సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఖాళీల భర్తీ ప్రక్రియ వేగం పుంజుకుంది. టీజీటీ, పీజీటీ పోస్టుల భర్తీ కోసం ఏర్పాటు చేసిన టీఆర్‌ఈఐఆర్‌బీ(తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు) నోటిఫికేషన్ జారీకి కసరత్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు గురువారం బోర్డు సభ్యులు భేటీ అయ్యారు. దాదాపు రెండున్నర గంటల పాటు సుదీర్ఘంగా చర్చించిన సొసైటీ కార్యదర్శులు నోటిఫికే షన్ ఎలా ఇవ్వాలనే అంశంపై ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, విద్యా శాఖ గురుకులాల్లో బోధన, బోధనేతర కేటగిరీల్లో 5 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 80 శాతం పోస్టులు నేరుగా భర్తీ చేయాలని బోర్డు భావిస్తోంది. వీటికి ఏకకాలంలో నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు రోస్టర్ రూపొందించాలని బోర్డు నిర్ణయించినట్లు తెలిసింది.
జూన్ 15 కల్లా నోటిఫికేషన్!
గురుకులాల్లో ఖాళీలపై సొసైటీలు ఇప్పటికే స్పష్టత ఇచ్చాయి. ఈ నేపథ్యంలో వీటిలో వేజ్ ఇండెంట్‌పై వారంలోగా స్పష్టత రానుంది. సొసైటీల వారీగా రోస్టర్ జాబితా సిద్ధమైతే నోటిఫికేషన్‌కు మార్గం సుగమమవుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 15 నాటికి నోటిఫికేషన్ ఇచ్చేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
నోటిఫికేషన్ వెలువడ్డాక పరీక్షల నిర్వహణ, ఫలితాలు, పోస్టుల భర్తీకి కనీసం 3 నెలల సమయం పడుతుందని సమాచారం. ఈ నెలాఖరులోగా తాజా నియామకాలపై స్పష్టత రానుంది. కాగా, గతేడాది టీఎస్‌పీఎస్సీ ద్వారా చేపట్టిన భర్తీ ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment