కొత్త మెనూ అమలు అవుతోందా?
విద్యార్థులను ఆరా తీసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
బీబీనగర్ బీసీ బాలికల గురుకులం, ఎస్సీ బాలికల హాస్టల్ తనిఖీ
బీబీనగర్:బోజనం ఎలా ఉందమ్మా? కొత్త మెనూ ప్రకారం అన్నీ పెడుతున్నారా? సదుపాయాలు బాగున్నాయా?..’అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యార్థులను ఆరా తీశారు. వారితో కలిసి భోజనం చేశారు. ఆదివారం ఆయన వరంగల్ వెళుతూ మధ్యలో యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలోని బీసీ బాలికల గురుకులం, ఎస్సీ బాలికల హాస్టల్‌ను సందర్శించారు.
తొలుత బీసీ బాలికల గురుకుల పాఠశాలకు వెళ్లారు. కొత్త మెనూ అమలు, వసతిగృహంలో కల్పిస్తున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటూ అడిగారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అరగంటకు పైగా అక్కడ గడిపారు. అనంతరం అదే ఆవరణలో ఉన్న ఎస్సీ బాలికల హాస్టల్‌ను సందర్శించి తనిఖీలు చేశారు. భోజనం, కిచెన్, డైనింగ్ హాల్, కూరగాయలు, కిరాణా సరుకులు, బియ్యం తదితర వంట సామాన్లను పరిశీలించారు.
విద్యార్థులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారా అని ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించారు. హెల్త్‌చెకప్ కార్డులు మెయింటెయిన్ చేయడం లేదని, రిజిస్టర్లలో నమోదు చేస్తున్నారని ఆయన చెప్పడంతో, హెల్త్ చెకప్ కార్డులు తప్పనిసరిగా మెయింటెయిన్ చేయాలని వైద్యారోగ్య సిబ్బందిని ఆదేశించారు. ఎస్సీ బాలికల హాస్టల్‌లో డిప్యూటీ సీఎం గంటన్నర పాటు ఉన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
ఆర్థిక భారం ఉన్నా డైట్ చార్జీలు పెంచాం
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యం కోసం డైట్ చార్జీలను 40 శాతం పెంచినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు.పెంచిన చార్జీలు, మెనూ ప్రకారం హాస్టళ్లలో అన్నీ సక్రమంగా అందుతున్నాయో లేదో తెలుసుకునేందుకు మంత్రులతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, అదనపు కలెక్టర్లు గంధాధర్, వీరారెడ్డి ఆయన వెంట ఉన్నారు.
వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా: భట్టి
గీసుకొండ: భూమిలేని వ్యవసాయ కూలీలందరికీ ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’పథకం ద్వారా ఆర్థిక చేయూత అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి హామీ ఇచ్చారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మొగిలిచర్లలో కీర్తినగర్, మొగిలిచర్ల, విశ్వనాథపురం 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ల పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
గత బీఆర్‌ఎస్ సర్కారు రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తామని మాయమాటలు చెప్పి అప్పుల కుప్పగా మార్చి ప్రజల జీవితాలను ఆగం చేసిందని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు చేసిన నిర్వాకానికి ప్రతి నెలా రూ.6,500 కోట్ల మేరకు అసలు, వడ్డీ చెల్లిస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు.
రానున్న రోజుల్లో రాష్ట్రంలో కరెంటు సమస్య లేకుండా చేస్తామని అన్నారు. ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్.నాగరాజు, గండ్ర సత్యనారాయణ, మురళీనాయక్, రాంచంద్రునాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తదితర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment