RTI commissioners
-
ఆర్టీఐ కమిషనర్లుగా కాకర్ల చెన్నారెడ్డి, ఉల్చాల హరిప్రసాద్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లుగా ఉల్చాల హరిప్రసాద్, కాకర్ల చెన్నారెడ్డిని నియమించారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో హరిప్రసాద్, చెన్నారెడ్డి పేర్లను ఖరారు చేసి గవర్నర్ ఆమోదానికి పంపారు. రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం అమలును వీరు పర్యవేక్షిస్తారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ నుంచి హిస్టరీలో మాస్టర్స్ డిగ్రీ పొందారు ఉల్చాల హరిప్రసాద్. రెండు దశాబ్ధాలుగా పత్రికారంగంలో కొనసాగారు హరిప్రసాద్. పోస్ట్ గ్రాడ్యుయేట్, లాలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన కాకర్ల చెన్నారెడ్డి తెలుగు రాష్ట్రాల హైకోర్టులో 15 ఏళ్లుగా న్యాయవాదిగా కొనసాగుతున్నారు. చదవండి: AP Cabinet Meet: నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ -
ఆర్టీఐ కమిషనర్ల పదవి మూడేళ్లే!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సమాచార హక్కు కమిషనర్ల పదవీకాలాన్ని మూడేళ్లకు కుదించే ప్రతిపాదన సహా.. సమాచార హక్కు చట్టం నూతన నిబంధనలకు కేంద్రం శుక్రవారం ఆమోదం తెలిపింది. ఇకపై అన్ని నియామకాలకు కొత్త నిబంధనలు వర్తిస్తాయి. వేతనం, ఇతర అలవెన్సులు, సర్వీసు నిబంధనల విషయంలో నిర్ణయాధికారం కొత్త నిబంధనల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి లభించింది. ఆయా నిబంధనలను మార్చే అధికారం కూడా ఇకపై కేంద్రానికి ఉండనుంది. 2005 చట్టంలో సమాచార హక్కు కమిషనర్ల పదవీ కాలాన్ని కచ్చితంగా ఐదేళ్లు లేదా 65 ఏళ్ల వయసు వచ్చేవరకు అని నిర్ణయించగా, తాజా నిబంధనల్లో దాన్ని మూడేళ్లకు కుదించారు. ప్రధాన సమాచార కమిషనర్ వేతనాన్ని రూ. 2.5 లక్షలుగా, సమాచార కమిషనర్ వేతనాన్ని రూ. 2.25 లక్షలుగా నిర్ణయించారు. ఈ మార్పులు సమాచార హక్కు చట్టం స్ఫూర్తిని కాలరాయడమేనని, తాజా నిబంధనల వల్ల సమాచార కమిషన్లు ప్రభుత్వ విభాగాల స్థాయికి తగ్గిపోతాయని ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఆగస్టు 31లోగా ఆర్టీఐ కమిషనర్లను నియమించండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీఐ కమిషనర్ల నియామకానికి లైన్ క్లియర్ అయింది. రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఆర్టీఐ కమిషనర్ల నియాకం చేపట్టాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఖాళీగా ఉన్న కమిషనర్ల పోస్టులను ఆగస్టు 31 లోపు భర్తీ చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కాగా ఆర్టీఐలో ప్రస్తుతం ఒక్క కమిషనరే ఉండటంతో ఎలాంటి సమాచారం తెలుసుకోలేకపోతున్నామని ఆకాష్ కుమార్ అనే విద్యార్థి కోర్టును ఆశ్రయించాడు. ప్రజలకు అందుబాటులో ఉండేలా మరింతమంది కమిషనర్ల నియామకం చేపట్టాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు పూర్తి స్థాయిలో ఆర్టీఐలో కమిషనర్ల నియామకం చేపట్టవచ్చని తెలిపింది. -
ఆర్టీఐ కమిషనర్ల నియామకంపై వైఎస్సార్ సీపీ అభ్యంతరం
-
సీఎస్‌కు విజయసాయి రెడ్డి లేఖ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీఐ కమిషనర్ల నియామకంపై వైఎస్సార్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంకు లేఖ రాశారు. లేఖలో సారాంశం... ‘విజయవాడకు చెందిన హోటల్ యజమాని ఐలాపురం రాజాను ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా నియమించటంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం తెలియజేస్తోంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి ప్రైవేటు సెక్రటరీగా ఉన్న ఇ.శ్రీరాంమూర్తి, ఐలాపురం రాజాలు టీడీపీ పార్టీ యాక్టివిస్టులు. ఇలాంటి వారిని ఆర్టీఐ కమిషనర్లుగా ఎలా నియమిస్తారు. ఆర్టీఐ యాక్ట్ 2005, సెక్షన్ 15 ప్రకారం నియామకాలు చేపట్టాలి. ఆర్టీఐ యాక్ట్ 2005 సబ్ సెక్షన్ 5 ప్రకారం స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టేవారికి తగిన అర్హతలు ఉండాలని తెలియజేస్తోంది. ఆర్టీఐ యాక్ట్ ప్రకారం చూస్తే..లా, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ సర్వీస్, మేనేజ్మెంట్, జర్నలిజం, మాస్ మీడియాలో అనుభవం ఉన్న వ్యక్తులనే ఆ పదవులకు ఎంపిక చేయాలి. దానికి భిన్నంగా టీడీపీ యాక్టివిస్టులను ఆర్టీఐ కమిషనర్లుగా నియమించారు. అంతేకాకుండా ఈ పదవులకు ఎంపిక అయ్యే వ్యక్తులు ఎంపీలు కానీ, రాష్ట్ర శాసనసభల్లోనూ, కేంద్రపాలిత ప్రాంతాల్లో, ఆదాయం వచ్చే పదవుల్లో, వ్యాపారాల్లోనూ ఉండకూడదు. ఎలాంటి పార్టీలతోనూ సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండకూడదని ఆర్టీఐ యాక్ట్ తెలియజేస్తోంది. అయితే, ఓ హోటల్ యజమాని, మంత్రికి ప్రైవేటు సెక్రటరీగా ఉన్న వ్యక్తులను ఎలా ఎంపిక చేశారు. ఏ ప్రాతిపధికన సీఎం, సీనియర్ కేబినెట్ మినిస్టర్ వీళ్ల పేర్లు సిఫార్సు చేయటం జరిగింది?. వీరిలో ఐలాపురం రాజా పేరును గవర్నర్ ఆమోదించారు. శ్రీరాంమూర్తి పేరును గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీరాంమూర్తికి సామాజిక సేవతో సంబంధాలు ఉన్నాయా?. ఎన్నికల్లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బిజీగా ఉన్న సమయంలో కమిటీని ఏర్పాటు చేసి సిఫార్సు చేశారు. ఈ ఆర్టీఐ కమిషనర్ నియామకాలు అన్నీ రాజకీయ దురుద్దేశంతో కూడినవి. 4 ఏళ్ల పాటు సాగదీసి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఈ నియామకాలు చేయటంలో ఆంతర్యం ఏమిటి?. 2017లో ఆరుగురును ఆర్టీఐ కమిషనర్లుగా నియామకంలో రాజకీయ ప్రమేయం ఉండటంతో సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇప్పటికైనా ఆర్టీఐ కమిషనర్ల నియామకంలో పారదర్శకత పాటించాలి’ అని విజయసాయి రెడ్డి కోరారు. -
మరో నలుగురిని నియమించండి
సాక్షి, న్యూఢిల్లీ: సమాచార హక్కు కమిషనర్లుగా ప్రస్తుత, పదవీ విరమణ పొందిన అధికారులనే కాకుండా న్యాయ రంగం, సైన్స్ అండ్ టెక్నాలజీ, సామాజిక సేవ, మేనేజ్మెంట్, జర్నలిజం, మాస్‌మీడియా రంగాల్లో లబ్ధప్రతిష్టులైన వారిని ఎంపిక చేయాలని కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశిం చింది. సమాచారహక్కు చట్టం–2005ని సమగ్రంగా అమలు చేసేలా ఆదేశాలు జారీచేయా లని కోరుతూ అంజలీ భరద్వాజ్, ఇతరులు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సమాచార కమిషనర్ల నియామకాల్లో జాప్యం తోపాటు పారదర్శకత లేకపోవడం, దీంతో నియామకాలపై కోర్టుల్లో కేసులు నమోదు కావడం వంటివి ఆందోళన కలిగిస్తున్నాయని పిటిషనర్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, గుజరాత్, కేరళ, నాగాలాండ్, కర్ణాటక, ఒడిశా తదితర రాష్ట్రాలు తక్షణం సమాచార కమిషనర్లను నియమించేలా ఆదేశాలు జారీచేయాల ని కోరారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం 52 పేజీల తీర్పును వెలువరించింది. ఆయా రాష్ట్రాలకు ప్రత్యేక ఆదేశాలు జారీచేసింది. పని భారాన్ని బట్టి కేంద్ర సమాచార కమిషన్, రాష్ట్ర సమాచార కమిషన్లలో గరి ష్ట సంఖ్యలో కమిషనర్లను నియమించాలని ఆదేశించింది. కమిషనర్లను నియమించకపోవ డం వల్ల వేలాది అప్పీళ్లు పెండింగ్‌లో ఉండిపోతున్నాయని, కొన్ని అప్పీళ్ల పరిష్కారానికి ఏళ్లు పడుతోందని అభిప్రాయపడింది. కమిషనర్ల పోస్టులు ఖాళీ అయ్యే రెండు నెలల ముందే నియామక ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడేలా చూడాలని ఆదేశించింది. తెలంగాణకు ఇలా... ‘తెలంగాణలో సమాచార కమిషన్ వద్ద 10,102 అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నట్టు తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించింది. రాష్ట్ర విభజన అనంతరం సెప్టెంబర్ 2017లో తెలంగాణ సమాచార కమిషన్ ఏర్పడింది. అయితే ఒక ప్రధాన కమిషనర్, ఒక కమిషనర్ మాత్రమే నియమితులయ్యారు. ప్రస్తుతం భారీగా ఉన్న అప్పీళ్ల పరిష్కారానికి వీరు సరిపోరు. తగిన సంఖ్యలో కమిషనర్లను నియమించని పక్షంలో అప్పీళ్ల సంఖ్య మరింత పెరుగుతుంది. అందువల్ల తెలంగాణ సమాచార కమిషన్ పూర్తిస్థాయిలో పని చేసేందుకు కనీసం మరో నలుగురు సమాచార కమిషనర్లను నియమించాలి. ఈ సలహాను పరిగణనలోకి తీసుకుని సెలక్షన్ కమిటీ నెల రోజుల్లోపు నిర్ణయం తీసుకోవాలి. కొత్తగా సృష్టించే ఈ పోస్టులను ఈ తీర్పు వెలువడిన రోజు నుంచి ఆరు నెలల్లోగా భర్తీచేయాలి’అని సుప్రీంకోర్టు తెలంగాణకు సంబంధించిన తీర్పులో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌కు ఇలా... ‘ఆంధ్రప్రదేశ్‌లో సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్‌ను నియమించడంలో తీవ్రమైన నిర్లక్ష్య ధోరణి అవలంభించారు. 2017 నుం చి ఏపీ సమాచార కమిషన్ పనిచేయలేదు. ఇటీవల ముగ్గురు కమిషనర్లను నియమించడంతో కమిషన్ కొంత క్రియాశీలకంగా వ్యవహరించగలుగుతుంది. కానీ కమిషన్ పూర్తిస్థాయిలో పనిచేసేందుకు ఇది సరిపో దు. అందువల్ల ప్రధాన కమిషనర్, మిగిలిన కమిషనర్ పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేయాలి. ఈ తీర్పు వెలువడిన మూడు నెలల్లోగా ఎట్టి పరిస్థితుల్లోనూ నియామకాలు పూర్తిచేయాలి’అని ఏపీకి సంబంధించిన తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. -
మాజీ అధికారులకే అందలం
‘‘మీకు మాజీ అధికా రులు తప్ప మరెవరూ కేంద్ర సమాచార కమిషనర్ పదవికి అర్హులుగా కనిపించడం లేదా?’’ అని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. అంజలీ భరద్వాజ్ సీఐసీ నియామకాలపై దాఖలుచేసిన ప్రజాప్రయోజన వాజ్యంపై సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్య చేసింది. ఇదే విషయాన్ని అనేకమంది ఆర్టీఐ కార్యకర్తలు, మాజీ కమిషనర్లు, ఈ రచయితతో సహా అడిగినా పట్టించుకున్న నాథుడు లేడు. రాష్ట్రపతికి లేఖ రాస్తే చదివినవారు లేరు. అసలు కదలికే లేదు. కమడోర్ లోకేశ్ బత్రా, అంజలీ భరద్వాజ్, అమ్రితా జోహ్రీ ఆర్టీఐ అభ్యర్థనలపై ప్రభుత్వం కొన్ని పత్రాలను వెల్లడిచేసింది. ప్రభుత్వం ఒక పద్ధతి లేకుండా వ్యవహరించిందని తేలింది. అన్వేషణ సంఘం ఎంపిక బృందానికి పంపినవి 14 మంది పేర్లు. అందులో 13 మంది మాజీ ప్రభుత్వ అధికారులవి, ఒక్క పేరు మాత్రం మాజీ హైకోర్టు న్యాయమూర్తిది. అంజలీ తరఫు న్యాయవాది అసలు దరఖాస్తులు పంపుకోకపోయినా ఇద్దరినీ పరిగణిం చారని చెప్పారు. సురేశ్‌చంద్ర, అమీసింగ్ ల్యూఖామ్ ఈ పదవికోసం దరఖాస్తులు పెట్టుకోలేదని వెల్లడైంది. కానీ వారిపేర్లు తుదిపరిశీలనకు వెళ్లడం, సురేశ్ చంద్ర నియమితులు కావడం తెలిసిందే. న్యాయమూర్తులు ఎ.కె. సిక్రీ, ఎస్. అబ్దుల్ నజీర్... ‘‘మేము మా అనుభవంతో చెబుతున్నాం. విభిన్న ట్రిబ్యునళ్ల పాలక సభ్యులుగా ఎందరో అధికారు లను మేము ఇంటర్వూ్య చేస్తూ ఉంటాం. వారిలో సాధారణంగా ఒక అభిప్రాయం నెలకొని ఉంటుంది. బ్యూరోక్రాట్లు మాత్రమే ఉత్తములని వారు అనుకొంటూ ఉంటారు. చాలా కాలం పాలనా రంగంలో ఉండటం వల్ల వారికి విస్తారమైన అనుభవం ఉందనడంలో సందేహం లేదు. కాని మిగతా రంగాలలో సుప్రసిద్ధులైన వారు ఒక్కరు కూడా సమాచార కమిషనర్ పదవికి పనికి వస్తారని ప్రభుత్వం వారికి కనిపించలేదంటే ఆశ్చర్యం కలుగుతున్నది’’ అని వ్యాఖ్యానించారు. ఏం చెప్పమంటారు? కేంద్రం అయినా రాష్ట్రా లలో అయినా సరే సమాచార కమిషనర్ పదవికి మాజీ అధికారులను ఎంచుకోవడం పరిపాటిగా మారింది. ఇక ఆ ఎంపిక విధానంలో కూడా అంత దాపరికం ఎందుకో అర్థం కాదు. దాపరికంలేని పారదర్శక పాలనను ప్రోత్సహించవలసిన బాధ్యత చట్ట పరంగా నిర్వహించవలసిన సమాచార కమిషనర్ల ఎంపికలోనే లేకపోతే సమాచార హక్కు చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేసేదెవరు? కమిషనర్ పదవికి దరఖాస్తులు పంపుకోవా లని నోటిఫికేషన్లు ప్రచురించేందుకు వేలాది రూపాయల ప్రజాధనం చెల్లిస్తారు. ఆ ప్రకటనలు లోపాలతో ఉంటాయి. కమిషనర్ పదవీకాలం ఎంతో చెప్పరు. జీత భత్యాల గురించి తరువాత చెబుతాం అంటారు. స్థాయి హోదా జీతం తెలియని పదవికి చాలామంది అర్హులు దరఖాస్తు చేసుకోకపోవచ్చు. ఆర్టీఐ చట్టం కమిషనర్ హోదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థాయిలో ఉన్న ఎన్నికల కమిషనర్ హోదాతో సమంగా ఉంటుందని స్పష్టంగా తెలియజేసినా, సర్కారు వారు తమ ఇష్టానుసారం íసీఐసీ హోదాను జీతాన్ని మార్చడానికి వీలుగా చట్టాన్ని సవరించాలనుకుంటున్నారు. అందువల్ల చట్టం నీరుగారిపోయినా, సమాచారం జనానికి అందకుండా పోయినా ఫరవాలేదన్నట్టు, అదే కావాలన్నట్టు వ్యవహరిస్తున్నారనడానికి ఇటీవలి నియామకాలే సాక్ష్యం. ఆగస్టు 27, 2018నాడు సుప్రీంకోర్టుకు కేంద్రం ఒక అఫిడవిట్‌ను సమర్పించింది. వచ్చిన దరఖాస్తులలో అర్హులైన వారిని ఎంపిక చేయడానికి కొన్ని పద్ధతులను రూపొందిస్తున్నట్టు ప్రభుత్వం తెలియజేసింది. తీరా మినిట్స్ చూస్తే.. అడిగిన వారిని పక్కన పెట్టి, ఏ పద్దతీ లేకుండా అడగని వారికి కూడా పదవి ఇవ్వాలని వీరు ప్రతిపాదించారు. సురేశ్‌చంద్ర దర ఖాస్తు చేసుకోకపోయినా అన్వేషణ సంఘం ఆయ నను ఎంపిక చేసింది. ఆ ఎంపిక ఆధారంగా ఆయన కమిషనర్‌గా నియమితులైనారని కోర్టుకు విన్నవించారు. ఆర్టీఐ చట్టం అమలులో ఉన్నా, ప్రజలకు అడిగిన సమాచారం ఇవ్వకుండా దాచడానికి వీలుగా నియామకాల సమయంలోనే విధేయులైన మాజీ అధికారులను నియమిస్తే, రాబోయే కాలంలో సమాచారం వెల్లడవకపోయే అవకాశం ఉందని సమాచార హక్కు అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ సంకీర్ణం స్థానంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ప్రధాన కమిషనర్ ఎంపిక విషయంలో భిన్నమైన ధోరణిని అనుసరించింది. పనిచేస్తున్న కమిషనర్లలో సీనియర్‌ను ప్రధాన కమిషనర్‌గా నియమించలేదు. దాదాపు ఏడాది పాటు చీఫ్ కమిషనర్ లేనే లేడు. ఈ సంప్రదాయాన్ని కాదని సీనియర్ కమిషనర్ యశోవర్ధన్ ఆజాద్‌ను చీఫ్ కమిషనర్‌గా నియమించకుండా, కొత్త వ్యక్తిని నియమించారు. ఇప్పుడు ఆ పద్ధతి మార్చుకుని సీనియర్ కమిషనర్ సుధీర్ భార్గవ్‌ను చీఫ్‌గా నియమించారు. ఇందువల్ల ఒక జూనియర్ కమిషనర్ కింద పనిచేసే ఇబ్బంది ఆయనకు తప్పింది. ఆజాద్‌కు ఆ సౌకర్యం నిరాకరించారు. మాడభూషి శ్రీధర్, వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ (madabhushi.sridhar@gmail.com) -
సుప్రీం మొట్టికాయలు: ఏపీకి ఆర్టీఐ కమిషనర్లు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు ఆర్టీఐ కమిషనర్ల నియామకం చేపట్టింది. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో ప్రభుత్వం మొద్దునిద్ర వీడింది. రాష్ట్రంలో నాలుగేళ్ల తర్వాత సమాచార కమిషనర్లను నియమించింది. మాజీ ఐపీఎస్ అఫీసర్ బీవీ రమణకుమార్(కృష్ణా జిల్లా), మాజీ ఐఎఫ్ఎస్ రవికుమార్ (రాజమండ్రి), టీడీపీ లీగల్ సెల్ సభ్యుడు జనార్థన్‌రావు(కడప)లను ఆర్టీఐ కమిషనర్లుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
పనిచేయలేని ఆర్టీఐ ఎందుకు?
కేంద్ర సమాచార కమిషన్‌లో కల్లోలం పుట్టింది. పని చేయలేని ఆర్టీఐ ఎందుకనే ప్రశ్న తలెత్తింది. ఆ ప్రశ్న బయటి నుంచి కాకుండా లోపలినుంచి తలెత్తింది. సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ సీఐసీకి రాసిన లేఖే దానికి మూలం. ఆ లేఖ ముఖ్యాంశాలు. కేంద్ర సమాచార కమిషన్ చీఫ్ (సీఐసీ), సమాచార కమిషనర్లకు గౌరవపూర్వకంగా నేను రాస్తున్న లేఖ : సీఐసీ ఆర్.కె. మాథుర్, సమాచార కమిషన్ సభ్యులు యశోవర్ధన్ అజాద్‌లకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నందుకు, ఈ రోజు (ఫిబ్రవరి 21, 2018) తమ సమయాన్ని వెచ్చించినందుకు నా సహచర సభ్యులకు నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. వివిధ శాఖల్లో నైపుణ్యం కలిగిన అనుభవజ్ఞులతో కూడిన సమాచార కమిషన్‌లో భాగమైనందుకు ఎంతో సంతోషిస్తున్నాను. 2018 ఫిబ్రవరి 7న నేను రాసిన ఉత్తరానికి అదనంగా కొన్ని విషయాలు ఇక్కడ పొందుపర్చదలిచాను: 1. మనమందరమూ ఒక సంస్థగా ఆర్టీఐ చట్టం కింద రాజకీయ పార్టీల పారదర్శకత, జవాబుదారీతనంకి సంబంధించిన విస్తృత ప్రజా ప్రయోజనాలకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నామని నేను భావిస్తున్నాను. అంతే కాకుండా, ఆర్టీఐ చట్టం కింద దేశంలోని ఆరు రాజకీయ పార్టీలను ప్రజాప్రయోజన సంస్థలుగా ప్రకటిస్తూ 2013లో సమాచార కమిషన్ జారీ చేసిన ఆదేశాన్ని అమలు చేయడంలో కమిషన్ సామర్థ్యతకు, మన సంస్థ విశ్వసనీయతకు కూడా మనం ప్రాధాన్యమిస్తున్నట్లు భావిస్తున్నాను. కానీ నాలుగేళ్ల తర్వాత కూడా విచారణ కోసం ఒక బెంచ్ ఏర్పర్చే దిశలోనే ఉంటున్నాం. 2013 నాటి కమిషన్ ఆదేశం తుది ఆదేశంగా మార్పు లేకుండా, సవాలు చేయని విధంగా కొనసాగుతోందని తెలిసిందే. ఏడీఆర్ సంస్థ ఇతరులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం 2013లో సీఐసీ నిర్ణయానికి మద్దతు తెలుపుతూనే, ఆర్టీఐని ఇతర జాతీయ, ప్రాంతీయ పార్టీలకు కూడా విస్తరించాలని కోరుతోంది. ఈ వ్యాజ్యంపై, సుప్రీంకోర్టు 2013 నాటి ఆర్టీఐ ఆదేశంపై స్టే విధించకుండానే ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. 2. సీఐసీ 2013లో జారీ చేసిన ఆదేశానికి ఆరు రాజకీయ పార్టీలు కట్టుబడి ఉండటంలేదంటూ ఏడీఆర్, తదితరులు చేసిన సాధారణ ఫిర్యాదును మరొక ఫుల్ బెంచ్ 16–03–2016న తిరస్కరించింది. అదే సమయంలో తాము ఆర్టీఐకి వ్యక్తిగతంగా చేసిన అభ్యర్థనలను తిరస్కరించారనీ, ఫైల్ చేయలేదంటూ ఆర్.కె. జైన్ మరో 30 మంది ఇచ్చిన ఫిర్యాదు నిర్దిష్టమైనది. విస్తృతంగా చెప్పాలంటే, మన సొంత ఆదేశాన్ని అమలు చేయాల్సిన శాసన సంబంధ బాధ్యత మనపై ఉంది. మన ఆదేశాలను మనమే అమలు చేయకపోవడం మన విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీస్తుందంటూ మన సహోద్యోగి భట్టాచార్య సరిగానే ఎత్తి చూపారు. 3. గౌరవనీయ ఢిల్లీ హైకోర్టు ఈ విషయంపై సీఐసీకి రెండు సార్లు ఆదేశాలిచ్చింది. సమాచార కమిషన్‌లోని అత్యంత సీనియర్ ఉద్యోగి ఈ ఫిర్యాదులను విచారించాలని హైకోర్టు సూచించింది. పైగాఈ విచారణకు నిర్దిష్ట కాల వ్యవధిని సూచించింది. హైకోర్టు ఆదేశాలను మనమే అమలు చేయకపోతే ఎవరు చేస్తారు? 4. ఈ ఫిర్యాదులపై విచారణకు సీఐసీ బెంచ్‌లను సరిగానే ఏర్పాటు చేసింది. రాజకీయ పార్టీలను పబ్లిక్ సంస్థలుగా ప్రకటించాక, సీఐసీ తన కమిషనర్లలో ఒకరిని వీటి విచారణకు కేటాయించాల్సి ఉంది. కానీ కేటాయించవలసిన అంశాల జాబితాలో కూడా మనం దాన్ని పొందుపర్చలేదు. దీనిపై డజన్ల కొద్దీ ఫిర్యాదులు వచ్చిన తర్వాత మనం సంవత్సరాల కాలాన్ని గడిపేశాం. దీనిపై మనం జాతికి ఏమని సందేశాన్ని ఇస్తున్నాం? 5. ఒక సమాచార కమిషనర్ తన ప్రమేయం లేకుం డానే ఒక బెంచ్‌లో ఉండటం, మరొక బెంచ్‌లో లేకపోవడం వంటివి చోటుచేసుకున్నందున, ఇది సమాచార కమిషనర్ స్వతంత్రతపైనే తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఒక ఫుల్ బెంచ్ ఉండగా దాని ప్రస్తావన కూడా లేకుండా మరొక బెంచ్‌ని ఎలా ఏర్పరుస్తారు. ఒక కమిషనర్‌ను ఎందుకు తొలగించారు, దాని కారణాల గురించి మొత్తం సీఐసీకి తెలిసి ఉండాలి. 6. సమాచార కమిషన్ విచారించాల్సిన అంశాల పంపిణీ, పునఃపంపిణీని ఒక వ్యక్తిగత అధికారి కాకుండా మొత్తం కమిషన్ హేతుపూర్వకంగా కేటాయించాలి. దీనికి నిర్దిష్ట వ్యవస్థ, మార్గదర్శక సూత్రాలు ఉండాలి. అప్పుడే ఒక కమిషనర్ జరుపుతున్న విచారణను మార్పు చేయడం, బెంచ్ నుంచి తొలగించడం వంటి వాటిపై బాహ్య ఒత్తిళ్లు పనిచేయడం అసాధ్యమవుతుంది. 7. ఇది అత్యున్నత ప్రజోపయోగ అంశం కాబట్టి, రాజకీయ పార్టీలగురించి తెలుసుకోవడం ప్రజల హక్కు కాబట్టి, ఈ లేఖలోని అంశాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. ఫిబ్రవరి 7న, ఇప్పుడు తాజాగా రాసిన ఈ రెండు లేఖలను, వాటిపై వచ్చే స్పందనలను కూడా మన కమిషన్ అధికారిక వెబ్సైట్లో ఉంచాలి. 8. రాజకీయ పార్టీలపై, ఇతరులపై మన సొంత ఆదేశాల అమలుకు చెందిన సంక్లిష్ట సమస్యలపై పారదర్శకమైన, స్వతంత్ర, నిశ్చితమైన నిర్ణయాలను తీసుకోవాలని నేను నిజాయితీగా అభ్యర్థిస్తున్నాను. దీనిపై మనం విఫలమైతే, దానికి కారణాన్ని కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనమీదే ఉంది. మనం ఇలా చేయలేకపోతే, స్వతంత్రంగా వ్యవహరించలేకపోతే, సమాచార కమిషనర్ల స్వతంత్రతను పరిరక్షించకపోతే, మనది పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన సంస్థగా మనం చెప్పుకోలేం. అలాంటి విధ్వంసకర పరి స్థితుల్లో ఏ ప్రయోజనం లేకుండా, ప్రజల సొమ్ముపై నడుస్తూ ఈ సంస్థను కొనసాగించడం అవసరమా, ప్రజలు మన సంస్థను రద్దు చేయాలని కోరేంతవరకు వేచి ఉండటం అవసరమా? దయచేసి ఆలోచించండి. వ్యాసకర్త మాడభూషి శ్రీధర్ కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
ఆర్టీఐ కమిషనర్ల నియామకంపై సర్కారుకు ఎదురుదెబ్బ
సాక్షాత్తు గవర్నర్ నరసింహన్ చెప్పినా వినిపించుకోకుండా అస్మదీయులను అందలం ఎక్కించాలనుకున్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నలుగురు సమాచార కమిషనర్ల నియామకాన్ని రద్దుచేసి, వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని హైకోర్టు ఆదేశించింది. తాంతియాకుమారి, వెంకటేశ్వర్లు, ఇంతియాజ్, విజయ నిర్మల.. ఈ నలుగురి నియామకాలనూ రద్దు చేయాలని స్పష్టం చేసింది. వెంకటేశ్వర్లు నియామకాన్ని సవాలుచేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా, దాని విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్రంగా స్పందించింది. గవర్నర్ వద్దని చెప్పినా ఎందుకు వీరిని నియమించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం నలుగురి నియామకాలను రద్దు చేసి, ఆరు వారాల్లోగా కొత్త కమిషనర్లను నియమించాలని ఆదేశించింది. దీంతో కిరణ్ సర్కారు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా తయారైంది. -
ఆ నియామకాలు రాజకీయమే!
సాక్షి, హైదరాబాద్: సమాచార కమిషనర్ల నియామకం జరిగిన తీరును చూస్తుంటే, అవి రాజకీయ నియామకాలుగా కనిపిస్తున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. సమాచార కమిషనర్లుగా వి.వెంకటేశ్వర్లు, తాంతియా కుమారి, ఇంతియాజ్ అహ్మద్, విజయనిర్మల నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో సోమవారం వాదనలు ముగిశాయి. వాదనలు విన్న చీఫ్ జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ ఖండవల్లి చంద్రభాను నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు గండ్ర మోహనరావు, కె.వివేక్ రెడ్డిలు వాదనలు వినిపించగా, కమిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది డి.వి.సీతారామ్మూర్తి, ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది ఎన్.శ్రీధర్‌రెడ్డి వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నిష్ణాతులైన వ్యక్తుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రభుత్వం ప్రకటన జారీ చేయాలని, కాని ఈ కేసులో ప్రభుత్వం ఎటువంటి దరఖాస్తులను ఆహ్వానించడం గానీ, ప్రకటన జారీ చేయడం గానీ చేయలేదని మోహనరావు కోర్టుకు నివేదించారు. అంతేకాక కమిషనర్ల నియామకం వ్యవహారాన్ని చూసే కమిటీలో సభ్యుడైన ప్రతిపక్ష నేత సైతం ఈ నియామకాలపై అసంతృప్తిని వ్యక్తం చేశారని కోర్టుకు నివేదించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కమిషనర్లుగా నియమితులైన వ్యక్తులు నియామకానికి ముందే వారు నిర్వర్తిస్తున్న పదవులకు రాజీనామా చేయాలని, అయితే వెంకటేశ్వర్లు మాత్రం న్యాయవాదిగా నేటికీ కొనసాగుతున్నారని తెలిపారు. ఈ వాదనలను శ్రీధర్‌రెడ్డి తోసిపుచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నియామకం జరిగిన తరువాతనే వారు తమ తమ పదవులకు, వ్యాపారాలకు స్వస్తి చెప్పాల్సి ఉంటుందంటూ తీర్పును చదివి వినిపించారు. ప్రతిపక్ష నేత ఎటువంటి అసంతృప్తి వ్యక్తం చేయలేదని డి.వి.సీతారామ్మూర్తి తెలిపారు. తమ సభ్యత్వాన్ని రద్దు చేయాలని వెంకటేశ్వర్లు రాష్ట్ర బార్ కౌన్సిల్‌కు ఎప్పుడో దరఖాస్తు చేసుకున్నారని, దీనిపై సోమవారం బార్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుందంటూ అందుకు సంబంధించి లేఖను ప్రధాన న్యాయమూర్తికి సమర్పించారు. విచారణ జరుగుతున్న సమయంలో ఇలా లేఖ తీసుకురావడం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇవి రాజకీయ నియామకాలుగా కనిపిస్తున్నాయని, అందుకు ప్రాథమిక ఆధారాలు కూడా ఉన్నాయంటూ తీర్పును వాయిదావేస్తున్నట్లు తెలిపింది. కాగా, సమాచార కమిషనర్ల నియామకంపై దాఖలైన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మరో ధర్మాసనానికి నివేదించింది.