హెల్త్‌ఇన్సూరెన్స్ రశీదు
నిర్మల్/బాసర: పేదింటి విద్యార్థులు చదివే బాసర ట్రిపుల్‌ఐటీ తీరెలా ఉందో మరోమారు బయటపడింది. ఇటీవల చనిపోయిన తమ విద్యార్థి సంజయ్‌కిరణ్ కుటుంబాన్ని పరామర్శించని వర్సిటీ అధికారులు.. కనీసం అతడికి ‘ఆరోగ్యబీమా’కూడా ఇవ్వలేదన్న విషయం వెలుగులోకి వచ్చింది. ‘హెల్త్ ఇన్సూరెన్స్’ పేరిట ప్రతీ విద్యార్థి నుంచి రెండేళ్లకోసారి రూ.700 చొప్పున అధికారులు వసూలు చేస్తున్నారు.
డబ్బులైతే సకాలంలో తీసుకున్నారు కానీ విద్యార్థులకు అందించాల్సి బీమాపై మాత్రం దృష్టిపెట్టలేదు. కొన్నేళ్లుగా అసలు ఇన్సూరెన్స్ కంపెనీలనే సంప్రదించలేదన్న విషయం విస్మయానికి గురిచేస్తోంది. ఈక్రమంలోనే సంజయ్‌కిరణ్‌కు ఆరోగ్యబీమా దక్కలేదని స్పష్టమవుతోంది.
రూ.700 చొప్పున..
బాసర రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ)లో విద్యార్థులకు హెల్త్ ఇన్సూరెన్స్‌ను 2017లో అప్పటి ఇన్‌చార్జి వీసీ అశోక్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. రెండేళ్లకు రూ.700 చొప్పున విద్యార్థుల నుంచి వసూలుచేశారు. ఏడాదికి రూ.350 చొప్పున వర్తిస్తుందని, ఆ మేరకు బీమా అందుతుందని చెప్పారు. రెండేళ్లపాటు వివిధ సంస్థలకు చెల్లింపులు చేశారు. ఆపై ఇన్‌చార్జి వీసీ మారడం, మరో ఐఏఎస్ రాహుల్ బొజ్జా రావడం, కోవిడ్ పరిణామాలతో విద్యార్థుల బీమా అటకెక్కింది.
సంస్థలు ముందుకు రాలేదని..
కోవిడ్ సమయంలోనూ విద్యార్థుల నుంచి డబ్బులను తీసుకున్నారు. కానీ ఏ బీమా సంస్థకు బాధ్యతను అప్పగించలేదు. ఈక్రమంలో 2019–20, 2020–21 విద్యాసంవత్సరాల్లో వసూలుచేసిన డబ్బులు ఏమయ్యాయనే దానికి సమాధానం లేదు. రెండేళ్లకు రూ.700 చొప్పున తొమ్మిదివేల మంది విద్యార్థుల నుంచి రూ.63 లక్షలు వసూలు చేశారు.
సంజయ్‌కు దక్కని బీమా..
వరంగల్‌రూరల్ జిల్లా ఎల్గూరు రంగంపేటకు చెందిన శాబోతు సంజయ్‌కిరణ్ అనే పీయూసీ–2 విద్యార్థి ఈనెల 26న మృతిచెందాడు. సంజయ్ సైతం వర్సిటీకి రూ.700 హెల్త్ ఇన్సూరెన్స్ చెల్లించాడు. అనారోగ్యంతో బాధపడుతూ కొద్దిరోజుల క్రితం మరణించిన సంజయ్‌కు ఆరోగ్యబీమా దక్కలేదు.
బీమా రాలేదు..
వర్సిటీలో భోజనం బాగుండదని, తినాలనిపించట్లేదని సంజయ్ చెప్పేవాడు. దీంతోనే అతడి ఆరోగ్యం దెబ్బతింది. చికిత్స కోసం శక్తికి మించి రూ.16 లక్షలు ఖర్చుచేశాం. కానీ సంజయ్ ప్రాణాలు దక్కించుకోలేకపోయాం. వర్సిటీకి డబ్బు లు చెల్లించినా వైద్యానికి ఎలాంటి ఆరోగ్యబీమా అందలేదు.
–శాబోతు శ్రీధర్, సంజయ్‌కిరణ్ తండ్రి
విచారణ చేయించాం..
15 రోజుల క్రితమే ఇన్‌చార్జి వీసీగా బాధ్యతలు చేపట్టాను. విద్యార్థులు చెల్లించిన బీమా డబ్బులు ఏమయ్యాయి, సంస్థలు ఎందుకు ముందుకు రాలేదనే దానిపై ఓయూ అధ్యాపకులతో విచారణ చేయించాం. కోవిడ్ కారణంగా బీమా సంస్థలు ముందుకు రాలేదని తేలింది. బీమా సంస్థల ను ఫైనల్‌చేసి, చెల్లించిన డబ్బుల మేరకు విద్యార్థులకు ఆరోగ్యబీమా చేస్తాం.
– ప్రొ.వెంకటరమణ, ఇన్‌చార్జి వీసీ, ఆర్జీయూకేటీ
Comments
Please login to add a commentAdd a comment