సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్యను మరింత పటిష్టపరిచే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌లో 2 వేల అసిస్టెంటు ప్రొఫెసర్ పోస్టులు భర్తీచేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియపై దృష్టి సారించిన ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి ప్రస్తుతం వర్సిటీల వారీగా పోస్టులు తదితర అంశాలపై కసరత్తు ప్రారంభించాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ యూనివర్సిటీ పోస్టుల భర్తీ ప్రక్రియను అస్తవ్యస్తంగా మార్చిన సంగతి తెలిసిందే. తమవారికి వర్సిటీ పోస్టులు కట్టబెట్టేందుకు ఇష్టానుసారం వ్యవహరించారు. న్యాయవివాదాల్లో చిక్కుకోవడంతో ఆ నోటిఫికేషన్ల ప్రకారం ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల అర్హులైన నిరుద్యోగ విద్యావంతులు తీవ్రంగా నష్టపోవలసి వస్తోంది.
అసిస్టెంటు ప్రొఫెసర్ పోస్టులే కాకుండా గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ నియామకాల్లోనూ న్యాయవివాదాల్లో ఉన్నాయి. వీటిని పూర్తిగా ఒక కొలిక్కి తెచ్చి పూర్తి పారదర్శకతతో, అర్హులైన వారికే వర్సిటీల్లో ఉద్యోగాలు దక్కేలా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో 1,100 అసిస్టెంటు ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా ఇప్పుడు వీటిస్థానంలో 2 వేల అసిస్టెంటు ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. గతంలోని 14 యూనివర్సిటీలతో పాటు రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్‌ఐటీల్లో కూడా అసిస్టెంటు ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
గత ప్రభుత్వ హయాంలో రేషనలైజేషన్ నుంచి అన్నీ అవకతవకలే
గత తెలుగుదేశం ప్రభుత్వం యూనివర్సిటీ పోస్టుల భర్తీ ప్రక్రియలో అనేక అవకతవకలకు పాల్పడింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన సన్నిహితుడైన శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్‌ను సీఎంవో కార్యాలయంలో సలహాదారుగా నియమించుకుని నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకున్నారు. తమ వర్గానికి చెందినవారిని నియమించుకోవడానికి ఎలాంటి జీవోలు ఇవ్వకుండా రాష్ట్రస్థాయిలో అన్ని యూనివర్సిటీ పోస్టులను హేతుబద్ధీకరణ చేయించారు. అన్ని యూనివర్సిటీలకు కలిపి 2015లో హైపవర్ కమిటీని నియమించారు.
ఈ కమిటీ ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు రేషనలైజేషన్‌ను పూర్తిచేసింది. దాదాపు 570 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను అసిస్టెంటు ప్రొఫెసర్ పోస్టులుగా మార్చింది. ఒక విభాగం పోస్టును మరో విభాగానికి మార్చేసింది. 2 విడతల్లో మొత్తం 1,385 పోస్టుల భర్తీకి అప్పటి ప్రభుత్వం జీవో 137 విడుదల చేసింది. న్యాయవివాదంతో సవరణ ఆదేశాలిచ్చింది. కమిటీ నియామకం, రేషనలైజేషన్ ప్రక్రియలపై కోర్టులు స్టేలు విధించినా పట్టించుకోకుండా వర్సిటీల ఆమోదంతో అంటూ మళ్లీ అవే పోస్టులు భర్తీచేసేలా వర్సిటీల వారీగా 14 జీవోలిచ్చింది. వీటిపై న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. మరోవైపు ఏపీపీఎస్సీ ద్వారా అన్ని యూనివర్సిటీలకు కలిపి ఒకే స్క్రీనింగ్ టెస్టు నిర్వహించింది. దీనిపైనా న్యాయవివాదం నెలకొంది. ఈ తప్పులేవీ లేకుండా అర్హులైన మెరిట్ అభ్యర్థులకు న్యాయం జరిగేలా వర్సిటీల నియమనిబంధనల ప్రకారం ఆయా విభాగాల్లో పోస్టుల భర్తీకి ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి చర్యలు చేపడుతున్నాయి.
తప్పులు సరిదిద్ది పోస్టుల భర్తీ
Published Tue, Jun 29 2021 3:20 AM | Last Updated on Tue, Jun 29 2021 3:20 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment