సాక్షి, అమరావతి: జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే) పోస్టుల భర్తీకి హైకోర్టు మంగళవారం నోటిఫికేషన్ జారీచేసింది. 68 పోస్టుల్లో 55 పోస్టులను ప్రత్యక్షంగా.. 13 పోస్టులను బదిలీల ద్వారా భర్తీచేస్తారు. దరఖాస్తుల సమర్పణకు ఆగస్టు 20 చివరి తేదీ. ఈనెల 20 నుంచి హైకోర్టు వెబ్‌సైట్ (https://hc.ap.nic.in/)లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. సెప్టెంబర్ 26న రాత పరీక్ష ఉంటుంది. అదే నెల 10న హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాస్తవానికి 2020లో 68 జేసీజే పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్ జారీచేసింది. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు మూడేళ్లపాటు న్యాయవాదిగా పనిచేసి ఉండాలన్న నిబంధన విధించింది. దీనిని సవాలు చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు, మూడళ్ల నిబంధన రాజ్యాంగ విరుద్ధమంటూ ఆ నోటిఫికేషన్‌ను కొట్టేసింది. తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో హైకోర్టు రిజిస్ట్రీ తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది. దరఖాస్తు ఫారాన్ని హైకోర్టు వెబ్‌సైట్‌లో ఉంచారు. ఆగస్టు 20వ తేదీ రాత్రి 11.59లోపు దరఖాస్తులు హైకోర్టుకు అందాల్సి ఉంటుంది. అలాగే..
► దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే పూర్తిచేసి సమర్పించాలి. చేతిరాత, టైపు, జిరాక్స్, ప్రింట్ దరఖాస్తులను ఆమోదించరు. దరఖాస్తులను ప్రత్యక్షంగా, పోస్టు ద్వారా కూడా స్వీకరించరు.
► 2020లో జారీచేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్‌కు హాజరైన అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు సమర్పించకుండానే ప్రస్తుతం నిర్వహించనున్న జేసీజే పరీక్షకు హాజరుకావొచ్చు. స్క్రీనింగ్ పరీక్షకు హాజరుకాని వారు తిరిగి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
► ప్రస్తుత జేసీజే పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు తప్పనిసరిగా లా డిగ్రీ ఉండి తీరాలి.
► ఓసీ, బీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజును రూ.800గా నిర్ణయించారు.
► ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు రూ.400 ఫీజుగా చెల్లించాలి. ఆంధ్రప్రదేశ్ నివాసితులు కాని ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు రూ.800 ఫీజు చెల్లించాలి.
► గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలను పరీక్ష కేంద్రాలుగా నిర్ణయించారు. వీటిల్లో మూడింటిని అభ్యర్థులు ఎంపిక చేసుకోవచ్చు.
► స్క్రీనింగ్ పరీక్షా ఫలితాల వెల్లడి తరువాత ఈ కేంద్రాల్లో ఆన్‌లైన్ రాత పరీక్ష ఉంటుంది.
జేసీజే పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్
Published Wed, Jul 21 2021 3:18 AM | Last Updated on Wed, Jul 21 2021 3:18 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment