Replacement of posts
-
వర్సిటీల్లో పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ఇతర ఖాళీలన్నీ భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నియామక ప్రక్రియ కోసం ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్ మంగళవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నతాధికారులతో ఈ అంశంపై సమీక్షించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీల్లో ఖాళీలకు సంబంధించిన వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం నియామకాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అయితే రాష్ట్రంలోని 11 యూనివర్సిటీలు ఎవరికి వారుగా నియామకాలు చేపట్టకుండా ఉమ్మడి నియామక విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. వర్సిటీల వారీగా రిక్రూట్మెంట్ జరగడం వల్ల గతంలో వచ్చిన ఆరోపణలు, విమర్శలను పరిగణనలోకి తీసుకుని ఒకే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నిపుణులతో కూడిన ప్రత్యేక కమిటీ కోసం కొన్ని పేర్లు పంపాలని సూచించినట్టు తెలిసింది. రిక్రూట్మెంట్కు సంబంధించి త్వరలోనే విధి విధానాలను ఖరారు చేయనున్నారు. సగానికిపైగా ఖాళీలు.. రాష్ట్రంలోని 11 వర్సిటీల్లో మొత్తం 2,828 పోస్టులు ఉండగా.. అందులో 1,869 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2017లో విశ్వవిద్యాలయాల్లో ఖాళీలపై ప్రభుత్వం నివేదిక తెప్పించుకుంది. అప్పట్లోనే 1,528 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించి.. వాటిలో 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు ఆ పోస్టుల భర్తీ ముందుకు పడలేదు. రిజర్వేషన్ల అంశం, న్యాయపరమైన వివాదాలు, నియామక విధానంపై కసరత్తు పేరిట విద్యాశాఖ అధికారులు కాలయాపన చేశారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో మరికొందరు పదవీ విరమణ చేయడంతో 2021 జనవరి చివరినాటికి యూనివర్సిటీల్లో ఖాళీల సంఖ్య 1,869కి చేరింది. ఇందులో 238 ప్రొఫెసర్ పోస్టులు, 781 అసోసియేట్ ప్రొఫెసర్, 850 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. ఇలా భారీ సంఖ్యలో ఖాళీలు ఏర్పడటంతో తాత్కాలిక, కాంట్రాక్టు అధ్యాపకులతో బోధన కొనసాగిస్తున్నారు. ఫలితంగా విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఎట్టకేలకు పోస్టుల భర్తీకి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ట్రిపుల్ఐటీ నిరసనపై నివేదిక బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల నిరనసకు సంబంధించి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమగ్ర వివరాలతో సీఎం కేసీఆర్‌కు నివేదిక అందజేశారు. విద్యార్థులతో చర్చలు ఫలప్రదం కావడం, అక్కడ తీసుకున్న చర్యలను వివరించారు. ట్రిపుల్‌ఐటీలో వెంటనే మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని, విద్యార్థుల డిమాండ్లు తక్షణం కొన్నింటిని, ప్రాధాన్యతా క్రమంలో మరికొన్నింటిని నెరవేర్చాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. -
ఒక్కో పోస్టుకు 48 మంది పోటీ
సాక్షి, అమరావతి: ప్రజారోగ్య విభాగంలో 31 సివిల్ అసిస్టెంట్ సర్జన్(సీఎస్) పోస్టుల నియామకానికి ఇటీవల వైద్య, ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. నియామక ప్రక్రియలో భాగంగా 1,483 మంది అభ్యర్థులతో ప్రాథమిక మెరిట్ జాబితా ప్రకటించారు. ఈ లెక్కన ఒక్కో పోస్టుకు సుమారు 48 మంది చొప్పున పోటీ పడుతున్నారు. ప్రాథమిక మెరిట్ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ తుది గడువు మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. అభ్యర్థులు casrecruitmentdphfw2022@gmail.com మెయిల్ ఐడీకు అభ్యంతరాలు పంపాల్సి ఉంటుందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ హైమావతి తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది కొరతకు తావుండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం నియామకాలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రజారోగ్య విభాగం పరిధిలో 2019 నుంచి 929 వైద్యుల భర్తీ చేపట్టింది. ఇందులో 899 పోస్టుల భర్తీ పూర్తవగా, మిగిలిన 31 పోస్టులను ప్రస్తుతం భర్తీ చేస్తున్నారు. అదే విధంగా 4,520 పారామెడికల్, ఇతర పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతివ్వగా ఇప్పటికే 4,315 పోస్టుల భర్తీ పూర్తయింది. మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. -
తెలంగాణలో మరో నోటిఫికేషన్.. ఈసారి 1,271 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) 1,271 పోస్టుల భర్తీకి సోమవారం నోటిఫికేషన్ ప్రకటించింది. ఇందులో 70 అసిస్టెంట్ ఇంజనీర్(ఎలక్ట్రికల్), 201 సబ్ ఇంజనీర్(ఎలక్ట్రికల్), వెయ్యి జూనియర్ లైన్మెన్(జేఎల్ఎం) పోస్టులు ఉన్నాయి. విద్యార్హతలు, వయోపరిమితి, కేటగిరీలవారీగా ఖాళీల వివరాలతో సమగ్ర నియామక ప్రకటనను ఈ నెల 11న సంస్థ వెబ్సైట్ https://tssouthernpower.cgg.gov.in లేదా https://www.tssouthernpower.comలో పొందుపరచనున్నట్టు యాజమాన్యం తెలిపింది. త్వరలో ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎన్పీడీసీఎల్), తెలంగాణ జెన్కో సంస్థల నుంచి సైతం ఏఈతోపాటు ఇతర కేటగిరీల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న విద్యుత్ ప్లాంట్ల నిర్వహణకు తెలంగాణ జెన్కో దాదాపు 200 ఏఈ పోస్టులను భర్తీ చేసే అవకాశముందని అధికారవర్గాలు తెలిపాయి. ఓ మూడు, నాలుగు నెలల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందన్నారు. టీఎస్ఎన్పీడీసీఎల్ దాదాపు 50 ఏఈ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. -
ఉద్యోగాల భర్తీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక సంస్కరణలు
సాక్షి, అమరావతి: పారదర్శకంగా ఉద్యోగ నియామకాలతోపాటు పోస్టుల భర్తీలో అక్రమాలకు తావులేకుండా పలు కీలక సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. గ్రూప్ 1 సహా అన్ని పోస్టులకూ ఇంటర్వ్యూలు రద్దు, డిజిటల్ మూల్యాంకనం, ట్యాబ్ ఆధారిత ప్రశ్నపత్రాలు, రిజర్వుడ్ మెరిట్ అభ్యర్థులకు ఓపెన్ కేటగిరీ పోస్టులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈడబ్ల్యూఎస్ కోటా అమలు తదితరాలు ఇందులో ఉన్నాయి. ఎక్కువ అభ్యర్థులున్న పోస్టులకే ప్రిలిమ్స్ గ్రూప్–1 పోస్టులకు మినహా మిగతా అన్ని కేటగిరీల పోస్టులకు ప్రిలిమ్స్ పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. అయితే కొన్ని పోస్టులకు లక్షల్లో దరఖాస్తులు రావడం, మెరిట్ అభ్యర్థులను నిర్ణయించడంలో సమస్యలు తలెత్తడంతో కొన్ని మినహాయింపులు చేపట్టింది. అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు అందే పోస్టులకు మినహా మిగతా వాటికి ప్రిలిమ్స్ లేకుండా ఒకే పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు. దీంతోపాటు గ్రూప్–1 సహా అన్ని పోస్టులకూ ఇంటర్వ్యూలను పూర్తిగా తొలగించారు. గత సర్కారు హయాంలో ఇంటర్వ్యూల పేరిట తమ వారికే పోస్టులు వచ్చేలా చేసి అర్హులకు అన్యాయం చేశారు. అన్ని బోర్డులకు ఏపీపీఎస్సీ చైర్మనే నేతృత్వం వహించడంతో అక్రమాలకు తెర లేచింది. దీన్ని పూర్తిగా రద్దు చేసి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లలో కొన్ని పోస్టులకు బహుళ బోర్డులతో ఇంటర్వ్యూలను నిర్వహించారు. బోర్డులకు వేర్వేరు చైర్మన్లను నియమించారు. గ్రూప్ 1 సహా అన్ని పోస్టులకూ ఇంటర్వ్యూలు రద్దయిన నేపథ్యంలో ఏపీ స్టేట్ సర్వీస్ కేడర్ పోస్టుల అభ్యర్థుల ఎంపికలో వ్యక్తిత్వం, పరిపాలనా దక్షతను అంచనా వేసేందుకు ప్రత్యామ్నాయ విధానాలపై కమిషన్ కసరత్తు చేస్తోంది. మెయిన్స్‌లో ట్యాబ్ ఆధారిత ప్రశ్నపత్రం టీడీపీ సర్కారు గ్రూప్ 1తో పాటు అన్ని కేటగిరీల పోస్టులకూ ప్రిలిమ్స్‌ను తప్పనిసరి చేసింది. గతంలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తుండగా దాన్ని రద్దు చేసి 1:15 ప్రకారం మార్చింది. దీనివల్ల వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు నష్టపోయారు. పాత విధానాన్ని కొనసాగించాలని ఆందోళన చేసినా పట్టించుకోలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ విధానాన్ని మార్చి నిరుద్యోగులకు మేలు చేసేలా 1: 50 నిష్పత్తిని తిరిగి ప్రవేశపెట్టింది. మరోవైపు గ్రూప్ 1 మెయిన్స్‌లో ట్యాబ్ ఆధారిత ప్రశ్నపత్రాల ద్వారా పరీక్షలు నిర్వహించారు. దీనివల్ల అభ్యర్థులందరికీ ఒకేసారి ప్రశ్నపత్రం అందడంతో పాటు లీకేజ్ లాంటి వాటికి ఆస్కారం లేకుండా చేశారు. అవకతవకలను నివారించేందుకు ఏపీపీఎస్సీ డిజిటల్ మూల్యాంకనాన్ని చేపట్టింది. దీనివల్ల పారదర్శకతతో పాటు అర్హులైన వారికి న్యాయం జరుగుతుంది. నెగిటివ్ మార్కులు రద్దు.. ఏపీపీఎస్సీ నిర్వహించే డిపార్టుమెంట్ పరీక్షల్లో గత సర్కారు నెగిటివ్ మార్కులు ప్రవేశపెట్టడంతో పదోన్నతులు, ఇతర ప్రయోజనాల కోసం పరీక్షలు రాసే ఉద్యోగులు నష్టపోయారు. దీన్ని రద్దు చేయాలని ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ఆలకించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిపార్టుమెంట్ పరీక్షలలో నెగిటివ్ మార్కులను రద్దు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గరిష్ట వయోపరిమితి పొడిగింపు ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి నిబంధనల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కల్పిస్తున్న ఐదేళ్ల సడలింపును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వర్గాలకు కల్పిస్తున్న సడలింపు కాలపరిమితి 2021 మే నెలతో ముగిసింది. కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతుండటంతో ఈ అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా వయోపరిమితి సడలింపును 2026 మే 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. రిజర్వుడ్ మెరిట్ అభ్యర్థులకు ఓపెన్ కేటగిరీ పోస్టులు గత సర్కారు రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులు తమ రిజర్వేషన్ల ప్రయోజనాన్ని ముఖ్యంగా వయోపరిమితి మినహాయింపును వినియోగించుకుంటే వారిని ఆ కేటగిరీ పోస్టులకే పరిమితం చేస్తూ ఓపెన్ కేటగిరీ పోస్టులకు అనర్హులుగా చేసింది. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలతో పాటు రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులందరికీ తీరని నష్టం వాటిల్లింది. దీనిపై జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లకు ఫిర్యాదులు అందినా టీడీపీ సర్కారు పట్టించుకోలేదు. ఇప్పుడు రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులు రిజర్వేషన్ ప్రయోజనాన్ని వినియోగించుకున్నా మెరిట్లో అగ్రస్థానంలో ఉంటే ఓపెన్ కేటగిరీ పోస్టులకు అర్హులుగా నిర్ణయిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారికి మేలు చేసింది. ఈడబ్ల్యూఎస్ కోటా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడ బ్ల్యూఎస్) ప్రభుత్వ ఉద్యోగాల్లో పది శాతం కోటాను రిజర్వు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2018లో చట్టం తెచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ హయాంలో ఆ కోటా సంగతిని ప్రస్తా వించకుండా నోటిఫికేషన్లు జారీ చేయడంతో ఆ వర్గాల యువతకు అన్యాయం జరిగింది. పైగా పది శాతం కోటాలో 5 శాతాన్ని కాపులకు ప్రత్యేకిస్తున్నట్లు నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులు ఇవ్వడంతో అది న్యాయపరంగా చెల్లుబాటు కాకుండా నిలిచిపోయింది. దీనివల్ల నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయా వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో పది శాతం కోటా అమలుకు చర్యలు తీసుకుంది. ఈడబ్ల్యూఎస్ కోటా అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో ఏపీపీఎస్సీ ఆమేరకు చర్యలు చేపట్టింది. కొత్త నోటిఫికేషన్లలో ఈడబ్ల్యూఎస్ కోటా అభ్యర్థుల వివరాలను పొందుపర్చేలా వీలు కల్పించింది. -
ముందు ఆప్షన్ ఇచ్చినవారికే తొలి ప్రాధాన్యం
సాక్షి, అమరావతి: అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పోస్టులకు పరీక్ష కేంద్రాల కేటాయింపులో ముందుగా ఆప్షన్ ఇచ్చిన వారికే తొలి ప్రాధాన్యత ఉంటుందని ఏపీపీఎస్సీ తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులు ఫిబ్రవరి 5లోగా ఆప్షన్లను వెబ్ లింక్‌లో కొత్తగా నమోదు చేయాలని సూచించింది. ఈ వెబ్ లింక్ ( https:// psc. ap. gov. in) ఈ నెల 27 నుంచి అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు తప్పకుండా వెబ్ ఆప్షన్లను సమర్పించాలి. ఇంతకు ముందు దరఖాస్తుల సమర్పణ సమయంలో ఇచ్చిన ఆప్షన్లను పరిగణనలోకి తీసుకోరు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు పరీక్ష కేంద్రం ఆప్షన్లతోపాటు తమ సబ్జెక్ట్, పోస్టు ప్రాధాన్యతలను ఫిబ్రవరి 5లోపు కమిషన్ వెబ్సైట్లో నమోదు చేయాలి. ఈ ఆప్షన్లనే తుది ఆప్షన్లుగా పరిగణిస్తారు. అభ్యర్థులు ప్రాధాన్యతా క్రమంలో మూడు పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవాలి. కేంద్రాల ఎంపిక సహా ఇతర అంశాలను ఎడిట్ ఆప్షన్ ద్వారా జాగ్రత్తగా నమోదు చేయాలి. కాగా, ఏపీపీఎస్సీ 190 ఏఈ పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబర్ 7న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
కేజీబీవీల్లో 958 టీచింగ్ పోస్టుల భర్తీ
సాక్షి, అమరావతి: కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) ఖాళీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అన్ని కేజీబీవీల్లో 958 ఖాళీ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయాలని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.వెట్రిసెల్వి శుక్రవారం అన్ని జిల్లాల విద్యాధికారులను ఆదేశిస్తూ షెడ్యూల్ విడుదల చేశారు. పోస్టులను భర్తీ చేసి ఈనెల 20వ తేదీలోగా నివేదికలు పంపాలని పేర్కొన్నారు. అభ్యర్ధుల అర్హతలు, మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వయోపరిమితి 42 ఏళ్లుగా నిర్దేశించారు. రిజర్వుడ్ అభ్యర్ధులకు గరిష్ట వయోపరిమితి 47 ఏళ్ల వరకు ఉంటుంది. కేజీబీవీల్లో పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలో బోధన సాగుతున్నందున తప్పనిసరిగా అదే మాధ్యమంలో బోధన సామర్థ్యం కలిగి ఉండాలి. అలా లేనివారి నియామకాలను రద్దు చేసి తొలగిస్తారు. టీచింగ్ సిబ్బంది నియామక ఉత్తర్వులను జిల్లా స్థాయిలో, ప్రిన్సిపాళ్ల నియామక ఉత్తర్వులు రాష్ట్ర స్థాయిలో ఇస్తారు. అభ్యర్ధుల విద్యార్హతలు, సాధించిన మార్కులు, అనుభవం, రిజర్వేషన్ల వారీగా ప్రొవిజనల్ జాబితాను ఆయా జిల్లాల అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు, డీఈవోలు విడుదల చేస్తారు. అభ్యంతరాలను స్వీకరించి తుది మెరిట్ జాబితా వెలువరిస్తారు. విద్యార్హతలు, నెలవారీ వేతనాలు ఇలా ప్రిన్సిపాల్ (స్పెషలాఫీసర్): యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం కనీస మార్కులతో పీజీ డిగ్రీ, బీఈడీ, ప్రభుత్వ గుర్తింపు పొందిన జూనియర్ కాలేజీ, హైస్కూళ్లలో ప్రిన్సిపాల్‌గా రెండేళ్ల అనుభవం. వేతనం రూ.27,755 సీఆర్టీ: యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో 50 శాతం కనీస మార్కులతో పీజీ డిగ్రీ, మెథడాలజీలో బీఈడీతో పాటు ఏపీటెట్ లేదా తత్సమాన పరీక్షలో అర్హత సాధించి ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన జూనియర్ కాలేజీ, హైస్కూళ్లలో ప్రిన్సిపాల్‌గా రెండేళ్ల అనుభవం. వేతనం రూ.21,755 పీఈటీ: 50 శాతం కనీస మార్కులతో ఇంటర్మీడియెట్ లేదా డిగ్రీ ఉత్తీర్ణత. యూజీడీపీఈడీ లేదా బీపీఈడీ/ఎంపీఈడీ శిక్షణతో పాటు ఏపీటెట్లో అర్హత సాధించి ఉండాలి. రెండేళ్ల అనుభవం కలిగి ఉండాలి. వేతనం రూ.21,755 పీజీటీ: యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో 50 శాతం కనీస మార్కులతో పీజీ డిగ్రీ, మెథడాలజీలో బీఈడీ అర్హత సాధించి ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన జూనియర్ కాలేజీ, హైస్కూళ్లలో పీజీటీగా రెండేళ్ల అనుభవం. వేతనం రూ.12,000 పీజీటీ వొకేషనల్: యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో 50 శాతం కనీస మార్కులతో పీజీ డిగ్రీ లేదా పీజీ డిప్లొమో చేసి ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన జూనియర్ కాలేజీ, హైస్కూళ్లలో పీజీటీ వొకేషనల్ పోస్టులో రెండేళ్ల అనుభవం. వేతనం రూ.12000. -
38 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వరుసగా జారీ చేస్తున్న నోటిఫికేషన్లలో భాగంగా మరో 38 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టుల్లో.. అసిస్టెంట్ పబ్లిక్ సర్వీస్ రిలేషన్ ఆఫీసర్ (ఏపీఆర్వో) (6), అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (29), ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (1), హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్–2 (2) ఉన్నాయి. ఈ పోస్టులకు నవంబర్ 12 నుంచి డిసెంబర్ 7 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు తెలిపారు. మరిన్ని వివరాలకు ‘హెచ్‌టీటీపీఎస్://పీఎస్సీ.ఏపీ.జీవోవీ.ఐఎన్’ చూడొచ్చన్నారు. -
ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ సన్నాహాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కొన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు అనుమతివ్వాలని కోరుతూ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు ప్రభుత్వానికి లేఖరాశారు. గతంలో ప్రభుత్వం భర్తీకి అనుమతించిన పోస్టుల్లో మిగిలి ఉన్న 1,180 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు అనుమతివ్వాలని సోమవారం రాసిన లేఖలో కోరారు. వాటితోపాటు ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లలో అర్హులైన అభ్యర్థులు లేకపోవడం, పోస్టులకు ఎంపికైనవారు చేరకపోవడం వంటి కారణాలతో 150 పోస్టులు మిగిలి ఉన్నాయని వివరించారు. వీటినీ భర్తీ చేయాల్సి ఉందని తెలిపారు. అలాగే ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్ల కోటా అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినందున రోస్టర్ పాయింట్లను ఖరారు చేయాలని కోరారు. -
జేసీజే పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే) పోస్టుల భర్తీకి హైకోర్టు మంగళవారం నోటిఫికేషన్ జారీచేసింది. 68 పోస్టుల్లో 55 పోస్టులను ప్రత్యక్షంగా.. 13 పోస్టులను బదిలీల ద్వారా భర్తీచేస్తారు. దరఖాస్తుల సమర్పణకు ఆగస్టు 20 చివరి తేదీ. ఈనెల 20 నుంచి హైకోర్టు వెబ్సైట్ (https://hc.ap.nic.in/)లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. సెప్టెంబర్ 26న రాత పరీక్ష ఉంటుంది. అదే నెల 10న హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాస్తవానికి 2020లో 68 జేసీజే పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్ జారీచేసింది. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు మూడేళ్లపాటు న్యాయవాదిగా పనిచేసి ఉండాలన్న నిబంధన విధించింది. దీనిని సవాలు చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు, మూడళ్ల నిబంధన రాజ్యాంగ విరుద్ధమంటూ ఆ నోటిఫికేషన్‌ను కొట్టేసింది. తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో హైకోర్టు రిజిస్ట్రీ తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది. దరఖాస్తు ఫారాన్ని హైకోర్టు వెబ్సైట్లో ఉంచారు. ఆగస్టు 20వ తేదీ రాత్రి 11.59లోపు దరఖాస్తులు హైకోర్టుకు అందాల్సి ఉంటుంది. అలాగే.. ► దరఖాస్తులను ఆన్లైన్లోనే పూర్తిచేసి సమర్పించాలి. చేతిరాత, టైపు, జిరాక్స్, ప్రింట్ దరఖాస్తులను ఆమోదించరు. దరఖాస్తులను ప్రత్యక్షంగా, పోస్టు ద్వారా కూడా స్వీకరించరు. ► 2020లో జారీచేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్‌కు హాజరైన అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు సమర్పించకుండానే ప్రస్తుతం నిర్వహించనున్న జేసీజే పరీక్షకు హాజరుకావొచ్చు. స్క్రీనింగ్ పరీక్షకు హాజరుకాని వారు తిరిగి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ► ప్రస్తుత జేసీజే పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు తప్పనిసరిగా లా డిగ్రీ ఉండి తీరాలి. ► ఓసీ, బీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజును రూ.800గా నిర్ణయించారు. ► ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400 ఫీజుగా చెల్లించాలి. ఆంధ్రప్రదేశ్ నివాసితులు కాని ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.800 ఫీజు చెల్లించాలి. ► గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలను పరీక్ష కేంద్రాలుగా నిర్ణయించారు. వీటిల్లో మూడింటిని అభ్యర్థులు ఎంపిక చేసుకోవచ్చు. ► స్క్రీనింగ్ పరీక్షా ఫలితాల వెల్లడి తరువాత ఈ కేంద్రాల్లో ఆన్లైన్ రాత పరీక్ష ఉంటుంది. -
తప్పులు సరిదిద్ది పోస్టుల భర్తీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్యను మరింత పటిష్టపరిచే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో 2 వేల అసిస్టెంటు ప్రొఫెసర్ పోస్టులు భర్తీచేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియపై దృష్టి సారించిన ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి ప్రస్తుతం వర్సిటీల వారీగా పోస్టులు తదితర అంశాలపై కసరత్తు ప్రారంభించాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ యూనివర్సిటీ పోస్టుల భర్తీ ప్రక్రియను అస్తవ్యస్తంగా మార్చిన సంగతి తెలిసిందే. తమవారికి వర్సిటీ పోస్టులు కట్టబెట్టేందుకు ఇష్టానుసారం వ్యవహరించారు. న్యాయవివాదాల్లో చిక్కుకోవడంతో ఆ నోటిఫికేషన్ల ప్రకారం ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల అర్హులైన నిరుద్యోగ విద్యావంతులు తీవ్రంగా నష్టపోవలసి వస్తోంది. అసిస్టెంటు ప్రొఫెసర్ పోస్టులే కాకుండా గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ నియామకాల్లోనూ న్యాయవివాదాల్లో ఉన్నాయి. వీటిని పూర్తిగా ఒక కొలిక్కి తెచ్చి పూర్తి పారదర్శకతతో, అర్హులైన వారికే వర్సిటీల్లో ఉద్యోగాలు దక్కేలా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో 1,100 అసిస్టెంటు ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా ఇప్పుడు వీటిస్థానంలో 2 వేల అసిస్టెంటు ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. గతంలోని 14 యూనివర్సిటీలతో పాటు రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ఐటీల్లో కూడా అసిస్టెంటు ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో రేషనలైజేషన్ నుంచి అన్నీ అవకతవకలే గత తెలుగుదేశం ప్రభుత్వం యూనివర్సిటీ పోస్టుల భర్తీ ప్రక్రియలో అనేక అవకతవకలకు పాల్పడింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన సన్నిహితుడైన శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్‌ను సీఎంవో కార్యాలయంలో సలహాదారుగా నియమించుకుని నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకున్నారు. తమ వర్గానికి చెందినవారిని నియమించుకోవడానికి ఎలాంటి జీవోలు ఇవ్వకుండా రాష్ట్రస్థాయిలో అన్ని యూనివర్సిటీ పోస్టులను హేతుబద్ధీకరణ చేయించారు. అన్ని యూనివర్సిటీలకు కలిపి 2015లో హైపవర్ కమిటీని నియమించారు. ఈ కమిటీ ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు రేషనలైజేషన్‌ను పూర్తిచేసింది. దాదాపు 570 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను అసిస్టెంటు ప్రొఫెసర్ పోస్టులుగా మార్చింది. ఒక విభాగం పోస్టును మరో విభాగానికి మార్చేసింది. 2 విడతల్లో మొత్తం 1,385 పోస్టుల భర్తీకి అప్పటి ప్రభుత్వం జీవో 137 విడుదల చేసింది. న్యాయవివాదంతో సవరణ ఆదేశాలిచ్చింది. కమిటీ నియామకం, రేషనలైజేషన్ ప్రక్రియలపై కోర్టులు స్టేలు విధించినా పట్టించుకోకుండా వర్సిటీల ఆమోదంతో అంటూ మళ్లీ అవే పోస్టులు భర్తీచేసేలా వర్సిటీల వారీగా 14 జీవోలిచ్చింది. వీటిపై న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. మరోవైపు ఏపీపీఎస్సీ ద్వారా అన్ని యూనివర్సిటీలకు కలిపి ఒకే స్క్రీనింగ్ టెస్టు నిర్వహించింది. దీనిపైనా న్యాయవివాదం నెలకొంది. ఈ తప్పులేవీ లేకుండా అర్హులైన మెరిట్ అభ్యర్థులకు న్యాయం జరిగేలా వర్సిటీల నియమనిబంధనల ప్రకారం ఆయా విభాగాల్లో పోస్టుల భర్తీకి ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి చర్యలు చేపడుతున్నాయి. -
ఉగాదికి విద్యాశాఖ పోస్టుల భర్తీకి క్యాలెండర్
సాక్షి, అమరావతి: విద్యా శాఖలో ఈ ఏడాది భర్తీ చేయనున్న పోస్టుల క్యాలెండర్‌ను సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఉగాది నాడు విడుదల చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో మౌలిక వసతుల కల్పనకు వీలైనంత త్వరగా నిధులు విడుద ల చేయాలని సీఎం ఆర్థిక శాఖను ఆదేశించారని చెప్పారు. వచ్చేనెల 9న జగనన్న విద్యా దీవెన కింద ఫీజులు చెల్లిస్తామన్నారు. ఈ ఏడాది నుంచి తల్లుల ఖాతాల్లో ఈ పథకం నగదు జమ చేస్తామన్నారు. దీనివల్ల 10 లక్షల మందికి పైగా విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు. గతేడాదితో పోలిస్తే డిగ్రీ అడ్మిషన్లు 2.2 లక్షల నుంచి 2.7 లక్షలకు పెరిగాయన్నారు. ఆయన శుక్రవారం సచివాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని కళాశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతోపాటు విద్యార్థులకు ఉద్యోగా లు లభించేలా విద్యాబోధన చేయిస్తామన్నారు. అక్రమాలకు పాల్పడే అటానమస్ కాలేజీలు తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇంకా ఆయన ఏమన్నారంటే.. అటానమస్ కాలేజీల్లో నాణ్యమైన విద్య అందడం లేదు.. రాష్ట్రంలో పలు యూనివర్సిటీల పరిధిలో 109 అటానమస్ కాలేజీలున్నాయి. ఈ కాలేజీల్లో సిల బస్, ప్రశ్నపత్రాల రూపకల్పనతోపాటు మూ ల్యాంకనం వంటివి అవే సొంతంగా చేపడుతు న్నాయి. దీనివల్ల నాణ్యమైన విద్య అందడం లేద ని గుర్తించాం. అంతేకాకుండా ప్రభుత్వ రాయి తీలు పొందుతూ.. అటానమస్ స్టేటస్‌ను అడ్డం పెట్టుకుని కొన్ని అక్రమాలకు పాల్పడుతు న్నాయి. ఇకపై అటానమస్ కాలేజీలు సొంతంగా ప్రశ్నపత్రాలు రూపొందించుకోవడం కుదరదు. వాటిలో నాణ్యతా ప్రమాణాలు లేకపోవడం వల్లే ఉద్యోగాలు రావడం లేదు. డిగ్రీ విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచడానికి అటానమస్ కాలేజీల్లో ఆడిట్ చేపట్టి, పరీక్ష విధానంలో సమూల మార్పులు తీసుకొస్తాం. ఇక నుంచి డిగ్రీ తరగతులకూ అప్రెంటీస్ విధానం అమలు చేస్తాం. ఆంధ్రా, శ్రీ వేంకటేశ్వర వర్సిటీలు, ఆర్జీయూకేటీ, జేఎన్టీయూ– కాకినాడ, అనంతపురంల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. -
వర్సిటీ పోస్టులన్నీ 'రీ రేషనలైజేషన్'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 14 యూనివర్సిటీల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియను పునఃప్రారంభించడంపై ఉన్నత విద్యామండలి దృష్టి సారిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఈ పోస్టుల భర్తీకి జారీ చేసిన జీవోలు, నోటిఫికేషన్లను న్యాయస్థానం ఇటీవల రద్దు చేయడంతో కొత్తగా ప్రక్రియను ప్రారంభించనున్నారు. గత సర్కారు ఇష్టానుసారంగా పోస్టుల హేతుబద్ధీకరణ చేపట్టడంతో న్యాయవివాదాల్లో చిక్కుకున్నాయి. ఆ లోపాలను సవరించి వర్సిటీల వారీగా పోస్టుల హేతుబద్ధీకరణ చేపట్టాలని మండలి భావిస్తోంది. రేషనలైజేషన్, రిజర్వేషన్లు, రోస్టర్ విధానం, వయోపరిమితి తదితర అంశాలపై న్యాయస్థానం మార్గదర్శకాల ప్రకారం వ్యవహరిస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రక్రియను చేపట్టనున్నామన్నారు. నిబంధనల ప్రకారం హేతుబద్ధీకరణ వర్సిటీ పోస్టుల హేతుబద్ధీకరణపై యూజీసీ మార్గదర్శకాలతో పాటు ప్రభుత్వ నిబంధనలను పాటించనున్నారు. వర్సిటీలకే బాధ్యత అప్పగించనున్నారు. హేతుబద్ధీకరణ ముగిశాక కొత్తగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మెరిట్ అభ్యర్థులను గుర్తించేందుకు స్క్రీనింగ్ టెస్టు నిర్వహించాలని భావిస్తున్నారు. వర్సిటీ పోస్టులను పూర్తి పారదర్శకంగా, మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలిని ఆదేశించారు. కమిటీ సిఫార్సులంటూ క్యాడర్ మార్పు రాష్ట్రంలోని 14 యూనివర్సిటీల్లో 1,385 బోధనా సిబ్బంది పోస్టుల భర్తీ ప్రక్రియలో గత ప్రభుత్వం అక్రమాలు, అవకతవకలకు తావిచ్చింది. వర్సిటీల స్వయం ప్రతిపత్తిని పక్కన పెట్టి కమిటీ ద్వారా పోస్టుల హేతుబద్ధీకరణ చేసింది. కమిటీ సిఫార్సులంటూ నిబంధనలకు విరుద్ధంగా 570 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులుగా క్యాడర్ మార్పు చేసింది. ఒక విభాగం పోస్టును మరో విభాగానికి తరలించింది. రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లను కూడా తమకు అనుకూలంగా మార్చుకున్నారు. తమ సామాజిక వర్గానికి ప్రొఫెసర్ పోస్టులు ప్రొఫెసర్ పోస్టులను తమ సామాజికవర్గం వారితో గత ప్రభుత్వ పెద్దలు భర్తీ చేయించారు. అనంతపురం జేఎన్టీయూలో 9 ప్రొఫెసర్ పోస్టులలో ఏడింటిని ఒకే సామాజికవర్గం వారితో భర్తీ చేశారు. కృష్ణా వర్సిటీలో 4 ప్రొఫెసర్ పోస్టులు, రాయలసీమ వర్సిటీలో 4 ప్రొఫెసర్ పోస్టులతోపాటు మరికొన్ని వర్సిటీల్లో కూడా తమ వారితో భర్తీ చేశారు. రేషనలైజేషన్ జీవోలు, నోటిఫికేషన్లను న్యాయస్థానం రద్దు చేసినందున ఈ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలు కూడా రద్దు కానున్నాయి. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో 7,634 రెగ్యులర్ పోస్టుల భర్తీ
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రులను నిర్వీర్యం చేసి, పరోక్షంగా ప్రైవేట్ ఆస్పత్రులను ప్రోత్సహిస్తే, ప్రస్తుత ప్రభుత్వం అందుకు భిన్నంగా ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో డాక్టర్లు, వైద్య సిబ్బందిని పెద్ద సంఖ్యలో నియమించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర, జిల్లా స్థాయి ఆస్పత్రుల్లో ఏకంగా 7,634 రెగ్యులర్ పోస్టులను భర్తీ చేశారు. జిల్లా స్థాయిలో డైరెక్టర్ మెడికల్ విద్య, ఏపీ వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ కింద ఆస్పత్రుల్లో మొత్తం 7,590 రెగ్యులర్ పోస్టుల భర్తీకి అనుమతించగా ఇప్పటి వరకు 6,106 పోస్టులను భర్తీ చేశారు. రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్ మెడికల్ విద్య, ఏపీ వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ కింద 2,120 పోస్టులు మంజూరు చేయగా ఇప్పటి వరకు 1,528 పోస్టులను భర్తీ చేశారు. మిగతా 592 పోస్టుల భర్తీ ప్రాసెస్‌లో ఉన్నట్లు వైద్య శాఖ వర్గాలు తెలిపాయి. దీనిని బట్టి ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రజారోగ్యం పట్ల ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధి స్పష్టం అవుతోందని వైద్య శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లా స్థాయిలో మిగతా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని, వీలైనంత త్వరగా భర్తీ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. -
కోడ్‌కు ముందే కొలువుల జాతర?
సాక్షి, హైదరాబాద్: పోలీసు శాఖలో 20 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న వేళ ఎలాంటి అవాంతరాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. త్వరలో రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కోడ్‌కు ముందే కొలువుల జాతరకు పోలీసు శాఖ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో న్యాయపరమైన వివాదాలు రాకుండా తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎన్నికల కోడ్‌కు ముందే నోటిఫికేషన్ ఇచ్చేందుకు న్యాయనిపుణులతో సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఎప్పుడైనా రావచ్చు.. అసెంబ్లీ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ సాధ్యా సాధ్యాలను పరిశీలిస్తే.. నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఇంకా 5 నెలలకు పైగా సమయం ఉంది. ఈ రెండు ఎన్నికల్లో ముందుగా రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ స్థానంతో పాటు ఖమ్మం–వరంగల్–నల్లగొండ గ్రాడ్యుయేట్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ స్థానాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఎమ్మెల్సీ సభ్యుల పదవీ కాలం మార్చి నెలాఖరు వరకు ఉంది. ఈ నేపథ్యంలో ఈ గడువుకు ముందే కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) వీటికి ఎన్నికలు నిర్వహించనుంది. ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుకు ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు గడువు ఉంది. ఈ ప్రక్రియ పూర్తయి తుది ఓటర్ల జాబితా అందుబాటులోకి వచ్చేసరికి మరో 2 వారాలు పడుతుంది. ఆ తర్వాత ఎపుడైనా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు వెళ్తుంది. ఈ లోపు నోటిఫికేషన్ ఇస్తే..ఈ భర్తీ ప్రక్రియ ప్రారంభించినట్లు ఉంటుందని, న్యాయపర చిక్కులు రావన్న అభిప్రాయంతో రిక్రూట్ మెంట్ బోర్డు ఉంది. అయితే, ఈ భర్తీకి ప్రభుత్వం నుంచి బోర్డుకు అధికారిక ఆదేశాలు రాలేదు. పదోన్నతులు కల్పిస్తేనే.. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇప్పటికిప్పుడు ఉన్న ఖాళీల ప్రకారం ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తే 5 వేలకు పైగా అందుబాటులోకి రానున్నాయి. అదే ప్రభుత్వం కనుక టీచర్ల పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే 12 వేలకు పైగా పోస్టులు భర్తీ చేయొచ్చు. ఇదీ క్షేత్ర స్థాయిలో ఉపాధ్యాయ ఖాళీల వివరాలను సేకరించిన అనంతరం పాఠశాల విద్యా శాఖ తేల్చిన పరిస్థితి. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించేందుకు సిద్ధమవుతోంది. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో విద్యా శాఖ చర్యలు వేగవంతం చేసింది. క్షేత్రస్థాయిలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల ఖాళీల వివరాలను సేకరించింది. విద్యా శాఖ తేల్చిన లెక్కల ప్రకారం స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో 9 వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి. వాటి ల్లో విద్యా వలంటీర్లు పని చేస్తున్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులు కూడా మరో 3 వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి. 12 వేలకు పైగా పోస్టుల భర్తీ ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో 9 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నా వాటన్నింటినీ డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే అవకాశం లేదు. 70% పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. మిగతా 30% పోస్టులను మాత్రమే డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయొచ్చు. అంటే 9 వేల ఖాళీల్లో డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా 2,700కు పైగా పోస్టులను మాత్రమే భర్తీ చేసే వీలుంటుంది. మిగతా 6,300 పోస్టుల్లో అర్హత కలిగిన సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది. వారికి పదోన్నతులు కల్పిస్తే.. ఖాళీ అయ్యే 9 వేలకు పైగా ఎస్జీటీ పోస్టులు డైరెక్టు రిక్రూట్మెంట్ చేసేందుకు అందుబాటులోకి వస్తాయి. అయితే ముందుగా ఎస్జీటీ తత్సమాన పోస్టుల్లో ఉన్న క్లియర్ వేకెన్సీలు, స్కూల్ అసిస్టెంట్ తత్సమాన కేటగిరీలో ఉన్న డైరెక్ట్ రిక్రూట్మెంట్ క్లియర్ వేకెన్సీలను ప్రభుత్వానికి పంపేందుకు విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
కారులో ‘నామినేటెడ్’ జోరు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్లో పదవుల పందేరానికి రంగం సిద్ధమైంది. ఎన్నికల నియమావళి ముగిసిన వెంటనే వరుసగా రాష్ట్రస్థాయి పదవులను భర్తీ చేయనున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల నియమావళి అమలు గడువు ముగిసిన వెంటనే ప్రభుత్వంలోని అన్ని రకాల నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా పలువురు కార్పొరేషన్ చైర్మన్లు రాజీనామా చేశారు. పార్టీ మారడంతో కొందరు ఇదే నిర్ణయం తీసుకున్నారు. మరికొందరి పదవీకాలం గడువు త్వరలో ముగియనుంది. అసెంబ్లీ, లోక్‌సభ, ఎమ్మెల్సీ, జెడ్పీ ఎన్నికల్లో అవకాశం రాని జాబితా ఆధారంగా నామినేటెడ్ పదవుల భర్తీలో పార్టీ నేతలకు అవకాశం కల్పించాలని కేసీఆర్ భావిస్తున్నారు. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 54 చైర్మన్ పదవులను భర్తీ చేసింది. ప్రస్తుతం ఖాళీలు... అసెంబ్లీ ఎన్నికల ముందు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరడంతో రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవికి టి.నర్సారెడ్డి, పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవికి ఎస్.బేగ్ రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి వీలుగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఎస్.నిరంజన్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, గిరిజన సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, మూసీ పరివాహక సంస్థ చైర్మన్ ప్రేంసింగ్ రాథోడ్, సెట్విన్ చైర్మన్ మీర్ ఇనాయత్‌అలీ బాక్రి తమ పదవులకు రాజీనామా చేశారు. ఇటీవల శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైన శేరి సుభాశ్‌రెడ్డి భూగర్భ గనుల సంస్థ చైర్మన్ పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ 12 పదవులను వెంటనే భర్తీ చేసే అవకాశం ఉంది. నెలాఖరులో మరికొన్ని... 2018లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పౌరసరఫరాల చైర్మన్‌గా మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి నియమితులయ్యారు. అధికార భాషా సంఘం చైర్మన్‌గా దేవులపల్లి ప్రభాకర్‌రావు, అత్యంత వెనుకబడిన కులాల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా తాడూరి శ్రీనివాస్, వైద్య సేవలు, వసతుల కల్పన సంస్థ చైర్మ న్గా పర్యాద కృష్ణమూర్తి పదవులను ఏడాదిపాటు కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ కె.వాసుదేవరెడ్డి, మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ గుండు సుధారాణి, గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ ఎం.భూంరెడ్డి, టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ సి.హెచ్.రాకేశ్‌కుమార్, గిరిజన సహకార సంస్థ చైర్మన్ డి.మోహన్‌గాంధీ నాయక్, ఫిల్మ్, టెలివిజన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ పుస్కూరు రామ్మోహన్రావు పదవీకాలం మే 27తో ముగియనుంది. అక్టోబర్‌లో... గొర్రెలు, మేకల పెంపకందారుల సమాఖ్య చైర్మన్ కె.రాజయ్యయాదవ్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు, నీటి పారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి పదవీకాలం 2019, అక్టోబర్‌లో ముగుస్తుంది. గత ప్రభుత్వంలో వీరికి మాత్రమే మూడేళ్ల పదవీకాలం చొప్పున ఇచ్చారు. మిగిలిన చైర్మన్లకు గరిష్టంగా రెండేళ్ల చొప్పున ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన చైర్మన్ల పదవీకాలం సైతం దశలవారీగా పూర్తి కానుంది. -
లెక్చరర్ల పోస్టుల భర్తీకి తొలగిన అడ్డంకులు
సాక్షి, హైదరాబాద్: రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టుల భర్తీకి అడ్డంకులు తొలగిపోయాయి. పోస్టుల భర్తీకి సంబంధించి గతంలో ఇచ్చి న మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు సవరించింది. లెక్చరర్ల పోస్టులను భర్తీ చేసుకోవచ్చని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)కు హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ నియామకాలన్నీ తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని పేర్కొంది. పొలిటికల్ సైన్స్ విభాగంలో ఓ పోస్టును ఖాళీగా ఉంచాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి ఉత్తర్వులు జారీ చేశారు. రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టుల భర్తీలో బీసీలకు తగిన రిజర్వేషన్లు కల్పించడం లేదంటూ హైదరాబాద్‌కు చెందిన సుజాత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. నియామకపు ప్రక్రియపై స్టే విధించింది. ఈ స్టేను ఎత్తేయాలని కోరుతూ టీఎస్పీఎస్సీ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి విచారణ జరిపారు. ప్రభుత్వ నియామకాల్లో బీసీలకు 29 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసిందని పిటిషనర్ వివరించారు. అయితే డిగ్రీ కాలేజీల్లో భర్తీ చేసే లెక్చరర్ల పోస్టుల భర్తీ విషయంలో ఈ ఉత్తర్వులను అమలు చేయడం లేదన్నారు. ఆ తరువాత టీఎస్పీఎస్సీ న్యాయవాది డి.బాలకిషన్‌రావు వాదనలు వినిపిస్తూ, రోస్టర్ ప్రకారం రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. 546 పోస్టుల్లో బీసీలకు 117 పోస్టులు కేటాయించామన్నారు. సర్వీసు నిబంధనల ప్రకారం పోస్టుల భర్తీ జరుగుతోందని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. పోస్టుల భర్తీ విషయంలో గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరించారు. లెక్చరర్ల పోస్టుల భర్తీకి అనుమతినిచ్చారు. -
ఈఎస్ఐసీలో 5వేల పోస్టుల భర్తీ
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ)లోని సుమారు 5వేల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు కార్మికశాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ వెల్లడించారు. దేశ రాజధానిలోని మయూర్ విహార్ ప్రాంతంలో ఈఎస్ఐసీ డిస్పెన్సరీ భవన శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఈఎస్ఐసీలోని వివిధ రకాలైన 5వేల పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. గ్రేటర్ నోయిడాలో ఈఎస్ఐసీ డిస్పెన్సరీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను పరిశీలిస్తున్నాం’ అని తెలిపారు. -
రాష్ట్రంలో 3,137 పోలీసు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో 3,137 పోలీసు పోస్టుల భర్తీకి కసరత్తు మొదలైంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసినట్టు ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ కుమార్‌విశ్వజిత్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎస్ఎల్పిఆర్బి.ఎపి.జిఓవి.ఐఎన్ వెబ్సైట్లో అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎస్ఐ, ఆర్ఎస్ఐ, ఫైర్ ఆఫీసర్ పోస్టులకు ఈ నెల 5 వ తేదీ నుంచి 24వ తేదీ లోగా, కానిస్టేబుల్, వార్డెన్, ఫైర్‌మెన్ పోస్టులకు ఈ నెల 12 నుంచి డిసెంబర్ 7 వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థి వయస్సు ధృవీకరణ, విద్యార్హత, శరీర కొలతలకు సంబంధించి ధృవపత్రాలు దరఖాస్తుతోపాటు ఆన్లైన్లోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఐ, ఆర్ఎస్ఐ, ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్ పోస్టులకు ఓసీ, బీసీలు రూ.600, ఎస్సీ, ఎస్టీలు రూ.300 వంతున ఫీజు చెల్లించాలి. వీరికి డిసెంబర్ 16వ తేదీ ప్రాథమిక పరీక్ష ఉంటుంది. పోలీస్ కానిస్టేబుల్, వార్డర్, ఫైర్‌మెన్ పోస్టులకు ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.300, ఎస్సీ, ఎస్టీ పోస్టులకు రూ.150 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. వీరికి 2019 జనవరి 6న ప్రాథమిక పరీక్ష ఉంటుంది. భర్తీ చేయనున్న పోస్టుల్లో ఎస్ఐ(సివిల్) 150, ఆర్ఎస్ఐ(ఏఆర్) 75, ఆర్ఎస్ఐ(ఏపీఎస్పీ) 75, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 20, డిప్యూటీ జైలర్(మెన్) 10, డిప్యూటీ జైలర్(ఉమెన్) 4, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ 50, పోలీస్ కానిస్టేబుల్(సివిల్) 1600, కానిస్టేబుల్(ఏఆర్) 300, పోలీస్ కానిస్టేబుల్(ఏపీఎస్పీ) 300, వార్డర్(మేల్) 100, వార్డర్(ఉమెన్) 23, ఫైర్‌మెన్ 400, డ్రైవర్ ఆపరేటర్స్ 30 పోస్టులు ఉన్నాయి. -
1,100 పోస్టుల భర్తీకి ఎస్ఎస్సీ ప్రకటన
న్యూఢిల్లీ: వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1,100కు పైగా పోస్టులను భర్తీ చేయనున్నట్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) గురువారం ప్రకటించింది. మొత్తం 130 విభాగాల్లో గ్రూప్– బి (నాన్– గెజిటెడ్), గ్రూప్– సికి సంబంధించిన 1136 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపింది. రీజియన్ల వారీగా ఉన్న ఈ పోస్టులకు దేశంలోని అభ్యర్థులు అన్ని రీజియన్లలోనూ పలు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, ఆన్లైన్ దరఖాస్తుకు సెప్టెంబర్ 30 గడువు అని వివరించింది. దరఖాస్తు విధానం, ఫీజు, అర్హత వివరాలు ఠీఠీఠీ.టటఛి.nజీఛి.జీnలో చూడాలని సూచించింది. -
ఏకకాలంలో 5 వేల పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఖాళీల భర్తీ ప్రక్రియ వేగం పుంజుకుంది. టీజీటీ, పీజీటీ పోస్టుల భర్తీ కోసం ఏర్పాటు చేసిన టీఆర్‌ఈఐఆర్‌బీ(తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు) నోటిఫికేషన్ జారీకి కసరత్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు గురువారం బోర్డు సభ్యులు భేటీ అయ్యారు. దాదాపు రెండున్నర గంటల పాటు సుదీర్ఘంగా చర్చించిన సొసైటీ కార్యదర్శులు నోటిఫికే షన్ ఎలా ఇవ్వాలనే అంశంపై ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, విద్యా శాఖ గురుకులాల్లో బోధన, బోధనేతర కేటగిరీల్లో 5 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 80 శాతం పోస్టులు నేరుగా భర్తీ చేయాలని బోర్డు భావిస్తోంది. వీటికి ఏకకాలంలో నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు రోస్టర్ రూపొందించాలని బోర్డు నిర్ణయించినట్లు తెలిసింది. జూన్ 15 కల్లా నోటిఫికేషన్! గురుకులాల్లో ఖాళీలపై సొసైటీలు ఇప్పటికే స్పష్టత ఇచ్చాయి. ఈ నేపథ్యంలో వీటిలో వేజ్ ఇండెంట్‌పై వారంలోగా స్పష్టత రానుంది. సొసైటీల వారీగా రోస్టర్ జాబితా సిద్ధమైతే నోటిఫికేషన్‌కు మార్గం సుగమమవుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 15 నాటికి నోటిఫికేషన్ ఇచ్చేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. నోటిఫికేషన్ వెలువడ్డాక పరీక్షల నిర్వహణ, ఫలితాలు, పోస్టుల భర్తీకి కనీసం 3 నెలల సమయం పడుతుందని సమాచారం. ఈ నెలాఖరులోగా తాజా నియామకాలపై స్పష్టత రానుంది. కాగా, గతేడాది టీఎస్పీఎస్సీ ద్వారా చేపట్టిన భర్తీ ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. -
ఎయి'డెడ్' స్కూల్స్
ప్రభుత్వ పాఠశాలలు తగినన్ని లేని రోజుల్లో పేద విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పేందుకు ఎందరో దాతలు, ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు నెలకొల్పిన ఎయిడెడ్ పాఠశాలలు నేడు పాలకుల నిర్లక్ష్యానికి కుదేలవుతున్నాయి. ఈ స్కూళ్లలో పోస్టుల భర్తీపై నిషేధం విధించడంతో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ఆయా పాఠశాలలకు దూరమవుతున్నారు. ఫలితంగా జిల్లాలో అనేక పాఠశాలలు మూతపడే పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. * పోస్టులు భర్తీ చేయక.. పిల్లలు రాక కుదేలు * టీచర్లకు పదోన్నతులు, రేషనలైజేషన్ నిల్ * విద్యార్థులకు యూనిఫామ్స్ కూడా ఇవ్వని వైనం ఏలూరు సిటీ : ఉన్నతాశయాలతో ఏర్పాటైన ఎయిడెడ్ పాఠశాలలు ప్రభుత్వ వైఖరితో మూతపడే పరి స్థితి వచ్చింది. పోస్టుల భర్తీపై బ్యాన్ విధించటంతో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు స్కూళ్లకు దూరమవుతున్నారు. జిల్లాలోని ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించలేక దీనావస్థకు చేరుకున్నాయి. స్కూళ్లలో పోస్టులు భర్తీ నిలుపుదల, రేషనలైజేషన్ చేయకపోవటంతో టీచర్లు లేని దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వ, జెడ్పీ యాజమాన్యాల్లోని ఉపాధ్యాయులకు అనేక సౌకర్యాలు కల్పిస్తుండగా, ఎయిడెడ్ ఉపాధ్యాయులు మాత్రం సౌకర్యాలు లేకపోగా వేధింపులకు గురవుతున్నారు. 37 యాక్ట్‌తో ఎయిడెడ్ ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. సర్వీసంతా కష్టపడి పనిచేసినా పూర్తిస్థాయిలో సొమ్మును తీసుకునే అవకాశంలేని దుస్థితిలో ఉన్నారు. ఏమిటీ వివక్ష : జిల్లాలో ఎయిడెడ్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో 240 ప్రాథమిక పాఠశాలలు, 40 ఉన్నత పాఠశాలలు, మరో ఐదు యూపీ స్కూళ్లు పనిచేస్తున్నాయి. ఆర్సీఎం, సీఎస్ఐ, ఐసీఎం, సీబీసీఎన్సీ, హిందూ ధార్మిక సంస్థలు, ముస్లిమ్ మైనార్టీ ఎయిడెడ్ విద్యాసంస్థలు ఉన్నాయి. ప్రభుత్వం ఎయిడెడ్ విద్యాసంస్థల్లో చదువుతోన్న పేదవర్గాల పిల్లలపై సవతితల్లి ప్రేమ చూపిస్తోంది. జిల్లాలో 17 వేల 500 మంది విద్యార్థులు ఈ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. విద్యార్థులకు కనీసం యూనిఫాం కూడా ఇవ్వడం లేదు. యాక్ట్ 37ను రద్దు చేయాల్సిందే ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు తీవ్ర మానసిక వేదన కలిగించే యాక్ట్ 37ను రద్దు చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. జీవితకాలమంతా ఉపాధ్యాయ వృత్తిలో కష్టపడి పనిచేయగా వచ్చిన సొమ్మును సైతం ప్రభుత్వం వెనక్కిలాక్కోవటం దారుణమని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ఎయిడెడ్ సర్వీస్‌ను రెగ్యులర్ సర్వీసుగా గుర్తించి ఇంక్రిమెంట్లు, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ పథకానికి అర్హత కల్పిస్తూ 1980లో ప్రభుత్వం ఉత్తర్వులతో రెగ్యులర్ సర్వీస్‌తో వేతనాలు పొందుతున్నారు. 2005లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేసిన చట్టం 37తో పరిస్థితులు తిరగబడ్డాయి. ఈ చట్టంతో 1980 నుంచి 2005 మధ్యకాలంలో పనిచేసిన ఉపాధ్యాయులు తీసుకున్న రెగ్యులర్ సర్వీస్ వేతనాలను రికవరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటివరకు తీసుకున్న ఇంక్రిమెంట్ల సొమ్మును సైతం రికవరీ చేయాల్సి రావటంతో పదవీవిరమణ అనంతరం ఉపాధ్యాయులకు చిల్లిగవ్వకూడా మిగిలే పరిస్థితి కన్పించటంలేదు. మూతపడుతున్న పాఠశాలలు ఏలూరులోని డగ్లస్ ఎయిడెడ్ పాఠశాల మూతపడింది. దెందులూరులో ఏళ్ల నాటి నైట్ హైస్కూల్‌ను సైతం మూసివేశారు. శనివారపుపేటలోని సీఎస్ఐ ప్రాథమిక పాఠశాల విలీనమైంది. ఉంగుటూరు, బుట్టాయిగూడెం, ఆకివీడు, పెనుగొండ పరిసర ప్రాంతాలు, ఉంగుటూరు, మెట్ట ప్రాంతాల్లోని ఎయిడెడ్ విద్యాసంస్థలు పిల్లలు లేక వెలవెలబోతున్నాయి. సుమారు 100కు పైగా ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయుడితో గుడ్డిలో మెల్లలా నెట్టుకొస్తున్నారు. ఉన్నత పాఠశాలలు సైతం దీనావస్థకు చేరుకున్నాయి. ఆకివీడులోని సీబీసీఎన్సీ ఉన్నత పాఠశాల భవనం శిథి లావస్థకు చేరింది. ఆయా ప్రాంతాల్లో ఎయిడెడ్ విద్యాసంస్థల యాజమాన్యాలు సైతం కోర్టులకు ఎక్కటంతో అభివృద్ధి నిలిచిపోయింది. రేషనలైజేషన్ చేయాలి ఎయిడెడ్ పాఠశాలల్లో రేషనలైజేషన్ చేయాలి. ఎయిడెడ్ ఉపాధ్యాయులకు హెల్త్‌కార్డులు మంజూరు చేయటంతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయులకు అందించే సౌకర్యాలు కల్పించాలి. ఎయిడెడ్ స్కూళ్లలో చదివే పిల్లలకు యూనిఫామ్స్ పంపిణీ చేయాలి. ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. - కేజే విజయకుమార్, జిల్లా అధ్యక్షుడు, ఎయిడెడ్ స్కూల్స్ టీచర్స్ యూనియన్ పాఠశాలలపై వివక్ష ఎయిడెడ్ విద్యా సంస్థలపై ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపిస్తోంది. యాక్ట్ 37ను వెంటనే రద్దు చేసి, అన్ఎయిడెడ్ సర్వీస్‌కు రక్షణ కల్పించాలి. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసుకునే అవకాశం కల్పిస్తూ నిషేధం ఎత్తివేయాలి. ఎయిడెడ్ స్కూళ్లలోని ఉపాధ్యాయులకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలి. - టి.కొండలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎయిడెడ్ స్కూల్స్ టీచర్స్ యూనియన్