రాయలసీమ యూనివర్సిటీకి హైకోర్టు అక్షింతలు
రాయలసీమ యూనివర్సిటీకి హైకోర్టు అక్షింతలు
Published Tue, Jul 4 2017 10:57 PM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM
– అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలపై మూడు వారాలు స్టే
– వారంలోపు అఫిడవిట్ సమర్పించాలని ఆదేశం
కర్నూలు (ఆర్‌యూ): రాయలసీమ యూనివర్సిటీలో ఇటీవల చేపట్టిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏళ్ల తరబడి పని చేస్తున్న అధ్యాపకులను రెన్యూవల్ చేయకుండా మే నెలలో కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసింది. సంబంధిత సబ్జెక్టులలో పీజీతో పాటు పీహెచ్‌డీ, నెట్, స్లెట్, సెట్ ఏదో ఒక విద్యార్హత కలిగి ఉండాలని అందులో పేర్కొంది. అయితే ఏ సబ్జెక్టులో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.. ఎంత మంది అవసరం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితర నిబంధనలు తెలపకపోవడంతో పాటు వర్సిటీ అధికారులు వాటిని పాటించకపోవడంతో నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందని బాధితులు గతనెల 28న హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన కోర్టు అదే రోజు నియామకాలపై స్టే విధించింది.
అయినా, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ వర్సిటీ పాలకులు మరుసటి రోజే అంటే 29వ తేదీన కూడా దాదాపు 30 మందికి పోస్టింగ్ ఇచ్చారు. ఈ విషయం హైకోర్టు దృష్టికి బాధితులు తీసుకెళ్లడంతో జూలై 4వ తేదీన ఇరువురు వాదనలు విని రాయలసీమ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలు పాటించకుండా అనర్హులను నియమించుకోవడమే కాక ఆ విషయాలను దాచి సుప్రీం కోర్టు ఆదేశాలనే ధిక్కరిస్తారా అని నియామకాలపై మూడు వారాలకు స్టే విధించింది. వారంలోపు పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీ చేసింది.
Advertisement
Advertisement