మే 27తో ముగియనుంది.
అక్టోబర్‌లో...
గొర్రెలు, మేకల పెంపకందారుల సమాఖ్య చైర్మన్ కె.రాజయ్యయాదవ్, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు, నీటి పారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి పదవీకాలం 2019, అక్టోబర్‌లో ముగుస్తుంది. గత ప్రభుత్వంలో వీరికి మాత్రమే మూడేళ్ల పదవీకాలం చొప్పున ఇచ్చారు. మిగిలిన చైర్మన్లకు గరిష్టంగా రెండేళ్ల చొప్పున ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన చైర్మన్ల పదవీకాలం సైతం దశలవారీగా పూర్తి కానుంది.
Comments
Please login to add a commentAdd a comment