కోడ్‌కు ముందే కొలువుల జాతర? | Telangana Govt is preparing to replace 20000 posts in police department | Sakshi
Sakshi News home page

కోడ్‌కు ముందే కొలువుల జాతర?

Published Sat, Dec 19 2020 3:10 AM | Last Updated on Sat, Dec 19 2020 3:59 AM

Telangana Govt is preparing to replace 20000 posts in police department - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోలీసు శాఖలో 20 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న వేళ ఎలాంటి అవాంతరాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. త్వరలో రాష్ట్రంలో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ, నాగార్జున సాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కోడ్‌కు ముందే కొలువుల జాతరకు పోలీసు శాఖ సిద్ధమవుతోంది. ఈ  నేపథ్యంలో న్యాయపరమైన వివాదాలు రాకుండా తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్బీ) జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎన్నికల కోడ్‌కు ముందే నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు న్యాయనిపుణులతో సంప్రదిస్తున్నట్లు సమాచారం. 

ఎప్పుడైనా రావచ్చు.. 
అసెంబ్లీ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ సాధ్యా సాధ్యాలను పరిశీలిస్తే.. నాగార్జున సాగర్‌ అసెంబ్లీ స్థానానికి ఇంకా 5 నెలలకు పైగా సమయం ఉంది. ఈ రెండు ఎన్నికల్లో ముందుగా రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్‌ స్థానంతో పాటు ఖమ్మం–వరంగల్‌–నల్లగొండ గ్రాడ్యుయేట్‌ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ స్థానాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఎమ్మెల్సీ సభ్యుల పదవీ కాలం మార్చి నెలాఖరు వరకు ఉంది. ఈ నేపథ్యంలో ఈ గడువుకు ముందే కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) వీటికి ఎన్నికలు నిర్వహించనుంది.

ప్రస్తుతం గ్రాడ్యుయేట్‌ ఓటర్ల నమోదుకు ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు గడువు ఉంది. ఈ ప్రక్రియ పూర్తయి తుది ఓటర్ల జాబితా అందుబాటులోకి వచ్చేసరికి మరో 2 వారాలు పడుతుంది. ఆ తర్వాత ఎపుడైనా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు వెళ్తుంది. ఈ లోపు నోటిఫికేషన్‌ ఇస్తే..ఈ భర్తీ ప్రక్రియ ప్రారంభించినట్లు ఉంటుందని, న్యాయపర చిక్కులు రావన్న అభిప్రాయంతో రిక్రూట్‌ మెంట్‌ బోర్డు ఉంది. అయితే, ఈ భర్తీకి ప్రభుత్వం నుంచి బోర్డుకు అధికారిక ఆదేశాలు రాలేదు.   

పదోన్నతులు కల్పిస్తేనే..
రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇప్పటికిప్పుడు ఉన్న ఖాళీల ప్రకారం ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తే 5 వేలకు పైగా అందుబాటులోకి రానున్నాయి. అదే ప్రభుత్వం కనుక టీచర్ల పదోన్నతులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే 12 వేలకు పైగా పోస్టులు భర్తీ చేయొచ్చు. ఇదీ క్షేత్ర స్థాయిలో ఉపాధ్యాయ ఖాళీల వివరాలను సేకరించిన అనంతరం పాఠశాల విద్యా శాఖ తేల్చిన పరిస్థితి. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించేందుకు సిద్ధమవుతోంది. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాల నేపథ్యంలో విద్యా శాఖ చర్యలు వేగవంతం చేసింది. క్షేత్రస్థాయిలో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టుల ఖాళీల వివరాలను సేకరించింది. విద్యా శాఖ తేల్చిన లెక్కల ప్రకారం స్కూల్‌ అసిస్టెంట్‌ కేటగిరీలో 9 వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి. వాటి ల్లో విద్యా వలంటీర్లు పని చేస్తున్నారు. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టులు కూడా మరో 3 వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి. 

12 వేలకు పైగా పోస్టుల భర్తీ
ప్రస్తుతం స్కూల్‌ అసిస్టెంట్‌ కేటగిరీలో 9 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నా వాటన్నింటినీ డైరెక్టు రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేసే అవకాశం లేదు. 70% పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. మిగతా 30% పోస్టులను మాత్రమే డైరెక్టు రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయొచ్చు. అంటే 9 వేల ఖాళీల్లో డైరెక్టు రిక్రూట్‌మెంట్‌ ద్వారా 2,700కు పైగా పోస్టులను మాత్రమే భర్తీ చేసే వీలుంటుంది. మిగతా 6,300 పోస్టుల్లో అర్హత కలిగిన సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది. వారికి పదోన్నతులు కల్పిస్తే.. ఖాళీ అయ్యే 9 వేలకు పైగా ఎస్జీటీ పోస్టులు డైరెక్టు రిక్రూట్‌మెంట్‌ చేసేందుకు అందుబాటులోకి వస్తాయి. అయితే ముందుగా ఎస్జీటీ తత్సమాన పోస్టుల్లో ఉన్న క్లియర్‌ వేకెన్సీలు, స్కూల్‌ అసిస్టెంట్‌ తత్సమాన కేటగిరీలో ఉన్న డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ క్లియర్‌ వేకెన్సీలను ప్రభుత్వానికి పంపేందుకు విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement