ప్రార్థనా మందిరాలపై దాడులతో ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ప్రజలు సంయమనంతో వ్యవహరించాలి.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారైనా చర్యలు తప్పవు
పోలీసులు గౌరవంగా ఉండాలి.. ఒకరి దగ్గర చేయిచాపే పరిస్థితి వద్దు
పోలీస్ అమరుల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటన
వీర మరణం పొందిన పోలీసుల కుటుంబాలకు భారీగా పరిహారం
సాక్షి, హైదరాబాద్: కొందరు ఉన్మాదం, భావోద్వేగంతో మందిరాలు, మజీద్‌లపై దాడులు చేస్తూ.. ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ గుడి సంఘటన సహా ఇటీవల జరిగిన మరికొన్ని ఘటనలు ఆందోళనకరమని పేర్కొన్నారు. నేరా లకు పాల్పడినవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అదేవిధంగా సమాజానికి చెడు చేసేవారి విషయంలో ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని స్పష్టం చేశారు.
తెలంగాణ సమాజం ఎంతో తెలివైనదని, మత విద్వేషాలను అరికట్టడంలో ప్రజలు ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరిస్తున్నారని చెప్పారు. ‘పోలీస్ అమరుల సంస్మరణ దినం (పోలీస్ ఫ్లాగ్ డే)’సందర్భంగా సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని గోషామహల్ పోలీస్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పోలీసు అమరుల స్మారకం వద్ద నివాళులు అరి్పంచారు. అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బంది ఉద్దేశించి మాట్లాడారు. ‘‘ప్రజల భద్రత కోసం ఉగ్రవాదులు, మావోయిస్టుల చేతుల్లో మరణించిన అధికారులను స్మరించుకోవడం అందరికీ స్ఫూర్తిదాయకం.
పోలీసు అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారు. అయితే ఏ చిన్న తప్పు జరిగినా ప్రభుత్వం, పోలీసుల ప్రతిష్ట పోతుంది. అలాంటి వాటికి అవకాశం ఇవ్వకూడదు. పోలీసులపై ప్రజల్లో గౌరవం పెరిగేలా పనిచేయాలి. ఒకరి దగ్గర చేయిచాచే పరిస్థితి ఉండకూడదు. ఖద్దరు, ఖాకీలను సమాజం నిశితంగా గమనిస్తుంది. ఆ గౌరవాన్ని కాపాడుకునేలా నడుచుకోవాలి..’’ అని సీఎం రేవంత్ సూచించారు.
సైబర్ నేరాలు, డ్రగ్స్‌పై కఠినంగా ఉంటాం
సరికొత్త పంథాలో జరుగుతున్న సైబర్ నేరాలు, యువత భవిష్యత్తును నాశనం చేసే డ్రగ్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా ఉంటుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. నేరస్తులతో కఠినంగా వ్యవహరించాలని, బాధితులతో ఫ్రెండ్లీగా ఉండాలని పోలీసులకు సూచించారు. హైదరాబాద్ నగర పరిధిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సిబ్బందిని, కృత్రిమ మేధ (ఏఐ)ను వాడుకోవాలని డీజీపీ, హైదరాబాద్ సీపీలను ఆదేశించారు.
ఈ సందర్భంగా పోలీసు అమరులపై రాసిన ‘అమరులు వారు’ అనే పుస్తకాన్ని డీజీపీ జితేందర్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌లతో కలిసి సీఎం ఆవిష్కరించారు. కార్యక్రమానికి హాజరైన రిటైర్డ్ ఐపీఎస్ అధికారుల వద్దకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రతి ఒక్కరిని పలకరించారు. కార్యక్రమంలో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, సీఐడీ డీజీ శిఖాగోయల్, అడిషనల్ డీజీలు మహేశ్ భగవత్, సంజయ్‌కుమార్ జైన్ ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పోలీసు అమరులకు భారీగా ఎక్స్‌గ్రేషియా..
విధి నిర్వహణలో మరణించిన పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. అలా అమరులైన పోలీస్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సైలకు రూ.కోటి.. ఎస్సై, సీఐలకు రూ.1.25 కోట్లు, డీఎస్పీ, ఏఎస్పీలకు రూ.1.50 కోట్లు, ఎస్పీ స్థాయి నుంచి ఐపీఎస్‌ల కుటుంబాలకు రూ.2 కోట్లు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ప్రకటించారు. అదేవిధంగా శాశ్వత అంగవైకల్యానికి గురైన కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సైలకు రూ.50 లక్షలు, ఎస్సై, సీఐ, డీఎస్పీ, ఏఎస్పీ వరకు రూ.60 లక్షలు, ఐపీఎస్‌లకు రూ.కోటి చొప్పున పరిహారం ఇస్తామని చెప్పారు.
ఇక తీవ్రంగా గాయపడిన వారిలో కానిస్టేబుల్ నుంచి ఏఎస్పీ వరకు రూ.10 లక్షలు నష్టపరిహారం ఇస్తామని.. ఎస్పీ, ఆపై ర్యాంకు అధికారులు తీవ్రంగా గాయపడితే రూ.12 లక్షలు ఎక్స్‌గ్రేషియాగా ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఇటీవల మృతి చెందిన ఐపీఎస్ రాజీవ్‌రతన్ కుమారుడికి గ్రేడ్–2 మున్సిపల్ కమిషనర్‌గా, కమాండెంట్ మురళి కుమారుడికి డిప్యూటీ ఎమ్మార్వోగా ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు.
పోలీస్ అమరుడు ఆది ప్రవీణ్ కుటుంబానికి అండగా ఉంటాం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా అటవీ ప్రాంతంలో ఈ ఏడాది ఫిబ్రవరి 11న కూంబింగ్ ఆపరేషన్ చేస్తుండగా విద్యుత్ షాక్‌తో మృతిచెందిన గ్రేహౌండ్స్ జూనియర్ కమెండో ఆది ప్రవీణ్ కుటుంబాన్ని గోషామహల్ స్టేడియం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శించారు. ఆది ప్రవీణ్ భార్య రాథోడ్ లత, కుమారులు ఆది హర్ష, ఆది వివాన్‌లకు పోలీసు స్మారక చిహ్నం జ్ఞాపికను అందించారు. ఆది ప్రవీణ్ భార్య లతకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.
ఎక్స్‌గ్రేషియా పెంపుపై సీఎంకు ధన్యవాదాలు
పోలీసు అమరుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పెంచుతున్నట్టు ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డికి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపిరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. పోలీసుల సమస్యల పరిష్కారానికి సీఎం హామీ ఇవ్వడం, పోలీసు అధికారులు, సిబ్బంది పిల్లల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తుండటంపై హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment