సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ఇతర ఖాళీలన్నీ భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నియామక ప్రక్రియ కోసం ప్రత్యేకంగా రిక్రూట్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్ మంగళవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నతాధికారులతో ఈ అంశంపై సమీక్షించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీల్లో ఖాళీలకు సంబంధించిన వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం నియామకాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అయితే రాష్ట్రంలోని 11 యూనివర్సిటీలు ఎవరికి వారుగా నియామకాలు చేపట్టకుండా ఉమ్మడి నియామక విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు.
వర్సిటీల వారీగా రిక్రూట్‌మెంట్ జరగడం వల్ల గతంలో వచ్చిన ఆరోపణలు, విమర్శలను పరిగణనలోకి తీసుకుని ఒకే రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నిపుణులతో కూడిన ప్రత్యేక కమిటీ కోసం కొన్ని పేర్లు పంపాలని సూచించినట్టు తెలిసింది. రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి త్వరలోనే విధి విధానాలను ఖరారు చేయనున్నారు.
సగానికిపైగా ఖాళీలు..
రాష్ట్రంలోని 11 వర్సిటీల్లో మొత్తం 2,828 పోస్టులు ఉండగా.. అందులో 1,869 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2017లో విశ్వవిద్యాలయాల్లో ఖాళీలపై ప్రభుత్వం నివేదిక తెప్పించుకుంది. అప్పట్లోనే 1,528 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించి.. వాటిలో 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు ఆ పోస్టుల భర్తీ ముందుకు పడలేదు. రిజర్వేషన్ల అంశం, న్యాయపరమైన వివాదాలు, నియామక విధానంపై కసరత్తు పేరిట విద్యాశాఖ అధికారులు కాలయాపన చేశారనే ఆరోపణలున్నాయి.
ఈ క్రమంలో మరికొందరు పదవీ విరమణ చేయడంతో 2021 జనవరి చివరినాటికి యూనివర్సిటీల్లో ఖాళీల సంఖ్య 1,869కి చేరింది. ఇందులో 238 ప్రొఫెసర్ పోస్టులు, 781 అసోసియేట్ ప్రొఫెసర్, 850 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. ఇలా భారీ సంఖ్యలో ఖాళీలు ఏర్పడటంతో తాత్కాలిక, కాంట్రాక్టు అధ్యాపకులతో బోధన కొనసాగిస్తున్నారు. ఫలితంగా విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఎట్టకేలకు పోస్టుల భర్తీకి ప్రభుత్వం ముందుకు వచ్చింది.
ట్రిపుల్‌ఐటీ నిరసనపై నివేదిక
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల నిరనసకు సంబంధించి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమగ్ర వివరాలతో సీఎం కేసీఆర్‌కు నివేదిక అందజేశారు. విద్యార్థులతో చర్చలు ఫలప్రదం కావడం, అక్కడ తీసుకున్న చర్యలను వివరించారు. ట్రిపుల్‌ఐటీలో వెంటనే మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని, విద్యార్థుల డిమాండ్లు తక్షణం కొన్నింటిని, ప్రాధాన్యతా క్రమంలో మరికొన్నింటిని నెరవేర్చాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.
వర్సిటీల్లో పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్!
Published Wed, Jun 22 2022 1:01 AM | Last Updated on Wed, Jun 22 2022 1:10 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment