సాక్షి, హైదరాబాద్: సమాచార కమిషనర్ల నియామకం జరిగిన తీరును చూస్తుంటే, అవి రాజకీయ నియామకాలుగా కనిపిస్తున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. సమాచార కమిషనర్లుగా వి.వెంకటేశ్వర్లు, తాంతియా కుమారి, ఇంతియాజ్ అహ్మద్, విజయనిర్మల నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో సోమవారం వాదనలు ముగిశాయి. వాదనలు విన్న చీఫ్ జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ ఖండవల్లి చంద్రభాను నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు గండ్ర మోహనరావు, కె.వివేక్ రెడ్డిలు వాదనలు వినిపించగా, కమిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది డి.వి.సీతారామ్మూర్తి, ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది ఎన్.శ్రీధర్‌రెడ్డి వాదనలు వినిపించారు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నిష్ణాతులైన వ్యక్తుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రభుత్వం ప్రకటన జారీ చేయాలని, కాని ఈ కేసులో ప్రభుత్వం ఎటువంటి దరఖాస్తులను ఆహ్వానించడం గానీ, ప్రకటన జారీ చేయడం గానీ చేయలేదని మోహనరావు కోర్టుకు నివేదించారు. అంతేకాక కమిషనర్ల నియామకం వ్యవహారాన్ని చూసే కమిటీలో సభ్యుడైన ప్రతిపక్ష నేత సైతం ఈ నియామకాలపై అసంతృప్తిని వ్యక్తం చేశారని కోర్టుకు నివేదించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కమిషనర్లుగా నియమితులైన వ్యక్తులు నియామకానికి ముందే వారు నిర్వర్తిస్తున్న పదవులకు రాజీనామా చేయాలని, అయితే వెంకటేశ్వర్లు మాత్రం న్యాయవాదిగా నేటికీ కొనసాగుతున్నారని తెలిపారు. ఈ వాదనలను శ్రీధర్‌రెడ్డి తోసిపుచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నియామకం జరిగిన తరువాతనే వారు తమ తమ పదవులకు, వ్యాపారాలకు స్వస్తి చెప్పాల్సి ఉంటుందంటూ తీర్పును చదివి వినిపించారు. ప్రతిపక్ష నేత ఎటువంటి అసంతృప్తి వ్యక్తం చేయలేదని డి.వి.సీతారామ్మూర్తి తెలిపారు.
తమ సభ్యత్వాన్ని రద్దు చేయాలని వెంకటేశ్వర్లు రాష్ట్ర బార్ కౌన్సిల్‌కు ఎప్పుడో దరఖాస్తు చేసుకున్నారని, దీనిపై సోమవారం బార్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుందంటూ అందుకు సంబంధించి లేఖను ప్రధాన న్యాయమూర్తికి సమర్పించారు. విచారణ జరుగుతున్న సమయంలో ఇలా లేఖ తీసుకురావడం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇవి రాజకీయ నియామకాలుగా కనిపిస్తున్నాయని, అందుకు ప్రాథమిక ఆధారాలు కూడా ఉన్నాయంటూ తీర్పును వాయిదావేస్తున్నట్లు తెలిపింది. కాగా, సమాచార కమిషనర్ల నియామకంపై దాఖలైన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మరో ధర్మాసనానికి నివేదించింది.
ఆ నియామకాలు రాజకీయమే!
Published Tue, Aug 27 2013 6:06 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement