జేసీజే నియామకాలకు లైన్ క్లియర్ | High court judgement over Junior civil judges appointments | Sakshi
Sakshi News home page

జేసీజే నియామకాలకు లైన్ క్లియర్

Published Fri, Apr 29 2016 7:35 PM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

High court judgement over Junior civil judges appointments

హైదరాబాద్ : జూనియర్ సివిల్ జడ్జిల (జేసీజే) నియమకాలకు లైన్ క్లియర్ అయింది. 2014 నోటిఫికేషన్ ప్రకారం జరిగిన జేసీజే రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు నియామకపు పత్రాలు అందచేయాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే ఆదేశాలు 2015 నోటిఫికేషన్‌కు సైతం వర్తిస్తుందని తేల్చి చెప్పింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. కిందిస్థాయి న్యాయవ్యవస్థ విభజన జరిగేంత వరకు జూనియర్ సివిల్ జడ్జీల పోస్టులను భర్తీ చేయవద్దని కోరుతూ సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.

తరువాత ఇదే అంశంపై మరి కొందరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై సుదీర్ఘ విచారణ చేపట్టి తీర్పు వాయిదా వేసిన ధర్మాసనం శుక్రవారం తన తీర్పును వెలువరించింది. సత్యంరెడ్డి దాఖలు చేసిన పిల్‌ను, ఇతర వ్యాజ్యాలను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. 2014, 2015 సంవత్సరాల్లో జేసీజే పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్ల ఆధారంగా నిర్వహించిన రాతపరీక్ష, ఇంటర్వ్యూల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తీర్పు కాపీ అందుబాటులోకి రాకపోవడంతో పిటిషన్ల కొట్టివేతకు కారణాలు తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement