IIIT Basar
-
బీటెక్‌లోకి అనుమతించండి
సాక్షి, హైదరాబాద్: రెండేళ్లపాటు కరోనా కారణంగా పీయూసీలో తక్కువ జీపీఏ వచ్చినందున.. మానవతా దృక్పథంతో బీటెక్‌లోకి అనుమతించాలని బాసర ట్రిపుల్ ఐటీలో చదివిన పలువురు విద్యార్థులు విద్యా మంత్రి సబిత ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రిని కలిసి వేడుకున్నారు. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చా మని తమ పరిస్థితిని వివరించారు. టెన్త్‌లో అత్య« దిక మార్కులు వస్తేనే బాసర ట్రిపుల్ ఐటీలో సీటు వస్తుందని ప్రభుత్వానికీ తెలుసునని వారు స్పష్టం చేశారు. పీయూసీలో గ్రేడ్ తక్కువ రావడానికి రెండేళ్లుగా ఉన్న పరిస్థి తులే కారణమని గుర్తించకపోవడం సరికాదని పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా ఆన్లైన్ క్లాసులు నిర్వహించారని, తమ కుటుంబాల్లో సెల్‌ఫోన్ కూడా కొనలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి స్మార్ట్ ఫోన్లు కొనిచ్చినా నెట్ బ్యాలెన్స్‌కు ఖర్చు పెట్టలేకపోయామని వారు తెలిపారు. నెట్వర్క్ సరిగ్గా పనిచేయని పల్లెల్లో ఉండటం వల్ల ఆన్లైన్ క్లాసులు సరిగా వినలేకపోయామనినిజామాబాద్‌కు చెందిన విద్యార్థిని ఎం.అంజలి వాపోయింది. విద్యార్థుల ఆవేదనపై ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫె సర్ ఆర్.లింబాద్రి స్పందిస్తూ వెంటనే విషయాన్ని బాసర అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విద్యా ర్థులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.ఈ విషయమై బాసర ట్రిపుల్ ఐటీ వీసీ ప్రొఫెసర్ వి.వెంకట రమణ స్పంది స్తూ, 6 జీపీఏ లేకుండా ఇంజనీరింగ్‌లోకి అనుమ తించకూడదనే నిబంధన ఉందని స్పష్టం చేశా రు. అయినప్పటికీ ఈ విషయాన్ని బోర్డ్ సమా వేశంలో చర్చిస్తామని, సానుకూల నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. -
విద్యార్థులు గ్లోబల్ లీడర్లుగా ఎదగాలి
బాసర(ముధోల్): ప్రతిభ ఎవరి సొత్తూ కాదని, ఐడియాలో దమ్ముంటే ఎవరూ ఆపలేరని, గ్లోబల్ లీడర్‌గా ఎదగాలంటే మంచి ఆలోచనలతో నిరంతరం కృషి చేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ లో శనివారం నిర్వహించిన 5వ స్నాతకోత్సవ కార్య క్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వచ్చే 20 ఏళ్లలో ప్రపంచం పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో నడుస్తుందని, దానికి తగ్గట్టు మనం కూడా రూపాంతరం చెందాలన్నారు. బాసర ట్రిపుల్ ఐటీపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని, సమస్యల పరిష్కారానికి దాదాపు రూ.25 కోట్లు అవసరమని కళాశాల అధికారులు కోరగా.. అవి సరిపోవంటూ రూ.27 కోట్లు సీఎం మంజూరు చేశారని వివరించారు. స్టేట్ యూనివర్సిటీగా ఉన్న ట్రిపుల్ ఐటీని నేషనల్ యూనివర్సిటీగా తీర్చిదిద్దే బాధ్యత విద్యార్థులదేనన్నారు. ట్రిపుల్ ఐటీకి వరాలు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై కేటీఆర్ వరాల జల్లు కురిపించారు. ఇకపై విద్యార్థులకు మిషన్ భగీరథ నీళ్లు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. మంత్రి సబితాఇంద్రారెడ్డి విన్నపం మేరకు నాలుగు వేల మంది విద్యార్థినులు చదువుతున్న ట్రిపుల్ ఐటీలో గైనకాలజీ డాక్టర్లు అందుబాటులో ఉండేలా పది పడకల ఆస్పత్రి నిర్మించనున్నట్లు ప్రకటించారు. విద్యార్థులకు సోలార్ ఎనర్జీ అందించి, క్యాంపస్ లోని చెరువును సుందరీకరణ చేస్తామని, విద్యా ర్థుల అవసరాల మేరకు సైన్స్‌ల్యాబ్ ఏర్పాటు చేస్తా మని తెలిపారు. వీటికి అవసరమయ్యే దాదాపు రూ.5కోట్లు త్వరలో మంజూరు చేస్తామన్నారు. ల్యాప్‌టాప్‌లు ప్రదానం గత సెప్టెంబర్‌లో ట్రిపుల్ ఐటీని సందర్శించిన కేటీఆర్ విద్యార్థులకు అవసరమైన ల్యాప్‌టాప్‌లు అందిస్తామని హామీనిచ్చారు. ఆ హామీని నెరవేరుస్తూ శనివారం స్థానిక కాన్ఫరెన్స్ భవనంలో పలువురు విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ప్రదానం చేశారు. స్నాతకోత్సవ కార్యక్రమంలో 38మంది విద్యార్థులకు మంత్రి కేటీఆర్ మెడల్స్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితాఇంద్రారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, వీసీ వెంకటరమణ, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్ తదితరులు పాల్గొన్నారు. -
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు కేటీఆర్ వరాల జల్లు
సాక్షి, నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు మంత్రి కేటీఆర్ వరాల జల్లు కురిపించారు. మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌కు అందిస్తామన్నారు. సైన్స్ బ్లాక్ ఏర్పాటుకు రూ.5 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. క్యాంపస్‌కు విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నందున మొత్తం సోలార్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. యూనివర్సిటీలో ఉన్న చెరువును సుందరీకరణ చేస్తామని తెలిపారు. వెంటపడి పనులు పూర్తి చేయించే బాధ్యత తనదేన్నారు. నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ ఐదో స్నాతకోత్సవానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం 10 పడకలతో కూడిన ప్రత్యేక దవాఖాన ఏర్పాటు చేస్తామన్నారు. ట్రిపుల్ ఐటీకి మళ్లీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని పేర్కొన్నారు. శానిటేషన్ సిబ్బందికి యంత్రాలు మంజూరు చేస్తామని, విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తామన్నారు. ఉన్నత విద్యాలయాల్లో మౌలికవసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. చదవండి: బాసర ట్రిపుల్ ఐటీ అధికారులపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం సాంకేతిక యుగంలో అవకాశాలకు కొదువ లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉందని, ప్రపంచంతో పోటీపడే సత్తా ఉందని కొనియాడారు. విద్యార్థులు సృజనతో ఎదిగేందుకు కృషి చేయాలని సూచించారు. ఆర్జీయూకేటీలో 2,200 మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందజేస్తున్నామని అన్నారు. పీ1, పీ2లో 1500 మంది విద్యార్థుకు డెస్క్‌టాప్‌లు అందిస్తున్నామని చెప్పారు. ఆర్జీయూకేటీలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. టీహబ్‌తో బాసర ట్రిపుల్ ఐటీ ఒప్పందం కుదుర్చుకుందని కేటీఆర్ తెలిపారు. అనేక స్టార్టప్‌లకు తెలంగాణ వేదికగా మారుతోందని, ప్రఖ్యాత సంస్థలు అన్నీ ఇక్కడికే వస్తున్నాయని పేర్కొన్నారు. ఔత్సాహికులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందన్నారు. మేధస్సు మీద విశ్వాసం ఉంటే ఎంత దాకైనా పోవచ్చని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహా అనేక కోర్సులకు మంచి భవిష్యత్తు ఉందని తెలిపారు. ఈ కోర్సులను అర్జీయూకేటి నుంచి ప్రారంభించాలని వీసీని ఆదేశించినట్లు పేర్కొన్నారు. -
బాసర ట్రిపుల్ ఐటీలో ర్యాగింగ్!
బాసర(ముధోల్): బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేయడంతో పోలీసులు ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. బాసర ట్రిపుల్ ఐటీలోని స్థానిక కృష్ణా బాయిస్ హాస్టల్ రూం నంబర్ 228ను పీయూసీ–1 విద్యార్థులకు అధికారులు కేటాయించారు. అయితే ఆ గదిలోని నూతన వస్తువులైన బెడ్ కార్టులు, ట్యూబ్ లైట్లను పీయూసీ–2 విద్యార్థులు జూనియర్లను బెదిరించి తీసుకెళ్లారు. ఇటీవల డైరెక్టర్ సతీశ్‌కుమార్ హాస్టల్ భవనాలు తనిఖీ చేసిన సందర్భంలో ఈ విషయాన్ని జూనియర్లు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో అప్పటి నుంచి కక్ష సాధింపు చర్యగా సీనియర్లు ర్యాగింగ్ చేయడం మొదలుపెట్టారు. రోజు రోజుకూ సీనియర్ల ర్యాగింగ్ శృతిమించడంతో బాధిత విద్యార్థులు పోలీసులను ఆశ్రయించారు. కళాశాల వార్డెన్ ఫిర్యాదు మేరకు తెలంగాణ ప్రొహిబిషన్ యాక్ట్ సెక్షన్ 323, 506, రాగింగ్ సెక్షన్ 4(1/2/3) ప్రకారం ఐదుగురు విద్యార్థులపై కేసులు నమోదు చేసినట్టు ఎస్సై మహేశ్ తెలిపారు. -
ట్రిపుల్ ఐటీలో ఊడిపడిన సీలింగ్ ఫ్యాన్
బాసర: బాసర ట్రిపుల్ ఐటీలో సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. ఈ ఘటనలో ఓ విద్యార్థి గాయపడ్డాడు. ఇటీవలే కళాశాల భవనంలో పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ ఘటనలో విద్యార్థి తలకు గాయాలయ్యాయి. ఈ ఘటన మరువక ముందే బాయ్స్ హాస్టల్–2లోని ఓ గదిలో శనివారం రాత్రి నడుస్తున్న సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. విద్యార్థులు నిద్రిస్తున్న సమయంలో ఫ్యాన్ ఊడిపడటంతో గదిలో పడుకున్న విద్యార్థి మెడ భాగంలో గాయాల య్యాయి. వెంటనే ఇతర విద్యార్థులు అధికా రులకు సమాచారం ఇవ్వడంతో వారు వర్సిటీ లోని ఆస్పత్రిలో విద్యార్థికి ప్రథమ చికిత్స చేయించారు. ఫ్యాన్ తలపై పడి ఉంటే ఘోరం జరిగేదని విద్యార్థులు పేర్కొంటున్నారు. -
‘హెల్త్ ఇన్సూరెన్స్’ పేరిట రూ.700.. ట్రిపుల్ ఐటీ.. ‘బీమా’ ఏదీ..?
నిర్మల్/బాసర: పేదింటి విద్యార్థులు చదివే బాసర ట్రిపుల్ఐటీ తీరెలా ఉందో మరోమారు బయటపడింది. ఇటీవల చనిపోయిన తమ విద్యార్థి సంజయ్‌కిరణ్ కుటుంబాన్ని పరామర్శించని వర్సిటీ అధికారులు.. కనీసం అతడికి ‘ఆరోగ్యబీమా’కూడా ఇవ్వలేదన్న విషయం వెలుగులోకి వచ్చింది. ‘హెల్త్ ఇన్సూరెన్స్’ పేరిట ప్రతీ విద్యార్థి నుంచి రెండేళ్లకోసారి రూ.700 చొప్పున అధికారులు వసూలు చేస్తున్నారు. డబ్బులైతే సకాలంలో తీసుకున్నారు కానీ విద్యార్థులకు అందించాల్సి బీమాపై మాత్రం దృష్టిపెట్టలేదు. కొన్నేళ్లుగా అసలు ఇన్సూరెన్స్ కంపెనీలనే సంప్రదించలేదన్న విషయం విస్మయానికి గురిచేస్తోంది. ఈక్రమంలోనే సంజయ్కిరణ్కు ఆరోగ్యబీమా దక్కలేదని స్పష్టమవుతోంది. రూ.700 చొప్పున.. బాసర రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ)లో విద్యార్థులకు హెల్త్ ఇన్సూరెన్స్‌ను 2017లో అప్పటి ఇన్చార్జి వీసీ అశోక్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. రెండేళ్లకు రూ.700 చొప్పున విద్యార్థుల నుంచి వసూలుచేశారు. ఏడాదికి రూ.350 చొప్పున వర్తిస్తుందని, ఆ మేరకు బీమా అందుతుందని చెప్పారు. రెండేళ్లపాటు వివిధ సంస్థలకు చెల్లింపులు చేశారు. ఆపై ఇన్చార్జి వీసీ మారడం, మరో ఐఏఎస్ రాహుల్ బొజ్జా రావడం, కోవిడ్ పరిణామాలతో విద్యార్థుల బీమా అటకెక్కింది. సంస్థలు ముందుకు రాలేదని.. కోవిడ్ సమయంలోనూ విద్యార్థుల నుంచి డబ్బులను తీసుకున్నారు. కానీ ఏ బీమా సంస్థకు బాధ్యతను అప్పగించలేదు. ఈక్రమంలో 2019–20, 2020–21 విద్యాసంవత్సరాల్లో వసూలుచేసిన డబ్బులు ఏమయ్యాయనే దానికి సమాధానం లేదు. రెండేళ్లకు రూ.700 చొప్పున తొమ్మిదివేల మంది విద్యార్థుల నుంచి రూ.63 లక్షలు వసూలు చేశారు. సంజయ్‌కు దక్కని బీమా.. వరంగల్‌రూరల్ జిల్లా ఎల్గూరు రంగంపేటకు చెందిన శాబోతు సంజయ్‌కిరణ్ అనే పీయూసీ–2 విద్యార్థి ఈనెల 26న మృతిచెందాడు. సంజయ్ సైతం వర్సిటీకి రూ.700 హెల్త్ ఇన్సూరెన్స్ చెల్లించాడు. అనారోగ్యంతో బాధపడుతూ కొద్దిరోజుల క్రితం మరణించిన సంజయ్‌కు ఆరోగ్యబీమా దక్కలేదు. బీమా రాలేదు.. వర్సిటీలో భోజనం బాగుండదని, తినాలనిపించట్లేదని సంజయ్ చెప్పేవాడు. దీంతోనే అతడి ఆరోగ్యం దెబ్బతింది. చికిత్స కోసం శక్తికి మించి రూ.16 లక్షలు ఖర్చుచేశాం. కానీ సంజయ్ ప్రాణాలు దక్కించుకోలేకపోయాం. వర్సిటీకి డబ్బు లు చెల్లించినా వైద్యానికి ఎలాంటి ఆరోగ్యబీమా అందలేదు. –శాబోతు శ్రీధర్, సంజయ్‌కిరణ్ తండ్రి విచారణ చేయించాం.. 15 రోజుల క్రితమే ఇన్చార్జి వీసీగా బాధ్యతలు చేపట్టాను. విద్యార్థులు చెల్లించిన బీమా డబ్బులు ఏమయ్యాయి, సంస్థలు ఎందుకు ముందుకు రాలేదనే దానిపై ఓయూ అధ్యాపకులతో విచారణ చేయించాం. కోవిడ్ కారణంగా బీమా సంస్థలు ముందుకు రాలేదని తేలింది. బీమా సంస్థల ను ఫైనల్‌చేసి, చెల్లించిన డబ్బుల మేరకు విద్యార్థులకు ఆరోగ్యబీమా చేస్తాం. – ప్రొ.వెంకటరమణ, ఇన్చార్జి వీసీ, ఆర్జీయూకేటీ -
వర్సిటీల్లో పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ఇతర ఖాళీలన్నీ భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నియామక ప్రక్రియ కోసం ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్ మంగళవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నతాధికారులతో ఈ అంశంపై సమీక్షించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీల్లో ఖాళీలకు సంబంధించిన వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం నియామకాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అయితే రాష్ట్రంలోని 11 యూనివర్సిటీలు ఎవరికి వారుగా నియామకాలు చేపట్టకుండా ఉమ్మడి నియామక విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. వర్సిటీల వారీగా రిక్రూట్మెంట్ జరగడం వల్ల గతంలో వచ్చిన ఆరోపణలు, విమర్శలను పరిగణనలోకి తీసుకుని ఒకే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నిపుణులతో కూడిన ప్రత్యేక కమిటీ కోసం కొన్ని పేర్లు పంపాలని సూచించినట్టు తెలిసింది. రిక్రూట్మెంట్కు సంబంధించి త్వరలోనే విధి విధానాలను ఖరారు చేయనున్నారు. సగానికిపైగా ఖాళీలు.. రాష్ట్రంలోని 11 వర్సిటీల్లో మొత్తం 2,828 పోస్టులు ఉండగా.. అందులో 1,869 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2017లో విశ్వవిద్యాలయాల్లో ఖాళీలపై ప్రభుత్వం నివేదిక తెప్పించుకుంది. అప్పట్లోనే 1,528 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించి.. వాటిలో 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు ఆ పోస్టుల భర్తీ ముందుకు పడలేదు. రిజర్వేషన్ల అంశం, న్యాయపరమైన వివాదాలు, నియామక విధానంపై కసరత్తు పేరిట విద్యాశాఖ అధికారులు కాలయాపన చేశారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో మరికొందరు పదవీ విరమణ చేయడంతో 2021 జనవరి చివరినాటికి యూనివర్సిటీల్లో ఖాళీల సంఖ్య 1,869కి చేరింది. ఇందులో 238 ప్రొఫెసర్ పోస్టులు, 781 అసోసియేట్ ప్రొఫెసర్, 850 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. ఇలా భారీ సంఖ్యలో ఖాళీలు ఏర్పడటంతో తాత్కాలిక, కాంట్రాక్టు అధ్యాపకులతో బోధన కొనసాగిస్తున్నారు. ఫలితంగా విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఎట్టకేలకు పోస్టుల భర్తీకి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ట్రిపుల్ఐటీ నిరసనపై నివేదిక బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల నిరనసకు సంబంధించి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమగ్ర వివరాలతో సీఎం కేసీఆర్‌కు నివేదిక అందజేశారు. విద్యార్థులతో చర్చలు ఫలప్రదం కావడం, అక్కడ తీసుకున్న చర్యలను వివరించారు. ట్రిపుల్‌ఐటీలో వెంటనే మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని, విద్యార్థుల డిమాండ్లు తక్షణం కొన్నింటిని, ప్రాధాన్యతా క్రమంలో మరికొన్నింటిని నెరవేర్చాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. -
సెక్యూరిటీ గార్డులపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆగ్రహం
సాక్షి, బాసర : బాసర ట్రిపుల్ఐటీ విశ్వవిద్యాలయాన్ని సోమవారం రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, నిర్మల్ ఎస్పీ శశి ధర్ రాజులు కలిసి సందర్శించారు. మంత్రి మా ట్లాడుతూ విద్యార్థినులను వేధిస్తున్న కళాశాల కెమిస్ట్రీ విభాగాధిపతి రవి వరాలను విధులు నుంచి శాశ్వతంగా తొలగించి కేసులు నమోదు చే యడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో కళా శాలలో ఇటువంటి చర్యలు పునరావృత్తం కాకుం డా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. తులసి వనంలో గంజాయి మొక్కలాంటి వారి వల్ల కళాశాల మొత్తానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. కళాశాలలో 60 శాతం బాలికలే ఉన్నందువల్ల ట్రిపుల్ఐటీకి ప్రత్యేక మహిళా ఎస్సైని నియమించాలని జిల్లా ఎస్పీ శశిధర్‌రాజుకు సూచిం చారు. కళాశాలలో విద్యార్థినులపై వే« దింపులు జరుగుతున్న విషయాన్ని గుర్తించిన మహిళ వార్డేన్ నందినిని మంత్రి అభినందించారు. కళాశాలలో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సెక్యూరిటీ గార్డులపై మంత్రి ఆగ్రహం.. ఔట్ గేట్ సెక్యూరిటీ గార్డులపై మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాలలోని సంబంధిత అధికారుల అనుమతి లేకుండా విద్యార్థులను ఎలా బయటికి పంపిస్తారని మందలించారు. కళాశాలలోని ప్రత్యేక చాంబర్లో పరి పాలన అధికారి శ్రీహరితోపాటు టీచించ్, నాన్ టీచింగ్ సభ్యులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఇతర నాయకులతో కలిసి హరితహారంలో పాల్గొన్నారు. భైంసా డీఎస్పీ రాజేష్‌భ ల్లా, ముథోల్ సీఐ శ్రీనివాస్, బాసర ఎస్సై రాజు, బాసర సర్పంచ్ లక్ష్మన్‌రావు, కిర్గుల్ సర్పంచ్ సు ధాకర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు నర్సింగ్‌రావు, కళాశాల పరిపాలనాధికారి శ్రీహరి, నాయకులు కోర్వశ్యాం, దేవేందర్, ట్రిపుల్ఐటీ అధికారులు ఉన్నారు. -
ట్రీపుల్ ఐటీ పిలుస్తోంది
కరీంనగర్‌ఎడ్యుకేషన్: పదో తరగతి పూర్తి కాగానే విద్యార్థులు, తల్లిదండ్రులు భవిష్యత్ బంగారమయ్యే దారులవైపు కలలు కంటుంటారు. ఇందులో బాసర ట్రీపుల్ ఐటీ ఒకటి. ప్రభుత్వ సంస్థల్లో చదువు పూర్తి చేసిన విద్యార్థులకు ప్రాధాన్యతనివ్వడంతో అధికశాతం విద్యార్థులు ట్రీపుల్‌ఐటీ వైపు దృష్టిపెడుతున్నారు. అంది వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకుంటున్నారు. విద్యార్థుల తలిదండ్రులు ట్రీపుల్ ఐటీకి ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక అయోమయపడుతుంటారు. చిన్న పొరపాట్లతో చేజేతులార సీట్లు కోల్పోవడం చూస్తునే ఉంటాం. ఈ సందర్భంగా ట్రిపుల్‌ఐటీలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోనే విధానం ‘సాక్షి’ మీకోసం అందిస్తోంది. వసతులు.. విద్యార్థులకు భోజనం, వసతి సౌకర్యాలతోపాటు రెండు జతల యూనిఫాం, షూలు, ల్యాప్‌టాప్‌లు తదితర సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రిపుల్ఐటీ అధికారులు కోరారు. జత చేయాల్సిన పత్రాలు.. ఆన్లైన్ దరఖాస్తు సమర్పించినప్పుడు ఇచ్చిన రశీదు, పదో తరగతి హాల్ టికెట్, మార్కుల లిస్టు, నివాసం, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కుల ధ్రువీకరణపత్రాలు, వికంలాగులైతే వైకల్య ధ్రువీకరణపత్రం, సైనికోద్యోగుల పిల్లలు సంబంధిత అధికారి జారీ చేసిన ధ్రువీకరణపత్రం, ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులైతే సంబంధిత అధికారి జారీ చేసిన ధ్రువీకరణపత్రాలు సమర్పించాలి. ఫీజుల వివరాలు.. రాష్ట్ర పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ఏడాది రూ.36 వేల ఫీజు చెల్లించాలి. ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన వారు చెల్లించాల్సి అవసరం లేదు. రిజిష్టేషన్ ఫీజు కింద ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1000, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. క్యాష్ డిపాజిట్ కింద ఏ కేటగిరీ అభ్యర్థులైనా 2000 చెల్లించాలి. (దీనిని తిరిగి ఇస్తారు). ఇతర రాష్ట్రాల, గల్ఫ్ దేశాల్లో పనిచేసే వారి పిల్లలు ఏడాదికి రూ.1.36 ల„ýక్షలు, ఎన్నారై విద్యార్థులు రూ.3 లక్షల ట్యూషన్ ఫీజు చెల్లించాలి . అర్హతలు.. అభ్యర్థులు ప్రథమ ప్రయత్నంలో 2019–ఎస్ఎస్సీ, తత్సామాన పరీక్షల్లో రెగ్యులర్‌గా ఉత్తీర్ణులై ఉండాలి. 2019 డిసెంబర్ 31 నాటికి 18 ఏళ్లు నిండకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 21 ఏళ్లు నిండకూడదు. దరఖాస్తు విధానం.. అభ్యర్థులు ఈ–సేవా లేదా మీ–సేవా కేంద్రాల ద్వారా ఆర్జీయూకేటీ వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఓసీ, బీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుం రూ.200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.150 చెల్లించాలి. దరఖాస్తు ఫీజుతోపాటు సర్వీసు చార్జి కింద ఆన్లైన్లో అదనంగా రూ.25 చెల్లించాలి. అడ్మిషన్ల పద్ధతి.. పదో తరగతిలో గ్రేడ్ పాయింట్ ఏవరేజ్ (జీపీఏ) ఆధారంగా మెరిట్ పద్ధతిలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఒకే జీపీఏ ఉన్న అభ్యర్థులకు సబ్జెక్టు వారీగా పొందిన గ్రేడ్ ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వారి జీపీఏకు 0.4 డిప్రివేషన్ స్కోర్‌ను అదనంగా కలుపుతారు. మోడల్, బాలికల, బాలుర పాఠశాల విద్యార్థులకు సైతం 0.4 జీపీఏ అదనంగా కలుపుతారు. సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబాటుకు గురైన విద్యార్థులకు ఇచ్చే వేయింటేజీగా పేర్కొన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో 85 శాతం సీట్లను స్థానికంగా, మిగిలిన 15 శాతం సీట్లను మెరిట్ కోటాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులకు కేటాయించారు. రాష్ట్రపతి ఉత్తర్వులు 371 ఆర్టికల్–డీ, సెక్షన్–95/2014 మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. -
భగ్గుమన్న ‘బాసర’ విద్యార్థులు
నిర్మల్: తమ సమస్యల పరిష్కారం కోసం బాసరలో ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేపట్టిన ఆందోళన రెండోరోజూ కొనసాగింది. ఏళ్లుగా తాము ఎదుర్కొంటున్న ‘ట్రబుల్స్’పై ట్రిపుల్ ఐటీయన్లు గళమెత్తారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని సోమవారం ఉదయం నుంచి మంగళవారం రాత్రి వరకు ఆందోళనలు నిర్వహించారు. దీంతో అధికారులు సోమ వారం రాత్రి నిరవధిక సెలవులు ప్రకటించి, మెస్‌లను మూసివేశారు. అయినా విద్యార్థులు ఇళ్లకు వెళ్లకుండా మంగళవారం అక్కడే బైఠాయించారు. గవర్నర్ నరసింహన్, ఐటీ మంత్రి కేటీఆర్ వచ్చేంత వరకు కదిలేది లేదని భీష్మిం చు కొని కూర్చున్నారు. చివరకు విద్యార్థుల పలు డిమాండ్లకు ఇన్చార్జి వీసీ అశోక్ ఒప్పుకున్నా వారు సంతృప్తి చెందలేదు. సొమ్మసిల్లిన విద్యార్థులు అధికారులు సెలవులు ప్రకటించడంపై విద్యార్థులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత కళాశాలతో పాటు మెస్‌లను మూసి వేసినా ఇళ్లకు వెళ్లకుండా రోజంతా ఎండలోనే బైఠాయించారు. పలుమార్లు ఇన్చార్జి వీసీ అశోక్ సంప్రదింపులు జరిపినా విద్యార్థులు స్పందించలేదు. ఎండలో తిండి లేకుండా ఉండటంతో చాలామంది విద్యార్థులు సొమ్మసిల్లి పడిపోయారు. వారిని అప్పటికప్పుడు తోటి విద్యార్థులే గదుల్లోకి తీసుకెళ్లి సపర్యలు చేశారు. ఇంత జరిగినా అధికారులు మెస్‌లను తెరవకపోవడం, తమకు భోజనం అందించకపోవడంతో విద్యార్థులు మరింత ఆగ్రహించారు. స్థానిక పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం రాత్రి పలువురు విద్యార్థులు ఇంటిబాట పట్టారు. ట్విట్టర్ ద్వారా కేటీఆర్ దృష్టికి.. తమ సమస్యలపై ఆర్జీయూకేటీ విద్యార్థులు నేరుగా మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా వినతులను పంపించారు. దీనికి స్పందించిన కేటీఆర్ సోమవారం రాత్రి వీసీతో మాట్లాడి, తన వద్దకు విద్యార్థుల బృందాన్ని పంపాలని, వారి తో మాట్లాడి పరిష్కరిస్తానని సూచించినట్లు తెలిసింది. సమస్యల పరిష్కారానికి కృషి: ఈటల జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని పలు గ్రామాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి వస్తున్న మంత్రి ఈటల రాజేందర్‌ను మోత్కులగూడెం చౌరస్తా వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు కలిశారు. బాసర ట్రిపుల్ ఐటీలో తమ పిల్లలకు తాగునీరు లేక అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈటల హామీ ఇచ్చారు. రాత్రి మెస్‌లు తెరిచిన అధికారులు బాసర: విద్యార్థుల ఆందోళనతో మంగళవారం రాత్రి మెస్‌లు తెరిపించారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ అనంతరం వెళ్లిపోవాలని సూచించారు. సెలవులు ఎప్పటి వరకు అన్నది త్వరలో ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. -
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య
ఆదిలాబాద్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ భవనంపై నుంచి దూకి విద్యార్థి నాగరాజు ఆదివారం ఉదయం ఆత్మహత్యకు యత్నించారు. సహచర విద్యార్థులు వెంటనే స్పందించి కళాశాల ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఉన్నతాధికారులు వెంటనే అప్రమత్తమై నాగరాజును నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాగరాజు మరణించాడు. నల్గొండ జిల్లా కనగల్ మండలం గౌరారం ఏంచ గ్రామానికి చెందిన నాగరాజు బాసర ట్రిపుల్ ఐటీలో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. అయితే అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా సహచర విద్యార్థులను పోలీసులు విచారిస్తున్నారు. అయితే అధికారు నిర్లక్ష్యం వల్లే నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు.