మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సమావేశం
పలు షరతులతో అనుమతించిన కేంద్ర ఎన్నికల సంఘం
అత్యవసర, నిర్దేశిత గడువులోగా అమలు చేయాల్సిన
అంశాలే ఎజెండాగా ఉండాలి.. ఉమ్మడి రాజధాని, రుణమాఫీ అంశాలను జూన్ 4 వరకు వాయిదా వేసుకోండి
ఎన్నికల డ్యూటీ చేసిన అధికారులను పిలవకూడదని ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు.. మంత్రివర్గ భేటీ నిర్వహణ కోసం పలు షరతులతో కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాశ్ కుమార్ ఆదివారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్‌కు లేఖ రాశారు.
అత్యవసరమైన అంశాలు మాత్రమే..
లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు.. అత్యవసరమైన, నిర్ణీత గడువులోగా అమలు చేయాల్సిన అంశాలను మాత్రమే కేబినెట్ భేటీలో చర్చించాలని ఈ లేఖలో ఈసీ స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్న నేపథ్యంలో.. అప్పటి వరకు నిరీక్షించడం సాధ్యం కాని, అత్యవసరమైన అంశాలను మాత్రమే మంత్రివర్గ సమావేశం ఎజెండాలో చేర్చాలని పేర్కొంది. మంత్రివర్గ సమావేశం ఎజెండాలో ప్రతిపాదించిన రుణమాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని వంటి అంశాలను లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు వాయిదా వేసుకోవాలని సూచించింది. ఇక ఎన్నికల నిర్వహణలో పాలుపంచుకున్న రాష్ట్ర ప్రభుత్వ అధికారులెవరినీ సమావేశానికి హాజరుకావాలని కోరరాదని ఆదేశించింది.
కాళేశ్వరం బ్యారేజీలకు రిపేర్లు, పంటల సాగుపై నిర్ణయాలు!
వాస్తవానికి గత శనివారమే కేబినెట్ భేటీ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఈసీ అనుమతి కోరింది. ఈసీ నుంచి స్పందన రాకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేసుకుంది. సోమవారంలోగా ఈసీ అనుమతించకుంటే మంత్రులతో కలసి ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు కూడా. కానీ తాజాగా ఈసీ అనుమతి ఇవ్వడంతో ప్రభుత్వం అత్యవసర అంశాలపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవడానికి అడ్డంకి తొలగిపోయింది. ఈ భేటీలో కాళేశ్వరం బ్యారేజీలకు అత్యవసర మరమ్మతులు, ధాన్యం కొనుగోళ్లు, వర్షాకాలం పంటల సాగు, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం వంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment