ప్రభుత్వ పాఠశాలలు తగినన్ని లేని రోజుల్లో పేద విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పేందుకు ఎందరో దాతలు, ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు నెలకొల్పిన ఎయిడెడ్ పాఠశాలలు నేడు పాలకుల నిర్లక్ష్యానికి కుదేలవుతున్నాయి. ఈ స్కూళ్లలో పోస్టుల భర్తీపై నిషేధం విధించడంతో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ఆయా పాఠశాలలకు దూరమవుతున్నారు. ఫలితంగా జిల్లాలో అనేక పాఠశాలలు మూతపడే పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి.
* పోస్టులు భర్తీ చేయక.. పిల్లలు రాక కుదేలు
* టీచర్లకు పదోన్నతులు, రేషనలైజేషన్ నిల్
* విద్యార్థులకు యూనిఫామ్స్ కూడా ఇవ్వని వైనం
ఏలూరు సిటీ : ఉన్నతాశయాలతో ఏర్పాటైన ఎయిడెడ్ పాఠశాలలు ప్రభుత్వ వైఖరితో మూతపడే పరి స్థితి వచ్చింది. పోస్టుల భర్తీపై బ్యాన్ విధించటంతో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు స్కూళ్లకు దూరమవుతున్నారు. జిల్లాలోని ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించలేక దీనావస్థకు చేరుకున్నాయి.
స్కూళ్లలో పోస్టులు భర్తీ నిలుపుదల, రేషనలైజేషన్ చేయకపోవటంతో టీచర్లు లేని దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వ, జెడ్పీ యాజమాన్యాల్లోని ఉపాధ్యాయులకు అనేక సౌకర్యాలు కల్పిస్తుండగా, ఎయిడెడ్ ఉపాధ్యాయులు మాత్రం సౌకర్యాలు లేకపోగా వేధింపులకు గురవుతున్నారు. 37 యాక్ట్‌తో ఎయిడెడ్ ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. సర్వీసంతా కష్టపడి పనిచేసినా పూర్తిస్థాయిలో సొమ్మును తీసుకునే అవకాశంలేని దుస్థితిలో ఉన్నారు.
ఏమిటీ వివక్ష : జిల్లాలో ఎయిడెడ్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో 240 ప్రాథమిక పాఠశాలలు, 40 ఉన్నత పాఠశాలలు, మరో ఐదు యూపీ స్కూళ్లు పనిచేస్తున్నాయి.
ఆర్‌సీఎం, సీఎస్‌ఐ, ఐసీఎం, సీబీసీఎన్‌సీ, హిందూ ధార్మిక సంస్థలు, ముస్లిమ్ మైనార్టీ ఎయిడెడ్ విద్యాసంస్థలు ఉన్నాయి. ప్రభుత్వం ఎయిడెడ్ విద్యాసంస్థల్లో చదువుతోన్న పేదవర్గాల పిల్లలపై సవతితల్లి ప్రేమ చూపిస్తోంది. జిల్లాలో 17 వేల 500 మంది విద్యార్థులు ఈ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. విద్యార్థులకు కనీసం యూనిఫాం కూడా ఇవ్వడం లేదు.
యాక్ట్ 37ను రద్దు చేయాల్సిందే
ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు తీవ్ర మానసిక వేదన కలిగించే యాక్ట్ 37ను రద్దు చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. జీవితకాలమంతా ఉపాధ్యాయ వృత్తిలో కష్టపడి పనిచేయగా వచ్చిన సొమ్మును సైతం ప్రభుత్వం వెనక్కిలాక్కోవటం దారుణమని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్‌ఎయిడెడ్ సర్వీస్‌ను రెగ్యులర్ సర్వీసుగా గుర్తించి ఇంక్రిమెంట్లు, ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ పథకానికి అర్హత కల్పిస్తూ 1980లో ప్రభుత్వం ఉత్తర్వులతో రెగ్యులర్ సర్వీస్‌తో వేతనాలు పొందుతున్నారు.
2005లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేసిన చట్టం 37తో పరిస్థితులు తిరగబడ్డాయి. ఈ చట్టంతో 1980 నుంచి 2005 మధ్యకాలంలో పనిచేసిన ఉపాధ్యాయులు తీసుకున్న రెగ్యులర్ సర్వీస్ వేతనాలను రికవరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటివరకు తీసుకున్న ఇంక్రిమెంట్ల సొమ్మును సైతం రికవరీ చేయాల్సి రావటంతో పదవీవిరమణ అనంతరం ఉపాధ్యాయులకు చిల్లిగవ్వకూడా మిగిలే పరిస్థితి కన్పించటంలేదు.
మూతపడుతున్న పాఠశాలలు
ఏలూరులోని డగ్లస్ ఎయిడెడ్ పాఠశాల మూతపడింది. దెందులూరులో ఏళ్ల నాటి నైట్ హైస్కూల్‌ను సైతం మూసివేశారు. శనివారపుపేటలోని సీఎస్‌ఐ ప్రాథమిక పాఠశాల విలీనమైంది. ఉంగుటూరు, బుట్టాయిగూడెం, ఆకివీడు, పెనుగొండ పరిసర ప్రాంతాలు, ఉంగుటూరు, మెట్ట ప్రాంతాల్లోని ఎయిడెడ్ విద్యాసంస్థలు పిల్లలు లేక వెలవెలబోతున్నాయి.
సుమారు 100కు పైగా ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయుడితో గుడ్డిలో మెల్లలా నెట్టుకొస్తున్నారు. ఉన్నత పాఠశాలలు సైతం దీనావస్థకు చేరుకున్నాయి. ఆకివీడులోని సీబీసీఎన్‌సీ ఉన్నత పాఠశాల భవనం శిథి లావస్థకు చేరింది. ఆయా ప్రాంతాల్లో ఎయిడెడ్ విద్యాసంస్థల యాజమాన్యాలు సైతం కోర్టులకు ఎక్కటంతో అభివృద్ధి నిలిచిపోయింది.
రేషనలైజేషన్ చేయాలి
ఎయిడెడ్ పాఠశాలల్లో రేషనలైజేషన్ చేయాలి. ఎయిడెడ్ ఉపాధ్యాయులకు హెల్త్‌కార్డులు మంజూరు చేయటంతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయులకు అందించే సౌకర్యాలు కల్పించాలి. ఎయిడెడ్ స్కూళ్లలో చదివే పిల్లలకు యూనిఫామ్స్ పంపిణీ చేయాలి. ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి.
- కేజే విజయకుమార్, జిల్లా అధ్యక్షుడు, ఎయిడెడ్ స్కూల్స్ టీచర్స్ యూనియన్
పాఠశాలలపై వివక్ష
ఎయిడెడ్ విద్యా సంస్థలపై ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపిస్తోంది. యాక్ట్ 37ను వెంటనే రద్దు చేసి, అన్‌ఎయిడెడ్ సర్వీస్‌కు రక్షణ కల్పించాలి. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసుకునే అవకాశం కల్పిస్తూ నిషేధం ఎత్తివేయాలి. ఎయిడెడ్ స్కూళ్లలోని ఉపాధ్యాయులకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలి.
- టి.కొండలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎయిడెడ్ స్కూల్స్ టీచర్స్ యూనియన్
ఎయి'డెడ్' స్కూల్స్
Published Sat, Jul 9 2016 3:55 AM | Last Updated on Fri, Aug 17 2018 6:08 PM
Advertisement