జేసీజే రాతపరీక్ష తాత్కాలికంగా నిలుపుదల
* హైకోర్టు న్యాయమూర్తుల కమిటీలో భిన్నాభిప్రాయాలు
* సుప్రీంకోర్టు నుంచి స్పష్టత తీసుకోవాలని నిర్ణయం.. అప్పటివరకూ పరీక్ష నిలుపుదల
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 27న నిర్వహించ తలపెట్టిన జూనియర్ సివిల్ జడ్జి(జేసీజే) పోస్టుల రాత పరీక్షను హైకోర్టు తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఖాళీగా ఉన్న 97 జూనియర్ సివిల్ జడ్జీల పోస్టుల భర్తీకోసం హైకోర్టు ఫిబ్రవరి 1న నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అయితే జూన్ 2వ తేదీ నుంచి రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడుతున్న పరిస్థితుల్లో జేసీజే పరీక్ష నిర్వహించడం సరికాదని, దీనిని వాయిదా వేయాలని కోరుతూ న్యాయవాదుల నుంచి డిమాండ్లు వచ్చాయి.
మరోవైపు ఈ పరీక్షను వాయిదా వేయాలంటూ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. ఈ నేపథ్యంలో కిందిస్థాయి న్యాయవ్యవస్థ విభజనపై ఏర్పాటైన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కమిటీ బుధవారం సమావేశమైంది. జేసీజే పరీక్ష వాయిదా వేయాలా? వద్దా? అనే అంశంపైనే దాదాపు 20 నిమిషాలపాటు చర్చించింది. పరీక్ష వాయిదాపై కమిటీలోని న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు నుంచి స్పష్టత లేదా ఉత్తర్వులు పొందాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు నుంచి స్పందన వచ్చేంత వరకు రాత పరీక్షను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు హైకోర్టు రిజిష్ట్రార్(రిక్రూట్‌మెంట్) గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.