
సాక్షి, హైదరాబాద్: రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టుల భర్తీకి అడ్డంకులు తొలగిపోయాయి. పోస్టుల భర్తీకి సంబంధించి గతంలో ఇచ్చి న మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు సవరించింది. లెక్చరర్ల పోస్టులను భర్తీ చేసుకోవచ్చని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)కు హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ నియామకాలన్నీ తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని పేర్కొంది. పొలిటికల్ సైన్స్ విభాగంలో ఓ పోస్టును ఖాళీగా ఉంచాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి ఉత్తర్వులు జారీ చేశారు. రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టుల భర్తీలో బీసీలకు తగిన రిజర్వేషన్లు కల్పించడం లేదంటూ హైదరాబాద్‌కు చెందిన సుజాత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. నియామకపు ప్రక్రియపై స్టే విధించింది. ఈ స్టేను ఎత్తేయాలని కోరుతూ టీఎస్‌పీఎస్సీ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి విచారణ జరిపారు. ప్రభుత్వ నియామకాల్లో బీసీలకు 29 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసిందని పిటిషనర్ వివరించారు. అయితే డిగ్రీ కాలేజీల్లో భర్తీ చేసే లెక్చరర్ల పోస్టుల భర్తీ విషయంలో ఈ ఉత్తర్వులను అమలు చేయడం లేదన్నారు. ఆ తరువాత టీఎస్‌పీఎస్సీ న్యాయవాది డి.బాలకిషన్‌రావు వాదనలు వినిపిస్తూ, రోస్టర్ ప్రకారం రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. 546 పోస్టుల్లో బీసీలకు 117 పోస్టులు కేటాయించామన్నారు. సర్వీసు నిబంధనల ప్రకారం పోస్టుల భర్తీ జరుగుతోందని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. పోస్టుల భర్తీ విషయంలో గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరించారు. లెక్చరర్ల పోస్టుల భర్తీకి అనుమతినిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment