junior Civil judge posts
-
సివిల్ జడ్జి నియామకాల్లో రూల్ 6 (ఎఫ్) రద్దు
సాక్షి, అమరావతి: జూనియర్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టుల భర్తీ ప్రక్రియలో ఓసీ అభ్యర్థులతో సమానంగా బీసీ అభ్యర్థులు కూడా రాత పరీక్ష, వైవాలో కలిపి మొత్తం 60 శాతం మార్కులు సాధించాలన్న ఏపీ జ్యుడిషియల్ సర్వీసెస్ రూల్స్‌లోని రూల్ 6 (ఎఫ్)ను హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది. ఈ నిబంధనకు అనుగుణంగా జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే) పోస్టుల భర్తీ నిమిత్తం 2019లో హైకోర్టు జారీ చేసిన నోటిఫికేషన్లో ఓసీ, బీసీ అభ్యర్థులు రాత పరీక్ష, వైవాలో 60 శాతం మార్కులు సాధించాలంటూ పెట్టిన క్లాజ్ 8ను కొట్టేసింది. ఈ నిబంధన చట్టవిరుద్ధమని హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ నిబంధన వల్ల బీసీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందన్న పిటిషనర్ వాదనతో ఏకీభవించింది. ఈ నిబంధన వల్ల నష్టపోయిన పిటిషనర్ షేక్ నిషాద్ నాజ్‌కు జేసీజే పోస్టు ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. ఓసీ అభ్యర్థులతో సమానంగా బీసీ అభ్యర్థులు రాత పరీక్ష, వైవా కలిపి 210 మార్కులు సాధించాలన్న నిబంధనను రాజ్యాంగ విరుద్ధంగా, ఏపీ జ్యుడిషియల్ సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా ప్రకటించి కొట్టేయాలని కోరుతూ గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన షేక్ నిషాద్ నాజ్ గతేడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున న్యాయవాది బాలాజీ వాదనలు వినిపిస్తూ.. జేసీజే పోస్టుల నోటిఫికేషన్లో ఇంటర్వ్యూలకు ఎంపిక కావాలంటే ఓసీ అభ్యర్థులు రాత పరీక్షలో 300 మార్కులకు గాను 180, వైవాలో 50 మార్కులకు గాను 30 మార్కులు కలిపి మొత్తం 210 మార్కులు సాధించాలని పేర్కొందన్నారు. అలాగే బీసీ అభ్యర్థులు రాత పరీక్షలో 165, వైవాలో 45 మార్కులు కలిపి మొత్తం 210 మార్కులు సాధించాలని నిబంధన విధించిందన్నారు. ఒక్కో పేపర్లో సగటున 50 మార్కులు సాధించాల్సి ఉంటుందని తెలిపారు. ఇక్కడే బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. వైవాలో బీసీ అభ్యర్థులు ఏకంగా 95 శాతం మార్కులు సాధిస్తే తప్ప మొత్తం 210 మార్కులు సాధించడం సాధ్యం కాదని వివరించారు. -
జేసీజే పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే) పోస్టుల భర్తీకి హైకోర్టు మంగళవారం నోటిఫికేషన్ జారీచేసింది. 68 పోస్టుల్లో 55 పోస్టులను ప్రత్యక్షంగా.. 13 పోస్టులను బదిలీల ద్వారా భర్తీచేస్తారు. దరఖాస్తుల సమర్పణకు ఆగస్టు 20 చివరి తేదీ. ఈనెల 20 నుంచి హైకోర్టు వెబ్సైట్ (https://hc.ap.nic.in/)లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. సెప్టెంబర్ 26న రాత పరీక్ష ఉంటుంది. అదే నెల 10న హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాస్తవానికి 2020లో 68 జేసీజే పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్ జారీచేసింది. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు మూడేళ్లపాటు న్యాయవాదిగా పనిచేసి ఉండాలన్న నిబంధన విధించింది. దీనిని సవాలు చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు, మూడళ్ల నిబంధన రాజ్యాంగ విరుద్ధమంటూ ఆ నోటిఫికేషన్‌ను కొట్టేసింది. తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో హైకోర్టు రిజిస్ట్రీ తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది. దరఖాస్తు ఫారాన్ని హైకోర్టు వెబ్సైట్లో ఉంచారు. ఆగస్టు 20వ తేదీ రాత్రి 11.59లోపు దరఖాస్తులు హైకోర్టుకు అందాల్సి ఉంటుంది. అలాగే.. ► దరఖాస్తులను ఆన్లైన్లోనే పూర్తిచేసి సమర్పించాలి. చేతిరాత, టైపు, జిరాక్స్, ప్రింట్ దరఖాస్తులను ఆమోదించరు. దరఖాస్తులను ప్రత్యక్షంగా, పోస్టు ద్వారా కూడా స్వీకరించరు. ► 2020లో జారీచేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్‌కు హాజరైన అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు సమర్పించకుండానే ప్రస్తుతం నిర్వహించనున్న జేసీజే పరీక్షకు హాజరుకావొచ్చు. స్క్రీనింగ్ పరీక్షకు హాజరుకాని వారు తిరిగి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ► ప్రస్తుత జేసీజే పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు తప్పనిసరిగా లా డిగ్రీ ఉండి తీరాలి. ► ఓసీ, బీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజును రూ.800గా నిర్ణయించారు. ► ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400 ఫీజుగా చెల్లించాలి. ఆంధ్రప్రదేశ్ నివాసితులు కాని ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.800 ఫీజు చెల్లించాలి. ► గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలను పరీక్ష కేంద్రాలుగా నిర్ణయించారు. వీటిల్లో మూడింటిని అభ్యర్థులు ఎంపిక చేసుకోవచ్చు. ► స్క్రీనింగ్ పరీక్షా ఫలితాల వెల్లడి తరువాత ఈ కేంద్రాల్లో ఆన్లైన్ రాత పరీక్ష ఉంటుంది. -
జేసీజే రాతపరీక్ష తాత్కాలికంగా నిలుపుదల
* హైకోర్టు న్యాయమూర్తుల కమిటీలో భిన్నాభిప్రాయాలు * సుప్రీంకోర్టు నుంచి స్పష్టత తీసుకోవాలని నిర్ణయం.. అప్పటివరకూ పరీక్ష నిలుపుదల సాక్షి, హైదరాబాద్: ఈ నెల 27న నిర్వహించ తలపెట్టిన జూనియర్ సివిల్ జడ్జి(జేసీజే) పోస్టుల రాత పరీక్షను హైకోర్టు తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఖాళీగా ఉన్న 97 జూనియర్ సివిల్ జడ్జీల పోస్టుల భర్తీకోసం హైకోర్టు ఫిబ్రవరి 1న నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అయితే జూన్ 2వ తేదీ నుంచి రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడుతున్న పరిస్థితుల్లో జేసీజే పరీక్ష నిర్వహించడం సరికాదని, దీనిని వాయిదా వేయాలని కోరుతూ న్యాయవాదుల నుంచి డిమాండ్లు వచ్చాయి. మరోవైపు ఈ పరీక్షను వాయిదా వేయాలంటూ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. ఈ నేపథ్యంలో కిందిస్థాయి న్యాయవ్యవస్థ విభజనపై ఏర్పాటైన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కమిటీ బుధవారం సమావేశమైంది. జేసీజే పరీక్ష వాయిదా వేయాలా? వద్దా? అనే అంశంపైనే దాదాపు 20 నిమిషాలపాటు చర్చించింది. పరీక్ష వాయిదాపై కమిటీలోని న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు నుంచి స్పష్టత లేదా ఉత్తర్వులు పొందాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు నుంచి స్పందన వచ్చేంత వరకు రాత పరీక్షను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు హైకోర్టు రిజిష్ట్రార్(రిక్రూట్మెంట్) గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.